Saturday, February 25, 2012

'అల సెంద్రవంక'లో ఆ పాటలేవి?--పసునూరి రవీందర్

'అల సెంద్రవంక'లో ఆ పాటలేవి?

ఎంకన్న తన గొంతునుండి సమస్త తెలంగాణ దుఃఖాన్ని, నిరసనను, ధిక్కారాన్ని పలికించినోడు. పక్షుల కిలకిలరావాలు లేకుండా తెలంగాణ పల్లె తుపాకి మోతలతో అల్లాడిపోతుందని ఒంటరిగా కూర్చొని ఏడ్చినోడు, ఏడ్పించినోడు. తెలంగాణ కోసం ఏ పాటగాడు రాయనన్ని పాటలు రాసి ధూంధాం సభలల్లో అంతెత్తున ఎగిరి దుంకి పాడి జనం గుండెల్లో నిలిచినోడు. కానీ 'అలసెంద్రవంక' పుస్తకంలో మాత్రం ...

నిజానికి ఎంకన్న ఇట్లా ఉద్యమానికి దూరంగా జరుగుతూ, చెట్ల మీద పుట్ల మీద పాటలు రాసేలా పురిగొల్పుత్నుది ఎవరు? అలా ఎంకన్నను కేవలం ప్రకృతి కవిని చేస్తున్నది ఎవరు? ప్రకృతి అంటే అందులో మనిషి లేడా? అందులో తెలంగాణ లేదా? దోపిడి లేదా? వివక్ష లేదా?

తెలంగాణ ప్రాంతంలో ఇవాళ జరిగే ఏ సభైనా జై తెలంగాణ నినాదాలతో మార్మోగుతున్నది. ఇక గోరటి వెంకన్న పాల్గొన్న సభలయితే ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేము. కానీ స్వయంగా గోరటి వెంకన్న పుస్తకావిష్కరణ సభలో ఇలాంటి ఆశలు ఆవిరైపోయాయి. గోరటి పాటల పుస్తకం ఆవిష్కరణ అదొక తెలంగాణ ధూంధాం లాగే ఉంటుందని అందరూ ఆశించారు. కానీ తీరా ఆ సభలో వేదిక మీదున్న తెలంగాణేతర సాహిత్యకారుల వక్రోపన్యాసాలకు జై తెలంగాణ నినాదం చిన్నబోయింది.

సభలో ఉన్న తెలంగాణ బిడ్డలు స్వేచ్ఛగా నోళ్లు కదుపలేకపోయారు. వచ్చిన వక్తలు మాత్రం తమకిష్టమొచ్చినట్టుగా ఎంకన్నను హైజాక్ చేసే ప్రయత్నం చేశారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున నడుస్తున్న సమయాన ఇలాంటి విపత్కర పరిస్థితి ఎదురుకావడం.. యావత్ తెలంగాణ ఉద్యమకారులకు ఎంతో బాధ కలిగించింది..

'ప్రజలు ప్రశ్నించకుండా ఉండేందుకు, వారిని నిద్రపుచ్చాలంటే పాటను ఆశ్రయించాలి' -ప్లేటో
ఇటీవల ప్రజావాగ్గేయకారుడు గోరటి వెంకన్న తన మూడో పాటల సంపుటి 'అలసెంద్రవంక'ను ప్రచురించాడు. ఈ సంపుటి ఆవిష్కరణకు ముందే విమర్శల పాలయ్యింది. తెలంగాణను వ్యతిరేకించే కోస్తా సాహిత్యకారులతో ముందుమాటలు రాయించుకున్న విషయం తెలంగాణ బిడ్డలు జీర్ణించుకోలేకపోయారు. 

