Tuesday, February 14, 2012

మీడియా కార్పొరేటీకరణ



రామోజీరావు నెలకొల్పిన ఈనాడు గ్రూప్‌లో తన వాటాలను రాఘవ్‌ బెహల్‌ అధ్యక్షతన గల నెట్‌వర్క్‌18 గ్రూప్‌కు విక్రయిస్తున్నట్లు రిలయెన్స్‌ ఇండిస్టీస్‌ (ఆర్‌ఐఎల్‌) అధినేత ముకేష్‌ అంబానీ 2012 జనవరి 3న ప్రకటించారు. తద్వారా దేశంలోనే అత్యంత పెద్ద కార్పొరేట్‌ సంస్థగా పేరుగాంచిన ఆర్‌ఐఎల్‌ మీడియా రంగంలో ప్రవేశించింది. రైౖట్స్‌ షేర్ల జారీతో నెట్‌వర్క్‌18 గ్రూప్‌కు నిధులు సమకూరుస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ షేర్ల కొనుగోలుతో నెట్‌వర్క్‌18 దేశంలోనే అతి పెద్ద మీడియా సంస్థగా అవతరించింది. రూపర్ట్‌ మర్డోక్‌, బెన్నెట్‌ కాల్‌మన్‌ కంపెనీ నేతృత్వంలోని స్టార్‌ చానల్‌ కంటే, జైన్‌ ఆధ్వర్యంలో నడిచే టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా గ్రూప్‌ కంటే తమది అతి పెద్ద గ్రూప్‌ అని బెహల్‌ పేర్కొన్నారు. ఈటీవీకి చెందిన ఆస్తులను కొనుగోలు చేసేందుకు రు.2,100 కోట్ల పెట్టుబడికి బోర్డు ఆఫ్‌ డైరెక్టర్లు అనుమతించినట్లు నెట్‌వర్క్‌18 గ్రూప్‌లోని టెలివిజన్‌ 18 ప్రకటించింది. అవసరమైన నిధుల సేకరణకుగాను ఇండిపెండెంట్‌ మీడియా ట్రస్టును నెలకొల్పుతున్నట్లు ఆర్‌ఐఎల్‌ ప్రకటించింది. ఈట్రస్టు నిధులతో నెట్‌వర్క్‌18, టివి18లో షేర్లను కొనుగోలు చేస్తుంది. ఈ రెండు సంస్థలు మొత్తం నాలుగు వేల కోట్ల రూపాయల మొత్తాన్ని ప్రమోటర్ల నుండి సేకరిస్తాయి. ప్రస్తుతం అఖిల భారత టెలికమ్యూనికేషన్‌ నెట్‌వర్క్‌ బ్రాడ్‌బాండ్‌ను నెలకొల్పుతున్న ఆర్‌ఐఎల్‌ ఈ మీడియా గ్రూప్‌లో ప్రాధాన్యతా షేర్లు పొందేందుకు, దాని ఆస్తుల పంపిణీకి అవకాశం కలిగి ఉంటుంది.


