- ‘అభివృద్ధి’కి అవినీతి జబ్బు
- అణచివేత ఒక్కటే మిగిలిన ఆయుధం
- సంపన్నులు- పేదల మధ్య అగాథం
- మనది ఉపాధి రహిత అభివృద్ధే
- దారిద్య్ర రేఖకు దిగువన 41 శాతం మంది
- హింసతో మావోయిస్టులు ప్రజలకు దూరం
- అవినీతి, దోపిడీతో ప్రభుత్వమూ దూరం
తుపాకీతోనే రాజ్యాధికారాన్ని సాధిస్తామంటున్నారు మావోయిస్టులు. తుపాకీతోనే వామపక్ష తీవ్రవాదాన్ని నిర్మూలిస్తామంటోంది ప్రభుత్వం. కానీ ఈ ఇరు పక్షాల మధ్యా ఎంతో మంది ప్రజానీకం నలిగిపోతున్నారు. ప్రధాని మన్మోహన్ సింగ్ గతంలో ప్రసంగిస్తూ ఉగ్రవాదం కంటె నక్సలిజమే ప్రమాదకరం, అందుకే నక్సలిజం నిర్మూలనపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆయా రాష్ట్రాల డీజీపీలను ఆదేశించారు. హోం మంత్రి చిదంబరం కూడా ఉగ్రవాద దాడుల్లో 26 మంది చనిపోతే, నక్సలైట్ల దాడుల్లో 297 మంది చనిపోయారు కాబట్టి ఉగ్రవాదుల కంటె నక్సలైట్లే ప్రమాదకారులని చెప్పారు. అంతేకాదు, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలోని ప్రజలకు ప్రభుత్వం పట్ల విశ్వాసం సన్నగిల్లిన మాట కూడా నిజం అంటూ మన్మోహన్ సింగ్ ఆ వాస్తవాన్ని కూడా అంగీకరించారు.
అయితే, మావోయిస్టుల సమస్య పరిష్కారం కోసం రెండేళ్ళ క్రితంనాటి ‘అభివృద్ధి, అణచివేత’ విధానం అనే పాత పాటే పాడారు ప్రధాని. కానీ అభివృద్ధి, అణచివేత అనే జోడు గుర్రాల రథం మాత్రం నేటికీ గమ్యం దరిదాపుల్లోకి చేరలేకపోయింది. కారణం? అభివృద్ధి అనే అశ్వానికి అవినీతి జబ్బు సోకి పడకేసింది. కాబట్టి అభివృద్ధి అశ్వానికి సోకిన అవినీతి జబ్బును నయం చేసుకోకుండా, అణచివేత అశ్వాన్ని ఎంత అదలించినా ఆ రథం గమ్యం చేరుకోదు గాక చేరుకోలేదన్న వాస్తవాన్ని మన పాలకులు ఎప్పటికి గ్రహిస్తారు?
నేడు మన దేశం అసమానాభివృద్ధిలో దూసుకు పోతున్నది. ఒకవైపు ప్రపంచ సంపన్నుల జాబితాలో 1.73 కోట్ల సంపన్నులతో రెండవ స్థానానికి ఎగబాకింది. అదే సమయంలో సగటు మానవాభివృద్ధిలో 177 దేశాల జాబితాలో మన దేశం 128వ స్థానానికి దిగజారిందనీ, దేశ జనాభాల్లో 77 శాతం మంది ప్రజలు రూ. 20 నుంచి రూ. 100 లోపు ఆదాయంతో బతుకులీడుస్తున్నారని, సంపన్నులు- పేదల మధ్య అగాథాలు ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయనీ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
అంతేకాదు, ఈ నాటి మన అభివృద్ధిని ఉపాధి రహిత అభివృద్ధిగా విశ్లేషిస్తున్నారు ఆర్ధిక నిపుణులు. ప్రపంచీకరణకు ముందు మన దేశ ఆర్ధికాభివృద్ధి రేటు 4 శాతంగా ఉన్నప్పుడు, ఉపాధి వృద్ధి రేటు 2 శాతంగా ఉండేది. కానీ ప్రపంచీకరణ తర్వాత మన దేశ ఆర్ధిక వృద్ధి రేటు 8 శాతం పెరిగితే, ఉపాధి రేటు మాత్రం 1 శాతం కంటె తక్కువకు పడిపోయింది. మనది ఉపాధి రహిత అభివృద్ధి అనేందకు ఇదే నిదర్శనం. అందువల్లనే దేశంలోని జనాభాలో 41 శాతం మంది దారిద్య్ర రేఖకు దిగువన ఉండిపోయారు. ఈ వాస్తవాన్ని ప్రపంచ బ్యాంకు నివేదికే ప్రకటించింది.
