Sunday, January 29, 2012

విగ్రహమా, ఆశయమా ?

విగ్రహమా, ఆశయమా ?
statuesభారత రాజ్యాంగ నిర్మాత, భారతీయ సమాజానికి మానవత్వం గరపడానికి విశేష కృషి చేసిన మహనీయుడు డాక్టర్‌ బిఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహానికి కుల దురహంకారులు చెప్పుల మాల వేసినప్పుడల్లా ఆ విగ్రహానికి పాలాభిషేకం చేయడానికి అలవాటు పడిన ఆయన అభిమానులు కూడా ఆయన ద్వేషించిన హిందూ పవిత్రతా భావజాలాన్ని ఒంటబట్టించుకున్నవారే. అంబేడ్కర్‌ ఎంతగానో ఆశించిన సామాజిక సంస్కరణలను ద్వేషించిన హైందవ సమాజంలో భాగస్థులుగా ఉంటూనే వారు ఆయనను ఆరాధిస్తున్నారు. ఆయన ఆలోచనలను వారు బొత్తిగా జీర్ణించుకోలేదు.. అందుకే తిరుమల తిరుపతి దేవస్థానంవారు దళిత గోవిందం పేరిట దళిత వాడలలో రామాలయాలు, వెంకటేశ్వరుని విగ్రహాలు నెలకొల్పడానికి సాహసించగలుగుతున్నారు.

సామాజిక సంస్కరణలకు హైందవ భావజాలానికి చుక్కెదురనే వాస్తవాన్ని గ్రహించిన మహాత్మా ఫూలే, అంబేడ్కర్‌, పెరియార్‌లు హైందవానికి ప్రాణ ప్రదమైన బ్రాహ్మణ మతాచారాలను సంప్రదాయాలను ద్వేషించారు. దానికి దన్నుగా వెలిసిన నిచ్చెనమెట్ల కుల వ్యవస్థను కూకటి వేళ్ళతో పెకలించాలని కృషి చేశారు. కాని అది నిర్మూలన కాకపోగా నానాటికీ మరింతగా బలపడుతున్నది. అదేమంటే బిసి, ఎస్‌సిలు కుల ప్రాతిపదికగా సంఘటితం కావడాన్ని అగ్రకుల వాదులు ఎత్తిచూపుతున్నారు. అగ్రవర్ణాలు కుల సంఘాలు ఏర్పాటు చేసుకొని సంఘటితం కావడం, లోపాయికారీగా కుల దురభిమానాన్ని ప్రదర్శించడం, కుల పరంగా హైందవ దోపిడీ, పీడన కొనసాగాలనే కోరికతో కాగా, బిసి, ఎస్‌సిలు కుల ప్రాతిపదికన ఏకం కావడం కుల వ్యవస్థలో, అగ్రవర్ణ పాలక వర్గాల రాజకీయ పెత్తందారీతనంలో తమకు జరుగుతున్న అన్యాయాలను ఎదుర్కొని కుల రహిత మానవీయ సమాజాన్ని నెకొల్పుకునే మహత్తర ఆశయం కోసమే.

ఈ తేడాను కప్పిపుచ్చి కింది కులాలదే కులతత్వమంటూ అగ్రవర్ణ మేధావులు తప్పుదోవ పట్టిస్తున్నారు. తాము మాత్రం కుల దురభిమానాన్ని ప్రదర్శిస్తూ పోషిస్తూ కులం కుడ్యాలు కూలాలంటూ గొంతు చించుకుంటారు. ఇప్పుడు అంబేడ్కర్‌ విగ్రహానికి అపచారం జరిగిందంటూ గగ్గోలు పెట్టి దానికి పాలాభిషేకం చేస్తున్న దళితులు సైతం హైందవ చట్రంలో చేరిపోయి కుదురుగా కూర్చున్నవారే. వీరికి అంబేడ్కర్‌ ఆశయాలు నిజంగా అర్ధమై ఉంటే పాలాభిషేకాన్ని శుద్ధి కార్యక్రమంగా ఎంచుకుని ఉండేవారు కాదు.
దళితులు అంబేడ్కర్‌ విగ్రహాన్ని కడగడానికి వినియోగిస్తున్న పాలు కూడా బహుశా ఆవు పాలే అయి ఉంటాయి. ఆ విధంగా వారు బ్రాహ్మణ్యాన్ని అక్కున చేర్చుకుంటున్నారు.