ఈటీవీకి చెందిన వేర్వేరు చానల్స్‌లో షేర్లు కొనుగోలుచేసేందుకు ఆర్‌ఐఎల్‌ రు.2,600 కోట్ల పెట్టుబడులు పెట్టింది. ఉత్తరప్రదేశ్‌. మహారాష్ట్ర, బీహార్‌లోని ప్రాంతీయ న్యూస్‌ చానల్స్‌ను, ఈటీవీ ఉర్దూ చానల్‌ను, మరాఠీ, కన్నడ, బెంగాలీ, గుజరాతీ, ఒరియా ఎంటర్‌టైన్‌మెంట్‌ చానల్స్‌లో నూటికి నూరు శాతం షేర్లు కొనుగోలు చేసేందుకు, ఈటీవీ తెలుగు, ఈటీవీ తెలుగు న్యూస్‌ చానల్స్‌ను కొనుగోలు చేసేందుకు పెట్టుబడులు పెట్టింది. ఈ టీవీ ప్రాంతీయ న్యూస్‌ చానల్స్‌లో నూటికి నూరు శాతం, తెలుగు కాకుండా ఇతర భాషల్లోని ఎంటర్‌టైన్‌మెంట్‌ చానల్స్‌లో 50 శాతం. రెండు తెలుగు చానల్స్‌లో 24.5 శాతం షేర్లు కొనుగోలు చేస్తున్నట్లు టివి18 తెలియజేసింది. ఈ షేర్ల కొనుగోలు కారణంగా ఈటీవీ న్యూస్‌చానల్స్‌లో మేనేజ్‌మెంట్‌, డైరెక్టర్ల బోర్డులో నెట్‌ వర్క్‌18, టివి18 గ్రూప్‌ నియంత్రణ సంపాదించగలుగుతుంది. ఈ లావాదేవీలకు ఆర్‌ఐఎల్‌ పెట్టుబడులు పెట్టడంవల్ల సంపాదకీయ విధానాల్లో ఆ సంస్థ పెత్తనం చెలాయించబోదని ఈ రెండు నెట్‌వర్క్‌లు స్పష్టం చేశాయి. ప్రమోటర్లలో మేనేజ్‌మెంట్‌లో మార్పుఉండబోదని స్పష్టం చేశాయి.
బ్రాడ్‌బ్యాండ్‌ పట్ల ఆర్‌ఐఎల్‌ ఆసక్తి
ఆర్‌ఐఎల్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సర్వీస్‌ అయిన ఇన్ఫోటెల్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సర్వీసెస్‌ టివి18, నెట్‌వర్క్‌ 18 మీడియాలో పెట్టుబడులు, ప్రాధాన్యతా షేర్ల విషయంలో అవగాహన కుదుర్చుకుంది. అత్యధిక ప్రాధాన్యతగల ఖాతాదారుగా ప్రోగ్రామింగ్‌లో, డిజిటల్‌ కంటెంట్‌లో ప్రాధాన్యత కల్పిస్తారు. ఇన్ఫోటెల్‌ పాన్‌ ఇండియా ప్రపంచ శ్రేణి నాల్గవ తరం బ్రాడ్‌బ్యాండ్‌ నెట్‌వర్క్‌ను నెలకొల్పుతోంది. బ్రాడ్‌బ్యాండ్‌ టెక్నాలజీ ద్వారా కంటెంట్‌ను పంపిణీ చేయడంలో ఆధిపత్య పాత్ర పోషించగలనని ఇన్ఫోటెల్‌ విశ్వసిస్తోంది. తన అనుబంధ కంపెనీకి వినోదం, వార్తలు, క్రీడలు, సంగీతం, వాతావరణం, విద్య, ఇతర అంశాలకు సంబంధించిన కంటెంట్‌ అందుబాటులోకి రాగలదని భావిస్తోంది. నెట్‌వర్క్‌ 18 గ్రూప్‌లో సిఎన్‌బిసి-టివి18, సిఎన్‌బిసి-ఆవాజ్‌, సిఎన్‌ఎన్‌-ఐబిఎన్‌, ఐబిఎన్‌7, ఎబిఎన్‌ లోక్‌మత్‌ వంటి న్యూస్‌ చానల్స్‌తో పాటు ఇంకా అనేక వార్తేతర చానల్స్‌ ఉన్నాయి.
ఈనాడు, ఈటీవీ గ్రూప్‌ కంపెనీల హోల్డింగ్‌ కంపెనీ అయిన ఉషోదయ కంపెనీలో తనకు పెట్టుబడులు ఉన్నాయనే విషయాన్ని ఆర్‌ఐఎల్‌ ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో అంగీకరించింది. బ్లాక్‌స్టోన్‌ అనే ప్రయివేటు పెట్టుబడిదారుతో ఒప్పందం కుదర్చడంలో ప్రధాన పాత్ర పోషించడం ద్వారా ఉషోదయ కంపెనీని ఆర్‌ఐఎల్‌ ఆదుకుందని, ఆ ఆర్‌ఐఎల్‌కు కృష్ణా గోదావరి చమురు క్షేత్రంలో సహజవాయువు వెలికి తీసేందుకు ఉద్దేశించిన కాంట్రాక్టు మంజూరు చేయడంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సహాయపడిందని వచ్చిన ఆరోపణలను ఆర్‌ఐఎల్‌ ఖండించింది. 


