Thursday, January 26, 2012

బక్క బ్రాహ్మలకు అంత బలం ఉందా?



- రావులపాటి సీతారాంరావు

ఏ కులంలో పుట్టాలన్నది నా చేతిలో లేకపోయినప్పటికిని నేను పుట్టిన కులాన్ని ఈసడించుకునేంతగా ప్రభావితం చేసిన కంచ ఐలయ్య రాసిన పుస్తకం 'హిందూ మతానంతర భారతదేశం' చదివిన తర్వాత నాకెన్నో నగ్న సత్యాలు తెలిసిన భావన కలిగింది. రచయిత విజ్ఞప్తి మేరకు సొంతనీతిని దృష్టిలో పెట్టుకోకుండా నా మీద నేను జాలిపడకుండా చదవటం వలన, హిందూ మతమన్నా, హిందూ జాతీయ వాదమన్నా అర్థమయి యీ పనికి మాలిన వ్యవస్థలో ఎందుకు భాగస్వామి నయ్యానా అనే ఆలోచన యీ పుస్తకం చదివినప్పటి నుంచీ నాకు ఊపిరి ఆడనివ్వడం లేదు. 

అన్ని మతాలు సమానమనే లౌకిక తత్వాన్ని ప్రతిపాదించిన భారత రాజ్యాంగం మీద ప్రస్తుతం నాకు నమ్మకం సడలింది. అశాస్త్రీయ, అనైతిక, ఉత్పత్తి వ్యతిరేక విధానాలను అనుసరించిన బ్రాహ్మణీయ హిందూ మతం, ఇతర మతాలతో పోల్చినప్పుడు ఎంత తక్కువ స్థాయిలో వుందో రచయిత తన అపూర్వ వాద పటిమతో వివరించటం వల్ల ఆధ్యాత్మిక ప్రజాస్వామ్యమేమిటో నా అవగాహనలోకి వచ్చింది! ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముద్రించిన యీ సంవత్సరపు డైరీలో అందుకనే కాబోలు హిందూ మతానికి సంబంధించిన ఫోటోను ప్రచురించలేకపోయారు. 

నిజం మాట్లాడితే అల్ బెరూనీ వంటి ముస్లిం మేధావుల వల్ల 'హిందూ' అన్న పేరును యీ మతం నోచుకోగలిగింది, అని రచయిత చెప్పారు. అదే గనుక జరుగక పోయినట్లయితే పేరులేకుండానే యీ మతం వుండిపోయేది! మాది మతం గాదు జీవన విధానం అని గొప్పగా చెప్పుకోటానికి అలవాటుపడ్డ వారికి ఒక 'జస్టిఫికేషన్' అన్నా దొరికేది! 

రచయిత చెప్పినట్లు క్రైస్తవం, బౌద్ధం, ఇస్లాం మతాల్లో మాదిరిగా హిందూయిజం అన్న మాట మత ప్రవక్త పేరు మీదనో లేక ఆధ్యాత్మిక కృషిలోంచే రూపుదిద్దుకోకపోవటం వల్ల, హిందూ పాలకులు, ఆధ్యాత్మిక శక్తులూ బెరూనీ తొలిసారిగా ప్రతిపాదించిన 'హిందూ' అనే పదాన్ని ఆమోదించి, సొంతం చేసుకున్నాయి! ఈ పుస్తక రచయిత మరో నిజాన్ని కూడా బయటపెట్టారు. అదేమిటంటే 'మన బ్రాహ్మణ మేధావులకు క్రియాశీలత లేకపోవటం వల్ల హిందూయిజం అన్న పేరును సైతం పరాయివాళ్ళ నుంచి అరువు తెచ్చుకోవాల్సివచ్చింది' అని! 

భారత జాతి అంతర్యుద్ధ ప్రమాదం అంచున వుందన్న నగ్న సత్యాన్ని గ్రహించి రచయిత యీ పుస్తకం రాశారు. ఆ ప్రమాదాన్ని ఓ హెచ్చరికలా తీసుకొని హిందూ మతాన్ని కాపాడుకొనే ప్రయత్నం చేసుకోవాలనే సంకేతాన్ని యీ మధ్యనే యీ పుస్తకాన్ని చదివిన కొందరు సూచించడం కూడా జరిగింది! 

ఒక ప్రమాదపు అంచున వున్న జాతిని రక్షించేందుకు రాసిన పుస్తకం అని హృదయపూర్వకంగా నమ్మాను. కంచ ఐలయ్య రాసిన కొన్ని వ్యాసాలు చదివిన తర్వాత ఆయన రాసే ప్రతిదీ యుక్తి యుక్తంగా వుంటుందని, ఎలాంటి ప్రిజ్యుడిస్ లేకుండా విషయాన్ని చెప్పే సాధికారిత వుందని అనుకున్నాను. పుస్తకం చదవటం ఆ విధంగానే కొనసాగించాను. హిందూ మతంలోని కులతత్వం వల్లనే శాస్త్రీయ ఆవిష్కరణలు జరగలేదని యీ జాతి దుస్థితికి కేవలం బ్రాహ్మణ మేధావులే మూల కారకులన్న సంగతిని చదువుతున్నప్పుడు గూడా ఆయనను తప్పుపట్టటటానికి నా మనసు ఒప్పుకోలేదు. ఒక జాతి మేలును కోరిన వ్యక్తి సశాస్త్రీయ అవగాహన లేకుండా అలా రాయలేడు గదా అని సరిపుచ్చుకున్నాను. 

