Friday, January 6, 2012

తెలంగాణ పరిశోధకులకు మార్గదర్శి


సమకాలీన రాష్ట్ర రాజకీయాలలో తెలంగాణ ఉద్యమం ప్రాంతీయత సమిష్టి వారసత్వం అంశాలకు సంబంధించిన అనేక కీలక అంశా ల్ని మునుపెన్నడు లేని విధంగా ముందుకు తెచ్చింది. అదే క్రమంలో ప్రాంతీయ చైతన్యం, అస్తిత్వం, ఉనికి, సంస్కృతి కేంద్ర బిందువులుగా నిలిచాయి. సాధారణంగా సామాజిక, రాజకీయ ఉద్యమాలకు చరిత్ర, సంస్కృతి ప్రధాన పునాదులు, సాధనాలు కావడం వల్ల ఈ అంశాలపై అనుకూల, ప్రతికూల వ్యాఖ్యానాలు, విశ్లేషణలు చేయడం పరిపాటి. అయితే ప్రస్తుత ఉద్యమాలలో కొందరు రాజకీయ నాయకులు, కుహనా మేధావులు తెలుగువారి గతానికి, వర్తమానానికి సంబంధించిన అనేక అంశాల్ని విచక్షణారహితంగా అనాలోచితంగా ప్రస్తావించడం జరుగుతుంది. 
ఉదాహరణకు ఆంధ్ర/ఆంద్రులు, తెలుగు/తెలంగాణ, నిజాం రాష్ట్రం, జాతినామం, భాషానామం, ప్రాంత, రాజ్య నామాలపై అస్పష్టత వగైరాలు. మొత్తంగా తెలుగు వారి చారిత్రిక, సాంస్కృతిక వారసత్వాలపై పరస్పర విరుద్ధ ప్రకటనలు, విశ్లేషణలు, వక్రీకరణలు చోటుచేసుకుంటున్నాయి. సరైన చారిత్రిక దృక్పథం, అవగాహన లేకపోవడం వల్లనే క్షణికావేశాలకు లోనై విచక్షణారహితంగా చర్చించడం, దౌర్జన్యాలకు పాల్పడటం జరుగుతుంది. ఇలాంటి సందర్భంలోనే విద్యావంతులైన మేధావులు, చరిత్రకారులు, ఉద్యమాలు లేవనెత్తిన అంశాల్ని శాస్త్రీయంగా హేతుబద్ధంగా బేరీజువేయాల్సిన అవసరం ఉందని చెప్పక తప్పదు. పరిణితి చెందిన మేధావులు సున్నితమైన అంశాల్ని పలు కోణాల్నించి రాగద్వేషాలకు, భావోద్వేగాలకు అతీతంగా విశ్లేషించాల్సిన అవసరం ఉంది. 

డాక్టర్ సుంకిరెడ్డి నారాయణరెడ్డి గారు రచించిన ఈ 'తెలంగాణ చరిత్ర'లో తెలంగాణ రాజకీయ, సాం స్కృతిక ఉద్యమాల నేపథ్యంలో ఈ ప్రాంత ప్రజల గతానికి సంబంధించిన అనేక అంశాల్ని వివరణాత్మకంగా విశ్లేషించడం జరిగింది. గ్రంథకర్త తెలంగాణ భూమిపుత్రుడు, తన స్వంత గడ్డపై నడుస్తున్న ఉద్యమాల ద్వారా ప్రేరేపితుడై, వాటి పట్ల ఆకర్షితుడై తన వివిధ రచనలలో భాగంగా ప్రస్తుత గ్రంథాన్ని వీలైనంత సంగ్రహంగా రచించాడు. ఈ నాటి వరకు ఆంధ్రదేశ చరిత్ర పరిశోధన, రచనలల్లో తెలంగాణ ప్రాంత చరిత్రకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడానికి, అదేవిధంగా తెలంగాణ ప్రాంతానికి చరిత్రకారులు తగినంత ప్రాముఖ్యత ఇవ్వని లోటును పూడ్చడానికి చేసిన ప్రయత్నమే ఈ పుస్తకం. 

