Saturday, February 25, 2012

పోరు బాటలో ముందున్న మహిళ -సుజాత సూరేపల్లి


సహజ వనరులు, ప్రాచీన చరిత్ర, సంస్కృతి కలగలసిన తెలంగాణ నేల నేడు స్వార్థ పూరిత శక్తులతో నిలువు దోపిడీకి గురవుతున్నది. నీళ్లు, నిధులు, ఉద్యోగా లు అనేవి నేటి జీవితానికి పోరాటానికి పొంతనలేని, చరి త్ర తవ్వకాలలో బయటపడే శిలాజాల్లాగా చాల పాత మాటల్లాగా కనిపిస్తున్నాయి. ఇపుడు దృష్టి అంతా ఖనిజ సంపద మీద, విలువైన భూముల మీద, భూమిలో ఉన్న నిక్షేపాల మీద. యురేనియం నిక్షేపాలు ఉన్నది నల్లగొండ జిల్లాలో. బయ్యారం గనులు ఖమ్మం జిల్లాలో ఉన్నాయి. వరంగల్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలు ఓపెన్ కాస్ట్ మైనింగ్‌తో విలవిలలాడుతున్నాయి.
దీనికి తోడు ఇపుడు ఇసుక, క్వారీ, గ్రానైట్ తవ్వకాలు ఊపందుకున్నాయి. అపారంగా అంతరించి పోతున్న చారిత్రక అవశేషాలు ఒకవైపు, వన్యప్రాణి, పర్యావరణ విధ్వంసం మరోవైపు. బడుగు బలహీనవర్గాల ఆకలి కేకలు, పోరాటాలు, ఉద్యమాలు పత్రికలకు పెద్దగా రుచించని విషయాలు అయ్యాయి. భూమిపై ఆధారపడే బతుకులు, భూమితో ఉన్న అస్తిత్వాలు. ఒకవైపు చట్టసభల్లో వాటా కోసం కొట్లాడే మహిళలు. మరోవైపు స్త్రీలపై రోజురోజుకు పెరిగిపోతున్న హింసలపై రోజూ మాట్లాడే మేధావులు, వేదికలు ఉన్నప్పటికీ తగ్గని హింస, ఆగని దోపిడీ.

ఈ మధ్యకాలంలో ఉవ్వెత్తున ఎగిసిపడిన పోలేపల్లి పోరాటం స్త్రీల చేతుల మీదుగానే నడిచింది. కాకినాడ సెజ్, గంగవరం పోర్ట్, అరకు బాక్సైట్ పోరాటాలు అన్నీ స్త్రీలు ముందుండి నడిపించినవే. జైళ్ళు, పోలీసులు, నిరసనలు, వేధింపులు రోజూ ఉండేవే వారికి. సెజ్ సెగలు మెల్లగా రాజుకుంటూనే ఉన్నాయి. భూములు కోల్పోయి న వారు దిక్కు తోచక సొంత భూముల్లో పనివాళ్ళుగా పనిచేసే దౌర్భాగ్యం పెరుగుతున్నది. కొత్తగా ఎరువుల వేటలో మళ్ళీ ఆత్మహత్యలు జరుగుతూనే ఉన్నాయి. ఆడవాళ్ళ జుట్టు పట్టుకుని కొట్టుకుంటూ, ఈడ్చుకెళ్తూనే ఉన్నారు. అయినా వారు కొట్లాడుతూనే ఉన్నారు.