ఒక విధంగా వారు దళిత బ్రాహ్మణులు. ఇలా ఎటు తిరిగి బ్రాహ్మణ వాద విలువలే అంతటా చోటు చేసుకున్నచోట అంబేడ్కర్‌ ఆశించిన మార్గంలో ఆయన సామాజిక వర్గం వారు నడవడం సైతం దుస్సాధ్యమే అవుతుంది. మీ దేశ ప్రజలలో అతిపెద్ద వర్గంగా ఉన్న అంటరాని కులాల వారిని ప్రభుత్వం నడిపే పాఠశాలల్లో చదువు నేర్చుకోకుండా అడ్డుకుంటున్న మీరు రాజకీయాధికారానికి ఎలా అర్హులు? అని అంబేడ్కర్‌ ఆ నాడు అగ్రవర్ణ సమాజాన్ని సూటిగా నిలదీశారు. అందరికోసం ఉద్దేశించిన సామాజిక బావులలో నీరు చేదుకోకుండా అస్పృశ్యులను అడ్డుకుంటున్న మీరు రాజకీయాధికారానికి ఎంత మాత్రం అర్హులు కారని ఆయన దృఢ స్వరంతో స్పష్టం చేశారు.

అంటరానివారు తమకు నచ్చిన దుస్తులను, ఆభరణాలను ధరించడానికి కూడా అనుమతించని మీరు దేశాధికారానికి ఎలా అర్హులవుతారని 1930వ దశకంలోనే అంబేడ్కర్‌ అగ్రవర్ణ సమాజాన్ని ప్రశ్నించారు. వారు కోరుకొన్న, కొనుక్కోగలిగిన ఆహారాన్ని కూడా వారు తినకూడదని ఆంక్ష విధించి హింసిస్తున్న మీరు రాజ్యాధికారానికి ఎలా అర్హులవుతారని ఆనాటి కాంగ్రెస్‌ అగ్రవర్ణ నాయకత్వాన్ని అంబేడ్కర్‌ ప్రశ్నించారు. జాతీయ కాంగ్రెస్‌ పార్టీలో రాజకీయ సంస్కరణలవైపు మొగ్గు చూపించినవారు సామాజిక సంస్కరణలను నిరసించడమే గాక సామాజిక సంస్కరణవాదులను వేధించి, బాధించడం చూసి అంబేడ్కర్‌ ఆవేదన చెందారు. వారి వారసులే నేడు కాంగ్రెస్‌, బిజెపి, వామపక్షాలు సహా పలు పాలక పార్టీలలో ఆధిపత్యం చలాయిస్తున్నారు.

అందుకే బి.వి. రాఘవులు దళితుల ఆలయ ప్రవేశ సైకిల్‌ యాత్రలు, టిటిడి దళిత గోవిందాలు నిస్సిగ్గుగా సాగిపోతున్నాయి. సమాజంలో పరిమిత సంస్కరణలు తీసుకురాదలచిన హైందవ ఉదారవాదులతో కూడిన జట్‌ పట్‌ మండల్‌ సభకు అధ్యక్షత వహించాలని వారు అంబేడ్కర్‌ను కోరినప్పుడు ఆయన వారికి రాసిన సుదీర్ఘ లేఖలో బాగా చదువుకున్నవాడన్న కారణం మీదనో, అన్నీ తెలిసిన జ్ఞాని అయినందునో ఎవరినిపడితే వారిని గురువుగా గౌరవించడాన్ని హిందూ శాస్త్రాలు సమ్మతించవు కదా, అటువంటప్పుడు మీరు నన్ను ఎలా ఆహ్వానించగలిగారు అని మండల్‌ను ప్రశ్నించారు.

