అంతర్జాతీయ స్థాయిలో ప్రసిద్ధిగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రముఖపాత్ర వహించిన కరీంనగర్‌కు రాష్ట్ర సి.పి.ఐ. నాయకులు, కార్యకర్తలు తరలనున్నారు. సి.పి.ఐ. 23వ మహాసభ తిరుపతిలో జరిగితే 24వ మహాసభ కరీంనగర్‌లో ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు జరగబోతున్నది. ఉత్తర తెలంగాణలో ప్రథమంగా జరిగే సిపిఐ మహాసభ ప్రాముఖ్యత సంతరించుకుంటుంది. 1948 సెప్టెంబర్ 11వ తేదీన నిజాం నిరంకుశ పాలనను అంతం చేయడానికి సాయుధ రైతాంగ తిరుగుబాటుకు పిలుపునిచ్చిన త్రిమూర్తులు రావి నారాయణరెడ్డి, మగ్దుం మొహీద్దీన్, బద్దం ఎల్లారెడ్డిగార్లలో బద్దం ఎల్లారెడ్డి కరీంనగర్ జిల్లా వాసి అని చెప్పుకోవడానికి కరీంనగర్ గర్వపడుతున్నది.
ఒక వైపు నల్ల బంగారం (సింగరేణి సంస్థ) కార్మికులు మరోవైపు వేములవాడ పుణ్యక్షేత్రం, లోయర్ మానేరులో అనుకుని వున్న కరీంనగర్ రాష్ట్ర మహాసభలకు ముస్తాబవుతున్నది. జిల్లా అంతటా కమ్యూనిస్టు శ్రేణులతోపాటు అభిమానులు ఉత్సాహంతో స్వాగతిస్తున్నారు. ఈ నాలుగేండ్ల కాలంలో రాష్ట్ర రాజకీయాలలో సిపిఐ తమ వంతు గుర్తింపు పాత్ర వహించిందని సగర్వంగా చెప్పుకోగలం.
తిరుపతి మహాసభనాటికి వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా వెలిగిపోతున్న పరిస్థితి. అదే సందర్భంలో వైఎస్ఆర్ పాలన అవినీతి పునాదులు వేస్తున్నదని పసిగట్టాం. కేంద్రంలో యుపిఎ ప్రభుత్వానికి బయటనుంచి మద్దతిచ్చి, బిజెపిని అధికారంలోనికి రానీయకుండా నివారించగలిగాం. ముచ్చటగా మూడు సంవత్సరాలలోనే కాంగ్రెస్ అసలు స్వరూపం ప్రదర్శించ ప్రారంభించి అణు ఒప్పందంతో పరాకాష్టకు చేరుకుంది. విధానాలలో రాజీపడలేకనే కేంద్రంలో వామపక్షాలు యు.పి.ఎ. ప్రభుత్వానికి దూరమయ్యాయి. క్రమంగా వ్యతిరేక రాజకీయ పోరాటానికి ప్రత్యక్షంగా దిగింది.
రాష్ట్రంలో కూడా వైఎస్ఆర్ పాలనలో 'చిత్తం శివుడిపైన-చూపు ప్రసాదం'పైన అన్నట్లు జలయజ్ఞం వికృత రూపం దాల్చడం మొదలుపెట్టింది. రాష్ట్రాభివృద్ధికి నీటి ప్రాజెక్టులు అవసరమని సిపిఐ ఆది నుంచి వివిధ పద్ధతుల్లో ఆందోళనలు నిర్వహిస్తూనే వుంది. అటు కృష్ణా-యిటు గోదావరి నదీ జలాలు సక్రమంగా వినియోగించడం ద్వారా రాష్ట్రం సస్యశ్యామలమవుతుందని త్రికరణ శుద్ధిగా నమ్మాం. మంచిదని మనం మద్దతిస్తే వైఎస్ ఆర్ క్రమంగా జలయజ్ఞంలో అవినీతి ప్రాజెక్టులకు ప్రథమ ప్రాధాన్యత ఇచ్చి నీటి ప్రాజెక్టులకు ద్వితీయ ప్రాధాన్యం ఇవ్వడం ప్రారంభించారు.
