నందమూరి తారకరామారావు రెండు రూపాయలకు కిలో బియ్యం పథకం ప్రవేశపెట్టినప్పుడు సంక్షేమ కార్యక్రమాల చరిత్రలో అదొక సంచలనమే కాకుండా ప్రజల మన్ననకూ నోచుకుంది. ఎంతగానంటే, తర్వాతి కాలంలో కోట్ల విజయభాస్కర రెడ్డి రూపాయి తొంభై పైసలకే ఇవ్వజూపినా రెండు రూపాయల పథకాన్నే ప్రజలు ఆదరించారు. అదే పథకాన్ని అంతే ధరతో, ముప్పై సంవత్సరాల తర్వాత 'ఆహార వ్యాపారాన్ని' దాదాపు జాతీయం చేసేస్తూ జాతీయ ఆహార భద్రతా పథకంగా ప్రవేశపెడుతున్నది యూపీఏ ప్రభుత్వం. తమను ఎన్నుకొన్న ప్రజలకు ఆహార భద్రత కలగ చెయ్యడం ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన ప్రభుత్వ బాధ్యత.
అసలు మనం ఇంత బృహత్తర పథకాన్ని ఆరంభించడానికి కావాల్సిన మౌలిక సదుపాయాలను నెలకొల్పామా అన్నది ప్రశ్న. ఎందుకంటే ఈ పథకం ఎదుర్కోబోతున్న మొదటి సవాలు- కేవలం సగం సామర్ధ్యంతో కూడా పనిచేయని పంపిణీ యంత్రాంగం ద్వారా ఈపథకాన్ని అమలు చేయబూనడం! క్యాబినెట్ ఆమోదం పొంది పార్లమెంటు ముందు ఈ బిల్లు రాబోతున్న నేపథ్యంలో ఆహారభద్రత పథకం అనుకూల, ప్రతికూల విషయాలే కాకుండా ప్రత్యామ్నాయ విధానాల చర్చ కూడా అత్యవసరం. గత ఎన్నికలప్పుడు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ప్రతిపాదించిన నగదు బదిలీ పథకం ఈ సమయంలో ఖచ్చితంగా స్ఫురణకి వస్తుంది.
నాడు నగదు బదిలీని వెక్కిరించిన పార్టీలే ఈ రోజు (ప్లానింగ్ కమిషన్ సహా) స్వాగతిస్తున్నాయి. ఆహార భద్రతా చట్టం అమలు చాలా కారకాల సమాహారం మీద ఆధారపడి వుంటుంది. మొదటిది, వివిధ పేదరికపు అంచనాలను ఈ చట్టం అమలులో నిక్షిప్తం చెయ్యగలగడం; రెండవది, ఈ పథకం తమ హక్కులని హరిస్తోందని రాష్ట్రాలు కొన్నింటికి ఈ పథకం పెద్ద ఇష్టం లేకపోయినా, ఈ పథకం అమలులో తమ పూర్తి సహకారాలను అందించడం; మూడవది, ఇప్పటికే అమలులో ఉన్న పేదలకు సంబంధించిన పలు ఆహార పథకాలను వారికి నష్టం లేకుండా ఈ పథకంలో అంతర్భాగం చెయ్యడం; నాలుగవది, ఆహార ధాన్యాల లభ్యత, సేకరణ మరియు రైతుకు చెల్లించే ధరల మధ్య సరైన సమతుల్యత రావడం; అయిదవది, ఒక హక్కుగా ఇచ్చే ఈ ఆహార భద్రతతో ప్రభుత్వంపై పడే ఆర్థిక భారం; ఆరవది, అత్యంత క్లిష్టమైన, ప్రజాపంపిణీ వ్యవస్థని ఈ పథకం అమలుకు అనుగుణంగా సమూలంగా సంస్కరించడం, బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టడం. ఈ ఆహార బిల్లులో కొన్ని మౌలికమైన లోపాలు ఆందోళన కలిగిస్తున్నాయి.
జాతీయ నమూనా సర్వే ప్రకారం మన నిత్యావసర పంపిణీ వ్యవస్థ కేవలం 20 శాతం పట్టణ జనాభాకి మాత్రమే చేరుతోంది. కానీ ఆహార భద్రత పథకాన్ని ఈ వ్యవస్థ ద్వారానే 50 శాతం మందికి చేరుస్తామని, చేర్చగలమని ప్రభుత్వం బుకాయిస్తోంది. అలాగే జాతీయ పంపిణీ వ్యవస్థ కేవలం మూడో వంతు గ్రామీణ జనాభాకే చేరుతోందని సర్వే తెలిపితే ఇదే వ్యవస్థ ద్వారా ఆహార భద్రతా పథకాన్ని 75 శాతం గ్రామీణ జనాభాకి చేరుస్తామని యూపీఏ నమ్మబలుకుతోంది.
