Saturday, February 25, 2012

విముక్త * ఓల్గాపధ్నాలుగేళ్ల వనవాసాన్ని, అనేక కష్టాలను దాటి అయోధ్యకు తిరిగి వచ్చిన సీతారామలక్ష్మణులను స్వాగతించటానికి అంతఃపురమంతా కదలి వచ్చింది ఒక్క ఊర్మిళ తప్ప. 
ఆత్రంగా వెతికిన సీత కళ్లకు ఊర్మిళ ఎక్కడా కనిపించలేదు. అత్తగార్ల ఆలింగనాలు, కుశలప్రశ్నలు, మాండవి శ్రుతకీర్తుల స్నేహపు పలుకులు, సేవలు - ఇవేవీ సీత మనసుకెక్కటం లేదు. 
ఊర్మిళ ఏది? ఆరోగ్యం బాగా లేదా? హడావిడి కొద్దిగా తగ్గిన తర్వాత చెల్లెలు శ్రుతకీర్తిని దగ్గరకు తీసుకుని మెల్లిగా అడిగింది సీత. శ్రుతకీర్తి ముఖం వివర్ణమైంది. ఆమె ముఖం చూసి సీతకు భయం వేసింది. 
"ఊర్మిళ కేమయింది? కుశలమే కదా?'' 
సీత ఆందోళన అర్థమైనా ఏం చెప్పాలో తెలియలేదు శ్రుతకీర్తికి. ఆమె ఊర్మిళను చూసి పధ్నాలుగేళ్లయింది. 
"మాట్లాడకుండా అలా చూస్తావేమిటి? ఊర్మిళ ఏది? ఎలా ఉంది?'' సీత మరింత ఆందోళనగా అడిగింది. 
"ఊర్మిళ ఎలా ఉందో నాకూ తెలియదు. అక్కను నువ్వెళ్ళిననాటి నుంచీ చూడలేదు.'' 
సీతకేమీ అర్థం కాలేదు. తను పొరపాటుగా వింటున్నాననుకుంది. మళ్లీ గట్టిగా "శ్రుతకీర్తీ - నేను ఊర్మిళ గురించి అడుగుతున్నాను'' అంది. 
"నేనూ ఊర్మిళ గురించే చెప్తున్నాను. మీరు వెళ్లాక ఊర్మిళ ఎవరికీ కన్పించలేదు. తన మందిరంలోంచి బైటికి రాలేదు. ఎవరినీ లోపలకు రానివ్వలేదు.'' 
నిర్ఘాంతపోయింది సీత. 
"ఎవ్వరినీ? అత్తగార్లను కూడా'' 
"అవును. ఆమె గదిలోకి ప్రవేశం ఒక్క చారుమతి అనే దాసికే ఉంది. ఊర్మిళ యోగక్షేమాలు ఆమే మాకు చెబుతుంది.'' 
సీతకు ఊపిరాడనట్లయింది. 
పధ్నాలుగేళ్లు మనుషులతో మాట్లాడకుండా - తన వాళ్లను చూడకుండా ఎట్లా ఉంది? అట్లా ఉండాలని నిర్ణయించుకుందంటే ఆమె మనసు ఎంత గాయపడి ఉండాలి. పధ్నాలుగేళ్లు. ఆమె రామలక్ష్మణులనూ, తననూ క్షమిస్తుందా? 
"ఇవాళ మేం వస్తున్నాం అన్న వార్త ఊర్మిళకు తెలుసా?'' 
శ్రుతకీర్తి తల దించుకుంది. 
సీత వెంటనే రాముని దగ్గరకు వెళ్లాలని చూసింది గానీ మంత్రులు, తమ్ముళ్ళు, పురప్రముఖులు మోహరించిన ఆ సమయంలో రామలక్ష్మణులను సమీపించటం అసాధ్యమనిపించింది. 
ఇంతలో శ్రుతకీర్తి ఒక స్త్రీని తీసుకొచ్చింది. 
"ఈమె చారుమతి.'' 
సీత ఇంక ఆలస్యం చెయ్యలేదు. 
"పదమ్మా - ఊర్మిళ దగ్గరకు వెళదాం.'' 
"ఆమె ఎవరినీ చూడదు'' అంది చారుమతి ముక్తసరిగా. 
"ఎవరివల్ల ఆమె అందరికీ దూరంగా బతుకుతోందో వాళ్లే వచ్చారని తెలిస్తే ఆమె వారిని తప్పక చూస్తుంది. పద.'' 
సీత చారుమతిని నడవమని కళ్లతోనే ఆజ్ఞాపించింది. 

