Tuesday, February 21, 2012

ధర్మరక్షణ- జి.నాగేశ్వరరావు



'ఆత్మవిమర్శా, అంతర్యుద్ధమా?' (జనవరి17, ఆంధ్రజ్యోతి) అనే వ్యాసంలో అరవిందరావు (మాజీ డిజిపి) హిందూ మత విమర్శకులకు కొన్ని సహేతుకమైన ప్రశ్నలు సంధించారు. కంచ ఐలయ్య ఎప్పుడో తాను హిందువును కానని ప్రకటించుకుంటూ ఒక పుస్తకం కూడా రాశారు. ఫరవాలేదు. హిందూ మతానికొచ్చిన నష్టమేమీ లేదు. అయితే హిందువుకాని ఐలయ్య హిం దూ మతాన్ని విమర్శిస్తారేమిటి? ఆయన ముస్లిం కూడా కాదు గదా. మరి ఇస్లాంను విమర్శించరేం? ఏ మతంలోని విషయాలైనా అవి ఆ మతస్తుల వ్యక్తిగతం. ఇతరులకు అవి అప్రస్తుతం. హైందవేతరుడైన ఐలయ్య హిందూ మతాన్ని విమర్శించడానికి కారణం హిందువుల్లో ప్రతిఘటన వుండదని తెలుసు గనుకనే. 


లోపరహితమైన మతంగాని, సమాజంగాని యీ ప్రపంచంలో వున్నదా? వర్ణ వివక్షను, అంటరానితనాన్ని చూపి హిందూ మతాన్ని నిందించేటట్లైతే జాతి వివక్షను చూపి క్రైస్తవాన్ని కూడా నిందించాలి కదా? నాలుగున్నర శతాబ్దాల చరిత్ర గల అమెరికాలో నేడు గదా ఒక నల్ల జాతీయుడు అధ్యక్షుడు కాగలిగింది? 1853లో బానిసత్వాన్ని రద్దు చేసినందుకు ఆగ్రహించిన దక్షిణాది అమెరికన్ రాష్ట్రాలు సౌత్ కరోలినా నాయకత్వంలో అమెరికన్ యూనియన్ నుంచి విడిపోయి స్వాతంత్య్రం ప్రకటించుకున్నా యి. అబ్రహాం లింకన్ నాయకత్వంలో ఆ పది దక్షిణాది రాష్ట్రాలపై యుద్ధం ప్రకటించి తిరిగి యూనియన్‌లో విలీనం చేసుకోవడం జరిగింది. 

కె.కె.కె. అనే తీవ్రవాద సంస్థ ద్వారా నల్లవారిపై దాడు లు చేసిన అమెరికన్ ప్రజల్లోనా వివక్ష లేక వారనుసరించే క్రైస్తవమతంలోనా వివక్ష? కొన్ని దశాబ్దాల క్రితం జరిగిన దుర్ఘటనలను పదే పదే మననం చేసుకుంటూ మతాన్ని నిందించటం న్యాయ మా? లక్షల హిందువుల్ని వధించి వేలాది దేవాలయాల్ని నేల మట్టం చేసిన గజనీ, ఘోరీ, ఔరంగజేబులను ఉటంకిస్తూ మనం ముస్లింలను ద్వేషిస్తున్నామా? 

ఇంకా వారికి రిజర్వేషన్లు కల్పించి సత్కరిస్తున్నాం! నేడు తిరుపతి, కాశీ, ప్రయాగ, రామేశ్వరం వంటి పుణ్యక్షేత్రాల్లో ఎవరిది ఏ కులమని అడుగుతున్నామా? గ్రామాల్లో కొంత వివక్ష వుండవచ్చు కానీ ప్రభుత్వం దానికి కఠినమైన చట్టాలను చేసింది. మహిళలపై రోజూ ఎక్కడో అక్కడ అత్యాచారాలు, దాడులు జరుగుతూనే వున్నవి. అందుకు ప్రతిగా మహిళలంతా హిందూ మతం విడిచి అన్యమత ప్రవేశం చేయాలా? 

