Monday, January 9, 2012

పోస్కోపై పోరాటం..



అభివృద్ధి ప్రాజెక్టుల పేరిట మూలవాసుల బతుకులను ఆగం చేస్తున్న బహుళజాతి కంపెనీలకు వ్యతిరేకంగా వర్తమానంలో కొనసాగుతున్న ఉద్యమాల్లో పోస్కో వ్యతిరేక పోరాటం ప్రముఖమైనది. రూ. 60 వేల కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడితో ఏటా 12 మిలియన్ టన్నుల స్టీలును ఉత్పత్తి చేయడం లక్ష్యం గా భారీ కర్మాగారాన్ని నెలకొల్పడానికి పోస్కో కంపెనీ ఒరిస్సా ప్రభుత్వంతో ఒప్పం దం కుదుర్చుకున్నది మొదలు స్థానికులు అత్యంత దృఢమైన, రాజీలేని పోరాటం కొనసాగిస్తున్నారు. జగత్‌సింగ్‌పూర్ జిల్లాలోని ఎనిమిది గ్రామాలకు చెందిన సుమా రు నాలుగు వేల కుటుంబాలను బజారుకీడ్చే ప్రాజెక్టు తమకు వద్దే వద్దంటూ స్థానికులు పనులను అడ్డుకుంటున్నారు.

ఒప్పందం కుదిరిన 15 రోజుల్లోనే పోస్కో ప్రతిరోధ్ సంఘర్ష్ సమితి(పోస్కో వ్యతిరేక పోరాట సమితి-పీపీఎస్‌ఎస్)పేరిట సంస్థను ఏర్పాటు చేసుకుని పోరాడుతున్నారు. పోస్కో గూండాలు దాడి చేసి నేతలను హత్య చేసినా, లాఠీచార్జీలు, అరెస్టులతో పోలీసు బలగాలు బీభత్సం సృష్టించినా వెనకడు గు వేయకుండా గత ఆరేళ్లుగా ప్రజాస్వామిక పద్ధతుల్లో ఉద్యమిస్తున్నారు.. పోస్కో ప్రాజెక్టును మరోచోటుకు తరలించాలని, తమ బతుకులు తమను బతుకనివ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
దక్షిణ కొరియాకు చెందిన పోస్కో (పోహాంగ్ స్టీల్ కంపెనీ) ఒరిస్సాలోని జగత్‌సింగ్‌పూర్ జిల్లాలో భారీ ఉక్కు కర్మాగారాన్ని నెలకొల్పడానికి 2005 జూన్ 22న ఆ రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకున్నది. 2007 మేలో కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ప్రత్యేక ఆర్థిక మండలి(సెజ్)గా గుర్తించి అనుమతి మంజూరు చేసిం ది. ఒప్పందం ప్రకారం ధింకియా గ్రామం వద్ద భారీ ఉక్కు కర్మాగారం నిర్మిస్తారు.

ఈ కర్మాగారానికి అవసరమైన ఇనుప ఖనిజం కోసం సుందర్‌గఢ్ జిల్లాలోని కండధర్ పర్వతక్షిశేణుల్లో 6100 ఎకరాల ప్రాంతాన్ని, టౌన్‌షిప్ కోసం మరో 500 ఎకరాలను పోస్కోకు అప్పగిస్తారు. శుద్ధి చేసిన ఖనిజాన్ని, స్టీలును ఎగుమతి చేయడం కోసం పరదీప్ రేవుకు సమీపంలో పోస్కో స్వంత రేవును నిర్మించుకుంటుంది. కర్మాగారానికి అవసరమైన నీటిని మహానది బ్యారేజీ నుంచి సరఫరా చేస్తారు. ఇనుప ఖనిజానికి టన్నుకు కేవలం రూ. 27 మాత్రమే (అంతర్జాతీయ మార్కెట్‌లో టన్ను ఇనుము ధర రూ. 7వేలు ఉంది) పోస్కో కంపెనీ ప్రభుత్వానికి చెల్లిస్తుంది. 2016కల్లా ప్రాజెక్టు మొదలై ముందు సంవత్సరానికి 6 మిలియన్ టన్నుల ఉక్కు ను ఉత్పత్తి చేస్తూ క్రమంగా 12 మిలియన్ టన్నుల స్థాయికి చేరుకుంటుంది. కర్మాగారం కోసం ధింకియా తదితర ఎనిమిది రెవెన్యూ గ్రామాలకు చెందిన 4004 ఎకరాల భూమిని కేటాయించారు.

