Wednesday, February 1, 2012

అంబేద్కర్ అర్థమయ్యారా? - కంచ ఐలయ్య

డాక్టర్ అంబేద్కర్ విగ్రహాలను తూర్పు గోదావరి జిల్లాలో కూలగొట్టాక రాష్ట్రం అట్టుడుకుతోంది. గాంధీ వర్ధంతినాడు, అంబేద్కర్ కోసం దళిత బహుజనులు, రాజకీయ పక్షాలు రాష్ట్ర బంద్‌కు పిలుపునియ్యాల్సి వచ్చింది. అంబేద్కర్‌ను కొన్ని కులాల వ్యక్తులు అందరి లాగే ఒక నాయకునిగా పరిగణిస్తున్నారు. గత నెల 28న గద్దర్, ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థి నాయకులతో పాటు ముఖ్యమంత్రిని కలిశారు. అనంతరం గద్దర్ ఇలా వ్యాఖ్యానించారు: 'అంబేద్కర్ సంపూర్ణ స్వరూపం ముఖ్యమంత్రి కిరణ్‌కు అర్థమైనట్లు కనిపించలేదు'. గాంధీలాగనో, నెహ్రూలాగనో అంబేద్కర్ ఒక నాయకుడు మాత్రమే కాదు.

గౌతమ బుద్ధుని తరువాత ఈ దేశంలో పుట్టిన ఆధునిక బుద్ధుడు డాక్టర్ అంబేద్కర్. ఆయన వలస పాలన నుంచి దేశవిముక్తికి మాత్రమే కృషి చేసిన నాయకుడు కాదు. రాజ్యాంగాన్ని రాసిన కానిస్టిట్యూషనల్ ఎక్స్‌పర్ట్ మాత్రమే కాదు. ఈ దేశంలోని కుల- మత సంబంధాలను సంపూర్ణంగా మార్చడానికి నూతన బాటలు వేసిన ప్రవక్త కూడా.

ప్రపంచంలోని ప్రవక్తలంతా -బుద్ధుడు, జీసస్, మహమ్మద్- తమ జీవిత కాలాల్లోని అట్టడుగు ప్రజల విముక్తి కోసం సంస్థాగత నిర్మాణాలను చేశారు. అవి మతాలుగా మారాయి. ప్రపంచ గుర్తింపు పొందిన కారల్ మార్క్స్ కూడా అన్ని రకాల అణచివేతకు గురౌతున్న శ్రామిక వర్గాన్ని విముక్తిచేసే తాత్వికతను నిర్మించాడు. అందుకే మార్క్స్ అనుయాయులు ఆయన ఆశయాలను సాధించడానికి ప్రా ణాలు లెక్కచెయ్యక పోరాడుతారు.

మన దేశంలో బుద్ధుని తరువాత అంబేద్కర్‌కు ఒక్కడికి మాత్రమే అన్ని కులాల్లోని, అణగారిన ప్రజల మానవతావాదుల ఫాలోయింగ్ ఉంది. అది దిన దినానికి పెరుగుతోంది. ముస్లిం, క్రైస్తవ మైనారిటీలు సైతం తమ తమ ప్రవక్తలతో పాటు అంబేద్కర్‌ను తమ భుజాల మీద మోసుకు తిరిగే రోజు వచ్చింది. ఈ దేశంలోని అన్ని మతాల్లోని వెనుకబడిన ప్రజలు అంబేద్కర్ రూపొందించిన రిజర్వేషన్ సూత్రాల ఫలితాలను అనుభవించే రోజులొచ్చాయి.

గాంధీ వ్యతిరేకించి నిరాహారదీక్షకు దిగినా అంబేద్కర్ ఆయన్ని ఒప్పించి రిజర్వేషన్ల బీజాలు నాటి ఈ దేశ మేధో విలువల్ని సంపూర్ణంగా మార్చారు. రష్యాలో, చైనాలో సోషలిస్టు విలువలు మార్చలేని లాంగ్ జంప్ మార్పును ఆయన 'ఆధునిక విద్య, దాని అనుసంధానంగా రిజర్వేషన్లు' సిద్ధాంతంతో అతి కింది వ్యక్తుల్ని అతి పైకి తీసుకుపోయే వ్యవస్థను ఈ దేశానికందించారు. దానికి చట్టబద్ధ భద్రత కల్పించారు.

