Monday, January 23, 2012

ఆస్తిపరుల 'అరకు డిక్లరేషన్' - చిక్కుడు ప్రభాకర్


ఆస్తిపరుల 'అరకు డిక్లరేషన్'

- చిక్కుడు ప్రభాకర్

స్పీకర్ నాదెండ్ల మనోహర్ నేతృత్వంలో మన రాష్ట్ర మంత్రులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు ఇటీవల విశాఖ మన్యంలోని అరకులోయలో మూడు రోజుల పాటు పర్యటించారు. గిరిజనులతో నృత్యాలు చేశారు. గిరిజనుల అభివృద్ధి కొరకు బాధ్యత గల ప్రజా ప్రతినిధులుగా సమాలోచనలు జరిపారు. పర్యటన ముగింపు సమావేశం విశాఖపట్నంలోని పార్క్ హోటల్‌లో ఘనం గా జరిగింది. అనంతరం మంత్రులు తమ అంతర్గతంగా ఉన్న విషయమైన బాక్సైట్ నిల్వలను వెలికితీయడం గురించి మన్యం ప్రజలకు సందేశమిచ్చారు. 

మన్యంలో పరిశ్రమలు పెట్టడం ద్వారానే, బాక్సైట్ నిల్వలను అన్‌రాక్, జిందాల్ కంపెనీలకు కట్టబెట్టడం ద్వారానే ఏజెన్సీ ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయని తమ ప్రభుత్వ పన్నాగాన్ని బయటపెట్టారు. నిజానికి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే రాష్ట్ర ప్రభుత్వం మన మన్యంలోని బాక్సైట్ నిల్వలను పైన ప్రస్తావించిన కంపెనీలకు కట్ట బెట్టేందుకు ఎపియండిసిని రంగంలోకి దించింది. అలాగే బయ్యారంలోని ఇనుపరాతి ఖనిజాన్ని వైఎస్ అల్లుడు అనిల్‌కుమార్ బినామీ సంస్థ అయిన రక్షణ స్టీల్స్‌కు కేటాయించేందుకు కూడా ఎపియండిసిని వాడుకున్నారు. 

రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూల్ ప్రకారం ఏజెన్సీ ప్రాంతంలోని ఖనిజ నిల్వలను గిరిజనులకు, గిరిజన సహకార సంఘాలకు కేటాయించాలి. లేదూ, ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా ప్రజా ప్రయోజనాలకి ఉపయోగించేలా ప్రభుత్వమే స్వయంగా ఆ ఖనిజ నిల్వలను వెలికి తీయాలి. ఈ మేరకు 1991లో 'గనులు, ఖనిజ అభివృద్ధి చట్టం-1957'ను భారత ప్రభుత్వం సవరించింది. 

ఈ సవరణ - సదరు చట్టంలోని సెక్షన్ 11(5)-ను 1997లో సుప్రీం కోర్టు తీర్పు ఒకటి మరింతగా చట్టబద్ధం చేసింది. 'సమతా రవి వెర్సెస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం' కేసులో ఇచ్చిన ఆ తీర్పులో 'ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనేతరులకు ఎటువంటి ఖనిజ తవ్వకాలకు అనుమతి ఇవ్వవద్దని' సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఆ విలువైన సంపదను దక్కించుకొనేందుకు జిందాల్, అన్‌రాక్, రక్షణ ఇత్యాది కంపెనీలు జాయింట్ వెంచర్ నాటకాన్ని మొదలుపెట్టాయి. 

ఈ కంపెనీలు షెడ్యూల్డ్ ప్రాంతాలలో ఏర్పాటు చేయబోయే కంపెనీల తతంగమంతా ఓబులాపురం మైనింగ్ కంపెనీ పేరుమీద గనులను దక్కించుకున్న గాలి సోదరులు వ్యవహారంలాగే ఉం టుంది. ఎపియండిసికి ఉన్న అవకాశాన్ని తమకు అనుగుణంగా ఉపయోగించుకునేందుకు ఈ కంపెనీలు 98 లేదా 99 శాతం వాటా కలిగివుండి ఎపియండిసికి 2 లేదా 1 శాతం వాటాను కల్పిస్తాయి. 

దరిమిలా ఆ ప్రభుత్వ సంస్థ పేరు మీద లభించిన గనుల లీజును తమకు అనుకూలంగా ఉపయోగించుకుని లక్షల కోట్ల రూపాయల విలువైన బాక్సైట్, ఇనుపరాతి ఖనిజాన్ని తవ్వుకునేందుకు కుట్ర పన్నాయి. పై మూడు కంపెనీలు ఎపియండిసిని తమ బినామి సంస్థగా మార్చుకున్నాయి. 'హై పవర్ కమిటీ'ల పేరుమీద కమిటీలు వేసి, వాటిల్లో తమకు అనుకూలమైన ఉన్నతాధికార వర్గానికి ప్రాతినిధ్యం కల్పించి ఆఘమేఘాల మీద ఎపియండిసికి ఆ ఖనిజ తవ్వకాల లీజు దక్కేలా అలనాటి వైఎస్ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడింది. 