ప్రభుత్వ జాతీయ పంపిణీ వ్యవస్థ ఎంత దారుణ పరిస్థితిలో వుందో గుర్తించకుండా ఇంత పెద్ద పథకాన్ని దాని ద్వారా తీసుకుపోవాలని నిశ్చయించడం ఆశ్చర్యం, విచారకరం, అంతేకాదు ఆందోళనకరం కూడా. 2009 నవంబర్ 16న కేంద్ర వ్యవసాయ మంత్రి శరద్‌పవార్ పార్లమెంటులో ప్రకటన చేస్తూ దారిద్య్ర రేఖ దిగువన ఉన్నకుటుంబాల సంఖ్య 6.52 లక్షలు అయితే, వీటికి అదనంగా దాదాపు కోటిన్నరకు పైగా బోగస్ కార్డులు వున్నాయని సెలవిచ్చారు. ఇక మన రాష్ట్రంలో బోగస్ కార్డులు, నిజమైన కార్డులు అన్నీ కలిపి రాష్ట్ర జనాభానే దాటిపోవడం తెలిసిందే.
విచారకరమైన విషయం ఏమిటంటే ఇన్ని బోగస్ కార్డులు వచ్చిన తర్వాత కూడా లెక్కలేనంత మంది అసలు రేషన్ కార్డులే లేకుండా ఇంకా ప్రజా పంపిణీ వ్యవస్థ బయటే వున్నారు. ఇక రాష్ట్రాల సహాయ సహకారాలు ఈ పథకానికి అత్యావశ్యకం. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, రాష్ట్రాల హక్కులని హరించే ఇలాంటి పథకం తమకు వద్దని, తమిళనాడుని మినహాయించమని ఇప్పటికే చెప్పేశారు. ఒప్పుకొన్న మిగతా రాష్ట్రాలు ఇక తమ జనాభాని కేంద్ర ప్రభుత్వ కొత్త మార్గదర్శకాల ప్రకారం విభజించాలి. ఇక్కడ ప్రధాన సవాలు ఏమిటంటే కేంద్రం ప్రకటించిన 'ప్రయారిటీ', 'జనరల్' కేటగిరీల విభజన. ఇప్పటికే రాష్ట్రాలలో దారిద్య్ర రేఖకు దిగువ స్థాయి మార్గదర్శకాలు వున్నా యి.
సాంఘిక, ఆర్థిక, కుల ప్రాతిపదికన సర్వే ఇంకా ప్రారంభం కాని నేపధ్యంలో ఈ ప్రాతిపదికను ఎలా నిర్ణయిస్తారో తెలియదు. దేశంలో మొత్తం 23.5 కోట్ల కుటుంబాలు వున్నాయని అంచనా. ఇప్పుడు కేంద్రం ప్రకటించిన 75 శాతం కుటుంబాల లబ్ధిని ప్రామాణికంగా తీసుకొంటే మొత్తం 17 కోట్ల కుటుంబాలని ఈ ఆహార భద్రతా పథకం కింద తేవాల్సి వుంటుంది. ప్లానింగ్ కమిషన్ లెక్కల ప్రకారం ఇపుడు దారిద్య్ర రేఖ దిగువున వున్న కుటుంబాల సంఖ్య 6 కోట్లు పైచిలుకు. టెండూల్కర్ కమిటీ ప్రకారం 8 కోట్లు; సక్సేనా కమిటీ ప్రకారం 11 కోట్లు. ఇప్పుడు కేంద్రం ప్రకటించిన 17 కోట్లు ఏరకమైన మార్గదర్శకాల ద్వారా వచ్చాయో, ప్రాతిపదిక ఏమిటో తెలియదు.
మరొక పెద్ద సవాలు పెద్ద ఎత్తున ఆహార ధాన్యాలను సేకరించడం. ఈ పథకానికి ఆరుకోట్ల టన్నులు పై చిలుకు ధాన్యపు గింజలు అవసరం అని కేంద్రం అంటూ వుండగా, ఇప్పటి దాకా మనం అత్యధికంగా సేకరించిన ధాన్యం 5.70 కోట్ల టన్నులు మాత్రమే. ఈ పథకం కింద 49 కోట్ల మందికి ఏడు కేజీల లెక్కన, మూడు కేజీల వంతున ముప్పయి మూడు కోట్ల మందికి ఆహార ధాన్యాలు పంచాలి. గత అయిదు సంత్సరాల నుండి అయిదు కోట్ల ముప్పై లక్షలు సేకరిస్తున్న కేంద్రానికి బహుశా సరఫరా సమస్య కాబోదు. కానీ ఎదురయ్యే సవాళ్లు ద్విముఖం. ఒకటి, ఖజానా మీద పడే పెను భారం; రెండు రైతులకి పండించడానికి ఏ రకమైన ప్రేరణ లేకపోవడం. కనీస మద్దతు ధర ఖర్చులకు కూడా రాకపోవడంతో ధాన్యం పండించే ప్రధాన రాష్ట్రాలలో ఇతర వాణిజ్య పంటల వైపు మళ్లుతున్న నేపథ్యంలో సరైన ధర చెల్లించకుంటే ధాన్య సేకరణ కష్టతరమవుతుంది.