మన దేశంలో ముఖ్యంగా ప్రపంచీకరణ తర్వాత కార్పొరేట్ సంస్థలు, రాజకీయ నాయకులు, ప్రభుత్వ యంత్రాంగం అవినీతి త్రిభుజంగా మారి దేశ సంపదను కొల్లగొడుతున్నారు. అవినీతి అనంతంగా పెరిగిపోయింది. ఫలితంగా అభివృద్ధి ఫలాలు పేద, బడుగు, బలహీన వర్గాలవారికి అందకుండా పోతున్నాయి. సంక్షేమ పథకాలలో 10 శాతం సైతం అర్హులకు దక్కడం లేదు. ఈ కారణంగా పేదలలో ప్రభుత్వాల పట్ల అవిశ్వాసం, అసహనం పెరిగిపోతున్నాయి. ధనంతో అధికారం, అధికారంతో ధనార్జన అనే ఒక విషవలయంగా మారింది మన దేశంలో రాజకీయం. అందుకే నేడు దేశం వేల కోట్ల రూపాయల అవినీతి కుంభకోణాలలో పూర్తిగా మునిగి తేలుతున్నది.
ప్రపంచీకరణ తర్వాత బహుళజాతి సంస్థలకు తలుపులు బార్లా తెరిచిన మన ప్రభుత్వం ప్రతి అంశాన్నీ వ్యాపారంగా మార్చివేసింది. వైద్యం, విద్య వంటి మానవతా రంగాలనుంచి కూడా తప్పుకుని వాటిని కార్పొరేట్ సంస్థలకు అప్పగిస్తున్నది. రైతులకు ఎరువులు, విత్తనాలు, పురుగు మందులపై సబ్సిడీలు తొలగించింది ప్రభుత్వం. ప్రత్యేక ఆర్ధిక మండళ్ళ పేరిట ఆంధ్ర, ఒడిషా, చత్తీస్‌గఢ్, జార్ఖండ్ వంటి చోట్ల లక్షలాది ఎకరాల సాగు భూముల్ని, అటవీ భూముల్ని పరిశ్రమలు, విద్యుత్ ప్రాజెక్టులు, గనుల తవ్వకాలకోసం స్వాధీనం చేసుకుని ప్రైవేట్ సంస్థలకు కట్టబెడుతోంది. ఆదివాసుల్ని వారి భూముల్నించి, నివాసాలనుంచి తరమివేసే ప్రయత్నాలు చేస్తున్నది. సల్వాజుడుం, ఆపరేషన్ గ్రీన్ హంట్ వంటి మార్గాలలో అణచివేత చర్యలు చేపట్టింది. ఈ కీలక పరిణామాలవల్లనే బడుగు, బలహీన వర్గాల నిరుపేద, ఆదివాసీ ప్రజలు ప్రభుత్వం పట్ల విరక్తిని, మావోయిస్టులపట్ల ఆసక్తిని పెంచుకుంటున్నారు.
అవిద్య, నిరుద్యోగం, అనారోగ్యం వంటి సమస్యలు సామాన్య ప్రజానీకాన్ని పట్టి పీడిస్తున్నాయి. బంజరు భూముల సమస్య, దేవాదాయ భూముల్ని పేదలు కాకుండా పెత్తందార్లే నామమాత్రపు కౌలుతో అనుభవించడం, సంపన్నులు అధిక వడ్డీలకు అప్పులిచ్చి పేదల్ని పీల్చి పిప్పి చేయడం, అధిక ధరల భారం, ఏడాదిలో కొద్ది రోజులే పనులు దొరికి ఆ తర్వాత ఉపాధి లేకపోవడం, శ్రామికుల శ్రమకు తగ్గ ప్రతిఫలం అందకపోవడం, అతివృష్టి, అనావృష్టి వల్ల కలిగే సమస్యలు, రేషన్‌కార్డులు తదితర పత్రాలకు కూడా లంచాలు ఇచ్చుకోవలసి రావడం వంటి సమస్యలు ప్రజల్ని సతమతం చేస్తున్నాయి. ఇంకా అంటరానితనం, పెత్తందారీ దౌర్జన్యం, బడుగు బలహీన వర్గాల పేద మహిళలపై అత్యాచారాలు, పోలీసు స్టేషన్లలో సామాన్యుల మొర వినేవారు లేకపోవడం వంటి పరిస్థితులన్నీ పేదలు మావోయిస్టులవైపు ఆకర్షితులయ్యేలా చేస్తున్నాయి.
అన్నల భయం వల్లనే మారుమూల ప్రాంతాల్లోకూడా ప్రభుత్వోద్యోగులు పని చేస్తున్నారనే అభిప్రాయమూ ఆయా ప్రాంతాల్లో నెలకొంది. అదే తీవ్రవాదుల పట్ల ప్రజా మద్దతుగా మారుతోంది. తుపాకీ ద్వారా రాజ్యాధికార సాధన గానీ, వామపక్ష తీవ్రవాద నిర్మూలన గానీ సాధ్యం కాదని దాదాపు 1970 నుంచి తుపాకీ సంస్కృతిలో మునిగి తేలుతున్న నక్సలైట్లు గాని, పాలకులు గాని ఏమాత్రం పురోగతిని సాధించలేదు. తుపాకీ సంస్కృతి వల్ల మావోయిస్టు ఉద్యమం ఎంతో మంది గొప్ప మేధావులను, నాయకులను, కార్యకర్తలను కోల్పోయింది. నాయకత్వ స్థాయిలోని వారు ఎందరో జైళ్ళలో మగ్గుతున్నారు. 32 మంది సభ్యులతో నిండుగా ఉండాల్సిన మావోయిస్టుల పొలిట్‌బ్యూరో, కేంద్ర కమిటీలు 7గురు సభ్యులతో వెలవెలబోయాయి. పరదేశీనాయుడు, వ్యాస్, ఉమేష్ చంద్ర వంటి సమర్ధులు మెరికల్లాంటి అధికారులతో సహా ఎంతోమందిని పోలీసుయంత్రాంగం కోల్పోయింది.