ఈనాడు, ఈటీవీ గ్రూప్‌లో షేర్లను తన బినామీ కంపెనీ అయిన టివి18 ద్వారా కొనుగోలు చేయించడం ద్వారా ఆర్‌ఐఎల్‌ తన ఆస్తులను తానే కొనుగోలు చేసినట్లయిందని ఆర్థిక నిపుణులు పేర్కొన్నారు. ఉషోదయ కంపెనీలో తన షేర్ల గురించి వెల్లడించడంలో ఆర్‌ఐఎల్‌ చట్టప్రకారం వ్యవహరించిందీ, లేనిదీ అనే విషయాన్ని దేశ పెట్టుబడి మార్కెట్లను నియంత్రించే సెక్యూరిటీ అండ్‌ ఎక్స్చేంజ్‌ బోర్డు (సెబీ) పరిశీలిస్తోంది. ఈనాడు గ్రూప్‌లో రు. 2,600 కోట్ల మేరకు షేర్లను కొనుగోలు చేసినప్పటికీ ఆర్‌ఐఎల్‌ తన షేర్‌హోల్డర్లకు ఇటీవలి వరకు ఎందుకు బహిర్గతం చేయలేదు? ఆదాయం రు.525 కోట్లు ఉన్న కంపెనీలో షేర్లకు టివి18 రు. 2,100 కోట్ల విలువను ఎలా లెక్కకట్టింది? నెట్‌వర్క్‌18 గ్రూప్‌లో ఆర్‌ఐఎల్‌ సహ ప్రమోటర్‌ కానుందా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. భారత దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మీడియా గత కొద్ది కాలంగా తీవ్ర కష్టాల్లో చిక్కుకుంది. ఆర్థిక మాంద్యం నేపథ్యంలో అనేకమంది ప్రకటనదారులు తమ ప్రకటనల వ్యయాన్ని తగ్గించుకున్నారు. వాణిజ్య ప్రకటనలపైనే మనుగడ సాధించే మీడియా ఉనికికే ముప్పు ఏర్పడింది. సమాజంలోని ఇతర కంపెనీలు విలీనం, సేకరణల కారణంగా పుంజుకోగా మీడియాలో మాత్రం ఎటువంటి పురోగతి లేదని మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్‌ పరిశ్రమ (ఎం అండ్‌ ఇ) పేర్కొంది. మీడియా వ్యాపారం గానీ, లావాదేవీల సంఖ్యగానీ పెరిగిన దాఖలా లేదని అది స్పష్టం చేసింది.
కొనుగోలు, విలీనాలు
.ఎబిసిఎల్‌ టివి9 ప్రాంతీయ న్యూస్‌ చానల్స్‌ను నిర్వహిస్తోంది. ఎబిసిఎల్‌ను కొనుగోలు చేసేందుకు బిసిసిఎల్‌, టైమ్స్‌ గ్రూప్‌ తొలుత ఆసక్తి చూపింది. ఎన్‌డిటివి ప్రమోటర్లయిన ప్రణరు రారు, రాధికా రారు, ఆర్‌ఆర్‌పిఆర్‌ హోల్డింగ్‌లో సమిష్టిగా 61.45 శాతం షేర్లు కలిగి ఉన్నారు. ఈ అన్ని లావాదేవీల కంటే ఆర్‌ఐఎల్‌ నెట్‌వర్క్‌ 18-ఈనాడు ఒప్పందం అతి పెద్దది. కొత్తగా ఏర్పడిన మీడియా సమ్మేళనం గ్రామీణ ప్రాంతాల్లో, చిన్న నగరాలాల్లో మంచి వాణిజ్య భాగస్వామ్యాలు కలిగి ఉంటాయి. ఈటివి చానల్‌, దినపత్రిక ప్రేక్షకులు, పాఠకులు జాతీయ వాణిజ్య ప్రకటనదారులకు, వాణిజ్య ప్రకటన మీడియాకు అదనపు ఆకర్షణ కానున్నారు.