పనికోసం, ప్రకృతి కోసం, హక్కుల కోసం, కుటుంబాల కోసం ఒక తల్లి ఒక చెల్లి పడే ఆవేదన ఉద్యమ రూపంలో వ్యక్త పరుస్తూనే ఉన్నారు. ఎవరు ఈ స్త్రీలు? అజ్ఞాతంలో ఉంటూ ప్రజాస్వామ్యం, సమాన హక్కులు, సాధికారత అని వల్లించే ప్రభుత్వాల చేతిలో నిత్యం నరకం చవిచూసే అమాయక గ్రామీణ స్త్రీలు. దళిత, బహుజన, ఆదివాసీ స్త్రీలు- అందులో అనేక మంది నిరక్షరాస్యులు. కుల, పితృస్వామిక చట్రాల్లో బందీగా ఉంటూ బతుకు బండిని మోస్తున్న వారు. భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం వెనుదిరగకుండా నడుం బిగించి ముందు కు సాగుతున్నవారు. వీరి చరిత్రలు ఎక్కడా లిఖించబడ వు. వీరు చేసే వీరోచిత పోరాటాలకు మీడియాలో చోటుండదు.

ఉద్యమాలను నడిపిస్తూ, భ్రష్టుపట్టిన ఈ వ్యవస్థతో నిత్యం పోరాడే మహిళల గురించి ఎంతైనా చెప్పవచ్చు. మచ్చుకు కరీంనగర్ జిల్లా మానకొండూరు, అన్నారం గ్రామాల మహిళలు క్వారీలకు వ్యతిరేకంగా వీరోచితంగా కొనసాగిస్తున్న ఉద్యమాన్ని ఇక్కడ ప్రస్తావిస్తాను.
కరీంనగర్ జిల్లా కొండలు, గుట్టలతో అందంగా, హుందాగా, అనేక చారిత్రక విశేషాలతో దర్జాగా, దర్పం గా, ధైర్యంగా కనబడుతుంది. లెక్కలేనన్ని ఖనిజ నిక్షేపాలను కడుపులో దాచుకున్న ప్రదేశమిది. మంచితనం, అమాయకత్వం, విప్లవ భావాలు కలగలసిన బోళాతనం ఎవరిని చూసినా తొణకిసలాడుతుంది. ఇక రాజకీయ స్వార్థానికి మినహాయింపు లేదు. సున్నపురాయి, గ్రానై ట్, ఇనుము, ఇసుక, కంకర పుష్కలంగా లభించే జిల్లా ఇది. అయితే పాతికేళ్ళలోనే సగానికి పైగా కొండ, గుట్టలను కోల్పోయింది. కరీంనగర్ నుంచి వరంగల్ దారిలో ఎటు చూసినా వెక్కిరించే తవ్వకాలు. గ్రానై ట్ చుట్టూ బడాబాబుల పంజా.

భూగర్భ గనుల శాఖ ఇబ్బడి ముబ్బడిగా అడిగే వారికల్లా అనుమతులు ఇస్తూ పోతుంది. ఈ మధ్య కాలంలో గుట్టలతో ముడిపడి ఉన్న జీవితాల గురించి, వన్యప్రాణుల గురించి, జీవనోపాదుల గురించి గ్రామస్తులు తెలుసుకుంటున్నారు. కొంత మంది హక్కుల కార్యకర్తలు గ్రామగ్రామాన తిరిగి గుట్టలు పోవడం వల్ల జరిగే నష్టాలు వివరిస్తున్నారు. ఈ ఏడాదిలోనే దాదాపుగా ఐదు వందలకు పైగా అనుమతులు ఇచ్చారు. ఈ తవ్వకాలలో క్వారీ మిషన్లు కొనేవాళ్ళు, దాన్ని అమ్ముకునే వాళ్ళు, అధికలాభాలు గడించే వారిలో అన్ని రాజకీయ పార్టీలకు చెందిన వారు ఉన్నా రు. ఈ క్రమంలోనే బద్దిపల్లి, బొమ్మలమ్మ గుట్ట, మీర్జాపూర్, పోరండ్ల గ్రామాలలో ప్రజలందరూ ఏకమై క్వారీ, గ్రానైట్ తవ్వకాలు నిలిపివేయాలని రకరకాలుగా నిరసనను ప్రదర్శిస్తూ ఉన్నారు. అనుమతులు పొందిన గుట్ట ల చుట్టూ- అనేక చెరువులు, కుంటలు ఉంటాయి. పండ్లు,తాటి చెట్లు మొదలైనవి ఉంటాయి. ఆ తాటి కల్లు ని అమ్ముకుని బతికే బడుగు జీవులు ఉంటారు. వీరు ప్రభుత్వం అనుసరించే పునరావాస చట్టాలు ఏవి వర్తించని వాళ్ళు.