*** 
ఊర్మిళ మందిరం వందల యోజనాల దూరం ఉన్నట్లనిపించింది సీతకు. ఎంత నడిచినా రాదేం - అరణ్యవాసంలో ఉండగా లక్ష్మణుడితో పాటు ఊర్మిళా తమతో ఉంటే ఎంత బాగుండేది అనిపిస్తూ ఉండేది సీతకు. రామలక్ష్మణులు తమ పనులలో అరణ్య సంచారంలో ఉంటే తనూ, ఊర్మిళా కలిసి అరణ్య సౌరభాలను ఆస్వాదించేవారు గదా అనుకునేది. 
ఎందుకు లక్ష్మణుడు ఊర్మిళను తీసుకురాలేదు? ఆ విషయం ఎప్పుడు ప్రస్తావించినా మౌనం తప్ప పెదవి విప్పేవాడు కాదు లక్ష్మణుడు. తాము అడవికి వచ్చేప్పుడు అయోధ్యలో అంతా గందరగోళం. అయోమయం. దశరథుని అనారోగ్యం, కౌసల్య దుఃఖం, అంతఃపురమంతా అల్లకల్లోలమైంది. తాను రాముని వెంట వెళ్లటానికి అందరినీ ఒప్పించటమే పెద్ద పనయింది. 
తీరా సరయూనది దాటుతుండగా మనసు కాస్త స్థిమితపడ్డాక ఊర్మిళ తమతో రావటం లేదనే విషయం గట్టిగా మనసును తాకింది. ఊర్మిళ ఎక్కడా కనబడలేదనీ, తమకు వీడ్కోలు కూడా చెప్పలేదనీ గుర్తొచ్చాక సీతలో ఆందోళన పెరిగింది. 
రాముడిని పదే పదే ప్రశ్నించేది. 

"ఊర్మిళ వస్తాననలేదా? లక్ష్మణుడు ఒంటరిగా వస్తుంటే ఆమె ఎంత దుఃఖించిందో! అరణ్యవాసం దుస్సహమనుకుందా? లక్ష్మణుడు అయోధ్యలో ఉంటేనే బాగుండేదేమో. మనకోసం ఊర్మిళను ఒంటరిదాన్ని చేసి రావడం సమంజసమా?'' ఇలా మాట్లాడుతున్న సీతను రాముడు సమయానుకూలంగా సమాధానపరిచేవాడు. భర్త ృహీన, పుత్రవియోగి అయిన అత్తగారికి అండగా లేకుండా సీత వనవాసానికి వచ్చేసింది కదా. మరి ఆమెకు ఊర్మిళ కూడా లేకపోతే ఎలా? ముగ్గురు అత్తగార్లకూ ముగ్గురు కోడళ్లయినా ఉండొద్దా. రాముడు ఇంకా ఎన్నో చెప్పేవాడు. అంతఃపురంలో నిర్వహించాల్సిన బా«ధ్యతలెన్నో ఉంటాయి. అవి మహారాణిగా కౌసల్య ఎంతో సామర్ధ్యంతో నిర్వహించేది. ఇప్పుడామెకు శక్తి చాలదు. ఆసక్తి అసలే ఉండదు. ఆ నిర్వహణ భారం ఊర్మిళ తప్ప ఎవరు మోయగలరు? 