ఈ ఎపియండిసి నాటకానికి తెరవెనుక ఉన్నది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ కాగా ఆ తతంగాన్ని ప్రత్యక్షంగా పర్యవేక్షించింది ఆయన కుమారుడు, నేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే. దశాబ్దాల తరబడి సున్నపురాయి, గ్రానైట్, బెరైటీస్ లీజుల అక్రమ వ్యవహారాలలో తలపండిన వైఎస్ కుటుంబం ఆ అనుభవంతోనే గాలి సోదరులకు ఓబులాపురం ఇనుపరాతి గనులను కట్టబెట్టింది. 

అదే అనుభవం ద్వారా తన అల్లుని బినామీలయిన జగ్గయ్యపేట మండలం జయంతిపురం గిరిజనులైన తేజావత్ బద్రు నాయక్, శంకర్ నాయక్‌లకు ఖమ్మం జిల్లా, బయ్యారం మండలం రామచంద్రాపురం గ్రామంలోని 24.80 హెక్టార్లలోని ఇనుపరాతి ఖనిజాన్ని ఎపియండిసి ముసుగులో రక్షణ స్టీల్స్‌కు కట్టబెట్టే ప్రయత్నం చేసింది. అదే అనుభవంతోనే ఎపియండిసి ముసుగులోనే అన్‌రాక్, జిందాల్‌లకు అపార బాక్సైట్ నిల్వలు కలిగిన వేలాది ఎకరాల అటవీ భూమిని కట్టబెట్టింది. గుత్త పెట్టుబడిదారులకు కొండంత ధనం దోచిపెట్టి, ఎపియండిసికి గోరంత చెందే విధంగా ఉన్న ఈ జాయింట్ వెంచర్ ఒప్పందాలేవీ పారదర్శకంగా జరగలేదు. మన్యం ప్రజలు బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకిస్తున్నారు. 

ఈ విషయమై గత ఐదారేళ్ళుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పోరాడుతున్నారు. ఆ తవ్వకాల వల్ల తమ జీవనాధారం పోవడమే కాకుండా పర్యావరణం పూర్తిగా విధ్వంసమవుతుందని వారు హేతుయుక్తంగా వాదిస్తున్నారు. అయితే ప్రభుత్వాలు ఆ అడవి బిడ్డల మీద నిర్బంధాన్ని ప్రయోగించాయి. అయినా కార్పొరేట్ కంపెనీలేవీ మన్యంలో అడుగుపెట్టకుండా గిరిజనులు అడ్డుకున్నారు. 

గనుల తవ్వకాల విషయమై అటవీ గ్రామాలలో ప్రజాభిప్రాయ సేకరణ చేయాల్సివుంది. అయితే ప్రస్తావిత కార్పొరేట్ కంపెనీలేవీ ఆ గ్రామాలకు వెళ్ళనేలేదు. విశాఖపట్నంలోనే ప్రజాభిప్రాయ సేకరణ పేరుతో ఓ తతంగం నిర్వహించాయి. బాక్సైట్ తవ్వకాలకు అనుగుణంగా అభిప్రాయం చెప్పించారు. బాధిత గ్రామాల ప్రజలు ఆ కంపెనీలకు, వాటికి మద్దతునిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. అయినా ఆ కంపెనీలు లక్షల కోట్ల రూపాయల సంపదను దక్కించుకునేందుకు పలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. 

ఆ ప్రయత్నాలలో భాగంగా 'సుప్రీమ్ సాధికార కమిటీ' పేరుతో గతనెల 15, 16 తేదీల్లో ముగ్గురు సభ్యుల కమిటీ ఒకటి విశాఖ ఏజెన్సీలో పర్యటించేందుకు ప్రయత్నించింది. గిరిజనులు, కాంగ్రేసేతర రాజకీయ పక్షాలు, ప్రజాసంఘాలు మొదలైనవి ఆ కమిటీ పర్యటనకు వ్యతిరేకంగా మన్యం బంద్‌ను నిర్వహించాయి. అన్‌రాక్, జిందాల్ కంపెనీలు ప్రభుత్వంతో కుమ్మక్కై మన్యంలో వేలాది పోలీసు బలగాలను దించాయి. అయినా ప్రజలు ఆ కమిటీ పర్యటనను అడుగడుగునా అడ్డుకున్నారు. ఈ తీవ్ర ప్రతిఘటనకు బిత్తరపోయిన ఆ కార్పొరేట్ కంపెనీల ప్రతినిధులు, సుప్రీమ్ సాధికార కమిటీ సభ్యులు హెలికాప్టర్‌లో రెండు రోజులు మన్యం మీద చక్కర్లు కొట్టారు. ఎలాగైనా మన్యం ప్రజలను తమ దారికి తెచ్చుకునేందుకు ప్రభుత్వాలు శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నాయి. 

