Saturday, February 25, 2012

నడిచే హైదరాబాద్ సర్వస్వం ఖాలిది -సంగిశెట్టి శ్రీనివాస్


గుండెల నిండా హైదరాబాద్ ఆర్తిని, ఆత్మీయతను నింపుకున్న నిరంతర పరిశోధకుడు, రచయిత, పౌర హక్కుల కార్యకర్త, హైదరాబాద్-తెలంగాణ చరిత్ర, సంస్కృతి, మైత్రిని ప్రపంచం నలుదిశలా చాటి చెప్పిన ఉమర్ ఖాలిది లేని లోటు తీర్చలేనిది. ఖాలిది హైదరాబాద్ హిస్టారికల్ సొసైటీని స్థాపించి హైదరాబాద్ చరిత్రపై అమూల్యమైన పుస్తకాల్ని ప్రచురించాడు. వృత్తిపరంగా అమెరికాలోని మాసాచూసెట్స్ యూనివర్సిటీలో లైబ్రేరియన్‌గా పనిచేస్తోన్న ఖాలిది హైదరాబాద్ చరిత్రపై, భారతదేశంలో పోలీసు వ్యవస్థపై, ముస్లిం ఆర్థిక సామాజిక పరిస్థితులపై, 'హైదరాబాద్‌పై పోలీసు చర్య'పై అద్భుతమైన గ్రంథాలు వెలువరించాడు.

హైదరాబాద్ చరిత్రపై కొన్ని వందల వ్యాసాలు వివిధ సందర్భాల్లో వెలువరించాడు. హైదరాబాద్ నగరంలోని అబిడ్స్ ప్రాంతానికి ఆ పేరు ఎలా వచ్చింది? మొదట ఆ ప్రాంతం ఎలా ఉండేది, ఆ ప్రాంతంలో మొదట్లో వ్యాపారాలు నిర్వహించిన ఆబిద్, ఆ తర్వాత లండన్‌లో స్థిరపడిన వివరాలు, ఇలా హైదరాబాద్ చరిత్రకు సంబంధించిన చరిత్ర ఆయన రచనల్లో ఉన్నాయి.

శ్రీకృష్ణ కమిటీ సభ్యుడైన అబుసలే షరీఫ్ సైతం ఖాలిది గురించి రాస్తూ నాకు మంచి 'మిత్రుడు, దార్శనికుడు, ఫిలాసఫర్' అని చెప్పాడంటే ఆయన గొప్పతనం తెలుస్తుంది. పౌరహక్కుల కోసం నిరంతరం తపిస్తూ, హైదరాబాద్ చరిత్ర, సంస్కృతిని చిత్రికగడుతూ 24కు పైగా పుస్తకాలు వెలువరించాడు. 1981లో తాను సౌదీలో పనిచేస్తున్న కాలంలో హైదరాబాద్ హిస్టారికల్ సొసైటీని స్థాపించి దాని ద్వారా 'ద బ్రిటీష్ రెసిడెంట్స్ ఎట్ ద కోర్ట్ ఆఫ్ ది నిజామ్స్ ఆఫ్ హైదరాబాద్' పేరిట హైదరాబాద్ సంస్థానంలో పనిచేసిన కిర్క్ పాట్రిక్, కెప్టెన్ సీదెన్‌హామ్ మొదలుకొని బ్రిటిష్ రెసిడెంట్లుగా పనిచేసిన వారి చరిత్రను, హైదరాబాద్ పట్ల వారి వైఖరిని అందులో ఆయన వివరించాడు. హైదరాబాద్ హిస్టారికల్ సొసైటీ ద్వారా మొత్తం నాలుగు విలువైన పుస్తకాలు ప్రచురించాడు.