ఇది కాకుండా ఓడరేవుకు సరుకుల రవాణాకు రోడ్డు,రైలు మార్గం, ఇతర సదుపాయాల కల్పనకు, టౌన్‌షిప్ అభివృద్ధికి అవసరమయ్యే 2-3 వేల ఎకరాల భూమిని సైతం అప్పగించా రు. పోస్కో చెబుతున్న ప్రకారం ఈ భూకేటాయింపుల వల్ల 471 కుటుంబాలు (పెళ్లయిన వారందరిని యూనిట్‌గా తీసుకుంటే 718 కుటుంబాలు) ఇళ్లను, పంట పొలాల ను కోల్పోతాయి. అయితే నిర్వాసితుల తరఫున పోరాడుతున్న పీపీఎస్‌ఎస్ చెబుతున్న సంఖ్య నాలుగు వేలకు పైగానే ఉంది. ఈ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తు న్న ఏ నిరసన కార్యక్షికమాలకైనా, సభలకైనా 20 వేలకు మిం చిన సంఖ్యలో జనాలు రావడం చూస్తే ఏది నిజమో మనకు ఇట్టే అవగతమవుతుంది.

తమకు కేటాయించిన 4004 ఎకరాల్లో కేవలం 438 ఎకరాలు మాత్రమే ప్రైవేట్ వ్యక్తులకు చెందినదనీ, మిగ తా 3566 ఎకరాలు ప్రభుత్వ అటవీ భూమనీ పోస్కో చెబుతున్నది. తాము ఏ చట్టాలనూ ఉల్లంఘించడం లేద ని, తమ ప్రాజెక్టు మూలంగా ఈ ప్రాంతం సంపద్వంతమవుతుందని స్పష్టం చేస్తున్నది. భూమి కోల్పోయిన ప్రతి కుటుంబానికీ పరిహారం కింద ఎకరానికి పదకొండున్నర లక్షల రూపాయలు ఇవ్వడంతో పాటు పునరావాసం కల్పిస్తామని, కర్మాగారంలో ఉద్యోగం ఇచ్చేవరదాకా నెలకు రూ. 2250 చొప్పున అల ఇస్తామని మరోవైపు ప్రభుత్వం స్థానికులకు ఆశజూపుతున్నది. 

అయినప్పటికీ స్థానికులు ప్రాజెక్టు నిర్మాణానికి ససేమిరా అంటున్నారు. సాగుభూమిని, ఆదివాసుల ఆధీనంలో ఉన్న అటవీ భూమిని బహుళజాతి కంపెనీలకు ధారాదత్తం చేయడం చట్టాలను ఉల్లంఘించడమేనని పీపీఎస్‌ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అభయ్ సాహు ఆరోపిస్తున్నారు. కేటాయించింది ప్రభుత్వ భూమే అయినప్పటికీ దశాబ్దాల తరబడి ఆ భూములను స్థానిక ఆదివాసులు సాగు చేసుకుంటున్నారని, 2006లో పార్లమెంటు ఆమోదించిన అటవీ హక్కుల చట్టం ప్రకారం స్థానికంగా నివసించే తెగలకు అటవీ భూమితో పాటు ఇతర వనరులను ఉపయోగించుకునే హక్కు ఉందని చెబుతున్నారు. తమలపాకులు వంటి వాణిజ్యపంటలు పండిస్తూ స్థానికంగా స్వయం పోషక ఆర్థిక వ్యవస్థ వర్ధిల్లుతున్నదని, పారిక్షిశామికీకరణ పేరిట ఆదివాసుల జీవన విధ్వంసం తగదని ఆయన అన్నారు.