వామపక్షాల ఒత్తిడితో భూ పంపిణీపై కేంద్రీకరించినట్లు నటించి కోనేరు రంగారావు కమిటీ వేసి మసిపూసి మారేడుకాయ చేసి ఆచరణలో పేదలు, రైతుల నుంచి భూమి లాగేసుకొని పారిశ్రామిక అభివృద్ధి పేరున కొల్లగొట్టారు. భూగర్భ సంపదయిన ఖనిజ గనులను ప్రజలకు ప్రభుత్వానికి దక్కనీయకుండా, ఆ గనులను మాఫియా గ్యాంగ్‌కు అప్పగించారు. ఓబుళాపురం ఉదంతాన్ని ఆనాడే ప్రస్తావించి ఓబుళాపురం నుంచి కృష్ణ పట్నం వరకు ఆందోళన నిర్వహించాం. బయ్యారం, ఎంతాడ, సీతంపేట, తాటిచర్ల తదితర గ్రానైట్, మైన్స్ మాఫియాకు వ్యతిరేకంగా పోరాటం చేశాం. ఎంఆర్ ప్రాపర్టీస్‌పై మొదటినుంచి ప్రత్యక్ష ఆందోళనలో వున్నాం.
రాష్ట్రాన్ని ఒక ప్రయోగశాలగా కేంద్రం ఎంపిక చేస్తున్నదా? కేంద్రంలో సెజ్ (ప్రత్యేక ఆర్థిక మండళ్ళు) పేరుతో అనూహ్యంగా భూ దోపిడీకి బరి తెగించిందా? 27 ఎకరాల వాన్‌పిక్, కాకినాడ, విశాఖ, శ్రీకాకుళం, సోంపేట, విజయనగరం, కృష్ణపట్నం తదితర ప్రాంతాలలో వ్యవసాయానికి వినియోగం అయ్యే భూమిని ప్రజల నుంచి బలవంతంగా దూరం చేయడానికి తెగించారు. సోంపేట నుంచి కృష్ణ పట్నం వరకు బొగ్గు పై ఆధారపడే విద్యుత్ ప్రాజెక్టులు మర్చంట్ పవర్ పాలసీతో ప్రారంభం కావటం మొదలైతే భయ భ్రాంతులయిన ప్రజలకు సిపిఐ అండగా ఉన్నది.
మైక్రో ఫైనాన్స్, మద్యం, ఇసుక లాంటి మాఫియాలకు వ్యతిరేకంగా ఆందోళన చేశాం. రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై ఎప్పటికప్పుడు ఆందోళనలో ఉన్నాం. పంట విరామం తీవ్ర సమస్యగా పరిగణించాం. కాలుష్యంపై స్పందించాం. విద్యార్థుల ఫీజుల రీయింబర్స్‌మెంట్, విద్యుత్ ఛార్జీల పెంపుదల, వ్యాట్‌లకు ప్రతిఘటన, అసంఘటిత కార్మికులకు అండగా ఉన్నాం.
యానాంలో సిరామిక్ ప్యాక్టరీలో ఒక కార్మిక నేత పోలీసు లాఠీల చిత్రహింసలకు బలైతే, కార్మికుల ఆవేశానికి యాజమాన్యం ప్రతినిధి హత్యకు గురయ్యారు. ఇది అత్యంత విషాదకర సంఘటనే. అటుకార్మిక లోకానికి, ఇటు పారిశ్రామిక రంగాలకు నష్టమయిందే. అయితే కార్మికుల చట్టబద్ధ సంఘాలను కూడా పెట్టుకోనీయండా అప్రజాస్వామికంగా వ్యవహరించటం, లేబరు అధికారులు ఉత్సవ విగ్రహాలుగా మారడం, యజమానులకు కొమ్ము కాయడంతో పాటు పోలీసు అధికారులు, కార్మిక వ్యతిరేక వైఖరిని అవలంభించడం, స్థానికంగా గుర్తింపు ఉన్న కొంత మంది పలుకుబడి కలిగిన అవినీతిపరులైన రాజకీయ నాయకుల వికృత ప్రవర్తనతో పరిస్థితి చేయిదాటిపోయింది.
యానం బద్దలయింది. ఇదే పరిస్థితి అల్ట్రా టెక్ కర్మాగారం (తాడిపత్రి) సంఘాన్ని పెట్టుకోనీయకుండా యాజమాన్యం, తొత్తు యూనియన్ నాయకులు నిరంకుశంగా వ్యవహరిస్తే జెసి దివాకర రెడ్డి లాంటి రాజకీయనాయకులు బహిరంగంగా యాజమాన్యాన్ని సమర్థించారు. విశాఖ జిల్లా మహా సిమెంట్స్‌లో సంఘాన్ని పెట్టనీయకుండా అటు పోలీసులు, ఇటు ప్రభుత్వాన్ని ఉపయోగించుకొని బరి తెగిస్తున్నారు.
ఇక సెజ్‌లలో అయితే సంఘం పెట్టే ఆలోచనే లేకుండా చట్టాలున్నాయి. రాజ్యాంగ బద్ధంగా కార్మిక హక్కులు సాధించుకోవడానికి ప్రయత్నిస్తే దాన్ని స్వాగతించాల్సింది పోయి నిరంకుశంగా వ్యవహరిస్తే గతంలో అనేక సంఘటనలు జరుగగా, నాగరికత పెరుగుతున్న ఈ తరుణంలో కూడా పాత రోత వ్యవహారం అమలవుతుంటే, కార్మిక శక్తి ఎంతవరకు ఓర్పుగా వుండగలదో రాజకీయ విజ్ఞులు ఆలోచించాలి.