మల్హరరావు, మాధవరెడ్డి, శ్రీపాదరావు, రాగ్యానాయక్, మాగుంట సుబ్బరామిరెడ్డి వంటి రాజకీయ నేతలను ప్రభుత్వం కోల్పోయింది. ఈ ఉందంతాలన్నింటినీ మననం చేసుకుంటే- ఇటు మావోయిస్టులు, అటు ప్రభుత్వం కూడా ఇదంతా కాలం చెల్లిన వృథా విధ్వంసకాండ అని, ఈ విధానం ఎవరినీ లక్ష్యం దరిదాపులకు చేరనివ్వని అప్రయోజనకర విధానమన్న నగ్న సత్యాన్ని తప్పక దర్శించగలుగుతారు.
వామపక్ష తీవ్రవాదానికి తావు లేకుండా చేయాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉంటే, దాని ఉనికికి ఆధారంగా ఉంటున్న ఆర్ధిక, సాంఘిక అసమానతల నిర్మూలనకు తక్షణం నడుం బిగించాలి. సరళీకృత ఆర్ధిక విధానాల ద్వారా అసమాన అభివృద్ధి దిశగా కాక, అభివృద్ధి ఫలాలు అందరికీ అందజేసేందుకు శ్రమించాలి.
అవినీతి సమూల నిర్మూలనకు శ్రమించాలి. అందరికీ కూడు, గుడ్డ, వైద్యం, విద్య సమకూర్చే మానవతా దృక్పథం నుంచి ప్రభుత్వం వైదొలగరాదు. భూసంస్కరణలు చేపట్టాలి. ఉపాధి కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టాలి. దేవాలయ భూములను పేదలకు కౌలుకు అందించే చర్యలు చేపట్టాలి. కౌలు రైతులకు రుణసౌకర్యం కల్పించాలి. ఆదివాసీలు, గిరిజనుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టాలి. పోలీస్ స్టేషన్లు, న్యాయస్థానాలలో సామాన్యులకు తమ సమస్యల్ని పరిష్కరించుకునే అవకాశాలు కల్పించాలి. దేశ ప్రగతి ఫలాలు ప్రజలందరికీ అందజేయాలి. అప్పుడు తీవ్రవాద విస్తృతికి అవకాశాలు సన్నగిల్లుతాయి.
ఏ సమాజానికైనా ప్రేమ, అభిమానం, త్యాగం వంటి మానవతా విలువలే పునాదులు కావాలి. ఉద్యమకారులు తమ ఆశయం, సిద్ధాంతం, విధానాల ద్వారా ప్రజాభిమానాన్ని చురగొని వారిని సంఘటిత పరచడం ద్వారా మాత్రమే విప్లవాలు విజయవంతమవుతాయి. హింసాయుత పద్ధతులు, ప్రత్యర్ధుల భౌతిక నిర్మూలన ద్వారా ప్రపంచంలో ఏ విప్లవమూ విజయవంతం కాలేదని ఆధునిక ప్రపంచ చరిత్ర చాటి చెబుతున్నది. ప్రజామద్దతు లేకుండా చేసేవి విప్లవ కార్యక్రమాలనిపించుకోవు. అరాచకాలుగానే అపకీర్తిని మూటగట్టుకుంటాయి. అరాచకాల ద్వారా మావోయిస్టులు ప్రజాభిమానాన్ని పోగొట్టుకుంటూ ఉంటే- అవినీతి, అక్రమాలు, దోపిడీ, పీడన ద్వారా ప్రభుత్వమూ ప్రజలకు దూరమవుతున్నది. పాలకులైనా, వామపక్ష తీవ్రవాదులైనా గుర్తించవలసిన వాస్తవం- మన సమాజాన్ని ప్రస్తుత పరిస్థితులనుంచి కూడా సామ్యవాదం వైపు మళ్ళించడం సాధ్యమే. అయితే ఆ లక్ష్య సాధనకు నిరంతర శ్రమ, సుదీర్ఘ ప్రణాళికలతో కూడిన ప్రయోజనాత్మకమైన విలువైన త్యాగాలు అవసరం.
Surya Telugu News Paper Dated : 01/03/2012
Surya Telugu News Paper Dated : 01/03/2012