ఉత్తర ప్రదేశ్ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఆ రాష్ట్ర జనాభాలో అధిక శాతంగా ఉన్న ముస్లింల ఓట్లను సమీకరించడం కోసం బహుజన సమాజ్ పార్టీ, సమాజ్‌వాది పార్టీ, కాంగ్రెస్ పార్టీలు సకల యత్నాలు చేస్తున్నాయి. ఆ రాష్ట్రంలో ముస్లిం ఓట్లు 135 సీట్లలో ఫలితాలను నిర్ణయిస్తాయి. 19 జిల్లాల్లో ముస్లింల జనాభా 20 నుంచి 40 శాతం వరకు ఉన్నది. బిఎస్‌పి అధినేత్రి మాయావతి ముస్లింలకు 85 సీట్లను కేటాయించారు. గత ఎన్నికల్లో కంటే ఇది 20 సీట్లు ఎక్కువ. సమాజ్ వాది పార్టీ 80 సీట్లను, కాంగ్రెస్ 75 నుంచి 80 సీట్లను ముస్లింలకు కేటాయించాయి.
దీనితో పాటు ఈ పార్టీలు ముస్లింలపై హామీల వర్షాన్ని కురిపిస్తున్నాయి. తూర్పు ఉత్తరప్రదేశ్‌లో అధికంగా ఉన్న ముస్లిం చేనేత కుటుంబాలకు సోనియాగాంధీ తనయుడు, ఎఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ రూ.6వేల కోట్ల ప్యాకేజీని ప్రకటించారు. ముస్లింలకు ఓబిసి కోటాలో 4.5శాతం ఉప కోటాను కల్పిస్తామని కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ శాతాన్ని 9 శాతం వరకు పెంచుతామని కేంద్ర న్యాయశాఖ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ ప్రకటించి కేంద్ర ఎన్నికల కమిషన్ నుంచి ప్రవర్తనా నియమావళి క్రింద నోటీసు స్వీకరించాల్సి వచ్చింది.
తాను తప్పేమీ మాట్లాడలేదని ఈ విషయం ఎన్నికల ప్రణాళికలోనే ఉన్నదని ఖుర్షీ ద్ సమర్థించుకున్నారు. ఖుర్షీ ద్ వ్యాఖ్యలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూప్రధాన ఎన్నికల కమిషనర్ ఖురేషీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు లేఖ రాశారు. సల్మాన్ ఖుర్షీద్ తన వ్యక్తిగత స్థాయిలో ప్రకటన చేశారని, ఆయన వ్యాఖ్యలతో కాంగ్రెస్‌కు సంబంధం లేదని కాంగ్రెస్ సమర్థించుకునే ప్రయత్నం చేసిం ది. ఈ విషయాన్ని ఇంతటితో వదిలివేయవలిసిందిగా ఉన్నత స్థాయి కాంగ్రెస్ ప్రతినిధి వర్గం ఒకటి ఎన్నికలకమిషన్ సభ్యులను కలిసి అభ్యర్థించింది.
ఒక కేంద్ర మంత్రి ఎన్నికల సమయంలో హామీల వర్షం కురిపిస్తే అది వ్యక్తిగత స్థాయిలో ఇవ్వడం ఎలా అవుతుంది? పైగా ఆయన న్యాయశాఖ మంత్రి. ఎన్నికల కమిషనర్లను నియమించడంలో ఆ మంత్రిత్వ శాఖ పాత్ర ఉంటుంది. ఎన్నికల కమిషన్ కు సంబంధించిన పరిపాలనా వ్యవహారాలు న్యాయశాఖ ద్వారానే జరుగుతాయి. ఖురేషీ న్యాయశాఖమంత్రికి నోటీసు పంపగలరేమో కాని ఆయనపై చర్య తీసుకోగలరన్న నమ్మకం ఎవరికీ లేదు.