"సీతా చెప్పు - ఈ విషయంలో నీకంటే ఊర్మిళ సమర్థురాలు కదూ? మనం అయోధ్యలో ఉన్నప్పుడు అమ్మ నీకంటే ఊర్మిళకు ఎక్కువ బా«ధ్యతలు అప్పజెప్పేది కదూ?'' 
"ఔను'' అని ఆలోచనలో పడేది సీత. ఊర్మిళ లౌకిక వ్యవహారాలలో చాలా సమర్థురాలు. చూపుతో శాసించగలదు. రాణీవాసాలలో జరిగే సమస్త వి««ధులూ ఆమెకు తెలుసు. తండ్రి కూడా ఆ విషయంలో చెల్లినే ప్రశంసించేవాడు. 
"నీకు విలువిద్యలో, ఉద్యానవన విహారాలలో ఉన్న ఆసక్తి మిగిలిన విషయాలలో లేదమ్మా'' అనేవాడు. 
నిజమే. ఆ అంతఃపుర అధికారాలూ, వాటి నిర్వహణా సీతకే మాత్రం నచ్చేవి కావు. ఉద్యానవనంలో ఆటలు, విలువిద్యాభ్యాసం, ప్రకృతిలో సేదదీరటం యివే ఇష్టం సీతకు. అయోధ్యకి వచ్చిన తర్వాత కూడా అత్తగారినుంచి బాధ్యతలు తీసుకునే ఆసక్తి చూపించలేదు సీత. ఊర్మిళ మాత్రం కౌసల్య వెంటే ఉండేది. 
సీతకు అంతఃపురం కంటే అరణ్యమే హాయిగా ఉంది. ఇక్కడ స్నేహం చేయటానికీ, గౌరవించటానికీ మనుషులుంటారు. అధికారం చలాయించేందుకు కాదు. 
"నీకు ప్రియమైనది ఊర్మిళకు ప్రియమవ్వాలని లేదుగా. నువ్వు భూపుత్రివి. ప్రకృతి ప్రేమికురాలివి. ఊర్మిళకు నగరజీవితం, అంతఃపుర బాధ్యతలూ ప్రియం కావచ్చుగదా'' 
రాముడెంత సముదాయించినా సీత ఊర్మిళ కోసం దిగులు పడేది. 
భర్త ృ వియోగాన్ని భరించటం అన్నింటికంటే పెద్ద కష్టం కదా - 
రావణుని చెరలో అదెంత పెద్ద కష్టమో సీతకు బాగా అర్థమైంది. 
సీత ప్రకృతి ప్రేమికురాలని తెలిసి రావణుడు ఆమెను అశోకవనంలో ఉంచాడు. ఆ వన సౌందర్యం వర్ణనాతీతం. మిథిలలో, అయోధ్యలో ఎక్కడాలేని వనవైభవం. రావణునివి పిచ్చి ప్రేలాపనలే గాని సీతను తేరిపార చూసే ధైర్యం కూడా లేదు. సీతకు అతను తృణప్రాయం. 
ఐనా అపహరణకు గురై పతి తన రక్షణార్థం వస్తాడని ఎదురుచూస్తూ కూర్చోవటం సీతకు నరకప్రాయంగా ఉంది. 
రాముడు వస్తాడు. రావణుని సంహరిస్తాడు. దీనిలో సీతకే సందేహమూ లేదు. తనను తాను రక్షించుకోగల శక్తిని నియంత్రించుకుని ఏ ప్రయత్నమూ చేయకుండా కూర్చోవటమే అసహనంగా ఉండేది. 
రాముని మనసు సీతకు తెలుసు. రావణసంహారం తానే చెయ్యాలనే రాముని సంకల్పం ముందు సీత ప్రతాపం వెనక్కు తగ్గక తప్పలేదు. "మన అనుబంధంలో మీకు చాలా ఇష్టమైనదేమిటి?'' అని అడిగింది సీత ఒకరోజు. 
"నిన్ను కంటికి రెప్పలా కాపాడుకోవటం. నీ కాలిలో ముల్లు దిగినా నేనే తియ్యాలి. నిన్ను సమీపించబోయే క్రూరమృగాలను నేనే సంహరించాలి. నిన్ను రక్షిస్తున్నాననే భావన నాకు అయోధ్య సార్వభౌమత్వం కంటే ఎక్కువ గర్వాన్నీ ఆనందాన్నీ కలిగిస్తుంది'' అన్నాడు. 
"నన్ను నేను రక్షించుకోగలను. విలువిద్యలో మీకు తీసిపోను'' అంది సీత నవ్వుతూ. రాముని ముఖం చిన్నబోయింది. 
"నేను జీవించి ఉండగా నిన్ను నువ్వు రక్షించుకునే అవసరమే రాదు. రాకూడదు. నువ్వు నాకోసం చూడాలి. నా బలమైన బాహువుల రక్షణకోసం చూడాలి. అలాకాక నిన్ను నువ్వే రక్షించుకుంటే యిక నేనెందుకు? అలా ఎన్నడూ చెయ్యనని వాగ్దానం చెయ్యి'' సీత రాముని చేతిలో చేయి వేసింది. 

దాంతో అశోకవనంలో నిరీక్షణ తప్ప సీతకు మరో మార్గం లేకుండా పోయింది. అప్పుడు ఆ పతీ వియోగ వ్యధలో ఊర్మిళ ప్రతిక్షణం గుర్తొచ్చేది. ఎలా సహిస్తోంది ఊర్మిళ? 'నా ప్రియమైన చెల్లీ. ఎందుకక్కడ ఉన్నావమ్మా. ఆ అంతఃపురంపై అంత మక్కువ ఎందుకమ్మా' అని ఊర్మిళను కూడా తన దుఃఖార్త్తిలో కలుపుకునేది. 