పండితుడైనంత మాత్రాన ఒక ‘అంత్యజుడి’ (దళితుడు)ని హిందువులు ఎంతమాత్రం గురువుగా పరిగణించడానికి వీలు లేదని శివాజీకి గురువైన మరాఠీ సంత్‌ రామదాసు స్పష్టం చేసిన ఉదంతాన్ని అంబేడ్కర్‌ ఆ లేఖలో ప్రస్తావించారు. చాతుర్వర్ణ వ్యవస్థలో మిగిలిన మూడు వర్ణాలూ బ్రాహ్మణుడినే గురువు పీఠంలో కూచోపెట్టాలని హైందవ శాస్త్రాలు స్పష్టంగా చెబుతూ ఉండగా మీరు నన్ను ఆహ్వానించడం విడ్డూరంగా ఉన్నదని అంబేడ్కర్‌ మండల్‌కు స్పష్టం చేశారు. ఆ లేఖ సాంతం చదివిన తర్వాత అంబేడ్కర్‌ అధ్యక్షతన జరగవలసిన సభను జట్‌పట్‌ మండల్‌ రద్దుచేసుకున్నది. ఈ రోజుకి కూడా అగ్రవర్ణ సమాజం దాని చెప్పుచేతల్లో నడుచుకుంటున్న శూద్ర కులాలు అంబేడ్కర్‌ను తాము గర్వించదగిన నేతగా, మార్గదర్శకుడుగా గుర్తించి గౌరవించకపోవడానికి కారణం ఇప్పుడు అర్ధమై ఉండాలి.

మోహన్‌ దాస్‌ కరమ్‌ చంద్‌ గాంధీ కంటె ఉన్నత స్థానంలో ఉంచదగిన మహాత్మా జ్యోతిరావు ఫూలే, అంబేడ్కర్‌లను భారతీయ సమాజం పట్టించుకోకపోవడానికి హేతువు ఇప్పటికైనా తెలిసి ఉండాలి. తూర్పుగోదావరి అమలాపురం, ధవళేశ్వరంలలో తాజాగా సాగిపోయిన అంబేడ్కర్‌ విగ్రహాల విధ్వంస కాండ అణువంతైనా మారని ఈ మను మనస్తత్వం వల్ల ఊడిపడినదే. దీనికి నిరసనగా భగ్గుమన్న దళితులుగాని, వారికి దన్నుగా నిలిచి విధ్వంసకారులను అరెస్ట్‌ చేస్తామని విగ్రహాలను ప్రభుత్వ ఖర్చుతో తిరిగి నెలకొల్పుతామని చెప్పిన పాలకులు, పాలకవర్గాలు గాని అంబేడ్కర్‌ ఆశయాలకు అనుగుణంగా ఆధ్యాత్మిక, సామాజిక రంగాలలోని అసమానతలను నిర్మూలించగలిగే పట్టుదల ఆవంతైనా ఉన్నవారు కారు.

వెలివాడల దుష్ట సంస్కృతిని దునుమాడి గ్రామాలలో సామాజిక సమానత్వాన్ని ఆవిష్కరించాలనే పూనిక గలవారు కారు. నిచ్చెనమెట్ల కుల వ్యవస్థను కొనసాగిస్తూనే ఆ వైరుధ్యాలనుండి ఘర్షణలు తల ఎత్తడానికి తావివ్వకుండా పోలీసుల సాయంతో నిర్బంధ శాంతి సామరస్యాలను పోషించడమే లక్ష్యంగా అగ్రవర్ణ పాలకులు ఇటువంటి సందర్భాలలో స్పందిస్తూ ఉంటారు.దళితులను హింసించడంలో రాష్ట్రంలోని పాలక అగ్రవర్ణాలలో ఏ ఒక్కటి రెండోదానికి తీసిపోలేదు. గతంలో పదిరికుప్పం, చుండూరు, కారంచేడులలో దళితుల రక్తాన్ని కళ్ళచూస్తే ఇప్పుడు తరచుగా అంబేడ్కర్‌ విగ్రహాలను అవమానపరచడం ద్వారా వారి ఆత్మగౌరవానికి విద్యుదాఘాతాలిస్తున్నారు.

అప్పటివారు ఇప్పటివీరు ఒక తాను ముక్కలే. ఉన్నట్టుండి ఇప్పుడే విరుచుకుపడిన అంబేడ్కర్‌ విగ్రహ విధ్వంసకాండకు రాష్ట్ర రాజకీయాలలో భారీగా ఊపందుకున్న కుల ఓటు బ్యాంకుల ఆయారాం గయారాం ఘట్టమే కారణమని స్పష్టపడుతున్నది. ముఖ్యంగా పాలక కాంగ్రెస్‌లోని కుల సమీకరణలలో త్వరితగతిన వస్తున్న మార్పే దీనికి మూలం అని బోధపడుతున్నది. తూర్పు గోదావరి జిల్లా సామాజిక పటంలో కాపులు ఎస్సీలకు, కాపులు కొన్ని వర్గాల బీసీలకు మధ్య వైరుధ్యం కొత్తది కాదు. కాంగ్రెస్‌ పార్టీలో రెడ్లతో బాటు ఎస్‌సిలు చిర కాలంగా ప్రాధాన్యం పొందుతున్నారు.