ఎందుకంటే గోరటి వెంకన్న గత మూడు దశాబ్దాలుగా పాటలు రాస్తున్నప్పటికి, అతని స్థానాన్ని పతాక స్థాయికి తీసుకువెళ్లింది మాత్రం తెలంగాణ ఉద్యమమే. తెలంగాణకు గత యాభైయేండ్లుగా జరిగిన అన్యాయాలపై నిప్పుకణికల్లాంటి పాటల్ని రాసి పల్లెపల్లెన పాడినవాడు ఎంకన్న. కానీ, ఇయ్యాల ఈ పుస్తకం విషయంలో మాత్రం ఎంకన్న తెలంగాణ ఉద్యమాన్ని పక్కన పెట్టి వలసాంధ్రవాదుల అండగా నిలిచాడు. 

సుదీర్ఘ చరిత్ర కలిగిన తెలంగాణ పురిటిగడ్డ అనేకమంది ప్రజావాగ్గేయకారులను అందించింది. నిత్యం ఉద్యమాల కార్యాచరణతో వర్థిల్లడం ఈ నేలన సహజమైన విషయం. అట్లే తెలంగాణ ఉద్యమం తన విముక్తి కొరకు తానే, అనేకమంది కవులకు, కళాకారులకు జన్మనిచ్చింది. అట్లా వెలుగులోకి వచ్చిన పాటగాళ్లు ఈ విషయాన్ని మరిచి, తాత్కాలిక ప్రయోజనాలకోసం ఉద్యమ ఆకాంక్షలను మరిచిపోవడం క్షమార్హం కాదు! బెల్లి లలిత పాట కోసం ప్రాణమిడిసింది. తన చివరి శ్వాసదాకా ప్రజాపోరాటాల సాహిత్య చిరునామాగా నిలబడ్డాడు చెరబండరాజు. అట్లాంటి గడ్డ మీద వారి వారసత్వాన్ని బతికించడానికి వందలాదిమంది ప్రజాకళాకారులు అహోరాత్రులు శ్రమిస్తున్నారు. 

ఫలితంగా తెలంగాణ ప్రజల చైతన్యం సజీవమై కొట్లాడుతున్నది. గద్దర్, గూడ అంజయ్య, గోరటి వెంకన్న, అందెశ్రీ, మిత్ర, జయరాజుల పాటలు లేని తెలంగాణ సాంస్కృతిక రంగాన్ని ఊహించడం ఎవరివల్లా కాదు. తెలంగాణ ప్రజల బాధలకు పల్లవులై, చరణాలై ప్రవహించారు ఈ గడ్డమీద పాట కవులు. అలాంటి నేపథ్యం కలిగిన ప్రస్తుత పరిస్థితుల్లో ఏ కవైనా, కళాకారుడైనా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. 

ఎంకన్న మాత్రం నాలుగు కోట్లమంది ప్రజల డిమాండ్‌ను, రెండువందల ఎనభైమంది బలిదానాలను మరిచి పదిమంది సీమాంధ్ర కవులను తృప్తిపరచేందుకు పూనుకున్నాడు. తెలంగాణ పల్లెను గురించి కన్నీరు పెట్టి న కవి, ఎందుకోసం ఇట్లా మారుతున్నాడనే ఆవేదన తెలంగాణ ఉద్యమకారులందరి మనసులను తొలుస్తున్నది.

తెలంగాణ సాయుధ పోరాట కాలం నుండి సుద్దాల హన్మంతు, బండి యాదగిరి తమ వంతు పాత్రను పోషించారు. ఇప్పటికీ జనం నోళ్లల్లో నానే పాటలైన పల్లెటూరి పిల్లగాడ, బండెనుక బండి కట్టి వంటి పాటలు రాశారు. ప్రత్యేక్షంగా పోరాటంలోనూ పాల్గొని చరిత్రను ధన్యం చేశారు. కానీ వాళ్ల సాహిత్యమంతటి గొప్ప సాహిత్యాన్ని సృజించిన ఎంకన్న ఆ పాటలకు తన పుస్తకంలో స్థానం దక్కకుండా చేశాడు. ఇప్పటిదాకా తాను రాసిన తెలంగాణ ఉద్యమ పాటలను పక్కన పెట్టి ఈ అలసెంద్రవంకను ప్రచురింపజేశాడు.

