Tuesday, February 28, 2012

చారిత్రాత్మకం --సంపాదకీయం

చారిత్రాత్మకం 

భారత కార్మికవర్గం కొత్త చరిత్రను సృష్టించింది. రాజకీయ అభిప్రాయాలను, అనుబంధాలను పక్కన బెట్టి ఒక్కతాటిపై నిలిచింది. దేశవ్యాప్తంగా కోట్లాదిమంది కార్మికులు, ఉద్యోగులు సార్వత్రిక సమ్మె జెండాను ఎత్తిపట్టి దృఢంగా నిలిచారు. ఫలితంగా వివిధ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు స్తంభించాయి. పరిశ్రమల్లో ఉత్పత్తి నిలిచిపోయింది. బ్యాంకింగ్‌, ఎల్‌ఐసి కార్యక్రమాలు నిలిచిపోయాయి. పలు రాష్ట్రాల్లో రవాణారంగానిదీ ఇదే పరిస్థితి. సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి, ఉద్యోగ, కార్మికసంఘాల్లో చీలికను తీసుకురావడానికి పాలకవర్గాలు చేసిన ప్రయత్నాలు ఏమాత్రం ఫలించలేదు. కార్మికవర్గంపై కత్తికట్టి సమ్మెను విచ్ఛినం చేయడానికి సర్కారీ గూండాలతో హత్యారాజకీయాలకు దిగిన పశ్చిమబెంగాల్‌లోనూ సమ్మెకు మంచి స్పందన లభించింది. సమ్మె ప్రచారంలో నిమగమైన ఇద్దరు సిపిఎం నేతలను బహిరంగంగా హత్యచేయడం, పెద్ద సంఖ్యలో అరెస్టులు చేయడం ద్వారా కార్మికవర్గాన్ని భయోత్పాతానికి గురిచేయాలన్న తృణమూల్‌ కుతంత్రం సంఘటిత శక్తిముందు విఫలమైంది. బెదిరింపులు,హుంకరింపులతో అక్కడక్కడా కొన్ని రాష్ట్ర బస్సు సర్వీసులను, తృణమూల్‌ గూండాల పహరాతో కొన్ని వాణిజ్యసంస్థలను బెంగాల్‌ ప్రభుత్వం తెరిపించుకోగలిగింది. కేరళ, ఒడిశా, త్రిపుర రాష్ట్రాల్లో సమ్మె నూరుశాతం విజయవంతమైంది. మెట్రోపాలిటన్‌ నగరాలైన ఢిల్లీ, ముంబయి, చెన్నైలలోనూ సమ్మె ప్రభావం గణనీయంగా ఉంది. అన్ని ప్రభుత్వ, ప్రభుత్వరంగ కార్యాలయాలు మూతపడ్డాయి. దేశ ఆర్థిక రాజధానియైన ముంబయిలో బ్యాంకింగ్‌ కార్యకలాపాలు పూర్తిగా స్తంభించాయి. రిజర్వుబ్యాంకు ఆఫ్‌ ఇండియా క్లియరింగ్‌హౌస్‌కు తాళాలు పడటంతో ప్రైవేటు, విదేశీ బ్యాంకులు సైతం కార్యకలాపాలను నిలిపేసుకోవాల్సివచ్చింది. అనేక రాష్ట్రాల్లో పౌర రవాణా వ్యవస్థపైనా సమ్మె ప్రభావం పడింది. ఆంధ్రప్రదేశ్‌లోనూ సార్వత్రిక సమ్మె విజయవంతమైంది. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ , ప్రైవేటు రంగసంస్థలు, పరిశ్రమలు మూతపడ్డాయి. అంగన్‌వాడీలతో సహా అసంఘటిత రంగ కార్మికులు సమ్మె బాట పట్టారు. రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగులు నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరయ్యారు. సమ్మెకు మద్దతుగా రాష్ట్రంలో వామపక్షపార్టీలు ఇచ్చిన బంద్‌ పిలుపునకు మంచి స్పందన లభించింది. పలు ప్రాంతాల్లో వాణిజ్యసంస్థలు, విద్యాసంస్థలు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. సాధారణ ప్రజానీకం నుండి సంఘీభావం వ్యక్తమైంది. బంద్‌లో భాగంగా రాష్ట్ర రాజధానిలో శాంతియుతంగా ప్రదర్శన నిర్వహిస్తున్న వామపక్షపార్టీల