కరీంనగర్ మీర్జాపూర్ గుట్టల చుట్టు పక్కల ఉన్న తండాలలో ప్రజలు పండ్లు, కట్టెలు తెచ్చుకుని అమ్మి కుటుంబాలను నడిపిస్తుంటారు. బొమ్మలమ్మగుట్టపైన పాతకాలం నాటి చిహ్నాలున్నాయి. చాలా గుట్టలపై కోట లు, బురుజులు, విలువైన నిగూఢ విశేషాలున్నాయి. దౌర్భాగ్యం ఏమిటంటే అభివృద్ధి చెందిన దేశాలు చరిత్ర ను కాపాడుకుని భద్రపరిచే ప్రయత్నాలు చేస్తూంటే, మన భ్రష్టు పట్టిన రాజకీయాలు చరిత్రను డబ్బుసంచుల కోసం భూ స్థాపితం చేస్తున్నాయి. వాటితో పాటు ప్రజల జీవన విధానాన్ని ధ్వంసం చేస్తున్నాయి. ఇక్కడ ప్రజలు అంటే స్త్రీలు , పురుషులు, కొన్నిసార్లు పిల్లలు.. భూమిలేని నిరుపేదలందరికి ఈ గుట్టలే బతుకు తెరువు. చిన్న చిన్న నీటి ఊటలే, చెలిమలే జీవనాధారాలు. ఇప్పటికే దుబాయి బాట పట్టిన వారిని వెనక్కి తెప్పించుకునే శక్తి లేక అప్పుల ఊబిలో కూరుకుపోయి, ఒంటరిగా కుటుంబాలను నడిపించలేక, బీడికట్టలలో బందీలైన జీవితాల ను విడిపించుకోలేక, చేనేత మగ్గాలలో దారాలు అయి పోగులైన బతుకులను బాగుచేసుకోలేక, ఓపెన్‌కాస్ట్ గనుల్లో మసిబారి ఇక్కడి గ్రామీణ స్త్రీలు చిన్నా చితక పనులు చేస్తూ జీవచ్ఛవాల్ల కాలం వెళ్లదీస్తున్నారు.

పేదరికం వల్ల స్త్రీలపై పడే భారం ఎంత భయంకరం గా ఉంటుందో చెప్పాలంటే కొన్ని వందల పేజీల వ్యాసం అవుతుందేమో! ఇన్ని బాధల్లోంచి పోరు బాట పట్టిన స్త్రీల నుంచి నేర్చుకునేది ఎంతో విలువైంది. వారితో కలిసి పోరాట బాట పట్టినప్పుడే తెలుస్తుంది. ఆ అదృష్టం కొంతైనా నాకు దక్కింది. అభివృద్ధి నమూనాలు పేదల పాలిట శాపాలు ఎలాగయ్యాయో ప్రత్యక్షంగా చూస్తుం టే చెంపపై చాచి చెళ్లున దెబ్బపడ్డట్టు, జీవితాలకు సంబంధంలేని నా చదువు వెక్కిరిస్తున్నట్టు ఉంది. గత మూడు నెలలుగా అన్నారం గ్రామ ప్రజలు, ముఖ్యంగా స్త్రీలు అధిక సంఖ్యలో పాల్గొని పోరాటం చేస్తున్నారు. నెల కిందట స్వయం సహకార బృందాలతో మొదటిసారి మాట్లాడి, గుట్టల ద్వారా జరిగే నష్టాలు చెప్పినప్పుడు వారు వింతగా చూశారు. అంతా అయిపోయాక ఇపుడు ఎందుకు వస్తున్నారు అని నిలదీశారు.