ఈ దేశం నుంచి తరిమివేయబడ్డ బౌద్ధాన్ని, నవయాన బౌద్ధం రూపంలో అంబేద్కర్ తిరిగి స్థాపించారు. అంతకు ముందు ఆయన హిందూయిజంలో కూడా అంటరానివారిని హిందూ దేవతల ఆత్మీయులుగా రూపొందించాలని చూశారు. బౌద్ధ ధర్మంలో తాను నేర్చుకున్న 'సంఘం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్చామి, ధమ్మం శరణం గచ్ఛామి' అనే సర్వ సమాన సూత్ర త్రయాన్ని హిందూయిజంలో ప్రవేశింప చేయాలని చూశారు.

హిందూ ఆధ్యాత్మిక రంగాన్ని మార్చుకుంటూ, రాజకీయ, సామాజిక, ఆర్థికరంగాలను మార్చాలని చూశారు. వేదాలు, ఉపనిషత్‌లను, బ్రాహ్మణాలను, పురాణాలను సంస్కృత, ఆంగ్ల భాషల్లో సమగ్రంగా అధ్యయనం చేశారు. వాటి తాత్వికతల్లో ఎక్కడా బానిస విముక్తిగాని, చండాలుడిని పూజారిని చెయ్యగల వెసులుబాటు గాని ఆయనకు కనిపించలేదు.

వేదాలూ, ఉపనిషత్తులూ, వీటికీ బ్రాహ్మణాలకు మధ్య ఉన్న సంబంధాల్ని, తేడాలను తిప్పి తిప్పి చూశారు అంబేద్కర్. అందులో ఎక్కడా ఆయనకు అతి కింద మనుషుల్ని పైకి, అతి పైన ఉన్న మానవుల్ని కిందికి తీసుకురాగలిగే తాత్విక విలువలు కన్పించలేదు. అంటే బౌద్ధంలో అడుగు అడుగునా కనిపించిన సౌభ్రాతృత్వం హిందూ గ్రంథాల్లోగాని, నిజ జీవితంలో కాని కనిపించలేదు. ఆనాడు ఆయనతో సమాన స్థాయిలో ఎంగేజ్ చేయగలిగిన ప్రజాస్వామిక విలువలు కూడా 'బ్రాహ్మణ పండిత' వర్గంలో లేవు. అందుకే ఆయన ఆ రిఫామ్ ఉద్యమాన్ని వదిలేసి ముందు రాజకీయ రంగంపై కేంద్రీకరించి, రాజ్యాంగ రచనతో దాన్ని ఒక కొలిక్కి తెచ్చారు.

ఆ తరువాత హిందూయిజాన్ని వదిలేసి భార్యతో పాటు బౌద్ధం తీసుకొని నవయాన బుద్ధిస్టు వ్యవస్థ రూపకల్పన చేశారు. అందుకే ఇండియాలో ప్రతి బుద్ధ విహార్‌లో బుద్ధుని తరువాత బుద్ధుడిగా అంబేద్కర్ కన్పిస్తారు. అంబేద్కర్ విగ్రహాలను కూలగొట్టడమంటే అనునిత్యం ఇక్కడ ఎదుగుతున్న ఒక మతం మీద దాడి చెయ్యడమని రాజకీయ నాయకులకు అసలే తెలువనట్లుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిలో నాకు ఆ డీప్ అవగాహన కనిపించలేదు. అది ఆయన తప్పుకాదు. ఈ దేశంలోని ఎంతో మంది రాజకీయ నాయకులు (దళిత బహుజనులతో సహా) ఆయన జీవిత చరిత్ర చదివిన దాఖలాలు లేవు.