చివరకు రావణసంహారం జరిగింది. అగ్నిపరీక్ష గడిచింది. అయో«ధ్య సీతారాముల రాకకై నిరీక్షిస్తోంది అని రాముడు సగర్వంగా చెప్పినప్పుడు సీతకు ఊర్మిళే గుర్తొచ్చింది. 
'ఊర్మిళ ఇప్పుడు ఎంత ఆనందంగా ఉందో. తన మందిరాన్ని ఎంత సుందరంగా అలంకరింపజేసిందో. తను లక్ష్మణుడి ఎదుట పడే క్షణం కోసం ఎంత అలంకరణ చేసుకుంటుందో. అంతఃపురం చేరగానే అత్తగార్లకు నమస్కరించి లక్ష్మణునితో పాటు ఊర్మిళ దగ్గరకు వెళ్లాలి. లక్ష్మణుని ఊర్మిళకు అప్పగించి వారి సంబరం చూసి - కొద్ది నిమిషాలు వారి ఏకాంతానికి భంగం కలిగించినా సరే - ఊర్మిళ మందిరం చూసే తన మందిరానికి వెళ్లాలి' ఆ దృశ్యాన్ని పదేపదే ఊహించుకుని ఆనందం పొందుతూ అయోధ్యకు తిరిగొచ్చింది సీత. 
ఇంత ఉద్వేగంతో వస్తే హృదయానికి హత్తుకోవడానికి ఊర్మిళ ఎదురు పడలేదు. పైగా హృదయాన్ని చీలుస్తూ ఊర్మిళ తనకు తాను విధించుకున్న అజ్ఞాతవాసపు వార్త ... 

*** 
ఊర్మిళ మందిరం వెలుపలంతా అలంకరించి ఉంది. ఆమె గది తలుపులు మాత్రం మూసి ఉన్నాయి. చారుమతి మెల్లిగా తలుపు మీద తట్టి "అమ్మా - మీ సోదరి జానకీదేవి మిమ్మల్ని చూడాలని వచ్చారు'' అన్నది. 
సీత మనసు మనసులో లేదు. 
'ఏమంటుంది ఊర్మిళ? తననేం అడుగుతుంది. తనేం చెప్పాలి?' 
తలుపులు ఎంతకీ తెరుచుకోలేదు. 
సీత తనే స్వయంగా పిలిచింది. 
"ఊర్మిళా - నేనమ్మా. అక్కయ్యను వచ్చాను. అంతా చెబుతాను. మమ్మల్ని క్షమించి తలుపు తెరువు.'' 

మెల్లగా ఊర్మిళ గది తలుపులు తెరుచుకున్నాయి. సీత ఒక్కక్షణం దిగ్భ్రమ చెందింది. సీతకు తెలిసిన ఊర్మిళ కాదీమె. ఆ కళ్లలో ఇదివరకు అమాయకత్వమే ఉండేది- మరి... ఇప్పుడు ... ఆ రెండు కళ్లలో వెలుగుతున్నదేమిటి? ఎంతో ఠీవిగా రాణిలా ఉండేది. ఇప్పుడామె శరీరంలో ఏదో గాంభీర్యం. సంయమనం. ముఖంలో ఆ తేజస్సు ఏమిటి? సీత తెప్పరిల్లుతుండగా ఊర్మిళ వచ్చి అక్కగారి పాదాలకు నమస్కరించి ఆసనం మీద కూర్చోబెట్టింది. 

"ఊర్మిళా - పధ్నాలుగేళ్లుగా నీ గురించి ఆలోచిస్త్తున్నాను. ఎంతో బాధపడుతున్నాను'' సీత కళ్లలో కన్నీరు మరి ఆగనంటూ బైటికురికింది. "మా మీద నీకు కోపం ఉండొచ్చు.'' 
ఊర్మిళ గంభీరంగా నవ్వింది. 
"నాకెవరిమీదా కోపం లేదు.'' 
"మరి ఎందుకిట్లా అందరికీ దూరంగా - కోపం లేకపోతే ఇట్లా ఒక గదిలో బందీవవుతావా? నీ కోపాన్ని ప్రదర్శించు. ఆగ్రహించు. కానీ ఇలా ఎవరికీ కాకుండా పోకు. అసలేం జరిగిందో ఇలా ఎందుకు చేస్తున్నావో చెప్పు.'' 
ఊర్మిళ నవ్వింది "నీకు తప్ప ఎవరికీ అర్థం కాదనే ఎవరికీ చెప్పలేదు ఇంతవరకూ...'' 
సీత ఉత్సుకతతో ఎదురు చూస్తుండగా - 
"అక్కా... నేను కోపంతోనే మొదట ఈ గది తలుపులు మూశాను. నా భర్త నాతో ఒక్కమాట చెప్పకుండా, నా నిర్ణయంతో ప్రమేయం లేకుండా నేననేదాన్ని ఒకదానిని ఉన్నాననే ఆలోచన లేకుండా అన్నగారే సర్వస్వమని వెళ్లిపోయారు. కోపంతో దహించుకుపోయాను. ఈ అంతఃపురాన్ని నా తిరుగుబాటుతో తల్లకిందులు చేయాలనుకున్నాను. అందరూ మీ కోసం దుఃఖిస్తున్నారు. నా వైపు చూసేవారే లేరు. నిస్సహాయ ఆగ్రహం - నేనూ ఎవరినీ చూడదల్చుకోలేదు. సత్యాగ్రహం ప్రారంభించాను.'' 

