Saturday, February 25, 2012

ఎన్నాళ్లీ అఖిలపక్ష నాటకాలు? -కృపాకర్ మాదిగ

ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం అఖిల పక్షం ఈ నెల 14న ఢిల్లీ వెళ్తుందని ముఖ్యమంత్రి ఇటీవలే ప్రకటించారు. ఈ అంశంపై అఖిల పక్షాలు ఇప్పటికే పలుమార్లు ఢిల్లీ వెళ్లిరావడం గమనిస్తే, తిప్పడు మాచర్ల పోనూ పోయాడు, రానూ వచ్చాడు అన్న సామెత గుర్తొస్తుంది. ఈసారి కూడా తిప్పడి తిరుగుడేనా? లేక పనేమైనా జరుగుతుందా? వర్గీకరణ అంశంపై అఖిల పక్షాలు ఢిల్లీ పోనవసరం లేదు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి మాదిగల డిమాండ్‌ను సానుకూలంగా పరిష్కరించాలనే రాజకీయ సంకల్పం ఉంటే చాలు. అధికార పద్ధతులు, దారులు వాటంతటవే తెరుచుకుంటాయి. ఐతే చెయ్యాలనే సంకల్పం కాంగ్రెస్‌కు లేనందువల్లనే మళ్లీ ఈ అఖిల పక్షం ఢిల్లీ నాటకం అని ప్రజలు భావిస్తున్నారు.

రాష్ట్రంలో 61 షెడ్యూల్డు కులాలున్నాయి. ఎస్సీలలో అరవై శాతం జనాభాగా ఉన్న మాదిగలు 30 శాతం కంటే తక్కువ రిజర్వేషన్లు పొందుతున్నారు. కాగా, ఎస్సీల్లో 30 శాతం జనాభా కూడా లేని మాల కులస్తులు మొత్తం విద్య, ఉద్యోగ, సంక్షేమ, రాజకీయ రిజర్వేషన్లలో 70-80శాతం పొందుతున్నారు. ఈ వ్యత్యాసమే, జనాభా నిష్పత్తి ప్రకారం ఏ కులం వాటా రిజర్వేషన్లు ఆ కులానికే అందే విధంగా ప్రభుత్వం ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టం చేయాలన్న మాదిగ డిమాండుకు కారణమయ్యింది. మాదిగ హక్కుల దండోరా ఉద్యమంగా రూపుదిద్దుకుంది. మాదిగల డిమాండుకు మద్దతుగా రాష్ట్ర అసెంబ్లీ ఇప్పటికి రెండుసార్లు ఏకగ్రీవంగా తీర్మానాలు చేసింది. ఒకసారి ఏకగ్రీవ చట్టమే చేసింది. 

అసెంబ్లీ చరిత్రలో అధికార పక్షంతో సహా రాజకీయ పార్టీలన్నీ సానుకూలంగా ఏకతాటిపైన ఉన్న అంశమేదైనా ఉందంటే, అది మాదిగల ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ డిమాండు పైననే అని చెప్పి తీరాలి. ఇంతటి ప్రాధాన్యం సంతరించుకున్న అంశం ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ. పార్లమెంటులో అధికరణం 341కి రాజ్యాంగ సవరణ చెయ్యటం ద్వారా ఎస్సీ రిజర్వేషన్లను జనాభా నిష్పత్తి ప్రకారం ప్రతి ఎస్సీ కులానికీ అందేలాగా వర్గీకరణ-హేతుబద్ధీకరణ చెయ్యవచ్చు.

ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం నియమించిన జస్టిస్ ఉషా మెహ్రా కమిషన్ ఈ విషయాన్నే మూడేళ్ల కిందట సిఫార్సు చేసింది. ఈ విధమైన సానుకూల పరిష్కారం ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఎటువంటి అదనపు ఆర్థిక భారం పడే అవకాశం లేదు. పైగా సహజన్యాయం, సామాజిక న్యాయ సూత్రాలకనుగుణంగా ప్రతి షెడ్యూల్డు కులానికీ విద్య, ఉద్యోగ, సంక్షేమ, రాజకీయ రంగాల్లో పంపిణీ న్యాయం జరుగుతుంది.

సింహభాగం రిజర్వేషన్లు పొందడం ద్వారా షెడ్యూల్డు కులాల మధ్య ఆధిపత్య కులంగా రూపొందిన మా కులానికి చెక్ పెట్టడానికి ప్రభుత్వం వద్ద ఎన్నో మార్గాలున్నాయి. 

1)రాజ్యాంగంలోని 15(4), 16(4) అధికరణాల ననుసరించి విద్యలో వెనకకు నెట్టబడిన, ఉద్యోగాల్లో తగిన ప్రాతిని ధ్యం పొందలేకపోయిన మాదిగలు, డక్కలి, చిందు, బైండ్ల, మాస్టిన్, రెల్లి, పాకి, పంచమ, తోటి, గొడగలి, గొడారి, బుడగజంగం మొదలైన ఎస్సీ కులాల విద్యాభివృద్ధి కోసం, సరైన ఉద్యోగాల ప్రాతినిధ్యం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక విద్యాసంస్థలను స్థాపించవచ్చు. ప్రత్యేక ఉద్యోగ నియామక చర్యలు చేపట్టవచ్చు.