కీలకమైన అంశాలు
ఆర్‌ఎఐఎల్‌ నెట్‌వర్క్‌18- ఈనాడు ఒప్పందం అనేక కీలకమైన అంశాలను మన ముందుంచుతుంది. జీ, టర్నర్‌- సిఎన్‌ఎన్‌, వయాకమ్‌-ఎంటివి, సోనీ వంటి చానల్స్‌ ప్రాంతీయ నెట్‌వర్క్స్‌ను కొనుగోలు చేసినా, భాగస్వామ్యం వహించినా పెద్దగా ఆశ్చర్యం కలగబోదు. వార్తలను వాణిజ్యీకరించడం అనివార్యం అవుతున్నప్పటికీ హేతుబద్ధం కాదు. భారత్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మీడియా కార్పొరేషన్లు రాజకీయ ఆర్థిక వ్యవస్థలో ప్రధాన భూమిక పోషిస్తున్నాయి. పత్రికా స్వేచ్ఛ స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మ. జవాబుదారీతనాన్ని పెంపొందిస్తుంది. మీడియాకు పారదర్శకత తీసుకువస్తుంది. నీరజా రాడియా సంభాషణల్లో కొంతమంది పాత్రికేయుల సంభాషణల ఆధారంగా రాజకీయ నాయకులు, బడా పారిశ్రామిక సంస్థల మధ్య రహస్య అవగాహన గుట్టు రట్టయ్యింది.
ట్రారు 2009 నివేదిక
మీడియా మార్కెట్‌లో యాజమాన్యాల విలీనం వల్ల అనేక సమస్యలు టెలికమ్‌ వివాదాల పరిష్కార, అప్పిలేట్‌ ట్రిబ్యునల్స్‌ ముందుకు వచ్చాయని 2009 ఫిబ్రవరి 25న విడుదల చేసిన ట్రారు నివేదిక పేర్కొంది. చానల్స్‌, కేబుల్‌ నెట్‌వర్క్‌ల మధ్య అనేక వివాదాలు బట్టబయలయ్యాయి. ఇతర సర్వీసులు తమకు కంటెంట్‌ సరఫరా చేయడం లేదని కేబుల్‌ నెట్‌వర్క్‌ యజమానులు ఆరోపిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మీడియాలోని రెండు సంస్థలు విలీనం చెందడం వల్ల మార్కెట్‌పై పెత్తనం చెలాయించే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. వేర్వేరు అనుబంధ, అసోసియేట్‌ కంపెనీల పేరుతో మీడియా లైసెన్స్‌లు పొందే అవకాశం ఉంటుంది. ఇవి నిబంధనలకు నీళ్లొదిలే అవకాశాలు కూడా ఉంటాయి. విదేశాల్లో మాదిరిగా క్రాస్‌ మీడియా ఆంక్షలను ప్రవేశపెట్టడం ఈ నేపథ్యంలో అత్యుత్తమమైందనడంలో సందేహం లేదు. అనేక మీడియా హౌస్‌ల్లో పెద్ద ఎత్తున షేర్లు కొనుగోలు చేయడాన్ని నిషేధించాలి. ప్రింట్‌, టెలివిజన్‌, దినపత్రికలు, రేడియో, ఇంటర్నెట్‌లలో పెద్ద ఎత్తున షేర్ల కొనుగోలు చేయడంపై పరిమితులు విధించాలి. కెనడా, ఫ్రాన్స్‌ల్లో ఇటువంటి నిబంధన అమలులో ఉంది. ఈ రెండు దేశాల్లో రేడియో సర్వీసులు, దినపత్రికలు, ప్రాంతీయ టెలివిజన్‌ సర్వీసుల్లో రెండు సర్వీసులను మాత్రమే నిర్వహించే అవకాశం ఉంది. అదే బ్రిటన్‌లోనైతే, ఒకే ప్రాంతంలో మీడియా సంస్థలు రేడియో స్టేషన్లు, దినపత్రికలు లేదా టెలివిజన్‌ చానల్స్‌, దినపత్రికలను నిర్వహించడాన్ని నిషేధించారు.