సీత మనసు అప్పటి ఊర్మిళను పట్టుకునే ప్రయత్నం చేస్తోంది. 
"మొదలు పెట్టినపుడది ఆగ్రహమే - కానీ అది క్రమంగా సత్యం కోసం నాలో నేను, నాతో నేను చేసే అన్వేషణగా మారింది. నా కెందుకింత కోపం, నన్ను నేను కాల్చేసుకునే కోపం, నాకెదురైన ప్రతివారినీ దహించాలనే కోపం. నాకెందుకీ దుఃఖం. కారణం తెలుసు. కానీ ఆ కారణం లోపలికి, లోలోపలికి చూడాలనే తహతహ ఒకటి నాకు తెలియకుండానే పుట్టుకొచ్చింది. కోపం ఏమిటి? దుఃఖం ఎందుకు? ఆనందం దేనికి? నా శరీరానికీ, నాలో కలిగే ఈ ఆవేశాలకూ, ఉద్వేగాలకూ మధ్య ఉన్న సంబంధం ఏమిటి? ఇట్లా ఎన్నో ప్రశ్నలు - అవి నన్ను లీనం చేస్తున్నాయి. నా శరీరాన్ని గమనించటం, నా ఆలోచనల్ని... అవి నాలో రేకెత్తించే ఉద్రేకాన్ని గమనించటంతో మొదలుపెట్టాను. ఈ గమనికకు ఎలాంటి అంతరాయం కలిగినా నాకు అశాంతిగా ఉండేది. అందుకే నేను ఏకాంతాన్ని కోరుకున్నాను. ఒంటరితనాన్ని కాదు ఏకాంతాన్ని. నాలో నేను, నాతో నేను సంభాషించుకునే ఏకాంతాన్ని. 

ఆ సంభాషణ నన్నూ, నాకు సంబంధించిన వ్యక్తులనూ ఎదురెదురుగా నిలబెట్టేది. మా సంబంధాన్ని చీల్చి చూసేది. ప్రతి ఒక్క సంబంధాన్ని, మన తండ్రి, నీవు, లక్ష్మణుడు, రాముడు, కౌసల్య యిలా అందరితోటి నా సంబంధపు సారాంశం ఏమిటని పొరలు, పొరలు విప్పి చూశాను. అక్కగా నిన్ను ప్రేమించినపుడు, నన్ను ఒదిలి నీ భర్తతో నువ్వెళ్లిపోయినపుడు మన మధ్య సంబంధంలో జరిగిన మార్పు ఎలాంటిది - ఎందుకలా జరిగింది? ప్రేమను కోపంగా మార్చే రసాయనిక చర్య మూలం ఏమిటి? 

అసూయ, ద్వేషం, ప్రేమ, గౌరవం - వీటి మధ్య తేడా ఎంత? అసలుందా లేక ఒకే వర్ణ ఛాయా బేధాలా అవి? ఒక నీడలోకి ఇంకొక వెలుగు, ఒక వెలుగులోకి ఇంకొక నీడ ఎలా చొరబడుతుంది. ఏది వెలుగు? ఏది నీడ? 
ఒక్కొక్క ప్రశ్న ఉదయస్తున్న కొద్దీ నాలో సమరోత్సాహం వంటిది కలిగేది. మన పతులు ఈ పధ్నాలుగేళ్లూ రాక్షససంహారం కోసం యుద్ధాలు చేశారని విన్నాను. దాని వల్ల శాంతి చేకూరిందో, చేకూరుతుందో నాకు తెలియదు. కానీ నేనీ ప్రశ్నలతో చేసిన యుద్ధంలోంచి నాకు మాత్రం ఒక గొప్ప శాంతి, ఆనందం వచ్చింది.'' 
ఊర్మిళ ముఖంలో ఆ శాంతి ప్రస్ఫుటమవుతూనే ఉంది. సీత ఊర్మిళను ఆశ్చర్యంతో చూస్తూ, ఆమె మాటలను వింటూ, ఆమె చేశానని చెబుతున్న యుద్ధాన్ని ఊహించుకుంటోంది. ఆమెకు లక్ష్మణుడి గురించి ఒక ఆరాటం మొదలైంది. 
"లక్ష్మణునికి నీ మీద ప్రేమ ఉంది ఊర్మిళా - అతనితో -'' 
సీత మాటలకు అడ్డు వచ్చింది ఊర్మిళ. 
"పధ్నాలుగేళ్ల తర్వాత కలవబోతున్నాం మేమిద్దరం - ఏమో - నేను మాత్రం చాలా మారాను. మార్పు జీవన సంకేతం. దానికి అతను ఇచ్చే విలువను బట్టే మా ఇద్దరి జీవిత గమనం సాగిపోతుంది. 