హిందూ మతంపై బురద జల్లే వారికి కులవ్యవస్థ ఓ తురుఫు ముక్క. దళిత హిందువులను (దళిత క్రైస్తవులను వేరుగా గుర్తించాలి) దేవాలయాల్లో పూజారులుగా నియమించరు. దళిత హిందువులతో అగ్రవర్ణాల వారు వియ్యమందరు. కలిసి భోజనం చేయరు. దేవాలయాలలోకి రానివ్వరు. అంటరానితనాన్ని పాటిస్తారు. ఇంక హిందూ మతంలో ఎందుకుండాలి అని వాదిస్తారు? సరే, మతం మారగానే స్వర్గద్వారాలు తెరుచుకున్నాయా? క్రైస్తవులంతా సుఖంగా ఉన్నారా? అమెరికాలోని క్రైస్తవులు శ్రీమంతులు. ఆసియా, ఆఫ్రికాలలోని క్రైస్తవులు దరిద్రులుగానున్నారేమి? ఒకే దేముడిని ఆరాధించే వారంతా ఒకే తీరుగా లేరే? 

అంటరానితనం, కులవివక్ష అనేదానికి మతంలో ఎటువంటి ప్రామాణికమూ లేదు. ఉంటే గనుక వాల్మీకి పూజనీయుడెలా అవుతాడు? నారాయణ గురు, నయనార్‌లు, తిన్నడు, స్వామి వివేకానంద, సాయిబాబా, ఇంకా వందలాది స్వామీజీలు వీరే కులానికి చెందినవారు? అంబేద్కర్‌కు ఆర్థిక సహాయం చేసింది బరోడా మహారాజు కాదా? ఒక మతంలో పుట్టే మహనీయుల్ని బట్టి ఆ మతాన్ని విశ్లేషించాలి తప్ప దానిలో పుట్టే అధములని బట్టికాదు. అంటరానితనాన్ని, కుల వివక్షను పాటించే వారెవరైనా సరే మూర్ఖులే. దేవాలయ పూజారులుగా బ్రాహ్మణ స్త్రీలు గూడా అర్హులు కాదు. అశౌచం వున్న కొంతమందిని ఉపేక్షించటం జరిగింది. హిందువుల్లోనే గాదు, క్రైస్తవుల్లో గూడా మహిళా పాస్టర్లు, ముస్లింలలో మహిళా ఇమాంలు లేరు. వారిదిగూడా వివక్షేనా? 

మొదట్లో చాతుర్వర్ణ వ్యవస్థగావుండి తరువాత శాఖలు, ఉపశాఖలుగా విడిపోయిన హిందూ సమాజంలో ఎన్నడూ కులపరమైన ఘర్షణలు జరగలేదు. నేడు కొన్ని స్వార్థపరశక్తులు కుల వ్యవస్థను వక్రీకరించి రాజకీయం చేస్తున్నారు. దేశంలో ఒకప్పుడు సంస్కృత భాష ఒక్కటే వుండేది. క్రమేపీ అందులోనుంచి అనేక భారతీయ భాషలు పుట్టుకొచ్చాయి. కానీ వారెవరూ భాషా పరంగా కలహించుకోవటం లేదే? వివిధ కులాల వారు మాత్రం ఎందుకు కలహించుకోవాలి? ఏ కులమూ మరొక దానికంటే తక్కువదని ఎక్కడా చెప్పబడలేదు. బ్రాహ్మణులు ప్రజాపతి ముఖం నుంచి, శూద్రులు పాదాల నుంచి జన్మించారన్నదానికి విపరీతార్థాలు తీసి శూద్రులను హిందూ మతం కించపరిచిందని వాదిస్తారు. కాని ఎవరికైనా పాదాభివందనం చేసినప్పుడు ఆ పాదాలే శిరోధార్యాలు కదా? 

కులాంతర వివాహాలు వ్యక్తిగతం. బ్రాహ్మణులు కూడా తమ శాఖల్లోనే చేసుకోవటానికి ఇష్టపడతారు. ఇది ప్రత్యేకంగా దళితు ల పట్ల వివక్ష ఎట్లా అవుతుంది? డబ్బు, హోదా కలిగిన ఒక ఉన్నతోద్యోగి తన కార్యాలయంలోనే పనిచేస్తున్న అటెండరుతో వియ్యమందుతాడా? ఇక్కడ డబ్బు, హోదాగల వివక్ష. దీన్నికూడా ఖండించరేం? అమెరికాలో తెల్లవారు, నల్లవారి మధ్య వివాహాలు జరుగుతాయా? క్రైస్తవుల్లో గూడా జాతి వివక్ష ఉన్నట్లేగా? 

