Saturday, February 25, 2012

నిజాలు దాచి నిజాంపై దాడెందుకు? -సంగిశెట్టి శ్రీనివాస్


'నిజాం నిరంకుశుడు కాదా?' అంటూ ఎస్వీ సత్యనారాయ ణ స్పందించిన తీరు (మార్చి 7, ఆంధ్రజ్యోతి) పూర్తిగా మత దృక్పథంతో, అహేతుకంగా ఉంది. అభ్యుదయ రచయితల సంఘంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ఎస్వీ ఈ వ్యాసంలో లేవనెత్తిన అంశాలు అసత్యాలు, అర్ధసత్యాలతో నిండివున్నాయి. 

నిజాంని నిందించడమే ఎజెండాగా పెట్టుకొని అభ్యుదయ రచయితల సంఘం పనిచేస్తోందా అనే అనుమానం కూడా కలుగుతుంది. రాచరికంలో రాజులందరి మాదిరిగానే నిజాం కూడా కొన్ని విషయాల్లో నిరంకుశుడుగా ఉండి ఉండొచ్చు. దానికి ఆయన్ని బాధ్యుణ్ణి చేస్తూ 60 ఏండ్లుగా నిలదీస్తూనే ఉన్నాం. అయితే ప్రస్తుత ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సందర్భంలో నిజాం ని నిందించడం కూడదని రఫత్ సీమా, కనీజ్ ఫాతిమాలు ముస్లిం ఫోరం ఫర్ తెలంగాణ తరఫున చేసిన విజ్ఞప్తి (ఫిబ్రవరి 29, ఆంధ్రజ్యోతి) పూర్తిగా న్యాయంగా ఉంది. నేటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమంతో ఎలాంటి సంబంధం లేని నిజాంని నిందించడం వల్ల అదనంగా ఒనగూరే ప్రయోజనమేమిటో ఎస్వీ చెప్పాల్సి ఉంది.

గతంలో జరిగిన సంఘటనలకు ఒక్క నిజాంని మాత్రమే బాధ్యుణ్ణి చేసి ప్రచారం చేస్తున్న సంస్థలు, వ్యక్తులు ఆ సంఘటనలకు నిజాంతో పాటుగా సంస్థానాధీశులు, జాగీర్దార్లు, దేశ్ ముఖ్‌లు, దేశ్ పాండ్యాలు, భూస్వాములు, దొరలు కూడా సమా న బాధ్యత వహించాల్సి ఉంటుందనే విషయాన్ని ఎందుకు కావాలని విస్మరిస్తారు? బహుశా ఆయా వర్గాలు తమ మతానికి సంబంధించిన వారు కావడం మూలంగానే వదిలేస్తున్నారేమో? ఎస్వీ ఇంకా ఆ వ్యాసంలో నిజాం పాలనలో కేవలం పన్నులు, పీడన, వెట్టిచాకిరి తప్ప మరేమి లేదనే భావన కలిగించాడు.

1724 నుంచి 1948 వరకు 224 సంవత్సరాల ముందు 220 యేండ్లు జరిగిన సంఘటనలకు కూడా నిజాంనే బాధ్యుల్ని చేయాలి. అంటే తెలంగాణలో స్థాపించిన పరిశ్రమలకు, వైద్య, విద్యాలయాలకు, నోబెల్ ప్రయిజ్ గ్రహీత రోనాల్డ్ రాస్ పరిశోధనకు వసతులు సమకూర్చినందుకు, ఎగ్జిక్యూటివ్ నుంచి జ్యూడిష్యరీని విడదీసి న్యాయవ్యవస్థకు దేశంలోనే మొట్టమొదటిసారి స్వయం ప్రతిపత్తి కల్పించినందుకు కూడా నిజాంని బాధ్యుణ్ణి చేయాల్సిందే! కట్టుబట్టలతో వచ్చిన నిజాం అత్యంత సంపన్నుడెట్లయ్యా డు? అని ఎస్వీ ప్రశ్నించారు.

