Saturday, February 25, 2012

అవార్డులు దళితులకు అంటరానివా? -కృపాకర్ మాదిగ


ఈ ఏడాది డాక్టర్ బాబూ జగ్జీవన్‌రామ్, డాక్టర్ బి. ఆర్. అంబేడ్కర్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ ఏప్రిల్ 5-14 వరకు 'దళిత ఆత్మగౌరవ ఉత్సవాలు నిర్వహించింది. ఈ సందర్భంగా జరిగిన దళిత కవితోత్సవాన్ని కొందరు దళితేతర తెలంగాణ సాహితీవేత్తలు, వీరి ప్రోద్బలంతో కొందరు దళిత రచయితలు బహిష్కరిస్తున్నట్టు ఒక కరపత్రం, ఎస్ఎమ్ఎస్‌ల ద్వారా పిలుపునిచ్చారు. బహిష్కరణ వెనక ఉద్దేశాలు ఏవైనప్పటికీ, దాని లక్ష్యం దళిత కవితోత్సవం కాకూడదు. ప్రభుత్వ ఉత్సవాలకు, సన్మానాలకు, అవార్డులకు దళితులు దూరం గా ఉండాలని దళితేతరుల నాయకత్వంలోని తెలంగాణ రచయితల సంఘం పిలుపునివ్వడం సరైందికాదు.

ప్రభుత్వంలోని వివిధ శాఖలు సంబంధిత ప్రజల గౌరవార్థం అనేక ఉత్సవాలు నిర్వహిస్తుంటాయి. ఉదాహరణకు ఫూలే జయం తి, అంబేడ్కర్, జగ్జీవన్‌రామ్ జయంతి ఉత్సవాలు, మేడే, మహిళా దినోత్సవం, ఉగాది ఉత్సవాలు, నంది నాటక ఉత్సవాలు జానపద, గిరిజన సాంస్కృతిక ఉత్సవాలు.... ఇలా ప్రభుత్వ శాఖలు ఏటా కొన్ని ముఖ్యమైన సందర్భాల్లో ఉత్సవాలు నిర్వహిస్తాయి. 

అందులో సన్మానాలు చేసి అవార్డులను ప్రదానం చేయడం అందరికీ తెలిసిం దే. ఇటువంటి ఉత్సవాల్లో అవసరమైన, ఇష్టమున్న ప్రజలు పాల్గొంటున్నారు. మరి కొందరు బహిష్కరిస్తారు. ఎవరి కారణాలు వారికున్నాయి. అయితే ఈ బహిష్కరించే వారి వైఖరులు చాలా సందర్భా ల్లో సరైనవే. అయినప్పటికీ వారు ఎంచుకున్న సందర్భం (దళిత కవితోత్సవం) బహిష్కరించడానికి సరైనది కాదు.

దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 64 ఏళ్ల తరువాత దళితుల సమగ్రాభివృద్ధి గురించి పట్టించుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖకు మెలుకువ వచ్చిందో ఏమో? ఈ ఏడాది దళితుల్ని చైతన్యవంతం చేసే వివిధ కార్యక్రమాలతో 'దళిత ఆత్మగౌరవ ఉత్సవాలు' నిర్వహించి కొంత మంచి పని చేసింది. ఈ సందర్భంగా దళితులు- విద్య, దళితులు-ఉద్యోగాలు, ఉపాధి, దళిత పారిశ్రామిక విధానం, దళిత స్త్రీలు, పిల్లల వికాసం, దళితులపై అత్యాచారాలు, నిరోధక చర్యలు మొదలగు అంశాలపై అవగాహన సదస్సులు, చర్చలు, సమీక్షా కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించింది.

ఇందులో వంద గొంతులు, వెయ్యి డప్పులు, అంబేడ్కర్ రాజగృహ ప్రవేశం నాటకం, దళిత సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శనలు, దళి త కవితోత్సవం-ఇత్యాది కార్యక్రమాలను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో వివిధ రంగాల దళిత ప్రముఖులను దళితరత్న, కవితా పురస్కారాలతో సత్కరించింది. సాహిత్యంలో, విద్యలో, నాయకత్వంలో వివక్షలను అధిగమించి పోటీపడి అత్యుత్తమంగా ఎదుగుతున్న దళితుల అభివృద్ధి కోసం ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించాలని ప్రతిపాదనలు వెళ్లడం వెనుక సుదీర్ఘమైన దళిత పోరా టం ఉంది.

దళిత మేధావులు, విద్యావంతులు, నాయకుల కృషి చాలా ఉంది. ఈ దళిత ఆత్మగౌరవ వారోత్సవాలు నిర్వహించడంలో ప్రభుత్వానికి దళితులపై బాధ్యత ఉందని అనుకోలేం. పరిమితమైన ప్రయోజనాలు గల ఈ వారోత్సవాలను సాధించుకోవడం వెనుక దళిత ప్రజల ఆకాంక్షలున్నాయని చెప్పుకోవచ్చు.

ఈ దళిత వారోత్సవాల్లో పాల్గొన్న దళి త మేధావులు, నాయకులకు ఈ ప్రభుత్వ పాలసీలతో పేచీలు లేవని కాదు. దళిత వ్యతిరేక, అణగారిన అస్తిత్వాల వ్యతిరేక ప్రభుత్వ విధానాలపై నిరంతరం పోరాడ డం మాకు అలవాటే. తెలుగు భాషకు ప్రాచీన హోదా కల్పించాలని 2008లో రాష్ట్ర ప్రభుత్వం నెల రోజుల పాటు హైదరాబాద్‌లోని త్యాగరాయ గానసభలో తెలుగు భాష, సాహిత్య, సాంస్కృతికోత్సవాలను నిర్వహించింది. 

