- అమెరికాలో రియల్ ఎస్టేట్ బుడగ ఈ సంక్షోభం బయటపడకుండా తాత్కాలికంగా మాత్రమే కప్పివుంచింది. ఆ బుడగ పేలిపోవడంతో సంక్షోభం బయటపడింది. సంక్షోభం అనేది మౌలికంగా పెట్టుబడిదారీ వ్యవస్థలోనే దాగి వుంది. దాని మీద ఇది అదనంగా రుద్దబడింది. ఇప్పుడు మనం చూస్తున్న సంక్షోభం ఆ బుడగలు పేలిపోవడం వల్ల తలెత్తినది మాత్రమే కాదు, అసలు పెట్టుబడిదారీ వ్యవస్థే సంక్షోభంలో చిక్కుకుంది. దీని నుంచి అది బయటపడడం అంత తేలిక కాదు. ఎందుకంటే ఇది పెట్టుబడిదారీ సంక్షోభాల వలయంలో తరచుగానో, అప్పుడప్పుడూ వచ్చేటి సంక్షోభం లాంటిది కాదు.
పెట్టుబడిదారీ వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతున్నదనే విషయాన్ని అందరూ అంగీకరిస్తున్నారు. అయితే దీనిని ఒక్కొక్కరూ ఒక్కోవిధంగా చూస్తున్నారు. రియల్ ఎస్టేట్ కుప్పకూలిన పర్యవసానంగానే ఇదంతా జరిగిందని అంతటా వినిపిస్తున్న సాధారణ అభిప్రాయం. చివరికి ప్రగతిశీల ఆర్థికవేత్తలుగా పరిగణించబడే పాల్ క్రూగ్‌మన్, జోసెఫ్ స్టిగ్లిట్జ్ వంటివారు సైతం ఇదే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం గమనార్హం. ఈ పరిస్థితుల్లో ప్రయివేటు వ్యయం (పెట్టుబడుల రూపంలోనైనా, వినియోగం రూపంలోనైనా) పెరిగే అవకాశం సమీప భవిష్యత్తులో కనిపించడం లేదు. సంక్షోభం నుంచి కోలుకోవాలంటే ప్రభుత్వ వ్యయం పెంచడం ఒక్కటే పరిష్కార మార్గం. అమెరికా, యూరపులలో ప్రభుత్వాలు ప్రస్తుతం అనుసరిస్తున్న పొదుపు చర్యలను పక్కనపెట్టి వివిధ పథకాలపై ప్రభుత్వ వ్యయాన్ని విధిగా పెంచాలి. ఇలా చేయలేకపోవడానికి రిపబ్లికన్ల విశ్వాసరాహిత్యం, మితవాద పక్షాల నిర్లక్ష్యమే కారణమని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ విధమైన సంకుచిత దృష్టి వల్లే సంక్షోభాన్ని అంతగా పట్టించుకోలేదు. ఇదే అమెరికా ఆర్థిక వ్యవస్థను సంకట స్థితిలో పడేసింది. అలాగే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపైనా ప్రభావం చూపింది. రియల్ ఎస్టేట్ బూమ్ గాలి బుడగ మాదిరిగా పేలిపోవడానికి అలాన్ గ్రీన్‌స్పాన్ నేతృత్వంలోని ఫెడరల్ రిజర్వు బోర్డు అనుసరించిన బాధ్యతారహిత ద్రవ్య విధానమే కారణమని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. ఆర్థిక వ్యవస్థకు తాత్కాలిక ఉద్దీపనలా పనిచేసిన బూమ్ అ నే గాలి బుడగ పేలిపోవడంతో దాని డొల్లతనం బయటపడింది.
