Thursday, January 5, 2012

కుట్రల్ని ఎత్తి చూపడం ద్రోహమా?ప్రజల చైతన్యం అంతిమమే కాని, ఉద్యమాన్ని మలుపులు తిప్పి తలుపులు తెరిచే వ్యూహం మాత్రం నాయకత్వానిదే... తెలంగాణ ఉద్యమంలో కొద్ది మంది దళితులు నాయకులుగా ఉన్నంత మాత్రాన ఆ వర్గం వారి సమస్యలు పరిష్కారం కావు. ఆ ఉద్యమానికి వాళ్ళ జీవితాలను మార్చగలిగే సహజసిద్ధ స్వభావం లేకుండా పెద్దగా మార్పుల్ని ఆశించడం సంపూర్ణంగా భ్రమే అవుతుంది.


సామాజిక వర్గం రీత్యా మన వ్యక్తి అయినంత మాత్రాన మన కోసమే కృషి చేస్తున్నానడనుకుంటే అది అమాయకత్వం తప్ప అవగాహన కాదని గ్రహించాల్సిన బాధ్యత ఉంది.
- డాక్టర్ అంబేద్కర్


తెలంగాణ రాజకీయోద్యమ నాయకత్వంపై కొంతకాలంగా ('ఆంధ్రజ్యోతి'లో) జరుగుతోన్న విమర్శనాత్మక చర్చ అన్ని రకాల ఉద్యమాల ఎదుగుదల, పురోగతికి ఏదో ఒక మేరకైనా ఖచ్చితంగా తోడ్పడుతుంది. కాంగ్రెస్ పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం వ్యూహాత్మక ప్రణాళికలో భాగంగా, తెలంగాణ, సీమాంధ్ర అగ్రకుల నాయకత్వం తెలంగాణ పేరుతో శూద్ర కులాలను ఉద్వేగంలో ముంచెత్తి దహించి వేస్తోంది. ఈ వైనాన్ని ప్రొఫెసర్ కంచ ఐలయ్య తీవ్రంగా విమర్శిస్తున్నారు. తెలంగాణ ఉద్యమం చుట్టూ ప్రజల ఆకాంక్షలు ఉన్నప్పటికీ తెలంగాణ అగ్రకుల నాయకత్వ కుట్రల వల్ల దళిత బహుజనులకు తీరని శోకం కలుగుతుందని ఐలయ్య వాదిస్తున్నారు. ఆడించే సూత్రదారుల ఉద్దేశాలను అర్థం చేసుకోకుండా, మేమూ పాత్రధారులవుతామనటం వల్లనే బలిపీఠం ఎక్కాల్సి వస్తుందని ఐలయ్య హెచ్చరిస్తున్నారు.

వైఎస్ మరణానంతర పరిస్థితుల్లో జగన్ ఓదార్పు యాత్రలని నిలువరించడానికి కాంగ్రెస్ అధిష్టానానికి తెలంగాణను మించిన మరో సెంటిమెంటు దొరకలేదు. పాలకులు కూడా సంక్షోభకాలంలో రాజకీయ సమీకరణల కోసం అస్తిత్వ ఉద్యమాలని పెంచి పోషిస్తుంటారు. అందుకు తెలంగాణ ఉద్యమం మినహాయింపేమీ కాదు. ఈ వాస్తవాలను ఐలయ్య కంటే ముందే, రాష్ట్ర రాజకీయాల్ని అధ్యయనం చేసిన సామాజిక శాస్త్రవేత్తలు జి.రాంరెడ్డి, దాగ్మార్ బెర్న్ స్టాఫ్, హ్యూ గ్రేలు సవివరంగా తెలిపారు. బూర్జువా వర్గం తనకు తాను ప్రజల్లో, పౌర సమాజంలో ఒక భాగంగా ఉండిపోవడానికే రాజకీయాల్ని నిర్మిస్తుందని పార్థా చటర్జీ, రజనీ కొఠారి లాంటి రాజనీతి శాస్త్రవేత్తలు సిద్ధాంతీకరించారు.