సాహూ నాయకత్వంలో 2005 జూలై 11 నుంచీ పోస్కో వ్యతిరేక ఆందోళన కొనసాగుతున్నది. ఓ ఆరు నెలల పాటు స్థానికులకు అవగాహన కార్యక్షికమాలు నిర్వహించిన తర్వాత 2006 జనవరి 21న ప్రభుత్వ పునరావాస ప్యాకేజీని వివరించడానికి వచ్చిన మంత్రుల బృందాన్ని తమ గ్రామాలకు రాకుండా స్థానికులు అడ్డుకున్నారు. ఈ పోరాటంలో ప్రధానంగా మహిళలు ముందున్నారు. అప్పటి నుంచి పోస్కో ప్రైవేటు సైన్యంతో పాటు పోలీసు బలగాల సాయంతో ఇళ్ల నుంచి, పొలాల నుంచి స్థానికులను బలవంతంగా ఖాళీ చేయించే చర్యలను పీపీఎస్‌ఎస్ నాయకత్వంలో ప్రజలు తిప్పికొడుతున్నారు. 2008లో తపన్ మండల్ అనే పీపీఎస్‌ఎస్ నేతను పోస్కో గూండాలు చంపివేశారు. భారీయెత్తున పోలీసు బలగాలను మోహరించి పోలాంగ్, నౌగాం గ్రామాలకు చెందిన 1700 ఎకరాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నది. అయితే, కర్మాగార నిర్మాణ స్థలంగా భావిస్తున్న ధింకియా గ్రామం మాత్రం పట్టుసడలని దీక్షతో నిలబడింది. గ్రామం చుట్టూరా కంచెను నిర్మించి బయటివాళ్లు లోపలకు రాకుండా, లోపలివాళ్లు బయటకు వెళ్లకుండా చేసి, గ్రామానికి వచ్చే రోడ్డును తవ్వేసి గత ఐదేళ్లుగా పోస్కో ఆక్రమణను అడ్డుకుంటున్నారు. 

నిజానికి పోస్కోతో ఎంఓయూ కుదుర్చుకున్నప్పటి నుంచీ ఆ ఒప్పందం ఆదివాసుల హక్కులను ఉల్లంఘిస్తోందని, అక్కడ జరుగుతున్న భూసేకరణ చట్టవిరుద్ధమని, ఓడరేవు నిర్మిస్తున్న చోట నివసించే ఆలివ్ రిడ్లీ జాతికి చెందిన అరుదైన తాబేళ్ల ఉనికికి ప్రమాదమన్న విమర్శలు వినవస్తూనే ఉన్నాయి. ఈ అంశాన్ని పరిశీలించడానికి భారత ప్రభుత్వం 2010 జూలైలో 19 మంది సభ్యులతో ఎన్‌సీ సక్సే నా కమిటీని వేసింది. ఒరిస్సాను పర్యటించి వివిధ వర్గాల ప్రజలను కల్సిన తర్వాత పోస్కోకు భూకేటాయింపు విషయంలో అటవీ హక్కుల చట్ట ఉల్లంఘన జరిగిందని ఈ కమిటీ తేల్చింది. పర్యావరణ, అటవీ శాఖ వెంటనే ఈ ప్రాజెక్టుకు ఇచ్చిన అనుమతిని వెనక్కి తీసుకోవాలని కోరింది. దరిమిలా పోస్కో పనులను ఆపేయాల్సిందిగా ఆ మంత్రిత్వ శాఖ 2010 ఆగస్టులో ఆదేశాలు జారీ చేసింది. 

అయితే, సక్సేనా కమిటీ నివేదికను జీర్ణించుకోని భారత ప్రభుత్వం నలుగురు సభ్యులతో మీనా గుప్తా కమిటీని వేసింది. విస్తృత పరిశీలన తర్వాత 2010 పఅక్టోబర్‌లో ఈ కమిటీ భిన్నాభివూపాయం కలిగిన నివేదికను విడుదల చేసింది. పోస్కోకు కేటాయించింది అటవీ భూములే అయినప్పటికీ అవి ఆదివాసుల ఆక్రమణలో లేవని, రైతులు, మత్స్యకారుల ఆధీనంలో ఉన్నవని కమిటీ చైర్‌పర్సన్ మీనా గుప్తా అభివూపాయపడ్డారు. భూములు కోల్పోయిన వారిలో ఆదివాసులు కూడా ఉన్నారని, ఇది అటవీ హక్కుల చట్ట ఉల్లంఘన కిందకే వస్తుందని మిగతా ముగ్గురు సభ్యులు తేల్చి చెప్పారు. ఈ మీనాగుప్తా కమిటీ నివేదిక ఆధారంగా పోస్కో ప్రాజెక్టుకు కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ 2011 జనవరి 31న తిరిగి షరతులతో కూడిన అనుమతిని మం జూరు చేసింది. జూన్ 14న స్థానిక ప్రజల తీవ్ర నిరసనల నేపథ్యంలో ఒరిస్సా ప్రభుత్వం భూసేకరణను నిలిపివేసింది. సెప్టెంబర్ 8న అటవీశాఖ ఆధీనంలో ఉన్న భూముల సేకరణకు అనుకూలంగా ఒరిస్సా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే, ప్రైవేట్ భూముల సేకరణను మాత్రం తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు నిలిపివేసింది.