తెలంగాణ ఉద్యమం ఈనాడు పదిజిల్లాల నిండా నాలుగు వేల టెంట్లుగా వర్థిల్లుతున్నది. ప్రపంచంలో ఇంతటి మహత్తర పోరాటం జరుగుతున్న ప్రాంతం మరొకటి లేదంటే ఆశ్చర్యం కలుగక మానదు. ప్రతీ టెంటు దగ్గర ఎంకన్న రాసిన తెలంగాణ పాటలు పాడుకోవాలని ప్రజలు కోరుకుంటారు. అంతటి రిలవెన్సు కలిగిన పాటలు ఎంకన్నవి. కానీ ఎంకన్న మాత్రం ప్రజాకవి అనే బాధ్యత నుండి వైదొలగడానికి సిద్ధమయ్యాడు. తన పాటలు సినిమాల్లో, టీవీ రియాల్టీ షోలల్లో మాత్రమే ఆ క్షణానికి అలరిస్తే సరిపోతుందని ఎంకన్న చెప్పకనే చెప్పినట్టయ్యింది. 

వ్యాపార వ్యామోహం కలిగిన వ్యక్తులు, సంస్థలు ప్రజా సాహిత్యాన్ని కూడా బిజినెస్ చేయడం కాలాతీతమేమీ కాదు. కానీ, బాధ్యతగా వ్యవహరించాల్సిన ప్రజా కవులు ఇలాంటి మాయలను ఛేదించుకొని ప్రజల పక్షం నిలవాలి. నలుగురిని ఎంటర్‌టైన్ చేయడం కోసం నాలుగు కోట్లమంది ప్రజల దీర్ఘకాలిక డిమాండ్‌ను తోసిపుచ్చడం కన్నా నేరం మరొకటి ఉండదు.

ఎంకన్న తన గొంతునుండి సమస్త తెలంగాణ దుఃఖాన్ని, నిరసనను, ధిక్కారాన్ని పలికించినోడు. 'పొమ్మంటె.. పోవేందిరా పోరా ఓ ఆంధ్ర దొర' అని ప్రశ్నించాడు. సేతాన ఉన్నా తెలంగాణ సేలన్ని బీడెందుకైనయని ప్రశ్నించినో డు. ఏ ఆఫీసు మెట్లెక్కినా.. గుమ్మాలకు బొమ్మలోలె ఆంధ్రావారే కనబడతారని కడుపు రగిలి శపించినోడు. పాలమూరు మట్టి బిడ్డలు వలసబోయిన డబ్బుతో అప్పులకు వడ్డీ కడతారని తెలంగాణ గోసను కళ్ల ముందుంచినవాడు. విషాదాలకు స్వస్తి పలికి తెలంగాణ కోసం కుస్తి చెయ్యాలన్నాడు. 

మహబూబ్‌నగర్ ఎండిపోతా ఉంటే ఆంధ్రావారికి మూడు పంటలు ఎట్లా పండుతాయని అగ్నిపర్వతమై మండినోడు. పక్షుల కిలకిలరావాలు లేకుండా తెలంగాణ పల్లె తుపాకి మోతలతో అల్లాడిపోతుందని ఒంటరిగా కూర్చొని ఏడ్చినోడు, ఏడ్పించినోడు. తెలంగాణ కోసం ఏ పాటగాడు రాయనన్ని పాటలు రాసి ధూంధాం సభలల్లో అంతెత్తున ఎగిరి దుంకి పాడి జనం గుండెల్లో నిలిచినోడు ఎంకన్న. కానీ 'అలసెంద్రవంక' పుస్తకంలో మాత్రం ఈ నెత్తురసొంటి శక్తున్న పాటలను అంటరాని పాటలను చేశాడు.

'అలసెంద్రవంక'ప్రచురణకర్తలు ఎంకన్నను తెలం గాణకు దక్కనివ్వకుండా చేసే సమైక్యాంధ్ర కుట్రకు పాల్పడుతున్నారు. నిజానికి వాళ్లు తెలంగాణ న్యాయమైన పోరాటానికి మద్దతునిచ్చేవాళ్లు కాదు. సంకుచి త గోడల నడుమ, ఊహాలోకాల్లో నలుగురి నడుమ గౌరవాలు, కీర్తి కిరీటాలు పెట్టుకుని ఊరేగే ఆశల పల్లకీలు. ఎంకన్నను కూడా తమ ముగ్గులోకి లాక్కొని, తెలంగాణ పాటలను చేర్చకుండా అడ్డుపడ్డారు.