నేను ద్వేషంతో కాకుండా న్యాయాన్ని గురించి ప్రశ్నించగల విజ్ఞత సంపాదించుకున్నాను. లక్ష్మణునితో నా సంబంధం అతను 'నా విజ్ఞతను ఎలా అర్థం చేసుకుంటాడు. ఎంత గౌరవిస్తాడు' అనే దానిపై ఆధారపడి ఉంటుంది. అతను మిగిలిన అధికారాలను ఒదలకుండా వాటికి లోబడుతూ నాపై మాత్రం అధికారాన్ని ఒదులుకుంటాడా - ఏమో - చెప్పలేను. ఏదెలా జరిగినా నా శాంతి మాత్రం భగ్నమవదు. ఆ శాంతి అవతలి వ్యక్తికి కావాలా లేదా అన్నదే ముఖ్య.'' 

సీత ముఖంలోని ఆందోళన ఊర్మిళకు అర్థమైంది. తనను తాను మరింత విప్పి చెప్పుకుంటే సీత ఆందోళన తగ్గుతుందా - ప్రయత్నించాలనుకుంది. "నా చుట్టూ ఉన్నవారితో నాకున్న సంబంధంలోని అధికారాన్ని గుర్తించినపుడు నాకు సమస్తం తెలిసిన భావన కలిగింది. సర్వ దుఃఖాలకూ మూలం అధికారమేనక్కా - ఇంకొక చిత్రం తెలుసా? ఈ అధికారాన్ని మనం పొందాలి. ఒదులు కోవాలి. నేను ఎవరి అధికారానికీ లొంగను. నా అధికారంతో ఎవరినీ బంధించను. అపుడు నన్ను నేను విముక్తం చేసుకున్న భావన. నాలో ఇక ఒకే ఆనందం. గొప్ప శాంతి. ఎంతో ప్రేమ. అందరి మీదా జాలి. పాపం ఈ అధికార చట్రాలలో పడి ఎలా నలుగుతున్నారో గదా - విముక్తం అయ్యే దారి తెలియక అశాంతులతో, దుఃఖాలతో, ద్వేషాలతో కుళ్లిపోతున్నారు గదా - అందరికీ చెబుదామా ఈ శాంతి రహస్యం అనుకున్నాను. 

కానీ ఎవరికి అర్థమవుతుంది? 
పధ్నాలుగేళ్లు సత్యశోధనలో నే చేసిన గొప్ప తపస్సును నిద్ర అనుకున్న వాళ్లకు నా మాటలు అర్థం అవుతాయా? 
నిద్రపోయానట నేను. నిద్రకూ మెలకువకూ అర్థం తెలుసా వీళ్లకు? ఎన్నడైనా శాంతిగా నిద్రపోయారా? చైతన్యంతో మేలుకున్నారా? నాది నిద్ర అంటారు - పిచ్చి అంటారు నా మాటలు వింటే -'' 
"లేదు ఊర్మిళా నీ మాటలు ఎంతో బాగున్నాయి. నిజంగానే నువ్వు గొప్ప తపస్సు చేశావు.'' 
"నాకు తెలుసక్కా నీకు అర్థమవుతుంది. అందుకే ఇవాళ పెదవి విప్పాను. కానీ అక్కా - నీ జీవితంలో నాకొచ్చినటువంటి పరీక్షా సమయం వస్తే - అప్పుడు ఆ పరీక్ష నిన్ను మామూలుతనంలోకి, మురికిలోకి నెట్టకుండా, ద్వేషంతో, ఆగ్రహంతో నిన్ను నువ్వు దహించుకోకుండా కాపాడుకో. నీ మీద అధికారాన్ని నువ్వే తీసుకో - ఇతరులపై అధికారాన్ని ఒదులుకో. అప్పుడు నీకు నువ్వు చెందుతావు. నీకు నువ్వు దక్కుతావు. మనకు మనం మిగలటమంటే మాటలు కాదక్కా - నా మాట నమ్ము.'' 

ఊర్మిళ మాట్లాడుతుంటే సీత మనసులోకి ఒక నెమ్మదితనం ప్రవేశించింది. ఒక్కరోజులో ఇన్నేళ్ల ఊర్మిళ సంఘర్షణను అర్థం చేసుకోలేను అనుకుంది సీత. రామునితో ఊర్మిళ చెప్పినవన్నీ చెప్పింది. 
"ఈ మార్పు నా తమ్ముని బాధించదు గదా'' అన్నాడు రాముడు. 
"ఊర్మిళను చూస్తేనే బాధలన్నీ పోయేలా ఉన్నాయి'' అంది సీత. 