బహుశా యుపిలో ఫిబ్రవరిలోనే ఎన్నికలు నిర్వహించడం, మాయావతి, ఆమె పార్టీ చిహ్నమైన ఏనుగు విగ్రహాలపై ముసుగులు కప్పమని ఆదేశించడంపై ఏర్పడిన వివాదాలను ప్రక్కకు మళ్లించేందుకు ఆయన బహుశా సల్మాన్‌కు నోటీసు పంపి ఉంటారేమో? హస్యాస్పదం కాకపోతే కనిపించిన ఏనుగు విగ్ర హాలన్నిటిపై ముసుగు కప్పితే అవి ఏనుగులని ప్రజలకు తెలియకుండా ఉంటుందా? నిజానికి అన్ని ఏనుగు విగ్రహాలు నెలకొల్పినందుకు మాయావతి ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేక అభిప్రాయం ఏర్పడాలి కాని అనుకూల అభిప్రాయం ఏర్పడుతుందా?
ఎన్నికల్లో పార్టీలు రకరకాల ఎన్నికల గుర్తులను ఉపయోగించుకుంటాయి. అవి నిత్యజీవితంలో ప్రజలతో సంబంధం ఉన్న గుర్తులే అయి ఉంటాయి. వాటన్నింటినీ ప్రజలకు కనిపించకుండా చేయగలమా? డిఎంకె ఎన్నికల గుర్తు అయిన సూర్యుడికి అరచేయి అడ్డుపెట్టగలమా? సమాజ్‌వాది పార్టీ ఎన్నికల గుర్తు సైకిల్ అయినందువల్ల సైకిళ్లు కనపడకుండా చేయగలమా? అని ఒక మాజీ ఎన్నికల కమిషనర్ ప్రశ్నించారు.
కాంగ్రెస్ కంటే సమాజ్‌వాది పార్టీ ఒకడుగు ముందుకు వేసి తాము అధికారంలోకి వస్తే ముస్లింలకు 18 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రకటించింది. బాబ్రీ మసీద్ కూల్చివేత సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న కల్యాణ్ సింగ్‌తో గత ఎన్నికల్లో పొత్తు కుదుర్చుకున్నందుకు ములాయం సింగ్ యాదవ్ ముస్లింలకు క్షమాపణ చెప్పుకున్నారు. గతంలో తాను వదుల్చుకున్న ఆజంఖాన్ వంటి ముస్లింనేతలను ఆయన మళ్లీ చేర్చుకున్నారు. కాంగ్రెస్ కూడా తక్కువ తినలేదు. ఆజంఖాన్ చేరికతో అసంతృప్తిగా ఉన్న సమాజ్‌వాది పార్టీ నేత రషీద్ మసూద్‌ను కాంగ్రెస్ తన దరి చేర్చుకుంది.
నిజానికి బాబ్రీ మసీద్ కూల్చి వేత తర్వాత ముస్లింలు కాంగ్రెస్‌కు దూరమయ్యారు. కాని ములాయంసింగ్ వంటి నేత కూడా కల్యాణ్ సింగ్‌తో చేతులు కలపడంతో ముస్లింలు గత ఎన్నికల్లో కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు. అందువల్లనే కాంగ్రెస్ 22 ఎంపి సీట్లను గెలుచుకోగలిగింది. ఒకరకంగా కాంగ్రెస్‌ను ముస్లింలు క్షమించినట్లే. కాని యుపిలో బిఎస్‌పికి బలమైన పోటీ నిస్తున్న పార్టీ సమాజ్‌వాది పార్టీ. కల్యాణ్ సింగ్‌ను ములాయం వదుల్చుకున్నందువల్ల ఈ సారి ముస్లింలు ఎస్‌పికే మద్దతునిచ్చే అవకాశాలున్నాయి. పైగా వారు అధికారంలోకి రాగలిగిన, ఎన్నికల్లో గెలవగలిగిన పార్టీ అభ్యర్థులకే ఓటు వేస్తారు. అందుకే కాంగ్రెస్ ముందెన్నడూ లేని విధంగా ముస్లిం ఓట్లకోసం వెంపర్లాడుతున్నది.