ఇప్పుడు రెడ్ల స్థానాన్ని కాపులు ఆక్రమించుకుంటున్న వైనం ప్రస్ఫుటంగా కనుపిస్తున్నది. మరోవైపు రెడ్లతో బాటు ఎస్‌సిలు సైతం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ వైపు అడుగులు వేస్తున్న జాడలు కానవస్తున్నాయి. ఇద్దరు పిఆర్‌పి కాపులు డిమాండ్‌ చేసి మరీ కాంగ్రెస్‌ ప్రభుత్వంలో రెండు మంత్రి పదవులు సాధించుకోవడం, వారి నేత చిరంజీవిని కాంగ్రెస్‌ అధిష్ఠానం స్వీయావసరం కోసమే అయినప్పటికీ పిలిచి పెద్ద పీట వేయడం, అదే సమయంలో వ్యక్తిగత వ్యవహార శైలి కారణంగానే కావచ్చు పి.శంకరరావు మంత్రి పదవినుంచి బహిష్కృతుడు కావడం ఎస్‌సి నేతలకు బాధ కలిగించింది. ముఖ్యంగా కాపులకు ఎస్‌సిలకు నడుమ పూర్వంనుంచి ఎంతో కొంత ఎడం ఉన్న తూర్పు గోదావరి జిల్లాలో ఇది తన ప్రభావాన్ని తక్షణమే చూపించింది.

కాంగ్రెస్‌లో కాపులకు ప్రాధాన్యమివ్వడాన్ని ఆ జిల్లాలోని ఆ పార్టీ ఎస్‌సి నేతలు బాహాటంగా విమర్శించడంతో, ఆలోచనాపరంగా బొడ్డూడని కాపు యువకులు కొందరిలో ప్రకోపించిన కుల దురహంకారం ఈ విధ్వంసకాండకు పురికొల్పినట్టు తెలుస్తున్నది. ఇది మామూలే. ఓటు హక్కు కనికట్టు- ఉత్తర ప్రదేశ్‌లో దళిత- బ్రాహ్మణ, ఆంధ్రప్రదేశ్‌లో రెడ్డి- ఎస్సీ వయా క్రైస్తవ, కాంగ్రెస్‌ మైనస్‌ రెడ్డి ఖాళీని కాపుతో పూడ్చడం కాంగ్రెస్‌లో కాపులను నిరాదరిస్తున్నారన్న దానిని చూపి టిడిపి గోదావరిజిల్లాల కాపులను ఆకట్టుకోదలచడం ఈ విధంగా ఇలా కులాల చుట్టూ పార్టీలు, పార్టీల చుట్టూ కులాలు తిరుగుతూ ఉంటాయి. ఒక కులం ఖాళీ చేసిన పార్టీలోకి మరో కులం ప్రవేశిస్తూ, నిష్ర్కమిస్తూ సాగుతుందీ ఆట. కాని అదంతా బ్రాహ్మణీయ కుల వ్యవస్థ సామాజిక చట్రంలోనే సాగుతుంది గనుక దళితుల ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే విగ్రహ విధ్వంసాలు, వస్త్రాపహరణలు, గడ్డివాముల్లో విసిరేసి తగలేయడాలు వంటివి కూడా జరిగిపోతూ ఉంటాయి.

కాంగ్రెస్‌లో రాజకీయ సంస్కరణ వాదులు సామాజిక సంస్కరణ వాదుల సోషల్‌ కాన్షరెన్స్‌ను నామరూపాలు లేకుండా చేసిన చేదు వాస్తవం పడగనీడే ఇప్పటికీ దట్టంగా పరుచుకొని ఉన్నది. జాతీయ కాంగ్రెస్‌ ఆవిర్భావ సమయంలో హిందూ సమాజంలోని బలహీనతలపై దృష్టి సారించడం జరిగింది. దురాచారాల మూలంగా హిందూ సమాజం అత్యంత బలహీన స్థితిలో ఉన్నదని గుర్తించారు. వీటిని తొలగించడానికి రాజకీయ సంస్కరణలతో బాటుగానే సామాజిక సంస్కరణల అవసరమూ ఉందని భావించారు. అందుచేత కాంగ్రెస్‌ పార్టీతో బాటు సోషల్‌ కాన్ఫరెన్స్‌ ఆవిర్భావం కూడా జరిగింది. కొంతకాలం పాటు కాంగ్రెస్‌ పార్టీ, సోషల్‌ కాన్షరెన్స్‌లు కవలపిల్లల్లా కొనసాగాయి.