ఒక ప్రాంతానికి సుబేదారుగా నియమించబడ్డ వ్యక్తి కట్టుబట్టలతో మాత్రమే వస్తాడని ఊహించడం ఆయనకు అసఫ్‌జాహీలపై ఉన్న ఏహ్య భావాన్ని వ్యక్తం చేస్తోం ది. అసఫ్ జాహీలు ప్రపంచంలోనే అత్యధిక సంపున్నులుగా ఎదగడానికి ప్రధాన కారణాలైన వజ్ర, వైఢూర్య ఆభరణాలు, సర్ఫెఖాస్ భూములు రెండూ ఇప్పుడు ప్రభుత్వం అధీనంలోనే ఉన్నా యి. ఆ సర్ఫెఖాస్ భూములే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కామధేనువులయ్యాయి. 

అసఫ్ జాహీలు తమ ఆస్తుల్ని వేరే ప్రాంతాలకు తరలించలేదు. దేశ విదేశాల్లో మరెక్కడా పెట్టుబడి పెట్టలేదు. తమ ఆస్తి సంపదనంతా తెలంగాణలోనే నిక్షిప్తం జేశారు. బ్రిటి ష్ పాలకుల మాదిరిగా సంపదను తరలించలేదనే విషయాన్ని గ్రహించాలి. తనకు ఇంగ్లీషు పుస్తకాల్లో ఏమి రాస్తున్నారో తెలియదు అని ఒకవైపు ఒప్పుకుంటూనే మరో వైపు అందులో గోరంతలు కొండంతలు చేసి రాస్తున్నారనే అబద్ధాలు ప్రచారంలో పెట్టారు.

షీలారాజ్, సరోజిని రేగాని, రత్నానాయుడు, వి.కె.బావా లాంటి వందల మంది ఉర్దూ, పర్షియన్ పత్రాలను అవలోకించి వెలుగులోకి తెచ్చిన విషయాలు తెలుగువారికి అందుబాటులో లేవు. వారి పుస్తకాల్లోని విషయాలు అందరికి అందుబాటులో ఉన్నట్లయితే ఎస్వీ లాంటి వారు చేసే వాదనలు ఎంత అహేతుకమైనవో తేలుతాయి. రఫత్, కనీజ్‌లు అడిగినట్లుగా నిజాంని నిందించడం గాకుండా అరసం తెలంగాణ ముస్లింలకు ఏం జేసిందో, విశాలాంధ్ర ప్రచురణ సంస్థ నుంచి ఇంతవరకు తెలంగాణ ముస్లిం యోధులైన షోయెబుల్లాఖాన్, బందగీ, తుర్రేబాజ్ ఖాన్ గురించి ఒక్క చిన్న పుస్తకమైనా ఎందుకు వేయలేదో జవాబివ్వాలి? మఖ్దూమ్ కవిత్వం అంతా ఎందుకు ఒక దగ్గరికి రాలేదో చెప్పాలి.

గజ్జెల మల్లారెడ్డి తర్జుమా చేసిన మఖ్దూమ్ కవితను కోట్ చేసిన ఎస్వీ ఎన్నడైనా నిజాంని పొగుడుతూ ప్రతియేటా పండితులు తెలుగులో పద్యాలు రాసేవారంటే నమ్ముతా రా?అలాంటి పద్యాలే నిజాం 49వ జన్మదినం సందర్భంగా గోల కొండ పత్రికలో అచ్చయ్యాయి. ఆ పద్యాలను చూసినట్లయితే ఆనాటి పండితులు నిజాంని చూసినతీరుని అర్థం చేసుకోవచ్చు. 