ఇక ప్రభుత్వ ఖర్చు విషయానికొస్తే రైతుకు చెల్లించే మద్దతు ధర కిలోకి ఒక్కింటికి 11రూపాయల పది పైసలు. భారత ఆహార సంస్థ సేకరణ, రవాణా, నిల్వ ఖర్చులు దాదాపు 4 నించి 5 రూపాయలు దీనికి అదనం. అంటె వెరసి, ఒక కేజీ బియ్యానికి కేంద్రం ఖర్చు పెట్టే డబ్బు దాదాపు పదహారు రూపాయలు. ఆహార భద్రత పథకంలో అమ్మకం ధర రెండు రూపాయలు. అంటే ప్రభుత్వానికి నికర ఖర్చు/ నష్టం 14 రూపాయలు. భారత ఆహార సంస్థలో అవినీతి, సామర్థ్య లోపం ఇత్యాదులని పరిగణనలోనికి తీసుకొని, చంద్రబాబు ప్రతిపాదించిన నగదు బదిలీ లాంటి ప్రత్యామ్నాయ ఆలోచనలను చేయాల్సిన అవసరం వుంది. ప్లానింగ్ కమిషన్ సభ్యుల అంచనాల ప్రకారం, ఆహార భద్రత మీద ప్రభుత్వం ఖర్చు పెట్టబోతున్న సాలీనా లక్ష కోట్ల ధనాన్ని దేశంలో వున్న అదే 17కోట్ల కుటుంబాలకి డబ్బుగా పంచితే ప్రతి కుటుంబానికి నెలకు నికరంగా అయిదు వందల రూపాయలని ఇవ్వచ్చు.
ఆహార భద్రత చట్టం ప్రకారం, కనీస మద్దతు ధరని లెక్కలోకి తీసుకొన్న ప్రభుత్వం ప్రయారిటీ కుటుంబాలకు ఇచ్చేదే సుమారు నాలుగు వందల రూపాయలు మాత్రమే. ఇక జనరల్ కుటుంబాలకైతే రెండు వందల రూపాయలు మాత్రమే. సమర్థవంతమైన నగదు బదిలీకి కావాల్సింది ప్రతి ఒక్కరికి యుఐడి కార్డు; బ్యాంకు/పోస్ట్ ఆఫీసు అకౌంటు. ఇప్పటి పరస్థితులలో అదేమంత కష్టం కాదు. ధాన్యం బదులు నగదు పంపిణీ చేస్తే మనం మార్కెట్ వాణిజ్యం కంటే ప్రియమైన ఎఫ్‌సిఐ మీద ఆధార పడనక్కరలేదు.
లేదా, ఇప్పుడు నడుస్తున్న ప్రజా పంపిణీ వ్యవస్థని ప్రస్తుత లబ్ధిదారులకి వదిలి కొత్తగా చేరబోతున్న లబ్ధిదారులకి నగదు పంపిణీ చేయడం ఒక మంచి ఆరంభం కావచ్చు. ఖచ్చితంగా ప్రపంచంలో గోధుమ, బియ్యం ఉత్పత్తి విషయంలో రెండవ స్థానంలో వుండే భారత దేశానికి ఆచరణాత్మక, గుణాత్మక ప్రగతిశీల విధానాన్ని కనిపెట్టే శక్తి అయితే వుంది. ఆమ్ ఆద్మీ అంటూ గొంతుచించుకొనే ప్రభుత్వాలు వాళ్ళ ఆహార భద్రత కోసం తెలివిగా ఆలోచించే సన్నద్దత కావాలి.
- పంజుగుల శ్రీశైల్‌రెడ్డి
(తెలుగుదేశం పార్టీ వ్యవసాయ అధ్యయన కమిటీ సభ్యుడు)
నీలయపాలెం విజయకుమార్
(రాజకీయ ఆర్ధిక విశ్లేషకులు)
ANDHRA JYOTHI NEW'S PAPER DATED 03/01/2012
No comments:
Post a Comment