ఇవేవీ అనుభవంలోకి తీసుకోకుండా ఐలయ్య వాదనను, సామాజిక శాస్త్రవేత్త అయిన సూరేపల్లి సుజాత 'తెలంగాణ అంటే వాళ్ళేనా?' అని కౌంటర్ చేయడం చాలా వరకు అవగాహనా రాహిత్యమే. ఐలయ్యకు కౌంటర్‌గా అగ్రకులాల వారు రాయడం లేదు. వారు రాజకీయాలు చేస్తున్నారు. ఐలయ్యతో పాటు ఇంకొంత మంది దళితులు రాజకీయాలు వదిలిపెట్టి రాతలు మాత్రమే చేస్తున్నారు. అగ్రకులాల్ని తిట్టడం తప్ప అణగారిన కులాల ఉద్యమ నాయకత్వాన్ని వెలుగులోకి తీసుకురావడానికి ఐలయ్య రచనలు చేయడం లేదనే వాదన పాక్షికమే. దళిత బహుజనులకు రాజకీయ నాయకత్వాన్ని అందించడానికి ఆయన ఎంచుకున్న మార్గం తెలంగాణకు భిన్నమైనది కావచ్చు.

ఉద్యమాన్ని నిర్దేశించే నాయకత్వంగా ఆ కులాలు ఎదిగితే మరింత సంతోషపడనూవచ్చు. ఎందుకంటే అంబేద్కర్, ఫూలే, పెరియార్‌లు అందించిన జ్ఞానంతో ఐలయ్య తన కలాన్నే ఖడ్గంగా మార్చుకున్నారు. హిందూ ఉన్మాదం నుంచి తనను, తన జాతుల్ని రక్షించుకున్నాడు, కెసిఆర్ పై ఐలయ్య రాస్తే విస్ఫోటనంలాగా ఈ పత్రికలు ప్రచురిస్తున్నాయని ఆ మేధావిని తక్కువ చేసి మాట్లాడడం సరైందికాదు. ఐలయ్య 'నేను హిందువునెట్లయిత?' అన్న సంచలనాత్మక గ్రంథాన్ని రాసిన మేధావి. కార్యకర్తగా, విద్యావేత్తగా ఉన్న సుజాత ఇంత అర్థరహితంగా ఎలా రాస్తున్నారో ఊహించ లేకపోతున్నాం.

'తెలంగాణ అంటే కెసిఆర్ మాత్రమేనా?' అని సూరేపల్లి సుజాత ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ అంటే కెసిఆర్ మాత్రమే కాదు, అనేకానేక సబ్బండ కులాలు కూడా. అయితే తెలంగాణ పేరుతో రాజకీయాలని నడుపుతున్నది అగ్రకుల కెసిఆరే. ఆధిపత్య రాజకీయంలో భాగస్వామ్యానికి మరో రెండు అగ్రకులాలు కూడా కెసిఆర్‌తో మిలాఖత్ అయ్యాయి. ఈ మూడు కులాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు తమ అధిష్టానం మాటను జవ దాటరు.

సుజాత తమ వ్యాసంలో ఐలయ్య నుద్దేశించి ఇలా అన్నారు: 'రేపు ఒక పిలుపు ఇచ్చి చూస్తే తెలవదా ఉద్యమం ఎంత బలంగా ఉందో?'. ఎవరు పిలుపు ఇస్తే తెలంగాణ కదులుతుంది? బాపూజీనా? గద్దరా? విమలా? నళినా? లేక కెసిఆర్, కోదండరామ్ ద్వయమా? ఒక్క పిలుపు కాదు, లక్ష పిలుపులిచ్చినా, అరిచి గీపెట్టినా ఒక్కడూ కదలడు. అదే తెలంగాణ అగ్రకుల నాయకత్వం. కేవలం కనుసైగతోనే ప్రాణాలు తీసుకోవచ్చు. నిబద్ధతతో ఉద్యమం చేసే దళిత బహుజనులు ఎంతమంది ఉన్నా నాయకత్వం మాత్రం రెండు అగ్రకులాలదే. ఐలయ్య లాంటి వాళ్ళు కెసిఆర్‌ను విమర్శించినంత మాత్రాన ప్రజలందరి మనోభావాలు ఎట్లా దెబ్బ తింటాయో అసలుకే అర్థం కావడం లేదు.