తెలంగాణ భాషా సంస్కృతులకు, తెలంగాణ కవులు, రచయితలకు, అస్తిత్వ సాహిత్యాలకు, అస్తిత్వవాద సాహితీ వేత్తలకు ప్రభుత్వ సాంస్కృతిక మాసోత్సవాల్లో ప్రాధాన్యం ఇవ్వలేదు. దీంతో అప్పటి ప్రభుత్వ సాంస్కృతిక, మాసోత్సవాలను అడ్డుకున్నాం. ఉత్సవాల్లో పాల్గొనడానికి వచ్చిన మంత్రి, ముఖ్య అతిథులకు మా నిరసనలు తెలిపాం, అరెస్టు అయ్యాం.

ఐతే దళిత కవితోత్సవ కార్యక్రమాన్ని బహిష్కరించడం వెనుక కొంత మంది తెలంగాణ కవులు, రచయితల ఉద్దేశ్యం సరైంది కావొచ్చేమో కాని, వారు ఎంచుకున్న సందర్భం మాత్రం కచ్చితంగా సరైంది కాదు. ప్రభుత్వ శాఖలు ఏటా నిర్వహించే అనేక రకాల ఉత్సవాలను బహిష్కరించే చురుకైన కార్యక్రమం చేపట్టకుండా, కేవలం దళిత ఉత్సవాలను మాత్రమే బహిష్కరించడం ద్వారా దళితుల్ని గౌరవించుకునే సందర్భాలను అగౌరవపరచడంగానే భావించాలి. దళిత కవితోత్సవాన్ని బహిష్కరించిన సదరు తెలంగాణ సాహితీ సంస్థ నాయకత్వానికి ఉన్న దళిత వ్యతిరేక, కుల అహంకార, బాధ్యతారాహిత్యానికి ఇది అద్దం పడుతుంది.

సాహిత్య, సంగీత, నృత్య, నాటక, విద్య అకాడమీలలో కుల వివ క్ష ఇప్పటికీ తీవ్రంగా ఉంది. అబ్బురపరిచే ప్రతిభాపాటవాలతో దళితులు గట్టి పోటీలు ఇస్తున్న సందర్బాల్లోనూ, వారికి లభిస్తున్న గౌర వ మర్యాదలు, అవకాశాలు చాలా తక్కువనే చెప్పాలి. మార్జినలైజ్ అయిన నైరాశ్యంతోనో, ప్రభుత్వాలపై ఉండే వ్యతిరేకత వల్లనో ప్రభు త్వ అకాడమీలలో పోటీపడవద్దని, ప్రభుత్వ ఉత్సవాల్లో పాల్గొనవద్దనే ధోరణి కొందరిలో ఉంది. 

ప్రభుత్వ ఉత్సవాల నుంచి అకాడమీ పోటీల నుంచి దళితులు, అణగారిన సామాజిక వర్గాల వారు తప్పుకుంటే అది అంతిమంగా ఆధిపత్య కుల రాజకీయ, సాహిత్య,విధ్యాధికారానికి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఉపకరిస్తుంది. ప్రతిభ కనబరిచినా పురస్కారాలు దక్కించుకోవడం పెనుసవాలుగా ఉన్న పరిస్థితుల్లో, ప్రభుత్వ విభాగాలలో పోటీలు పడకుండా దళితులు విరమించుకుంటే హిందూ కుల శక్తుల సాహిత్య ఆధిపత్యమే కొనసాగుతుంది. దళితులు సుదీర్ఘ ఉద్యమాల ద్వారా సాధించుకున్న పరిమిత విజయవకాశాల వైపా? లేక ఆధిపత్య కులా ల 'అస్తిత్వ'రాజకీయ ఉద్యమాల వైపా? అని ప్రశ్నిస్తే, నేను మొదటి వైపే ఉంటాను.

దళితులు తమ ఉత్సవాల్లో తాము పొల్గొనాల్సి వచ్చినప్పుడు సన్మానాలు, పురస్కారాలు దళితులు మాత్రమే గ్రహించాల్సి వచ్చిన సందర్భాలను వివాదాస్పదం చెయ్యడం బాధకరమే కాదు, తీవ్ర అభ్యంత రకరం. దళితులపైకి దళితుల్ని ఎగదోసే 'మిత్ర' ద్రోహం. అదీ దళిత అనుకూల వ్యక్తులు, వర్గాలుగా చెప్పుకుంటున్న వారి నుంచే ఈ పరిస్థితులు ఎదురుకావడం విచారకరం.

ఈ పోకడలు దోపిడీ కులాలకు ఉపకరించేవేనని మిత్రులు గ్రహించాలి. సీమాం«ద్రుల దోపిడి పాలనలను విమర్శించే తెలంగాణ వాదులు, సీమాంధ్ర యాజమాన్యాలు ఇచ్చే ఉద్యోగావకాశాలను పొందుతున్నారు. వదులుకోవడం లేదే? నీతులు ఉపదేశాలన్నీ దళితులకేనా? ప్రభుత్వాలు, అకాడమీలు, ఉత్సవాలు దళితులకు పడిన చారిత్రక అప్పు తీర్పించుకునే ప్రయత్నం చేయాలి. ఈ దిశగా అందివచ్చే ఏ చిన్న సత్కారమైన వినియోగించుకుని దళితులు సాధికారాన్ని పొందడం చాలా అవసరం.

-కృపాకర్ మాదిగ
(వ్యాసకర్త మాదిగ దండోర ఉద్యమ వ్యవస్థాపకులు)
Andhra Jyothi News Paper Dated : 27/06/2010

No comments:

Post a Comment