భారత్‌లో ఇందుకు పూర్తిగా భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో పరిస్థితులకు భిన్నంగా భారతదేశంలో మీడియా ఇంకా అభివృద్ధి పథంలో పయనిస్తోంది. అనేక భాషలు వ్యాప్తిలో ఉండటంతో, దేశంలో అనేక పరస్పర విరుద్ధమైన ప్రాంతాలు ఉండటంతో మీడియా మార్కెట్‌లో కూడా భిన్నంగా ఉంటుంది. టెలివిజన్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ కార్పొరేషన్‌ గత రెండు దశాబ్దాలుగా భిన్న స్వరూపాలుగా ఉంది.
విదేశాల్లో మాదిరిగా భారతదేశంలో క్రాస్‌మీడియా యాజమాన్యంపై ఆంక్షలు ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించినా బడా సంస్థలు వాటిని అడ్డుకుంటాయి. కార్పొరేట్‌ గ్రూప్‌ల నియంత్రణకు ఎటువంటి ప్రయత్నం చేసినా అవి గట్టగా ప్రతిఘటిస్తాయి. ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛను కాలరాస్తోందని, నియంతృత్వంతో వ్యవహరిస్తోందని విమర్శలు వెల్లువెత్తుతాయి. ఎమర్జెన్సీ చీకటి రోజుల్లోకి మళ్లీ జారిపోతున్నామనే విమర్శలు చేస్తాయి. అధికారంలో ఉన్నవారిపై మీడియాలో పలు కథనాలను ప్రసారం చేస్తాయి. అభివృద్ధి చెందుతున్న భారతదేశంలో ఇటువంటి ప్రయత్నాలు మీడియా పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందేందుకు అడ్డుకట్టగా నిలుస్తాయని వ్యాఖ్యానిస్తాయి. ఇంటర్నెట్‌ ఆవిర్భావం భారతదేశంలో పెను మార్పులకు దోహదం చేశాయి. సమాచార ప్రవాహం పెరిగింది. మరింత పారదర్శకత పెరిగింది.
మీడియా బహుళత్వం
ఆర్‌ఐఎల్‌ ఒప్పందం నెట్‌వర్క్‌18, ఈనాడు తమ వ్యాపారాన్ని మరింతగా విస్తృత పరచుకునేందుకు దోహదం చేసింది. ఆయా కంపెనీల్లో షేర్‌హోల్డర్లు మాత్రమే కాకుండా వాణిజ్య ప్రకటనదారుల ప్రయోజనాలు కూడా ఇనుమడించేందుకు ఉపయోగపడింది. బోర్డు రూమ్‌, న్యూస్‌రూమ్‌ మధ్య స్పష్టమైన విభజన సాధ్యమేనా అన్న ప్రశ్న ఉదయిస్తుంది. బహుళ భాషల, బహుళ సంస్కృతుల దేశంలో మీడియా బహుళతత్వంపై కీలకమైన సందేహాలు కలుగుతున్నాయి. ఈ ఒప్పందంపై జరిగిన విశ్లేషణలో ఆర్థికాంశాల ప్రస్తావన వచ్చిందే కానీ మీడియా విలువల గురించి ప్రస్తావన రాలేదు.ప్రభుత్వ విధానాలు కూడా కార్పొరేటీకరణను మరింత ప్రోత్సహించేదిగా ఉన్నాయి. ముఖ్యంగా టెలివిజన్‌ మీడియా మరింత వాణిజ్యీకరణ ధోరణులు అవలంభించడంపైనే దృష్టి సారించే విధంగా దేశంలో పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ విధంగా జరిగే ప్రయివేటీకరణ విభిన్నమైన వార్తలు, వార్తాకథనాలు వెలువడేందుకు అవరోధంగా పరిణమిస్తోంది. వార్తలు ప్రజలకు మేలు చేసేదిగా కాకుండా కార్పొరేట్‌ సంస్థల ప్రయోజనాలకు కాపు కాసే విధంగా ఉంటాయి.
(ఇపిడబ్ల్యు సౌజన్యంతో) 
-పరంజరు గుహ, సుబీ చతుర్వేది
Prajashakti News Paper Date15/02/2012 d 

No comments:

Post a Comment