గద్దర్, బాపూజీ, విమలక్క, కృష్ణ మాదిగ , బెల్లయ్య నాయక్‌లను మాటలతో చేతలతో దాడి చేయించినప్పుడు సుజాత ఒక్క మాట మాట్లాడలేదు. ఎందుకో? కెసిఆర్‌ను కాపాడుకునే కమిట్‌మెంట్ సైనికులుగా సుజాత లాంటి వాళ్ళు మారడం అణగారిన ఉద్యమాల్లో పాల్గొన్న వారికి చాలా బాధ కల్గిస్తుంది. వైఎస్సార్, ఎన్‌టిఆర్, చంద్రబాబు సంపాదించుకున్నట్లుగానే కెసిఆర్ తన కుటుంబాన్ని పోషించుకోవడం తన ఉద్యమానికి పెద్దగా నష్టం చేసే విషయం కాదనడం తెలంగాణ తొందరగా తెచ్చుకునే వ్యూహం కావచ్చు. ప్రజల ఆకాంక్షలను పాతాళానికి తొక్కినా మీలాంటి వారంతా ఎలుగెత్తుతున్నారుగా? రాజకీయ కుట్రల్ని ఎత్తి చూపడం తెలంగాణ ఉద్యమాన్ని మరింత పదును తేలుస్తుంది తప్ప అడ్డంకి ఎలా అవుతుందో అర్థం కావడం లేదు.

కుట్రల్ని ప్రజలకు విప్పి చెప్పకుండానే నాయకత్వాన్ని అగ్రకులాల నుంచి అణగారిన కులాలకు షిప్ట్ చేయడం సాధ్యమవుతుందా? దళిత, బహుజన, ఆదివాసీ, మైనార్టీ, మహిళ, శ్రామిక, నక్సల్బరీ ఉద్యమాల్లో లేని ఆత్మహత్యల సంస్కృతి అగ్రకుల సంకీర్ణ నాయకత్వంలో నడుస్తున్న ఒక్క తెలంగాణ ఉద్యమంలోనే ఎందుకు దాపురించిందో సుజాత చెప్పలేక పోయారు. సీమాంధ్ర దోపిడీదారుల వల్ల ఎఫ్‌డిఐ, సెజ్‌లతో తెలంగాణ ప్రజలు కుదేలవుతున్నారు కాబట్టి ప్రత్యేక రాష్ట్రం కావాలంటున్నారు సుజాత. పాపం! తెలంగాణ రాష్ట్రంలో సెజ్‌లు ఉండబోవని ఆమె భ్రమిస్తున్నారు కాబోలు. లక్షసార్లు తలనరుక్కుంటానన్న కెసిఆర్ ఒక్కసారి కూడా గుండుసూది ముట్టలేదు. ఏడు వందల మంది ఏమీ అనకుండానే సచ్చిందాక ఉరి తీసుకున్నారు.

ప్రాణాలనైనా ఇస్తామనే ప్రకటన నాయకులది - ప్రాణాలు తీసుకునే బాధ్యత ప్రజలదా? సచ్చేటోని తరఫున వకాల్తా పుచ్చుకునే ప్రాతినిధ్య నాయకత్వం తెలంగాణకు లభించిన గొప్పవరం కావచ్చు. ప్రాణాలు ఇచ్చిన, ఇస్తోన్న వారు కళ్ళ ముందు కనిపిస్తున్నా నమ్మబలికే ప్రకటనలు చేసే నాయకుడే దైవ సంభూతుడుగా కనిపించడం ఎటువంటి దౌర్భాగ్యం? ఉస్మానియా విద్యార్థుల, వీరోచిత, నిస్వార్థ ఉద్యమాన్ని కుట్రలు, కోవర్టులతో నిట్ట నిలువుగా చేసిన రాజకీయ హత్య సంగతేమిటి? ఇవ్వాళ 'సైకిల్ యాత్ర' పేరుతో తిరుగుతున్న విద్యార్థుల కెందుకు ఆదరణ కరువైందో!