ఇందులో పైన పేర్కొన్న పుస్తకంతో పాటు 1296-1724 మధ్య కాలంలో దక్కన్‌లో సుల్తానుల పాలనపై వచ్చిన రచనల బిబ్లియోగ్రఫీ, 1724-1948 మధ్యలో హైదరాబాద్‌లో నిజామ్‌ల పాలనపై వచ్చిన రచనల బిబ్లియోగ్రఫీని కూడా వెలువరించాడు. అలాగే హైదరాబాద్‌పై పోలీసు చర్య సందర్భంగా జరిగిన దమనకాండపై వివిధ స్కాలర్ల చేత వ్యాసాలు రాయించడమే గాకుండా తాను ఆ పుస్తకానికి సంపాదకత్వం వహించాడు. హైదరాబాద్ హిస్టారికల్ సొసైటీ తరఫున వెలువడ్డ ఈ పుస్తకంలో హైదరాబాద్‌పై పోలీసు చర్య సందర్భంగా ముస్లింల ఊచకోతకు సంబంధించిన డాక్యుమెంట్లను సేకరించి పుస్తకం లో అచ్చేశాడు. 

40 ఏండ్లుగా అందరూ మరిచిపోయిన ఒక సంఘటనను వెలుగులోకి తెచ్చి చర్చకు పెట్టిన ఘనత ఖాలిదిదే. ఈ అంశంపై గత ఆరేళ్లుగా తెలుగు పత్రికల్లో విస్తృ తంగా చర్చ జరుగుతోంది (దీనిని తెలుగులో మొట్టమొదటిసారిగా 'ముల్కి' ముస్లిం సాహిత్య ప్రత్యేక సంచిక చర్చకు పెట్టింది). సమైక్యాంధ్ర నుంచి విడిపోతేనే హైదరాబాద్, తెలంగాణ చరిత్రకు న్యాయం జరుగుతుందని అభిప్రాయపడేవాడు. గోల్కొండ చుట్టూ గోల్ఫ్‌కోర్స్ ఏర్పాటు చేయడాన్ని ఆయన వ్యతిరేకించాడు. పరాయి పాలన వల్ల హైదరాబాద్‌కుఅంతా నష్టమే జరిగిందని, ముఖ్యంగా ఉర్దూ భాషకు, ముస్లిం ఉద్యోగార్థులకు తీరని అన్యాయం జరిగిందని ఆయన తన అభిప్రాయాల్ని పంచుకునేవాడు. తెలుగు, ఉర్దూ, పర్షియన్, ఇంగ్లీషు భాషల్లో రచనలు కూడా చేయతగ్గ ప్రతిభ ఉన్న ఖాలిది కొన్ని వేల పుస్తకాల సమాచారాన్ని వెలుగులోకి తెచ్చాడు. ఆయన తెలుగులో కూడా ఇస్లాం రచనల బిబ్లియోగ్రఫీని వెలువరించాడు.

గతంలో ఈ బిబ్లియోగ్రఫీకి సంబంధించిన ఒక అసమగ్ర కాపీని నాకు ఇస్తూ దీన్ని సమగ్రం చేయాల్సి ఉందనే అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఆయన పనిచేసేది అమెరికాలోనే అయినా ప్రతి సంవత్సరం కనీసం ఒక్క సారి అయినా హైదరాబాద్‌ని సందర్శించి విలువైన, పాత, అరుదైన పుస్తకాలు సేకరించేవాడు. ఆయన్ని కలిసిన ప్రతిసారి ఏదో ఒక పాత పుస్తకం 'గిఫ్ట్'గా ఇవ్వడం ఆయనకు అలవాటుగా ఉండేది. అలా ఉస్మానియా విశ్వవిద్యాలయంపై వెలువరించిన ఫోటో అల్బమ్‌ని కూడా ఆయన నాకు ఇచ్చారు. ముస్లిం హక్కుల ఉద్యమానికి అండగా నిలిచి అందుకు ఊతం ఇచ్చే ఎన్నో పుస్తకాలను, వ్యాసాలను ఆయన వెలువరించారు.