వ్యవస్థాగత సంక్షోభం
ఈ అభిప్రాయంతో వచ్చే సమస్య ఏమిటంటే వాస్తవాన్ని అది పూర్తిగా ప్రతిబింబించదు. దీనికి చాలా పరిమితులు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ గాలి బుడగ పేలిపోవడంతో ఆర్థిక సంక్షోభం నెలకొన్నదనేది మొత్తం గాథలో ఒక భాగం మాత్రమే. రియల్ ఎస్టేట్ బుడగ ఈ సంక్షోభం బయటపడకుండా కప్పివుంచింది. ఆ బుడగ పేలిపోవడంతో సంక్షోభం బయటపడింది. సంక్షోభం అనేది మౌలికంగానే పెట్టుబడిదారీ వ్యవస్థలోనే దాగి వుంది. దాని మీద ఇది అదనంగా రుద్దబడింది. ఇప్పుడు మనం చూస్తున్న సంక్షోభం ఆ బుడగలు పేలిపోవడం వల్ల తలెత్తినది మాత్రమే కాదు, అసలు పెట్టుబడిదారీ వ్యవస్థే సంక్షోభంలో చిక్కుకుంది. దీని నుంచి అది బయటపడడం అంత తేలిక కాదు. ఎందుకంటే ఇది పెట్టుబడిదారీ సంక్షోభాల వలయంలో తరచుగానో, అప్పుడప్పుడూ వచ్చేటి సంక్షోభం లాంటిది కాదిది. మనమిప్పుడు దీర్ఘకాలిక పెట్టుబడిదారీ సంక్షోభం అనే విషవలయంలో ప్రవేశించాము. ఇది 1930ల నాటి మహా ఆర్థిక మాంద్యాన్ని మనకు గుర్తు చేస్తున్నది. అయితే ఈ సంక్షోభం ఇప్పటికిప్పుడు తీవ్రతరమయ్యే అవకాశాలైతే లేవు. 30,40 దశకాల్లో మాదిరిగా వరుస రాజకీయ పరిణామాల రూపంలో ఈ సంక్షోభం ప్రభావం చూపుతుంది. వ్యవస్థ పరివర్తన చెందే క్రమంలోనే నిజమైన విప్లవ అవకాశాలు ఏర్పడతాయి.
సంక్షోభాన్ని అధిగమించేందుకు ప్రభుత్వ వ్యయం పెంపు అవశ్యం. ఇక్కడే వారిని కొన్ని ప్రశ్నలు అడగాలి. ప్రభుత్వ వ్యయం పెంపునకు అమెరికా, యూరపు ఎందుకంత తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నట్లు? సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేసే పొదుపు చర్యలు చేపట్టాలని అవి ఎందుకు పట్టుబడుతున్నట్లు? తప్పుడు ఆర్థికవిధానాల వల్లే ఇలా జరిగిందని చెబితే సరిపోదు. ఆధిపత్యం చెలాయించే వర్గాలు- కార్పొరేట్ సంస్థలు, ద్రవ్య సంస్థలు- పెత్తనం చెలాయించడానికి ఇది అన్నివిధాలా అనుకూలమైనది. ఆర్థిక వ్యవస్థను ఉత్తేజపరిచేందుకు తోడ్పడే ప్రభుత్వ వ్యయాన్ని భారీగా పెంచడాన్ని ఫైనాన్స్ పెట్టుబడి అంగీకరించదు. దీంతో ప్రభుత్వాలు పొదుపు చర్యలను నిర్బంధంగా అమలు చేస్తున్నాయి.
ప్రభుత్వ క్రియాశీలతకు ఫైనాన్స్ పెట్టుబడి వ్యతిరేకం కాదు. అయితే ఆ క్రియాశీలత తనకు ప్రోత్సాహకాలందిరచే రీతిలో ఉండాలి. తన స్వీయ ప్రయోజ నాలను పరిరక్షించేదిగా ఉండాలి. ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించేదిగా ఉండాలి. అలా అని ప్రభుత్వం నేరుగా ఖర్చు చేస్తానంటే అది ఒప్పుకోదు.