ఏటా ఒకే పందిరి కింద సమావేశమవుతూ వచ్చాయి. అయితే అదెంతో కాలం సాగలేదు. తొందరలోనే వాటి మధ్య వైరుధ్యం పెరిగింది. ఘర్షణ తల ఎత్తింది. రాజకీయ సంస్కరణలకు ముందు విధిగా హిందూ సమాజాన్ని సంస్కరించవలసి ఉన్నదనే స్పృహకు కాలం చెల్లింది. 1892లో అలహాబాద్‌లో ఎనిమిదవ కాంగ్రెస్‌ సమావేశాలలో డబ్ల్యుసి బెనర్జీ ప్రసంగపాఠంలోని ఈ భాగం గమనిస్తే పరిస్థితి అర్ధమవుతుంది. మన సాంఘిక వ్యవస్థను సంస్కరించుకోనంత వరకు రాజకీయ సంస్కరణలకు మనం అనర్హులమనే వారితో నేను ఏకీభవించను. మన విధవ ఆడపడుచులు పునర్వివాహానికి నోచుకోనందున, మన ఆడపిల్లలు ఇతర దేశాల బాలికల కంటె అతి పిన్న వయసులో పెళ్ళిళ్ళు చేసుకుంటున్నందున మన భార్యలు, కుమార్తెలు మనతో బాటు మన కార్లలో మన మిత్రుల ఇళ్ళకు వచ్చే స్వేచ్ఛను అనుభవించలేకపోతున్నందున మనం మన ఆడపిల్లలను పైచదువులు చదివించనందున మనం రాజకీయ సంస్కరణలకు అర్హులం కామా అని బెనర్జీ గద్దిస్తూ, గర్జిస్తూ సాగించిన ప్రసంగానికి ఆరోజున సభికుల హర్షధ్వానాలు మిన్నంటాయని అంబేడ్కర్‌ రాశారు. అగ్రవర్ణాలలోని ఆ పెద్దల వారసులే ఇప్పటికీ రాజకీయాలను నడుపుతున్నారు.వారు విదిల్చే పదవులకు మురిసిపోతూ బిసి, ఎస్‌సి, ఎస్‌టిలు తోకలూపుతున్నారు. అంబేడ్కర్‌ ఇందుకు పూర్తి వ్యతిరేకి. ఫూలే ఆయన గురువు.

జనసంఖ్య- ఓటు హక్కు మేళవింపుతో ఈ వర్గాలకు సంక్రమించిన మెజారిటీ బలంతో రాజ్యాధికారం సంపాదించుకొని తద్వారా సాంస్కృతిక రంగంలోనూ, ఆధ్యాత్మిక సామాజిక రంగాలలోనూ బ్రాహ్మణీయ అగ్రవర్ణ ఆధిపత్యం కోటలను నిలువునా కూల్చగలిగినప్పుడే అంబేడ్కర్‌ ఆశించిన సామాజిక సమానత్వం సిద్ధిస్తుంది. దానికోసం నిజమైన కృషికి నాంది పలకవలసి ఉండగా దానిని విస్మరించి కుల దురహంకారులు కూల్చిన విగ్రహాలను తిరిగి నెలకొల్పుకోవడం, చెప్పుల దండ వేసి అవమానపరచిన అంబేడ్కర్‌ విగ్రహానికి పాలాభిషేకం చేయడం శ్లేష్మంలో ఈగలుగా బతకడం కిందికే వస్తుంది. ఇప్పటికైనా మించిపోయింది లేదు, మనకేది కావాలి అంబేడ్కర్‌ విగ్రహమా, ఆయన ఆశయ సాధనా? తేల్చుకోవాలి. మెజారిటీ ప్రజలను బానిసలుగా న్యూనులుగా నీచులుగా వారి శ్రమను సేవలను అల్పమైనవిగా పరిగణించిన స్మృతులు, శాస్త్రాల పునాదుల మీది మతాన్ని విశ్వసించేవారి ఆధిపత్యాలవల్ల అణగారిన సామాజిక వర్గాలకు సమానత్వం ఎన్నటికీ సిద్ధించదు.
- సౌభాగ్య. ఎం
Surya News Paper Dated 30/1/2012 

No comments:

Post a Comment