'నైజాము సర్కరోడా-నాజీల మించినోడా' అనే పాటను రాసిన యాదగిరిని హతమార్చిన నైజాం పోలీసులను, ప్రభుత్వాన్ని, దానికి రాజైన నిజాంని నిందించాల్సిందే. యాదగిరితో పాటు మరో మూడువందల మందిని 1944-48 మధ్యలో చం పించినందుకు నిజాం ప్రభుత్వాన్ని నిలదీయాల్సిందే. ఇదే సమయంలో 1948-1951 మధ్యన అప్పటి భారత హోం మంత్రి వల్లభ్ బాయి పటేల్ సైన్యం, దానికి నేతృత్వం వహించిన నెహ్రూలు, నాలుగు వేల మంది తెలంగాణ సాయుధ పోరాట యోధుల్ని పొట్టన బెట్టుకోవడాన్ని ఎందుకు నిలదీయ కూడ దు? ఈ పని మీరెందుకు చేయరు? నిజాంని ఎత్తిచూపించి నెహ్రూని మరవడంలో మర్మమేంది? 

యాదగిరి మృతికి అభ్యుదయ రచయితల సంఘం ఆనాటి నుంచీ సంతాపం ప్రకటిస్తుంది. అయితే యాదగిరి మృతిని శ్రీశ్రీ ఎదురుకాల్పుల సంఘటనగా రాశాడంటే నమ్మే గుండె ధైర్యం అరసంకు ఉందా? అవును శ్రీశ్రీ నిజాం ప్రభుత్వ సమాచార శాఖ లో ఉద్యోగిగా ఉంటూ ఇంగ్లీషు వార్తలను తెలుగులోకి తర్జుమా చేశాడు. ఈ విషయాన్ని ఎక్కడా ఎందుకు ప్రస్తావించరు?

ఒక వైపు తెలంగాణ ప్రజలు సాయుధ పోరాటం చేస్తూంటే మరో వైపు శ్రీశ్రీతో పాటుగా రాయప్రోలు, కురుగంటి సీతారామయ్య, కాసింఖాన్ ఇంకా అనేక మంది సాహితీవేత్తలు నిజాం ప్రభుత్వం లో కొలువులు చేశారు. అడివి బాపిరాజు, రాంభట్ల, తిరుమల రామచంద్ర లాంటివారు 'మీజాన్' పత్రిక ద్వారా పరోక్షంగా నిజాం ప్రభుత్వానికి అండగా నిలిచారు. ఈ విషయాలను ఇప్పుడైనా చర్చించాల్సిన అవసరం లేదా?

గాంధీ విషయంలో కూడా అర్ధసత్యాలనే ఎస్వీ ప్రచారంలో పెట్టారు. 1938లో స్టేట్ కాంగ్రెస్ ప్రారంభమైన వెంటనే నిషేధానికి గురయ్యింది. ఈ స్టేట్ కాంగ్రెస్ తరఫున నాయకులు సత్యాగ్రహాన్ని, శాసనోల్లంఘనను చేపడితే గాంధీ వారిమీద వత్తిడి తీసుకొచ్చి వాటిని వెంటనే విరమింపజేసుకునేలా చేశాడు. చేస్తున్న ఉద్యమాన్ని ఆపు చేయించడమంటే 'ఉద్యమం చేయవలసిన అవసరం లేదు'గా రఫత్, కనీజ్‌లు భావిస్తే తప్పేంటి? ఇక్కడి పాలనపై సానుకూలతను గాంధీ-అక్బర్ హైదరీ లేఖల్లో ఉల్లేఖితమైన విషయం పరిగణనలోకి తీసుకోవాలి.

చివరగా ఒక్కమాట. ప్రస్తుత సందర్భం ప్రత్యేక తెలంగాణ. ఈ సందర్భాన్ని అడ్డుపెట్టుకొని కూడా నిజాంని నిందించాలని చూడడం పూర్తిగా అనైతికం. ఇప్పటికైనా విషయాల్ని ఉన్నదున్నట్లుగా, పాలని పాలుగా, నీళ్ళని నీళ్ళుగా చూడాలి, తెలంగాణ ఉద్యమాన్ని కులమతాలకు అతీతంగా ముందుండి నడిపించాలని ప్రతి ఒక్కర్నీ కోరుతున్నాం.
'సింగిడి' తెలంగాణ రచయితల సంఘం
Andhra Jyothi News Paper Dated : 21/3/2010

No comments:

Post a Comment