2) రిజర్వేషన్లలో రిజర్వేషన్లు అనే ప్రాధా న్య క్రమాలతో కూడిన చర్యల విధానాన్ని అనుసరించవచ్చు.

3)ఇంకా సూటిగా చెప్పాలంటే తమ జనాభా శాతం/నిష్పత్తి కంటే అదనంగా రిజర్వేషన్లను ఇప్పటి వరకూ పొందిన మాల, మాల దాసరి, ఆదియాంధ్ర మాల, ఆది ద్రావిడ మాల, హొలియదాసరి వంటి కులాలకు కొంతకాలం రిజర్వేషన్లు నిలుపుదల చెయ్యాలి. లేదా వారి నిష్పత్తి రిజర్వేషన్లలో కొంత శాతం తగ్గించాలి. రిజర్వేషన్లు పొందడంలో ఇప్పటి వరకూ వెననకు నెట్టబడిన మాదిగ, రెల్లి, బుడగజంగం వంటి అనేక ఎస్సీ కులాలకు రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్‌తో కొంత కాలం రిజర్వేషన్లు అందించాలి. ఇందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకోవాలి. ప్రాతినిధ్యం, సమానత్వం అనే స్ఫూర్తికి అనుగుణంగా ఎస్సీ రిజర్వేషన్లను హేతుబద్ధీకరించడానికి పై తెలిపిన ఏ మంచి మార్గాన్నైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంచుకోవచ్చు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను నడిపిస్తున్న కాంగ్రెస్‌కు, యు.పి.ఎ. భాగస్వామ్య పార్టీలకు మాదిగలకు సామాజిక న్యాయం చెయ్యాలనే రాజకీయ సంకల్ప శుద్ధి లోపించిం ది. అందుకే ఎస్సీల వర్గీకరణపై ఈ సాగతీత. ఈ అఖిల పక్ష నాటకాలు.

మొక్కుబడి ప్రాతినిధ్యాలతో, ప్రతిపక్షాలు సైతం మాదిగలకు రిజర్వేషన్లలో జరుగుతున్న సామాజిక అన్యాయాన్ని ఇంకెంత కాలం కొనసాగించదలుచుకున్నాయో తలచుకుంటే ఆందోళన కలుగుతున్నది. కేంద్రంలో అవినీతిపరులైన మంత్రుల్ని తొలగించాలని, టెలికాం స్కాం వంటి కుంభకోణాలపై విచారణ కోసం జెపిసిని నియమించాలని, పట్టువిడువక పార్లమెంటు సమావేశాలను స్తంభింపజేస్తున్నాయి విపక్షాలు. ఇది అభినందించదగ్గదే. కానీ కనీస సామాజికన్యాయంతో కూడుకున్న ఎస్సీ వర్గీకరణ డిమాండుపై ప్రతిపక్ష పార్టీలు పార్లమెంటులో పోరాడకపోవడం-వాటి మాదిగ వ్యతిరేక అసామాజిక, అన్యాయానికి గుర్తుగా భావించాల్సి ఉంటుంది. ప్రతిపక్షాలు ఉత్తుత్తి అఖిలపక్ష యాత్రలు చెయ్యొద్దు. పార్లమెంటులో నిర్దిష్ట, నిర్మాణాత్మక రూపాల్లో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం కొట్లాడాలి. మాదిగల పిల్ల లు పలకల్లో అక్షరాలు దిద్దుకునే అవకాశాల కోసం, మాదిగల గిన్నెల్లో రాయితీల మెతుకుల కోసం ప్రతిపక్షాలు నిబద్ధతతో వ్యవహరించాలి.

పంపిణీ న్యాయం కోసం, రిజర్వేషన్ల విధానం అమల్లో మార్పులు కోరు తూ మరో స్వాతంత్య్ర సంగ్రామమంత ఉద్యమాన్ని మాదిగలు నిర్వహించారు. సాచివేత నాటకాలతో రాజకీయ పార్టీలు చట్టసభల ద్వారా మాదిగలకు న్యాయం అందించలేకపోయాయి. క్షీణ ప్రజాస్వామ్యానికి ఇదే పెద్ద సాక్ష్యం. రిజర్వేషన్ల కుండంతా ఎబిసిడిల కంచాల్లో పంచవొద్దని, ఏ కులం బలమైనదేతే ఆ కులానిదే కుండంతా అనే మాల మనువాదం బట్టబయలైంది. గడచిన 60 ఏళ్లలో కోటి మంది మాదిగలకు తీర్చలేనంత అన్యా యం రిజర్వేషన్లలో జరిగిపోయింది.

ఈ దుర్నీతి, ఈ మహా నిర్లక్ష్యం ఇకపై కొనసాగకూడదు. పార్లమెంటులో రాజ్యాంగ సవరణ ద్వారా కేంద్ర ప్రభు త్వం ఎస్సీ రిజర్వేషన్లను ఎబిసిడి గ్రూపులుగా వర్గీకరించాలి. రానున్న పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టం చేసి, తన చేతికంటిన మాదిగలకు చేసిన పాపాన్ని కాంగ్రెస్ కడుక్కోవాలి. ఈ అంశంలో అఖిలపక్షాలు కప్పదాట్లు వెయ్యకుండా బాధ్యతతో నిలబడాలి.
-కృపాకర్ మాదిగ
ఎంఆర్‌పిఎస్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి

Andhra Jyothi News Paper 12/2/20111

No comments:

Post a Comment