'ముస్లిమ్స్ ఇన్ ఇండియన్ ఎకానమీ' పేరిట ఆయన రాసిన పుస్తకం మేధావుల మన్ననలు అందుకుంది. 2003లో దేశంలో జరిగిన మతకలహాలను దృష్టిలో ఉంచుకొని 'ఖాకీ అండ్ ఎత్నిక్ వయొలెన్స్ ఇన్ ఇండియన్ ఆర్మీ' అనే పుస్తకాన్ని రాశాడు. దీంట్లో పోలీసులు, సాయుధ బలగాలు ఎలా పక్షపాతంతో వ్యవహరించింది ఎత్తి చూపించాడు. ఈ పుస్తకంలోని వివరాలు రాజేందర్ సచార్ కమిటీకి స్ఫూర్తినిచ్చాయి. అందుకే రాజేందర్ సచార్ కమిటీ మతాలవారీగా సాయుధ బలగాల గణన చేసింది. సాధ్వి రితంబరకు అమెరికాలోని బోస్టన్ యూనివర్సిటీలో ప్రసంగించడానికి అనుమతివ్వడానికి వ్యతిరేకంగా ఉద్యమమే చేశాడు. అమెరికాలో ముస్లిం సంస్థల నిర్వహణలో ఖాలిది చేసిన కృషి మరువలేనిది. భారత సంతతికి చెందిన అమెరికా ముస్లింల సమాఖ్య, ఇండియన్ ముస్లిం చారిటీస్, ఇండియన్ ముస్లిం కౌన్సిల్, అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ ముస్లిం సంస్థల నిర్వహణలో ఖాలిది కీలక పాత్ర పోషించాడు.

ఖాలిది ప్రాథమిక విద్య మదరాసె-ఆలియా స్కూల్‌లో చదివాడు. తర్వాత చరిత్ర ప్రధానాంశంగా కన్సాస్‌లోని విచిటా స్టేట్ యూనివర్సిటీ నుంచి బి.ఎ. చదివిన ఖాలిది ఆ తర్వాత హార్వర్డ్ యూనివర్సిటీ లో ఎఎల్ఎం కోర్సుని యూనివర్సిటీ ఆఫ్ వేల్స్- లాంప్‌టర్ బ్రిటన్ నుంచి పిహెచ్‌డి చేశాడు. ఉమర్ ఖాలిది తండ్రి అబునాసర్ మహమ్మ ద్ ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేశారు. ఆయన ఇస్లామిక్ స్టడీస్, ఉర్దూ సాహిత్యంలో దిట్ట. తండ్రి నుంచి ఉమర్‌కు ఉర్దూ, చరిత్ర పట్ల ఆసక్తి అబ్బింది. 1953లో హైదరాబాద్‌లో పుట్టిన ఉమర్ ఖాలిది రెండు డజన్లకుపైగా పుస్తకాలు వెలువరించాడు.

అందులో దాదాపు అన్నీ హైదరాబాద్ చరిత్రకు, లేదా ముస్లిం సమాజానికి సంబంధించిన వే. వందల సంఖ్యల్లో పత్రికా వ్యాసాలే గాకుండా ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఆయా యూనివర్సిటీల్లో చేసిన ప్రసంగాలు, రాసిన అకడమిక్, రీసెర్చ్ వ్యాసాలు ప్రతి ఒక్కటీ ఆణిముత్యమే. మధుమేహంతో బాధపడుతున్న ఖాలిది ఈ నెల 29న అమెరికాలో రైలు ప్రమాదంలో చనిపోవడం హైదరాబాద్ సమాజానికి తీరని లోటు, వ్యక్తిగతంగా నేను ఒక ఆత్మీ య మిత్రుణ్ణి, పరిశోధక దిక్సూచిని కోల్పోయాను. ప్రపంచ ముస్లిం సమాజం ఒక మంచి ఉద్యమ కార్యకర్తను కోల్పోగా హైదరాబాద్ సమాజం ఉద్యమకారునితోపాటు విలువైన రచయితను, పరిశోధకుడిని కోల్పోయింది.
-సంగిశెట్టి శ్రీనివాస్
తెలంగాణ హిస్టరీ సొసైటీ
Andhra Jyothi News Paper Dated : 12/2/2010

No comments:

Post a Comment