'తెలంగాణ చరిత్రను తెలంగాణ వారు రాసుకుంటేనే తెలంగాణ చరిత్రకు న్యాయం జరుగుతుంది' అనేది నారాయణరెడ్డి గారి నమ్మకం. వాస్తవానికి ఆంధ్రదేశ చరిత్ర రచనా క్రమం లో తెలంగాణ ప్రాంతానికి సరైన గుర్తింపు లేదనే విషయాన్ని తొలి తరం తెలంగాణ మేధావులు గుర్తించారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడినఅనంతరం మిగతారంగాలతో పాటు చరిత్ర నిర్మాణ విషయంలో కూడా తెలంగాణ విస్మరణకు, వివక్షకు గురైన విషయాన్ని ప్రస్ఫుటంగా ప్రస్తావించిన పండితులు బి.ఎన్.శాస్త్రి. తెలంగాణ చరిత్రను పునర్నిర్మించడానికి ఆయన పడిన శ్రమ, కృషి, చేపట్టిన పరిశోధన, రచనలు మరుపురానివి. 

తెలంగాణ చరిత్రకు ప్రత్యేకతను, గుర్తింపును, ప్రాముఖ్యతను సంతరించి పెట్టిన తెలంగాణ ప్రాంత పరిశోధకుల్లో ఆయన అగ్రగణ్యుడు. శాస్త్రిగారి అడుగుజాడల్లో నడుస్తూ యింతవరకు అసమగ్రంగా వున్న తెలంగాణ రాజకీయ, సాంఘిక, మత, సాం స్కృతిక చరిత్రకు నిర్దిష్ట రూపకల్పన చేసిన ఘనత నారాయణరెడ్డి గార్కి దక్కుతుందని చెప్పడంలో సందేహం లేదు. రచయిత మాటల్లో 'విడిగా విష్ణుకుండినుల చరిత్ర, కాకతీయుల చరిత్ర, రాచకొండ పద్మనాయకుల చరిత్ర, కుతుబ్‌షాహి, అసఫ్ జాహిల చరిత్ర గురించి పరిశోధనలు జరిగినవి. 

కాని సమగ్రంగా తెలంగాణ భౌగోళిక, రాజకీయ, సాంస్కృతిక చరి త్ర ఒక్కచోట క్రోడీకరించడం జరగలేదు. తెలంగాణ చరిత్ర నిర్మాణం సమగ్రంగా జరగాలంటే ముందు తెలంగాణ భౌగోళిక, రాజకీయ చరిత్ర నిర్మాణం సమగ్రంగా జరగాల్సివుంది. అందులో భాగమే ప్రస్తుత పుస్తక రచన'. అంతేకాకుండా 'తెలంగాణ చరిత్ర పునర్నిర్మాణం వల్ల దశాబ్దాలుగా ఆత్మన్యూనతకు గురి అయిన తెలంగాణ ప్రజలు పునరుజ్జీవనం చెంది ఆత్మ విశ్వాసంతో పురోగమిస్తారు' అనేది ఆయన అభిప్రాయం. 

నిర్దిష్టమైన పరిశోధన, చరిత్ర రచనా పద్ధతుల్ని అనుసరించి లభ్యమై న సాక్ష్యాధారాల్ని సేకరించి ఆదిమయుగం నుండి ఆధునిక యుగం వర కు తెలంగాణ చరిత్రను గ్రంథకర్త 12 అధ్యాయాలలో వివరించాడు. 'కొత్త లక్ష్యాలు రూపొందినప్పుడల్లా గత కాలపు సంఘటనల ప్రాము ఖ్యం గతకాలానికి చరిత్రకారుల వ్యాఖ్యానం మారుతూ ఉంటుందని' ప్రముఖ చరిత్ర తత్త్వవేత్త ఇ.హెచ్.కార్ చేసిన సూత్రీకరణ అస్తిత్వ ఉద్యమాల నేపథ్యంలో తెలంగాణ చరిత్ర రచనకూ వర్తిస్తుందని నారాయణరెడ్డి రాశాడు. 