తెలంగాణ ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొనకుండా విమర్శించే అర్హత ఉండదని కండిషన్స్, కంపల్షన్స్ పెట్టడం ఎవరిచ్చిన జ్ఞానం? సామాజిక రాజకీయ విశ్లేషణ చేసే ప్రతిఒక్కరికీ ప్రాక్టికల్ లైఫ్ ఉండాలనడం ఆదర్శం మాత్రమే. అదే తప్పసనిసరి అనుకుంటే ప్రాపంచిక పురోగమనం ఇంత ఉండేది కాదు. శాస్త్రవేత్తలందరూ వీధుల్లోనే తిరగాల్సి ఉంటుంది. ఆఖరికి మార్క్స్, రూసోలు కూడ. ఉద్యమ ఆచరణ ఉండాలని కోరుకోవడం నిరభ్యరంతరంగా గొప్ప విషయమే. కాని తప్పనిసరి అంటే ప్రపంచాన్ని మార్చాలని చెప్పిన ఏ సిద్ధాంతకర్తనూ మనం అంగీకరించకూడదు. సుజాత ఉద్దేశ్యంలో అలాంటి వారంతా ఉద్యమాలకు నష్టం చేసినట్లేనా? తెలంగాణకు అనుకూలంగా రాస్తే, ఉద్యమంలో పాల్గొనకపోయినా ఫరావాలేదు కాబోలు.

ఎందుకంటే అలాంటి మేధావులే అధికంగా కనిపిస్తున్నారు. ఒక చోట తెలంగాణ ప్రజలు అమాయకులని, మరోచోట ఎన్ని కుట్రలు చేసినా రాష్ట్రం ఎలా తెచ్చుకోవాలో తెలంగాణ ప్రజలకు తెలుసనే పరస్పర విరుద్ధ వాదనలు సుజాత వ్యాసంలో ఉన్నాయి. ప్రజల చైతన్యం అంతిమమే కాని, ఉద్యమాన్ని మలుపులు తిప్పి తలుపులు తెరిచే వ్యూహం మాత్రం నాయకత్వానిదే. రాజకీయ కుట్రల్ని వివరించి చెప్పకుండానే నేరుగా ద్రోహులకు ప్రజలే బుద్ధి చెప్పుతారని వాదించడం రాజకీయ పరిజ్ఞానం కొరవడటం వలనే అని భావించాల్సివస్తుంది. 'రెండో ప్రపంచ యుద్ధానంతరం నన్ను నా దేశంలో మనిషిగా చూస్తారా?' అని ఆఫ్రికన్ అమెరికన్ సైనికుడు ఒకరు అడిగిన ప్రశ్న ఆనాడు అమెరికా రాజకీయాలలో సంచలనం కల్గించింది. రేపు తెలంగాణ వచ్చినా అణగారిన కులాల వారి ప్రశ్న అలాగే మిగిలిపోతుంది.

అప్పుడు ఏ అగ్రకులనాయకుడు నీ కోసం ఉద్యమించడు. అతని రాజకీయ సమస్య ప్రజలందరి జీవన్మరణ సమస్య. తెలంగాణ ఉద్యమంలో కొద్ది మంది దళితులు నాయకులుగా ఉన్నంత మాత్రాన ఆ వర్గం వారి సమస్యలు పరిష్కారం కావు. ఆ ఉద్యమానికి వాళ్ళ జీవితాలను మార్చగలిగే సహజసిద్ధ స్వభావం లేకుండా పెద్దగా మార్పుల్ని ఆశించడం సంపూర్ణంగా భ్రమే అవుతుంది.

- సుదర్శన్ బాలబోయిన,
వేణుగోపాల్‌రెడ్డి బండారి
ఉస్మానియా విశ్వవిద్యాలయ పరిశోధక విద్యార్థులు 
Andhra Jyothi News Paper Dated 06/01/2012

No comments:

Post a Comment