ముస్లిం ఓట్లకోసం ఎన్నికల్లో హామీలు ఇవ్వడం, ఎక్కువ మంది అభ్యర్థులకు సీట్లు ఇవ్వడం మొదలైనవి చేయడం సాధారణమే. కాని వారి మనోభావాలతో ఆడుకోవడమే తప్పు. ముస్లింలను తమ వైపుకు తిప్పుకోవడం కోసం చేసే ప్రయత్నాల్లో భాగంగా కాంగ్రెస్ బాట్లా హౌజ్ ఎన్‌కౌంటర్‌ను కూడా బూటకపు ఎన్‌కౌంటర్‌గా ప్రక టించింది. ఎఐసిసి ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ బాట్లా హౌజ్ ఎన్‌కౌంటర్‌ను బూటకపు ఎన్‌కౌంటర్‌గా కూడా అభివర్ణించారు. దీనిపై న్యాయవిచారణకు ఆయన డిమాండ్ చేశారు.
కేంద్రంలో కాంగ్రెస్ సారథ్యంలోని యుపిఏ ప్రభుత్వ హయాంలోనే, కేంద్ర హోంమంత్రి చిదంబరం ఆధ్వర్యంలో ఉన్న ఢిల్లీ పోలీసులు ఢిల్లీలోని జామియానగర్‌లో ఉన్న బాట్లా హౌజ్‌లో 2009 సెప్టెంబర్ 19న ఇద్దరు ముస్లింలను కాల్చి చంపారు. మరో ఇద్దర్ని అరెస్టు చేశారు. మరో ఇద్దరు పారిపోయారని చెబుతున్నారు. ఈ ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న ఎన్‌కౌంటర్ స్పెషలిస్టు, పోలీసు ఇన్‌స్పెక్టర్ మోహన్ చంద్ శర్మ కూడా కాల్పు ల్లో మరణించారు. ఆయనకు రిపబ్లిక్ డే సందర్భంగా పోలీసు అవార్డు కూడా బహూకరించారు.
అయితే ఈ ఎన్‌కౌంటర్‌పై పలు ప్రశ్నలు తలెత్తాయి. పౌరహక్కుల సంఘాల నిజనిర్ధారణ కమిటీ సభ్యులు స్థానికులను ప్రశ్నించి, ఈ ఎన్‌కౌంటర్ బూటకమైనదనడానికి పలు ఆధారాలు సమర్పించారు. బుల్లెట్లు ఒక హతుడి తలవెనుక తగిలిన తీరును బట్టి చూస్తే వెనుకనుంచి కాల్చినట్లు స్పష్టమవుతోందని, మరో హతుడి చర్మాన్ని కోసి వలిచినట్లు కనపడుతోందని వారి నివేదికల్లో పేర్కొన్నారు. ఇక ఎన్‌కౌంటర్ జరిగిన ఫ్లాట్‌కు బయటకు వెళ్లే తలుపు ఒకే ఒకటి ఉన్నప్పుడు మరో ఇద్దరు ఎలా పారిపోగలిగారని ప్రశ్నించారు.
ఎన్‌కౌంటర్‌లో పాల్గొనేందుకు వెళ్లిన పోలీసు ఇన్‌స్పెక్టర్ మోహన్ చంద్ శర్మ బుల్లెట్ ప్రూఫ్ ధరించకుండా ఎందుకు వెళ్లారన్న ప్రశ్నలకు కూడా జవాబు లేదు. ఒక ఎన్‌కౌంటర్ జరిగినప్పుడు జాతీయ మానవ హక్కుల సంఘం మార్గదర్శక సూత్రాల ప్రకా రం మెజిస్టీరియల్ దర్యాప్తు జరగలేదు. బాట్లాహౌజ్‌లో ఉన్న ఇతర జనాన్నీ ప్రశ్నంచలేదు. పోలీసులు స్వతంత్ర విచారణ జరిగిన దాఖలాలు కూడా లేవు. జాతీయ మానవ హక్కుల సంఘం పోలీసుల కథనాన్నే పూర్తిగా నమ్మి హైకోర్టుకు నివేదిక సమర్పించింది. హైకోర్టు కూడా దాన్ని విశ్వసించి న్యాయవిచారణ అవసరం లేదని తేల్చి చెప్పింది.