నాయకులను అరెస్ట్‌ చేయడం ద్వారా రాష్ట్ర కాంగ్రెస్‌ సర్కారు తన సహజ పెట్టుబడిదారీ, సంస్కరణల అనుకూల, కార్మిక ప్రజావ్యతిరేక వైఖరిని నగంగా బయటపెట్టుకుంది. రాష్ట్రంలో సమ్మె, బంద్‌ల సందర్భంగా ఒక్క అవాంఛనీయ సంఘటన కూడా చోటుచేసుకోలేదు. కార్మిక, ఉద్యోగ సంఘాలతో పాటు వామపక్షపార్టీల నాయకులు, కార్యకర్తలు అత్యంత క్రమశిక్షణతో వ్యవహరించారు. అత్యంత శాంతియుతంగా సమ్మె, బంద్‌ జరుగుతుండటంతో ఓర్వలేకే సర్కారు ఈ అరెస్టులకు తెగబడింది. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఐఎన్‌టియుసి, భారతీయ జనతా పార్టీకి చెందిన బిఎంఎస్‌లతో సహా 11 కేంద్ర కార్మిక సంఘాలు గతంలో ఎన్నడూ లేనివిధంగా ఒక్కతాటిపైకి వచ్చి సమ్మెకు పిలుపివ్వడంతో పాటు, పాలకవర్గాలు అనుసరిస్తున్న సరళీకరణ ఆర్థిక విధానాలపై ప్రజానీకంలో పెల్లుబుకుతున్న ఆగ్రహం ఈ సమ్మెద్వారా వ్యక్తమైంది. అంతరాలను పెంచుతూ సంపదను కొందరి వద్దే కేంద్రీకృతం చేసే పెట్టుబడిదారీ విధానంపై ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో చెలరేగుతున్న ఆగ్రహజ్వాలల సెగలు మనదేశాన్నీ తాకుతున్నాయి. సర్కారీ అభివృద్ధి లెక్కలు ఎలా ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో పెరుగుతున్న అంతరాలు ప్రజల ఆలోచనకు పదును పెడుతున్నాయి. అందుకే సార్వత్రిక సమ్మెలోనూ ఆ తరహా డిమాండ్లే ప్రధానంగా ముందుకొచ్చాయి. అధికధరలను అరికట్టాలి, ఫ్యూచర్‌ ట్రేడింగ్‌ను నిషేధించాలి, ప్రజాపంపిణీ వ్యవస్థను సార్వత్రికం చేయాలి వంటి డిమాండ్లు దేశ వ్యాప్తంగా సాధారణ ప్రజానీకాన్ని ప్రతిరోజూ సతమతం చేస్తున్న సమస్యలపై ఎక్కుపెట్టినవి! మిగిలిన డిమాండ్లు కూడ ఏ ఒక్క కార్మికరంగానికో, ఉద్యోగ రంగానికో సంబంధించినవి కావు. మరో మాటలో చెప్పాలంటే దేశ సార్వభౌమత్వ, స్వావలంబన పరిరక్షణకు ఈ డిమాండ్లే భవిష్యత్తులో కీలకంగా మారనున్నాయి. ఈ వాస్తవాన్ని గుర్తించారు కనుకే దేశవ్యాప్తంగా ప్రజానీకం సమ్మెకు పట్టం కట్టింది. కొత్త చరిత్రను సృష్టించింది. కేంద్రప్రభుత్వంతో పాటు, పాలకవర్గాలు ఈ పరిస్థితిని ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి. ప్రపంచీకరణ ముసుగులో సంపదను కొందరికే పరిమితం చేసి అత్యధికుల బతుకులను ఛిద్రం చేసే విధానాలకు స్వస్తిపలకాలి. దేశభవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని విధానాల రూపకల్పన చేయాలి. సాధారణ ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేయాలి. దీనికి భిన్నంగా జరిగితే గడిచిన రెండు దశాబ్దాల కాలంలో 13 సార్వత్రిక సమ్మెలను నిర్వహించి, 14వ సమ్మెనూ విజయవంతం చేసిన దేశ కార్మికవర్గం మరో చరిత్రను సృష్టించడానికి సిద్ధం కావడం అనివార్యంగా మారుతుంది.
Prajashakti News Paper Dated 29/02/2012

No comments:

Post a Comment