"అయితే యీ మతంలో బ్రాహ్మణులూ, వైశ్యులూ, క్షత్రియులు మాత్రమే హిందువులు అన్న సంగతి చాలా మంది మరచిపోతున్నారు. ఈ కులాలకంటే చాలా తక్కువస్థాయి కులాలుగా పరిగణించబడే శూద్రులకు హిందూ మతంతో వున్న సత్సంబంధాలు అంతంత మాత్రమే! వీళ్ళు హిందూ మతం చచ్చిపోతుందన్న విషయాన్ని పసికట్టారంటే మునుగుతున్న నావను వదిలేసినట్టు వదిలి వెళ్ళిపోతారు'' అన్న వాక్యాలు చదివినప్పుడు మాత్రం విభ్రమానికి గురయ్యాను. ఆధ్యాత్మిక ప్రజాస్వామ్యం ప్రక్కన పెట్తే ప్రస్తుత ప్రజాస్వామ్య రాజ్యంలో అధికులుగా సంఖ్యాపరంగా ఉన్న వారికే రాజ్యాధికారం వస్తుంది గదా! 

అలాంటప్పుడు కులం, మతం పేరుతో ఓట్ల పాడి గేదెలను పోషిస్తున్న ప్రస్తుత తరుణంలో యీ మతం ముసుగును వదిలి వెళ్ళటం సాధ్యమా? అన్న ప్రశ్నకు 'లేదు' అన్న స్పష్టమైన జవాబు దొరకగానే ఊరట చెందాను. కంచ ఐలయ్య ఊహించినట్లుగా రాజ్యాధికారాన్ని అనుభవిస్తున్న యీ 'కొత్త బ్రాహ్మణులు' హిందూ మతాన్ని వదిలివెళ్ళే ప్రసక్తే లేదు! బహుశా రచయిత 'మత మార్పిడి'ని దృష్టిలో వుంచుకొని హిందూ మతాన్ని 'మునుగుతున్న నావ'గా అనుకొని వుండొచ్చు. 

కానీ రాజ్యం వీరభోజ్యం అయినప్పుడు ఆధ్యాత్మిక ప్రజాస్వామ్యానికి రాజకీయ ప్రజాస్వామ్యానికి తేడాలు కనుమరుగవుతాయి. కులం, మతం, ట్రంప్ కార్డులవుతాయి! అలాంటి పరిస్థితుల్లో 'హిందూ మతం' రచయిత ఊహించినట్లుగా చావుకు దగ్గర కాదు! శాస్త్రీయ పరంగా వేసిన అంచనాలకు భిన్నంగా హిందూ మతం మనగలుగుతుంది! రచయిత ఎత్తిచూపిన కులవ్యవస్థే బలంగా మారుతున్న విచిత్ర వైనం రచయిత శాస్త్రీయ అవగాహనను ఆటపట్టిస్తుందా అన్న అనుమానం చదువరికి కలుగక మానదు. 

అయితే అత్యంత సానుభూతితో బ్రాహ్మణేతర కులాలను, వాటి మూలాలను విశ్లేషించిన విధానం ఎవరినైనా ఆకట్టుకుంటుంది. ఒకొక్క కులం అనుసరించిన ఉత్పత్తి, జీవన శైలిని ఆకర్షణీయంగా చెప్పటం జరిగింది. ఆదివాసులను ఉచిత ఉపాధ్యాయులుగా, బడుగు వర్గాల వారిని బడుగువర్గ శాస్త్రజ్ఞులుగా, క్షురకులను, బట్టలను శుద్ధిచేసే వృత్తిని స్వీకరించిన వారిని సామాజిక వైద్యులుగా యాదవులను మీట్ అండ్ మిల్క్ ఎకనామిస్టులుగా చేతి వృత్తుల వారిని అజ్ఞాత ఇంజనీర్లుగా, కాపులను రైతులను ఆహార ఉత్పత్తిదారులుగా అభివర్ణించడేమ గాకుండా, చాలా కన్విన్సింగ్‌గా వారి నేపథ్యాన్ని యీ పుస్తకంలో ఇవ్వటం జరిగింది. 