ఒక వేళ కాపు నాయకులు కొంత మంది తమకు హర్షకుమార్‌తో ఉన్న వైరుధ్యంతో ఈ పని చేయించి ఉంటే వాళ్ళు తాము కూర్చున్న కొమ్మను తామే నరుక్కుంటున్నట్టే. అంబేద్కర్ విగ్రహాలపై దాడిచేసే కులానికి రిజర్వేషన్లు అడిగే హక్కు ఎట్లా ఉంటుంది? కాపులు బిసిల్లోకి రావాలన్నా తాము అంబేద్కర్ సిద్ధాంతం ఆధారంగా తమ వెనుకబాటుతనాన్ని నిరూపించుకోవాలి కదా! ఈ రోజు ఏ రిజర్వేషన్ల ద్వారా తాము తలెత్తుకొని తిరుగుతున్న బిసి కులాలు ఉన్నాయో అవి అంబేద్కర్‌కు అనునిత్యం రుణపడి ఉంటాయి కదా!

ఆంధ్రప్రదేశ్ ఇప్పుడొక కొత్త కోణం నుంచి అంబేద్కర్‌ను అధ్యయనం చేస్తున్న రాష్ట్రం కూడా. ఆయన అనుచర బృందం దిన దినానికి పెరుగుతుంది. రాష్ట్రమంతటా బంద్‌కు పిలుపు ఇచ్చిన ఉస్మానియా విద్యార్థులు అంబేద్కరిజాన్ని ఆచరించే నూతన విప్లవ శక్తులుగా మారారు. బిసిల్లో అంబేద్కర్‌ను అనునిత్యం అధ్యయనం చేపే వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు నిరంతర తాత్విక సంఘర్షణలో ఉన్న రోజులివి. ఆంధ్ర యూనివర్సిటీలో అంతకంటే బలమైన పునాదులుండాల్సి ఉండింది. కాని దురదృష్ట వశాత్తు అక్కడ ఎందుకో తాత్విక సంఘర్షణ జరగటం లేదు. కాని రాష్ట్ర మంతా కూడా భిన్న స్థాయిల్లో అంబేద్కర్‌ను ఒక ప్రవక్తగా పరిశోధించే శక్తులు పెరుగుతున్నాయి. ఇది ఈ రాష్ట్ర భవిష్యత్తుకు ఎంతో మేలు.

అటువంటి తరుణంలో అంబేద్కర్ విగ్రహాలపై తాగో, సరదా కోసమో అమాయకులు దాడి చేశారంటే ఎవరూ నమ్మరు. అంబేద్కర్‌పై చెయ్యి చేస్తే ఏ వయస్సులో ఉన్న వ్యక్తికైనా ఎంత కోపం వస్తుందో అమలాపురంలో అరెస్ట్ అయిన బొజ్జా తారకాన్ని చూస్తే అర్థమౌతుంది. ఆయన సాధారణంగా ఎంతో శాంతిమంతుడు. చినిగిన చొక్కాతో ఆయన ఎందుకంత యుద్ధం పోలీసులతో చేస్తున్నాడు? అదే అంబేద్కర్ మీద ప్రతి మానవతావాదికి ఉండే అభిమానం. ఆ అభిమానానికి ఒక తాత్విక పునాది ఉంది.

ఆ పునాదిని ఆధునిక భారతదేశంలో అంబేద్కర్ నాటినంత బలంగా మరే నాయకుడు నాటలేదు. ప్రపంచ చరిత్రపై అవగాహన ఉన్న ఎవరూ అంబేద్కర్‌ను ఒక నాయకునిగా మాత్రమే చూడరు. అంబేద్కర్ ఈనాడొక మత శక్తి. అందుకే ఇంత మందికి కోపం. ఇన్ని కులాలకు కోపం, తపన. ఈ తపన కాపులకో, కమ్మలకో, రెడ్లకో, వెలమలకో, బ్రాహ్మణులకో ఉండకపోతే అది ఆయన తప్పుకాదు, వారి తప్పు. ఈ తప్పు మరోసారి జరక్కుండా చూసుకుంటే, ఈ రాష్ట్రం, ఈ దేశం ఎంతో బాగుపడుతుంది.

- కంచ ఐలయ్య
వ్యాసకర్త సామాజిక శాస్త్రవేత్త, సుప్రసిద్ధ రచయిత 
Andhra Jyothi News Paper Dated 2/2/2012 

No comments:

Post a Comment