ఎంకన్న తెలంగాణ కోసం రాసిన పాటలు ఈ పుస్తకంలో చేర్చి ఉంటే.. ఈ రోజు ఆ పుస్తకం తెలంగాణ పల్లెల నిండా ఒక ఆయుధమయ్యేది. ఆ పాటలు వలసాంధ్ర దోపిడి కోటల మీద బల్ల్యాలుగా ప్రజలు ప్రయోగించి ఉండేవారు. దీనిని గమనించారు గనుకనే ప్రచురణకర్తలు ఈ దుర్మార్గానికి పాల్పడ్డారు. పైగా ఎంకన్న పాటలను గేయరూప కవిత్వమని ప్రకటించారు. 

ఎంకన్న రాసిన కవిత్వం గురించి మాట్లాడుకొని తాదాత్మ్యం చెందడానికి ఇదేనా సందర్భం? ఎంకన్న పాటలు కవిత్వంగా చదువుకున్నా గొప్పగానే ఉంటాయి. అట్లా ఎంకన్న పాటల పుస్తకాన్ని కొని, చదువుకొనేవారు పిడికెడుమందే. కానీ, గోరటి పాటలను భుజానేసుకొని, జనాన్ని చైతన్యం చేసే కళాకారులు వందలు, వేలు. పిడికెడుమంది సంతృప్తికోసం వీటిని తమకిష్టమొచ్చినట్టుగా ప్రచురించి తెలంగాణ చరిత్రకు మాయని మచ్చను తెచ్చినట్టయింది.

ముందుమాటలు రాసినవారి ద్రోహం గురించీ చెప్పుకోవాలి. మార్క్సిజం సులోచనాలలో నుంచి ఎంకన్న పాటలను చూసిన పేరున్న పెద్దకవి- ఎంకన్న పాటలకు ప్రాపంచిక దృక్పథాన్ని అన్వయిస్తూనే ఎంకన్న సృజనకు తెలంగాణ జీవితమే కారణమనే స్థానీయత ఎక్కడ బయటపడకుండా ప్రయత్నించాడు. తాను రాసిన వెయ్యి పదాల ముందుమాటలో ఒక్కసారి కూడా తెలంగాణ పదం ఉచ్ఛరించకుండా తన (అ)విశాల దృక్పథాన్ని బలంగా చాటుకున్నాడు. 

ఎంకన్న పుస్తకానికి రెండోసారి ముందుమాట రాస్తున్నప్పటికీ తెలంగాణ ప్రాం త నేపథ్యమే ఎంకన్నను వాగ్గేయకారునిగా నిలబెట్టిందన్న వాస్తవాన్ని ఒప్పుకోలేకపోయాడు. పైగా ఎంకన్నకు అంతర్జాతీయ దోపిడిని అర్థం చేసుకునే చైతన్యమున్నదని తీర్మానించాడు. కానీ, వలసాంధ్ర దోపిడీదారులను కూడా ఎండగట్టే కసి ఉన్నదని మాత్రం వ్యాఖ్యానించలేకపోయాడు.

ఎంకన్నను అందరివాడు చేయాలనే ఆరాటంలో తనను తీర్చిదిద్దిన అర శతాబ్దపు తెలంగాణ దుఃఖం కూడా ఉంద ని గుర్తించకపోవడం విచారకరం. ప్రపంచ సాహిత్య సాంస్కృతిక పరిణామాలను ఒడిసిపట్టుకునే అధ్యయనశీలి, ఈ వాస్తవాన్ని మాత్రం ఎందుకొరకు దాచిపెడుతున్నట్లో సాహిత్యజీవులు ఆలోచించాలి! తాను తెలంగాణ న్యాయ పోరాటానికి మద్దతుగా నిలవాల్సింది పోయి, తెలంగాణ తల్లి ముద్దుబిడ్డను కూడా పక్కదారి పట్టించడమెందుకో ఆలోచించాలి.