*** 
లక్ష్మణుడు అరణ్యంలో ఒదిలి వెళ్లాక, నట్టనడి సముద్రంలో మునిగున్నాననిపించినపుడు సీత కళ్లముందు మళ్లీ ఊర్మిళ కదలాడింది. జీవితంలో ఎడబాట్లు, అపనిందలేనా దక్కిందని ప్రశ్నించుకుని అరణ్యరోదనం చేస్తున్న ఆ సమయంలో సీతకు ఊర్మిళ మాటలన్నీ మళ్లా గుర్తొచ్చాయి. ఊర్మిళకు చెప్పకుండా లక్ష్మణుడు అరణ్యవాసానికి వెళ్లాడు. తనకు చెప్పకుండా రాముడు తనను అరణ్యాలలో వదిలేసిరమ్మని లక్ష్మణుడిని నియోగించాడు. 

ఊర్మిళ సత్యాగ్రహమో, తపస్సో ఏదో చేసి తనను తాను కాపాడుకుంది. "అధికారాన్ని తీసుకో. అధికారాన్ని ఒదులుకో. అప్పుడు నీకు నువ్వు చెందుతావు. నీకు నువ్వు దక్కుతావు. మనకు మనం మిగలాలి'' ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా ఊర్మిళ ఈ మాటలే మళ్లీమళ్లీ చెప్పింది. అవి తనకు ఊర్మిళ గురించిన అశాంతిని తగ్గించాయి. మరి ఇప్పుడు తన మాటేమిటి? తను సత్యాగ్రహం ప్రారంభించాలా? ఆగ్రహం తగ్గేదెప్పుడు? సత్యం బోధపడేదెన్నడు? ఎట్లా - 

రాముని మీద ఎనలేని అనురాగం. అయినా ఎప్పటికప్పుడు వియోగం. రాముడి నుంచి తనకు విముక్తి ఎప్పుడు దొరుకుతుంది? ఎలాంటి పరీక్ష ఇది? అగ్ని పరీక్ష ఏపాటిది దీనిముందు - తనకు యుద్ధవిద్యలన్నీ వచ్చినా ఎన్నడూ ఎవరిమీదా యుద్ధం చెయ్యలేదు. కాని ఇప్పుడు తనమీద తనే యుద్ధం చేసుకోవాలి. 
యుద్ధం మొదలైంది. ఎన్నేళ్లు సాగుతుందో. 

*** 
"రామచంద్రుడు అశ్వమేధయాగం చేస్తున్నాడమ్మా. ఆహ్వానం పంపించాడు. నేను వెళతానమ్మా'' చెప్పాడు వాల్మీకి మహర్షి. కాసేపు సీత సమాధానం కోసం చూసి మహర్షి వెళ్లిపోవటం సీతకు తెలియలేదు. ఆమె దేనినీ గమనించే స్థితిలో లేదు. 
అశ్వమేధయాగం రాముడెలా చేస్తాడు? తను పక్కన లేకుండా ఎలా? తన స్థానంలో ఎవరు కూచుంటారు? 
సీత మనసులో జ్వాల రేగింది. 
"ఎవరు కూచుంటేనేం? నీకేం సంబంధం'' 
సీత మనసు చదివేసినట్లు మాట్లాడుతూ నవ్వుతూ వచ్చింది ఊర్మిళ. 
"ఊర్మిళా - నువ్వు'' సీత ఆశ్చర్యానికి మేరలేదు. 
"నేనే వచ్చాను. నువ్విక్కడ ఉన్నావని లక్ష్మణుడు చెప్పాడు. అశ్వమేధ యాగవార్త నీకు చేరుతుందని తెలుసు. నీ మనసులో అది ఎలాంటి భూకంపం లేవదీస్తుందో కూడా ఊహించాను. ఆ సమయంలో నిన్ను నిన్నుగా మిగల్చాలని వచ్చాను.'' 
సీత ఊర్మిళను ఆలింగనం చేసుకుని పక్కన కూచోబెట్టుకుంది. 
చాలాసేపటి నిశ్శబ్దం తర్వాత, ఆ నిశ్శబ్దంలో అనేక మాటలు నడిచాక - 
"యాగం శ్రీరామచంద్రుడే చేస్తున్నాడా?'' అడిగింది సీత. 
"మరెవరు చేస్తారు? చక్రవర్తులే గదా చెయ్యాలి.'' 
"నేను లేకుండా ఎలా -'' 
"ఆ ప్రశ్న నీకెందుకు రావాలి? వస్తే రాముడికి రావాలి. యాగం చేయించే వారికి రావాలి. అనవసరమైన ప్రశ్నలతో అశాంతి పడటం అవివేకం కదా?'' 
సీతకంటే పెద్దదానిలా పలికింది ఊర్మిళ. 
"నీకు తెలుసు. చెప్పు ఊర్మిళా రాముని పక్కన కూర్చునేదెవరు?'' 
"నేను నీకు సమాధానం చెప్పి నీ అగ్నిని తాత్కాలికంగా చల్లార్చటానికో మరింత ప్రజ్వరిల్ల చేయటానికో రాలేదు. అనవసరమైన ప్రశ్నలతో నిన్ను నువ్వు హింసించుకోవద్దని చెప్పటానికే వచ్చాను.'' 
"కానీ నేనిది మింగలేకపోతున్నాను.'' 
"మింగవద్దు. అసలది నీ మనసులో ప్రవేశించనే వద్దు. నువ్వు రాముడి నుంచి విముక్తం కావాలి.'' 
"ఊర్మిళా -'' 
సీత వెక్కి వెక్కి ఏడ్చింది. 
"ఎన్ని పరీక్షలు ఊర్మిళా...'' 
"ప్రతి పరీక్షా నిన్ను రాముడి నుంచి విముక్తం చెయ్యటానికే. నిన్ను నీకు దక్కించటానికే. యుద్ధం చెయ్యి. తపస్సు చెయ్యి. లోపలికి చూడు. నీవనే యధార్థం కనపడేదాకా చూడు.'' 
"చాలా కష్టంగా ఉందమ్మా'' సీత గొంతులోంచి మాట కష్టంగా వచ్చింది. 
"చాలా హాయిగా కూడా ఉంటుందక్కా. ప్రయత్నించు మరి నే వెళ్తాను'' ఊర్మిళ లేచింది. 
"అప్పుడేనా? నా పిల్లల గురించి వినవా? వారిని చూడవా?'' 
"వాళ్లు నా దగ్గరకు వస్తే, నన్ను చూడాలని వస్తే తప్పకుండా చూస్తాను.'' 