'ఈ దృష్ట్యా చరిత్రలో తెలంగాణ అస్తిత్వాన్ని నిరూపించ డం, విస్మరణకు గురైన తెలంగాణ చరిత్రను కొద్దిగానైనా వెలికి తీయడం ఈ గ్రంథంలో జరిగింది'. ఇది ఆధునిక చరిత్ర రచనా పద్ధతిలో ప్రాచు ర్యం పొందుతున్న నూతన ధోరణి. ఈ మధ్యకాలంలో దేశం మొత్తం మీద విస్తృత స్థాయిలో అణగారిన వర్గాలు, కులాలు, ప్రాంతాలు, లింగ వివక్షకు గురైన స్త్రీ సమూహాలలో నూతన చైతన్యం విస్తరిస్తుంది. ఈ క్రమంలో అస్తిత్వం, ఉనికిని చాటుకుంటూ చైతన్య స్థాయిని, సంఘటిత శక్తిని పెంపొందించుకునే తరుణంలో తమ పుట్టుపూర్వోత్తరాల్ని, గతాన్ని ప్రత్యేకతను చాటిచెప్పుకునే ప్రయత్నం జరుగుతుంది. అందుకు ప్రత్యామ్నాయ చరిత్ర రచన, సాంస్కృతిక పరిశోధనలు ప్రత్యేక ఆయుధాలుగా ఉపయోగపడుతున్నాయి. 

నారాయణరెడ్డి రచించిన ఈ పుస్తకం గత 5-10 సంవత్సరాలుగా తెలంగాణ పై వెలువడుతున్న అవగాహనా సాహిత్యంలో భాగమే. చరి త్ర రచనకు రెండు కండ్లైన కాలక్రమం, భౌగోళిక అంశాల్ని పరిగణనకు తీసుకొని చరిత్ర పూర్వయుగం నుండి ఆధునిక యుగం వరకు తెలంగాణ ప్రాంతం గతాన్ని చక్కగా వివరించడం జరిగింది. ఈ పుస్తకంలో క్రీస్తు పూర్వం నుండి 1948 వరకు తెలంగాణ భౌగోళికంగా, రాజకీయంగా ఏ విధమైన ప్రత్యేక ఉనికిని కలిగి వుంది అనే అంశాల్ని సోదాహరణంగా పేర్కొనడం జరిగింది. అంతేకాకుండా తెలంగాణ చరిత్రలోని కొన్ని ఖాళీలను పూరించే ప్రయత్నం కూడా చేయడం జరిగింది. 

ఉదాహరణకు ఇంతవరకు ఆంధ్రదేశ చరిత్రకారులు తమ రచనల్లో క్రీ.శ. 200-600 నాటి తెలంగాణ చరిత్ర 'అజ్ఞాతయుగమని' పేర్కొనడం జరిగింది. తనకు లభ్యమైన గ్రంథాల ఆధారాలతో మరుగునపడిన తెలంగాణ చరిత్రను వెలికి తీసే బలమైన ప్రయత్నాన్ని గ్రంథకర్త చేశాడు. ముఖ్యంగా ప్రాచీన తెలంగాణ చరిత్రలో విష్ణుకుండిన, వాకాటక, బాదామి చాళుక్య, కుందూరి చోడుల రాజ్యాల ప్రాము ఖ్యాన్ని విపులంగా వివరించడం జరిగింది. 'ఆంధ్రప్రదేశ్‌లో మూడవ వంతైన తెలంగాణను పాలించిన వాకాటకుల గురించిన వివరాలు ఏ ఆంధ్రదేశ చరిత్ర గ్రంథంలోనూ, ఆఖరికి సమగ్ర చరిత్ర అని చెప్పుకుని ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కాంగ్రెసు వారు ప్రచురించిన 'ఆంధ్రప్రదేశ్ సమగ్ర చరిత్ర - సంస్కృతి' గ్రంథాలలోనూ లేవు. 