మగవారు క్వారీ యజమానుల దగ్గర డబ్బు తీసుకుని తాగి తందానాలు ఆడుతుంటే మేమే ఎందుకు పోరాటం చేయాలని ప్రశ్నించారు. కానీ ఎక్కడో వారికి ఉన్న సందేహాలను నివృత్తి చేసుకున్నారు. గ్రూపులలో నిర్ణయం తీసుకొని ఉద్యమ బాట పట్టారు. గత నెల 16వ తేదీన గ్రామంలోని స్త్రీలు దాదాపు రెండు వేల మంది కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించారు. ఆ నియోజకవర్గం ఎమ్మెల్యేను ఘెరావు చేశారు. చివరకు తమ గోడు ఎవరు వినట్లేదని గుట్టపై ఉన్న క్వారీ మిషన్లను, వాటికి సంబంధించిన వస్తువులను ధ్వంసం చేశారు. అక్కడి మండలాధికారి వారిని కులం పేరుతో దుర్భాషలాడితే ఆమెను గదిలో వేసి బంధించి క్వారీ అనుమతిని రద్దు చేయాలని కోరారు. దీనికి ప్రతీకారంగా గ్రామప్రజలపై పోలీసులు కేసులు పెట్టారు. అయినా ధైర్యంగా గ్రామ ప్రజలంతా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి అక్కడ మండలాధికారిపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు పెట్టారు. అయితే పోలీసులు ఈ కేసును తీసుకోవడానికి నిరాకరించారు. చివరికి ఒక రాజకీయ పార్టీ జోక్యంతో కేసు తీసుకున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. పోలీసులు, క్వారీ యజమానుల సర్పంచుల మనుషులు నిత్యం గ్రామ మహిళలను వేధిస్తూనే ఉన్నారు.

ఇంతకీ ఈ మహిళలు ఎందుకు పోరాటం చేస్తున్నా రు? మూడు గుట్టలు, ముప్పై ఆరు చెరువులు ఉన్న అందమైన ఊరు అన్నారం. దాదాపు పదివేల మంది జనాభా. పంటపొలాలకు నీరు పూర్తిగా రాదు కానీ, గుట్టల బ్లాస్టింగ్ ద్వారా శ్వాసకోశ రోగాలు వస్తున్నట్టు చుట్టు పక్కల గ్రామస్తులను చూసి తెలుసుకున్నారు. దీని వల్ల ఎన్నో వన్య ప్రాణులను కూడా కోల్పోయే ప్రమాదముంది. ఈ పోరాటంలో ఆటుపోట్లు ఉన్నాయని తెలుసు. తమది ఒంటరి పోరాటం అని తెలుసు. అయి నా ముందుకుపోతున్నారు. ఇపుడు కరీంనగర్ మహిళల కు పోరాటం తప్ప మరో మార్గం లేదు. ఎక్కడైనా సహజ వనరులపై ఆధారపడిన జీవితాలు విచ్ఛిన్నమవుతున్నప్పుడు అక్కడి స్త్రీలు పోరాట బాట పట్టక తప్పలేదు. ఇది కేవలం వారి బతుకు పోరాటంగానే చూస్తే చదువుకున్న వాళ్లుగా మనం తప్పు చేస్తున్నట్టే. వారి పోరాటాలకు దూరంగా ఉంటే మనం మాట్లాడే హక్కులకు అర్థం లేనట్టే. ఇప్పుడు జరుగుతున్నా దోపిడిలో భాగం పంచుకున్నట్టే.
-సుజాత సూరేపల్లి
Andhra Jyothi News Paper Dated : 3/10/2010

No comments:

Post a Comment