*** 
ఊర్మిళ ఎంత హఠాత్తుగా వచ్చిందో అంత హఠాత్తుగా వెళ్లిపోయింది. సీత మనసులో జ్వాల మాత్రం అంత హఠాత్తుగా ఆరలేదు. దాని నాపటానికి సీత కఠోరశ్రమ చేసింది. 
ఎక్కడెక్కడో మూలమూలల దాగిన నిప్పురవ్వలు, ఎప్పటి నుంచో నివురుగప్పిన నిప్పులు కణకణ మండసాగాయి. 
ఆ మంటలో సుఖాన్ని అనుభవించటానికి అలవాటుపడుతున్న సమయంలో సీతకు వాటిని ఆర్పాలని తెలిసింది. 
రాముడిని ప్రేమించటం సుఖమా, రామునిపై ఆగ్రహించటం సుఖమా అనే ద్వైదీభావంలో మనసు కొట్టుమిట్టాడటం సీతకు తెలిసీ తెలియని స్థితిలో జరిగింది. 
ఆగ్రహాన్ని రగిలించుకోవటంలో, జ్వాలను పెద్దది చేయటంలో బాధగా కనపడే సుఖాన్ని పట్టుకోవటం తేలిక కాదు. 
రాముడిపై ప్రేమ యిచ్చే సుఖంలోని బాధను తట్టుకోవటమూ తేలిక కాదు. 
ఈ రెండిటినీ దాటి రాముడినుంచి విముక్తమయ్యే యత్నం ఎంతో యాతనాభరితమైంది సీతకు. 
ఐనా సీత ఆ తపస్సు చేసింది. 
కల్లోల కడలి శాంతి సాగరమయ్యే దాకా మథనం సాగించింది. క్రమంగా ఆ శాంతి సీతను ఆసాంతం ఆవరించింది. 
వాల్మీకి మహర్షి అశ్వమేధయాగం చూసి వచ్చేనాటికి సీత మనసు పూర్తిగా తేటపడింది. 
రాముని పక్కన యాగం కోసం కూర్చున్నదెవరు? అని అడగాలని వాల్మీకిని చూసిన తర్వాత కూడా సీతకు తోచలేదు. 
కొన్ని రోజుల తర్వాత వాల్మీకి సీతకో విషయం చెప్పేందుకు వచ్చాడు. 
"రాముడు లవకుశులను స్వీకరించాడు. సీతనూ స్వీకరిస్తాడు. ఐతే సీత వచ్చి నిండు సభలో తను నిర్దోషినని ప్రకటించుకోవాలి.'' ఈ మాటలు సీత ప్రశాంతంగానే విన్నది. చిరునవ్వుతోనే విన్నది. 
"అంత అవసరం ఉందంటారా నాకు'' అని మాత్రం అన్నది. 
శాంత స్మిత వదనంతో పిల్లలనుంచి కూడా విముక్తురాలై తానెక్కడ నుంచి వచ్చిందో అక్కడికి ప్రయాణమైంది. 
ఓల్గా - 98490 38926
Andhra Jyothi News Paper Dated : 7/3/2010

No comments:

Post a Comment