అం టే ఇక్కడ తెలంగాణ చరిత్ర విస్మరణకు గురైందని అర్థం.' అదేవిధంగా కొంతమంది చరిత్రకారులు ప్రాచీనాం ధ్ర చరిత్రలో తెలంగాణ ప్రాముఖ్యతను తగ్గిస్తూ కేవలం కోస్తాంధ్ర చరిత్రనే 'ఆంధ్రుల చరిత్ర' అనడంలోని ఔచిత్యాన్ని ప్రశ్నించడం జరిగింది. ఆ తర్వాత 'వేములవాడ చాళుక్యుల గురించి తెలుగు అకాడమి ఎం.ఏ చరిత్ర విద్యార్థులకోసం ప్రచురించిన ఆంధ్రదేశ చరిత్ర-సంస్కృతి (1986) గ్రంథంలో రాయనే లేదు. ఇతర ఆంధ్ర చరిత్రకారులు కూడా సరిగా రాయలేదు. ఒక్క బి.ఎన్.శాస్త్రి మాత్రమే వాళ్లు పేర్కొనని శాసనాలు, కట్టడాలు, గ్రంథాలు, నాణాలు మొదలగు ఆధారాలను పేర్కొని వివరంగా రాసినారు. 

' 'తెలుగు అకాడమి పాఠ్యపుస్తకంలో కేవలం 35 సంవత్సరాలు పాలించిన ముసునూరి వంశానికి నాలుగు పేజీలు కేటాయించి వంద సంవత్సరాలకు పైగా తెలంగాణను పాలించిన పద్మనాయకులకు పేజిన్నర కేటాయించడం, పద్మనాయకుల కంటే తక్కువ కాలం, తక్కువ ప్రాంతం పాలించిన రెడ్డి రాజులకు ఎనిమిది పేజీలు కేటాయించడం తెలంగాణ చరిత్రకు జరిగిన అన్యాయానికి మరో నిదర్శనం.' ఆధునిక చరిత్రకు సంబంధించిన అనేక రాజకీయ, సామాజిక, సాంస్కృతిక, గ్రంథాలయ ఉద్యమాల గురించి కొన్ని నూతన అంశాలను ఈ పుస్తకంలో పొందుపర్చినారు. సబాల్ట్రన్ చరిత్ర రచనా పద్ధతి ననుసరించి కేవలం శిష్ట వర్గాలను గురించే కాకుండా దళిత, బహుజన చరిత్రకు సంబంధించిన అంశాలను కూడా సంక్షిప్తంగా వివరించారు. 

నారాయణరెడ్డి గారు తను సేకరించిన నూతన సమాచారం ఆధారంగా తెలంగాణ చరిత్రలోని కొన్ని ఖాళీలను పూరించి, భావి తరాల పరిశోధకులకు మార్గదర్శిగా నిలిచాడని చెప్పక తప్పదు. అస్తిత్వ ఉద్యమాల నేపథ్యంలో చరిత్ర నిర్మాణ ప్రక్రియ హేతుబద్ధంగా ఆధారాల సహితంగా జరగాల్సిన అవసరాన్ని ఈ పుస్తకం తెలియజేస్తుందని నా నమ్మకం. అంతేకాకుండా గ్రంథకర్త ఆంధ్రదేశ చరిత్ర సంస్కృతిపై ఇంతవరకు వెలువడిన అనేక పుస్తకాల్ని తనకు అందుబాటులో వున్నంత వరకు వీలైనంత మేరకు సమన్వయం చేసి ఆబ్జెక్టివ్‌గా విశ్లేషించి సమగ్ర తెలంగాణ చరిత్రను రచించడం హర్షణీయం. మొత్తంగా ఈ పుస్తకం ద్వారా దీర్ఘకాల తెలంగాణ చరిత్రను క్రమపద్ధతిలో చదవడానికి చక్కని అవకాశమేర్పడింది. అందుకు నారాయణరెడ్డి గారికి నా అభినందనలు. 

- ప్రొఫెసర్ అడపా సత్యనారాయణ
చరిత్ర శాఖ, ఉస్మానియా యూనివర్సిటి
(త్వరలో ఆవిష్కరించనున్న 'తెలంగాణ చరిత్ర' పుస్తకం ముందుమాట)
Andhra Jyothi News Paper Dated 10/10/2011

No comments:

Post a Comment