బహుశా అత్యంత ఉన్నత స్థాయిలో జాతీయ భద్రతా కోణాన్ని, ముస్లిం రాజకీయాలను దృష్టిలో ఉంచుకుని ఈ ఎన్‌కౌంటర్‌ను కప్పిపుచ్చే ప్రయత్నం జరిగినట్లు స్పష్టమవుతున్నది. జాతీయ మానవ హక్కుల సంఘం ప్రతిష్ఠ కూడా దీనితో దెబ్బతింది. ఎన్‌కౌంటర్‌లో మరణించిన యువకులు యుపిలోని ఆజంఘర్‌కు చెందిన వారు. వారిని ఇండియన్ ముజాహిదీన్‌కు చెందిన వారిగా అభివర్ణించారు. రకరకాల కథనాలను అల్లారు. ఈ ఎన్‌కౌంటర్‌పై దర్యాప్తు జరపాలని డిమాండ్ చేస్తూ ఆజంఘర్ కు చెందిన యువకులు ఇటీవల రాహుల్ గాంధీ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు.
అసలు ఇవి నిజంగా ఎదురుకాల్పులేనా? లేక 2008 సెప్టెంబర్‌లో ఢిల్లీలో జరిగిన వరుస బాంబుప్రేలుళ్లలో 30 మంది చనిపోయిన తర్వాత పోలీసులు తమ సమర్థత నిరూపించుకోవడానికి జరిపిన బూటకపు ఎదురుకాల్పులా ఇవి? ఢిల్లీ స్పెషల్ పోలీసులు బూటకపు ఎదురుకాల్పుల్లో ప్రసిద్ధులు. గతంలో ఢిల్లీ నడిబొడ్డున కన్నాట్‌ప్లేస్ వద్ద ఇద్దరు వ్యాపారులను ఉగ్రవాదులని భావించి కాల్చి చంపారు. వారు చేస్తున్న అనేక అక్రమ అరెస్టులు పోలీసులపై ముస్లింల ఆగ్రహాన్ని పెంచుతున్నాయి. ఇవి బూటకపు ఎదురుకాల్పులని దిగ్విజయ్ సింగ్ వంటి నేత ప్రకటించిన తర్వాత కాంగ్రెస్ ఆత్మరక్షణలో పడింది.
హోంమంత్రి చిదంబరం జరిగినవి ఎదురుకాల్పులు కావని, అయితే దిగ్విజయ్ సింగ్ అంటే తనకు గౌరవం ఉన్నదని ప్రకటించారు. దిగ్విజయ్ సింగ్ వ్యక్తిగత వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ పేర్కొంది. అంటే ఏమిటి? ముస్లింల ఓట్లు కావాలి కాని వారి ప్రాణాలు విలువైనవి కావన్నమాట. ఈ ఎదురు కాల్పులపై న్యాయవిచారణ జరపాలని భారతీయ జనతా పార్టీ కూడా డిమాండ్ చేసింది. కాంగ్రెస్ పార్టీ ముస్లింల విషయంలో అధికారం కోసం ద్వంద్వ ప్రమాణాలు, ఓటు బ్యాంకు రాజకీయాలు అనుసరించడం మానకపోతే అవి ప్రజల మధ్య విద్వేషాలకు దారితీస్తాయి.
(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)
Andhra Jyothi News Paper Dated 18/1/2012
No comments:
Post a Comment