భారతదేశంలో కుల వివక్షే గనుక రాజ్యమేలుతున్నట్లైతే రాష్ట్రపతిగా ఒక దళితుడిని ఎలా ఎన్నుకున్నారు? దళితులు మన రాష్ట్రంలోనూ, ఇతర రాష్ట్రాలలోనూ ముఖ్యమంత్రులయ్యారు. కేంద్రంలోను, రాష్ట్రాలలోను పలువురు దళితులు మంత్రి పదవులు నిర్వహిస్తున్నారు. అగ్రవర్ణాల హిందువులు కుల వివక్షను పాటించి ఉండివుంటే దళితులకు రిజర్వేషన్లు ఎలా సమకూరినవి? ఊరూరా అంబేద్కర్ విగ్రహాలు ఎలా వెలిసినవి? మతం అనేది ఒక ఆధ్యాత్మిక ప్రక్రియ మాత్రమే గాదు; అది ఒక సాంఘిక, సాంస్కృతిక ప్రక్రియ కూడా. హిందూ మతంతో సహా ఏ మతమూ మనలను స్వర్గానికి తీసుకెడుతుందన్న ధీమా ఏమీలేదు. 

కానీ ప్రతి మతానికీ ఒక సంస్కృతి, సమాజం వుంటుంది. మతం మారితే ఇవి గూడా మారిపోతాయి. ఒక దేశంలో మతాలు ఎన్ని ఎక్కువైతే అస్థిరత అంత ఎక్కువగా వుంటుంది. ప్రజలు మతపరంగా చీలిపోయి వేర్పాటు వాదం తలెత్తుతుంది. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ పాకిస్థాన్. 1946లో జిన్నా ఒక ప్రకటన చేస్తూ హిందువులు, ముస్లింలు రెండూ వేర్వేరు జాతుల వారు; వారెన్నడూ కలిసి సఖ్యతగా జీవించలేరు గనుక పాకిస్థాన్‌ను ఏర్పాటు చేయవలసిందేనన్నాడు. నిన్నటిదాకా హిందువుగా ఉన్నవాడు నేడు ముస్లింగా మారగానే వేరే జాతి వాడుగా, వేర్పాటు వాదిగా మారుతున్నాడు. అలాగే క్రైస్తవులైన ఈశాన్య రాష్ట్ర ప్రజలు గూడా వేర్పాటు వాదాన్ని వినిపిస్తున్నారు. అంతేగాక మన వేదాలు, ఇతిహాసాలు, పురాణాలు, సంగీ తం, నాట్యం, శిల్పం ఇవన్నీ హిందూ మతం నుంచే పుట్టాయి. 

మతం నశిస్తే ఇవి గూడా నశిస్తాయి. ఏదైనా ఒక మతాన్ని గాని, సంస్కృతిని గాని, వ్యవస్థను గాని నిర్మించడం కష్టం గాని దానిని నాశనం చేయటం చాలా తేలిక. హిందూ మతాన్ని సంస్కరించి దానిని పరిపుష్టం చేయడానికి సలహాలివ్వాలిగాని మతాన్ని బలహీనపరిచే చర్యలు న్యాయం కాదు. మనం కాశ్మీర్‌పై ఎన్ని చర్చలైనా జరపవచ్చు కాని ప్రధానాంశం మాత్రం కాశ్మీరు భారత్‌లో అంతర్భాగం అనేది. అలాగే హిందూ మత పునరుజ్జీవనం అనేది మౌలిక సూత్రంగా సలహాలు, సంస్కృతులకు స్వాగతం. బయటకు వెళ్లేవారు వెడుతుంటే కొత్త వారు పుడుతుంటారు తప్ప హిందూ మతానికి నాశనం లేదు. దేశ సమగ్రత కోసం, సంస్కృతీ పరిరక్షణ కోసం, జాతి వారసత్వం కోసం హిందూ మతం బ్రతికే వుండాలి. హిందువులందరూ దానిని బ్రతికించుకోవాలి. 

ధర్మోరక్షతి రక్షితః
- జి.నాగేశ్వరరావు
(ధర్మప్రసార సమితి)
Andhra Jyothi News Paper Dated 22/02/2012 

No comments:

Post a Comment