'జూనియర్ డాక్టర్లు గ్రామాలలో కూడా పని చేస్తాం', అయితే మాకు ఉద్యోగాలు పర్మినెంటు చేయమని కోరడంతోపాటు కేంద్రంలో 40 వేలు స్టైఫండ్ ఇస్తుంటే, కనీసంగానైనా 30 వేలు మంజూరు చేయమంటే నిరాకరిస్తూనే మంత్రులకు మాత్రం 300 శాతం బరి తెగించి జీత భత్యాలుపెంచుకున్నారు. సంక్షేమపథకాలకు డబ్బు కావాలని బట్టలపై 5 శాతం పెంచి 56-00 కోట్లు వసూలు చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తూనే, మద్యం మాఫియా అవినీతి రాజకీయ నాయకులను రక్షిస్తుంది. వాహనాలపై లైఫ్ టాక్సులకు, రైతులు వాడే ట్రాక్టర్లపైకూడా భారం మోపబోతున్నది. విద్యా, వైద్యరంగాలను క్రమంగా ప్రైవేటు కార్పొరేటు వైపు నెట్టేస్తుంది.
ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వోద్యోగులు 48 రోజుల పాటు ఆందోళన చేస్తే మంత్రులు, శాసనసభ్యులు, ఎంపీలు రాజీనామా డ్రామాలాడారు. ఒక విధంగా రాష్ట్ర ప్రభుత్వం అవమానకర జీవచ్ఛవంగా మారిపోయింది. దానికి కారణం 'తెలంగాణ' అంశం. ఇది ఒక రాజకీయ ప్రక్రియల ద్వారానే పరిష్కరించాలి. ప్రధానమైన రాజకీయ బాధ్యత నుంచి కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ అధిష్ఠాన వర్గం పచ్చి అవకాశవాద వైఖరిని అనుసరిస్తున్నది. ప్రతిపక్షాలపై నెపం వేసి తప్పించుకో జూస్తున్నది.
మహిళాబిల్లు, తెలంగాణ బిల్లుకు మాత్రం అందరి అంగీకారం అడిగే కేంద్ర ప్రభుత్వం, అణు ఒప్పందం, అవిశ్వాస తీర్మానం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు విధానాలను ఎలా ఆమోదించుకుంటున్నారు? తెలంగాణ అంశం రాజకీయంగా పరిష్కరించేంత వరకు రాష్ట్రంలో రాజకీయ సుస్థిరత ఉంటుందా? ఏదో ఒక పద్ధతిలో అవమానానికి రాష్ట్రం గురి కావలసిందే. ఈ విధానంలో తెలుగుదేశం పార్టీది ఎంత అభ్యంతరకరమో దానికన్నా మించి టిఆర్ఎస్ వైఖరి మరింత అభ్యంతరకరంగా ఉంది.
ఏ కాంగ్రెస్ పార్టీ అయితే తెలంగాణ అంశంపై ద్వంద్వ విధానం అవలంభిస్తుందో, దాని పైననే భ్రమలు పెట్టుకోవడం విడ్డూరం. రక్తం తగ్గినప్పుడే రోగాలు బయటపడతాయి. ఒక వైపు ప్రజాదరణ తగ్గే కొద్ది అధికార పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ప్రబలుతున్నాయి. జగన్ వల్ల నష్టపోయిన కాంగ్రెస్, పిఆర్‌పిని దేహి అని అక్కున చేర్చుకుని నెంబర్ గేమ్‌తో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నది. ఇలాంటి కాయకల్పచికిత్స ద్వారా రాష్ట్రాన్ని పాలించడం సాధ్యం కాదు. ఇంతటి రాజకీయ అనిశ్చితి, ప్రజా వ్యతిరేక విధానాల నుంచి రాష్ట్రాన్ని కాపాడవలసిన కర్తవ్యం వామపక్షాలపైన, ప్రజాస్వామ్య వాదుల పైన ఉన్నది. కరీంనగర్ మహాసభ దానికి ఔషధం కనుగొంటుందని భావిస్తున్నాం.
- డాక్టర్ కె.నారాయణ
కార్యదర్శి, సిపిఐ రాష్ట్ర సమితి
(భారత కమ్యూనిస్టు పార్టీ 24వ రాష్ట్ర మహాసభల సందర్భంగా
Andhra Jyothi News Paper Dated 21/02/2012
No comments:
Post a Comment