ఇక మరో పెద్దమనిషి- 'మానవ సమాజంలోని వెలితిని మనిషి అంతరంగంలోని కోల్పోయినతనాన్ని పోగొట్టుకున్నతనాన్ని శైథిల్యాన్ని పాటలు పాటలుగా తోడి సమాజం సేదదీరుస్తున్నాడు' అన్నాడు. అదేకాదు, తెలంగాణ మట్టిబిడ్డలు యాభైమూడేండ్లుగా సమస్తం పోగొట్టుకున్నతనం గురించి కూడా ఎంకన్న రాసిన పాటల్లో ఎందుకు గుర్తించలేకపోయాడో ఈ విమర్శకుడు. నైసర్గిక కవి అంటూనే ఆ నైసర్గిక దుఃఖం గురించి ఎంకన్న రాసిన పాటలు ఈ పుస్తకంలో ఎందుకు లేవని ఒక్క విమర్శకుడు కూడా ప్రశ్నించకపోవడం విచారకరం.

ఎంకన్న ఇప్పుడు ఎవరిని మెప్పించడానికి ఉగా ది పాటలు రాస్తున్నాడు? దళిత, బహుజన కాన్సె ప్ట్‌తో పాటలు రాసిన కలం ఎందుకు పక్కదారి పడుతున్నది? ఎంకన్న రాసిన దళిత ఉద్యమ పాటలను ఊరూరా పాడి ఉద్యమాన్ని నడిపిన మారోజు వీరన్న బతికి ఉంటే ఎంకన్న ఇలాంటి పాటలు రాసేవాడా? ఎంకన్న ఇట్లా ఉద్యమానికి దూరంగా జరుగుతూ, చెట్ల మీద పుట్ల మీద పాటలు రాసేలా పురిగొల్పుత్నుది ఎవరు? అలా ఎంకన్నను కేవలం ప్రకృతి కవిని చేస్తున్నది ఎవరు? ప్రకృతి అంటే అందు లో మనిషి లేడా? అందులో తెలంగాణ లేదా? దోపిడి లేదా? వివక్ష లేదా? ప్లేటో చెప్పిన రాజ్యానుకూలమైన నిద్రపుచ్చే పాటలలాగా ఈ బుద్ధిజీవులం తా ఎంకన్న ఆ క్షణానికి ఎంజాయినిచ్చే పాటలు రాయాలని కోరుకుంటున్నా రు. 

అట్లాంటి ఉదారస్వభావంలో, లౌక్యం మరిచినతనంతో అమాయక బైరాగి లా నగ్నదేహంతో జీవించాలని చాటే పాటలకు వీళ్లు జడ్జీలై మార్కులేస్తున్నారు. ఆదిమ సమాజ జీవితాన్ని తిరిగి కోరుకుంటున్నారు. ఆధునికతను వ్యతిరేకించ డం అంటే ఆదిమసమాజాన్ని కోరుకోవడమనే తప్పుడు నిర్ధారణకు వస్తున్నా రు. ఈ పాపంలో ఎంకన్నక్కూడా భాగస్వామ్యం లేకపోలేదు.

అవార్డులు, అభి నందనల నడుమ సెలబ్రిటీగా మారుతూ తన బాధ్యతను గాలికొదిలేస్తున్నా డు. ఈ కుట్రలను ఛేదించుకొని తెలంగాణ ఉద్యమాన్ని మీదేసుకొని పనిచేయాల్సిన బాధ్యత ఎంకన్నమీద, ఎంకన్న పాటల మీదున్నది. లేకుంటే తెలంగాణ బిడ్డలు ఈ 'అలసెంద్రవంక'ను తిరస్కరిస్తారు.

- పసునూరి రవీందర్
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ
Andhra Jyothi News Paper Dated : 3/5/2010

No comments:

Post a Comment