ఆ ప్రయత్నాలలో భాగమే రాష్ట్ర శాసనసభ స్పీకర్ మనోహర్ నాయకత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంఎల్‌సిల అరకులోయ పర్యటన. అరవై యేళ్ళ స్వాతంత్య్రంలో మన్యం ప్రజలకు కనీస సదుపాయాలు సమకూర్చేందుకు ఏ ప్రభుత్వమూ చిత్తశుద్ధితో చర్యలు చేపట్టలేదు. ప్రతి వేసవిలో డయేరియా, ప్రతి వర్షాకాలంలో మలేరియాతో వేలాది గిరిజనులు చనిపోవడం పరిపాటిగా ఉంది. ఆ విషాదాలను ఏనాడూ పట్టించుకోని ప్రభుత్వాలు నేడు 'అరకులోయ డిక్లరేషన్' పేరుతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. 

ఆదివాసీయేతర సామాజిక వర్గాలకు కల్పిస్తోన్న కొన్ని సౌకర్యాలనైనా గిరిజనులకు మన ప్రభుత్వాలు కల్పించలేకపోతున్నాయి. అడవుల్లో శతాబ్దాల తరబడి నివసిస్తున్న గిరిజనులకు కనీస వ్యవసాయ సదుపాయం కల్పించలేదు. దశాబ్దాల తరబడి 'పోడు' కొట్టుకొని ఆ భూ ములలోనే వ్యవసాయం నిర్వహిస్తున్న గిరిజనులకు సదరు భూములపై హక్కులు కల్పించలేదు. 

ఆ భూములకు సాగునీటి సదుపాయం కల్పించకపోవడం వల్ల వర్షాకాలంలో గింజలు చల్లి ప్రకృతి మీద ఆ«ధారపడి పండిన ధాన్యంతో సంవత్సరంలో ఆరునెలలు కాలం వెళ్ళబుచ్చుతూ, మిగతా ఆరునెలల పాటు అడవిలో దొరికే గడ్డలు, పండ్లు, కాయలను గిరిజనులు భుజించుతున్నారు. ఫలితంగా వారి ఆరోగ్యం అంతంతమాత్రంగానే ఉంటోంది. రక్తంలో హిమోగ్లోబిన్ స్త్రీలలో 12 శాతం, పురుషులలో 13 శాతం ఉండాలి. అయితే ఇది గిరిజన స్త్రీలలో 6 శాతం, పురుషులలో 8 శాతం మాత్రమే ఉంటుంది. ఇంతగా అనారోగ్యం పాలవుతున్నా గిరిజనులకు కనీస పోషక విలువలను కూడా ప్రభుత్వం అందించలేకపోతోంది. 

'అరకు డిక్లరేషన్' పేరుతో ప్రభుత్వ, ప్రతిపక్ష ప్రజా ప్రతినిధులు ఆడుతున్న నాటకమంతా బాక్సైట్ తవ్వకాలకు ప్రజలను సంసిద్ధ పరచడానికే. గిరిజనుల సంక్షేమంపై శ్రద్ధ ఆ చర్యలో ఏమీ లేదు. మన్యం వాసులను సానుకూలం చేసుకొనేందుకే గిరిజనుల అభివృద్ధితో కూడిన 'అరకు డిక్లరేషన్'ను విడుదల చేశారు. జిందాల్, అన్‌రాక్‌ల లీజులను రద్దుచేసి మన్యం గిరిజనుల వైపు నిలబడాల్సిన ప్రజా ప్రతినిధులు ఆ కంపెనీలకు ఏజెంట్లుగా వ్యవహరించడం శోచనీయం. ఓబులాపురం గనుల విషయంలో కూడా 2006 సంవత్సరంలో శాసన సభా కమిటీ ఈ విధంగానే వ్యవహరించింది; 

గాలి సోదరులు చట్ట విరుద్ధంగా చేస్తోన్న గనుల తవ్వకాలకు మద్దతు పలికి ప్రజల ధనాన్ని దోచుకునేందుకు అవకాశం కల్పించింది. ఇప్పుడు అలా వ్యవహరించకుండా గిరిజనుల పక్షాన నిలబడాల్సిన మన ప్రజాప్రతినిధులు కార్పొరేట్ కంపెనీలకు సానుకూలంగా వ్యవహరించడాన్ని పౌర సమాజం ప్రశ్నించాలి. లేని పక్షంలో ఆ కార్పొరేట్ కంపెనీల అక్రమాలకు మన్యం గిరిజనులు బతుకులు ఛిద్రమవుతాయి. 'అరకు డిక్లరేషన్' ముసుగులో విలువైన బాక్సైట్ తవ్వకాలను కార్పొరేట్ కంపెనీలకు అప్పగించడాన్ని వ్యతిరేకించాల్సిన నైతిక బాధ్యత సమాజంలోని అన్ని వర్గాల ప్రజలపై ఉంది. 

- చిక్కుడు ప్రభాకర్
Andhra Jyothi News Paper Dated 24/1/2012 

No comments:

Post a Comment