చారిత్రాకాధారాలతో నిమిత్తం లేకుండానే వారి అణచివేత తీరుతెన్నుల విశ్లేషణతో పాఠకులు ఏకీభవించే అవకాశం వుంది. అప్పటిదాకా ఎంతో సహేతుకంగా సాగిన రచన 'సామాజిక స్మగ్లర్లుగా, కోమటోళ్ళు' అని కించపరిచే రీతిలో వైశ్యుల పూర్వాపరాలను ఎత్తిచూపటంలో నట్టు పడుతుంది. చరిత్రకారుడిగా, విశ్లేషకుడిగా 'బ్రాహ్మణిజాన్ని' ఎంతగా దుయ్యబట్టినా పట్టించుకోని పాఠకుడు అక్కడి నుంచీ 'షాక్'కు గురవుతాడు. గాంధీ-నెహ్రూ, కోమటి-బ్రాహ్మణత్వం శీర్షిక క్రింద బాపనోళ్ళు-కోమటోళ్ళు అనే పదాల ప్రయోగంతో విలువైన అధ్యయన పర్వానికి స్వస్తి చెప్పటమే గాకుండా చాలా నిర్దయగా ఆ కులాల వ్యవహారాలను చీల్చిచెండాడి రచనలో పారదర్శకత పట్ల అనుమానాలకు రచయిత తావిస్తాడు. 

బ్రాహ్మణులను ఆధ్యాత్మిక నియంతలుగా వేలెత్తి చూపటంలో తప్పుపట్టాల్సిన అవసరం లేదనుకున్న పాఠకులకు కూడా 'బ్రాహ్మణులు తమను తాము ఎంతగా ప్రేమించుకుంటారో, శూద్రుల్నీ, ఛండాలుల్నీ, ఆదివాసులను అంతకంటే ఎక్కువగా ద్వేషిస్తారు' అని చెప్పటంతో ఆ కులం పట్ల ఆయనకున్న అమిత ద్వేష భావం తేటతెల్లమవుతుంది. హిందూయిజం బ్రాహ్మణుల నిబిడీకృతరూపం అన్న సూత్రీకరణతో రచయిత కున్న పూర్తి అవగాహన అవగతమవుతుంది. 

భారతదేశపు దౌర్భాగ్యం ఆ కులం వల్లే అని ఈ దేశాన్ని నాటి నుంచీ నేటివరకూ బ్రాహ్మణిజం పట్టి పీడుస్తూ నాశనం చేస్తున్నదని అనడంతో, ఆర్థికంగా, రాజకీయంగా సామాజికంగా చాలా బలహీనులయిన వారుగా మారిన వారికి అంత శక్తి వుందని రచయిత ఎలా ఊహించుకున్నారా అని ఆశ్చర్యం కలుగక మానదు. అయితే రచయిత పుస్తకం మొదట్లోనే బ్రాహ్మణ పాఠకులను హెచ్చరించటం వల్ల ఆ పాఠకులు అంతగా యిబ్బంది పడకపోవచ్చు! ఒక విధంగా రచయిత వారికి అన్ని శక్తియుక్తులను ఆపాదించటం వల్ల మాకింత చరిత్ర వుందా? (మంచిదైనా-చెడ్డదైనా) అని గర్వపడే అవకాశం గూడా లేకపోలేదు. 

ఏది ఏమైనా యీ పుస్తకం చదివిన తర్వాత ఇతర మతాల ఔన్నత్యం అర్థం అవుతుంది. రాజ్యాంగ నిర్మాతలు తలపెట్టిన పరమత సహనం అలవర్చుకునే అవకాశం గూడా కలిగిస్తుంది. ప్రస్తుతం ఆధ్యాత్మిక నియంతృత్వం వదిలి ఆధ్యాత్మిక ప్రజాస్వామ్యంలోకి అడుగిడాలనే కాంక్ష కూడా కలుగుతుంది! కానీ రచయిత 'లాజిక్'తో తప్పకుండా అంగీకరించాలనే పాఠకుడ్ని గూడా ప్రతిసారీ 'వై ఐయామ్ నాట్ ఎ హిందూ'అని హెచ్చరిస్తూ ఆ ప్రాతిపదికకు సంబంధించిన విషయాలను చెప్పుతూ పోవడంతో ఆయనే హిందువునికాను నిజాయితీతో చెప్తున్నప్పుడు హిందువులం అనబడే మనం ఆయన మాటలు ఎందుకు వినాలి అనే సందేహం ఆసాంతం తొలుస్తూ వుంటుంది. 

మదర్ థెరిస్సా ఆధ్యాత్మిక ప్రజాస్వామిక జీవన విధానానికి ఒక గొప్ప ఉదాహరణ అని కంచ ఐలయ్య చెప్పినప్పుడు ఎవరైనా అంగీకరించక తప్పదు. కానీ హిందూ మతానికి చెందిన ఆదిశంకరాచార్యులు ఆధ్యాత్మిక నియంతృత్వానికి ప్రతీక అని అదే వాక్యంలో చెప్పగానే యీ గొడవ మనకు అర్థం అయ్యేటట్లు లేదు అని కొందరు పాఠకులు అయినా అనుకోకుండా వుండలేరేమో! ఏది ఏమైనా హిందూ మతం, ఎవరు ఎంతగా అభిలషించినా, అంత త్వరగా అంతరించే అవకాశాలు లేవు! 

- రావులపాటి సీతారాంరావు
Andhra Jyothi News Paper Dated 27/1/2012 

No comments:

Post a Comment