2005 ఎంఓయూకు చెల్లుబాటు కాలం గడిచిపోవడంతో ప్రస్తుతం పోస్కోతో తిరిగి తాజాగా ఒప్పందం కుదుర్చుకునే పనిలో ఒరిస్సా ప్రభుత్వం ఉంది. ఈ లో పు నవంబర్ 25న పీపీఎస్‌ఎస్ చైర్మన్ అభయ్ సాహును ఓ వరకట్న హత్యలో నిందితుడిగా పేర్కొంటూ ఒరిస్సా పోలీసులు అరెస్టు చేశారు. మరికొన్ని తప్పుడు కేసులు కూడా బనాయించారు. సంస్థకు చెందిన క్రియాశీల కార్యకర్తలను సైతం జైలుపాలు చేశారు. 2008లో అరెస్టయి 14 నెలల పాటు నిర్బంధంలో ఉన్న సాహు మరోసారి జైలు నుంచే పోస్కో వ్యతిరేక పోరాటాన్ని నడిపిస్తున్నా రు. జగత్సింగ్‌పూర్ ప్రజలు దేశవాసులను ఒక అతి సామాన్యమైన ప్రశ్నను అడుగుతున్నారు. ‘మేం ఇక్కడే పుట్టాం. ఇక్కడే పెరిగాం. మా ముత్తాతల ముత్తాతల నుంచీ ఇక్కడే ఉంటున్నాం. ఈ నేల మాది. అడవి మాది. మా ఇళ్ల ను, భూములను మేం ఎందుకు కోల్పోవాలి? కోల్పోవాలని నిర్ణయించడానికి వాళ్లెవరు? ప్రజాస్వామ్య దేశంలో తమకు కావల్సిందేదో నిర్ణయించుకునే హక్కు ప్రజలకే ఉంటుందంటారు కదా! ఆ హక్కు మాకు లేదా?’అని. ఇదే ప్రశ్నను సింగూరు వాసులు, నందిగ్రాం వాసులు, మన రాష్ట్రంలోని కాకరాపల్లి వాసులు అడిగారు. అభివృద్ధి ప్రాజెక్టుల పేర భూములు కోల్పోయిన అనేక ప్రాంతాల ప్రజలు అడుగుతున్నారు. 

ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత భారత పాలకులపైన, రాజకీయ పక్షాలపైన, ప్రజాస్వామ్యవాదులు, మేధావుల పైన ఉంది. అభివృద్ధి అంటే బహళజాతి సంస్థలకు తలుపులు బార్లా తెరిచి, సెజ్‌ల పేరుతో స్థానిక చట్టాలనుంచి మినహాయింపులు ఇస్తూ ఉచితంగా భూములను కట్టబెట్టడం, మూలవాసుల హక్కుల ను కొల్లగొట్టడం, స్థానిక సహజ వనరులను దోచుకెళ్లడం కాదని ఇప్పటికైనా గుర్తించాలి. ప్రజాభివూపాయాన్ని గౌరవిస్తూ అభివృద్ధిలో స్థానికులకు భాగస్వామ్యం కల్పి స్తూ ప్రాజెక్టులను చేబట్టాలి. ఎంఓయూలు కుదుర్చుకోవాలి. స్థానికులు అంగీకరించిన తర్వాతనే భూసేకరణ చేయాలి. అలా కాకుండా బలవూపయోగానికి పూనుకుంటే సింగూరు, నందిక్షిగాంలాగే కాకరాపల్లి ధింకియాలూ లాల్‌గఢ్‌లు కాకతప్పదు.

- డి. మార్కండేయ
Namasete Telangana News Papaer Dated 10/01/2012

No comments:

Post a Comment