ఫైనాన్స్ పెట్టుబడితో సంబంధం లేకుండా, కార్పొరేట్ ఫైనాన్షియల్ ప్రయోజనాలను పట్టించుకోకుండా ప్రభుత్వం స్వతంత్రంగా, నేరుగా చేపట్టే ఎటువంటి చర్యలనూ అది అంగీకరించదు. అలా గనుక ప్రభుత్వం చేస్తే పెట్టుబడిదారీ వ్యవస్థ సామాజిక చట్టబద్ధత ఎక్కడ దెబ్బతింటుందోనని దాని భయం. ప్రభుత్వ యాజమాన్యం ఎందుకు ఉండకూడదు? ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించేందుకు ప్రభుత్వం 13లక్షల కోట్ల డాలర్లు వెచ్చిస్తే ఫైనాన్స్ పెట్టుబడికి ఎటువంటి అభ్యంతరమూ ఉండదు. కానీ, ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం ఖర్చు చేస్తానంటే అడ్డుపడుతుంది. ప్రభుత్వ వ్యయం ప్రస్తావన వచ్చినప్పుడల్లా ఫైనాన్స్ పెట్టుబడి పొదుపు చర్యల మంత్రాన్ని అది జపిస్తుంది. డిమాండ్ మేనేజ్‌మెంట్‌లో ప్రభుత్వ జోక్యం ఎంత తక్కువగా వుంటే ఫైనాన్స్ పెట్టుబడి ఆధిపత్యానికి అంత ఎక్కువ అవకాశముంటుంది. అందుకే అది అలా వ్యవహరిస్తున్నది.
వృద్థిరేటును స్థిరంగా కొనసాగించేందుకు ఫైనాన్స్ పెట్టుబడికి బహిరంగ ప్రోత్సాహకాలు కావాలి. ఫైనాన్స్ పెట్టుబడి తనంతట తానుగా వృద్థిని కొంత పరిమితి మేరకే సాధించగలుగుతుంది. ఏదైనా కారణం వల్ల వృద్ధి మందగిస్తే లేదా వెనకడుగు వేస్తే లేదా వృద్ధికి ఎటువంటి సమస్యలైనా ఎదురైతే అటువంటి సందర్భాల్లో పెట్టుబడులు క్రమంగా పడిపోతాయి. వృద్ధి రేటు పతన ప్రక్రియ మరింత జోరందుకుంటుంది. అటువంటి సందర్భాల్లో బహిరంగ ప్రోత్సాహకాలను అది కోరుకుంటుంది.
బహిరంగ ప్రోత్సాహకాలు
రెండు రకాల బహిరంగ ప్రోత్సాహకాలు అమలులో ఉన్నాయి. ఇందులో మొదటిది మొత్తం వలస పాలనావ్యవస్థ మొదటి ప్రపంచ యుద్ధం ముగిసే వరకు కీలక పాత్ర పోషించింది. వలసపాలనా వ్యవస్థ గురించి ఇక్కడ ప్రస్తావిస్తున్నానంటే భారత్, చైనా వంటి వలసవాద, అర్ధవలసవాద పాలనా యంత్రాంగాల గురించి వివరించడం కోసం కాదు. పెట్టుబడిదారీ వ్యవస్థలోని వలసవాదులకు ప్రవేశం కల్పించేందుకు స్థానికులను తరిమేసి వలసవచ్చిన పెట్టుబడిదారులతో వాటిని నింపేయడం. వీటినే సెట్లర్ కాలనీలుగా చెబుతున్నారు. వలసవాద పాలనా వ్యవస్థ పేర్కొన్న విధంగా పెట్టుబడిదారీ వ్యవస్థ కింద వృద్ధి రేటును ప్రోత్సహించింది. సెట్లర్ కాలనీలకు వలసవచ్చిన జనాభాతోపాటు లేదా శ్వేతజాతీయుల నివాసం కోసం తాత్కాలిక ప్రాంతాలను ఏర్పాటుచేయడం, ఈ ప్రాంతాలకు పెట్టుబడి సమాంతరంగా వలస వస్తుంది. వలసవాద, అర్ధ వలసవాద ప్రాంతాల నుండి మిగులు నిధులు విదేశీ పెట్టుబడుల రూపంలో వలస వస్తాయి. భారత్, ఇతర వలసప్రాంతాల నుండి తగిన మేరకు పెట్టుబడులు లభించకపోవడంతో సెట్లర్ కాలనీలకు ఇతర ప్రాంతాల నుండి పెట్టుబడుల ఎగుమతులు కొనసాగుతాయి.
ఇతర దేశాల కంటే ప్రధాన పెట్టుబడిదారీ దేశమైన బ్రిటన్ పెద్ద మొత్తంలో పెట్టుబడులు ఎగుమతులు చేసే దేశంగా పేరుగాంచింది. అమెరికా మాదిరిగా సెట్లర్ కాలనీలో పెద్ద ఎత్తున డిమాండ్ గల వస్తువులు ఆ దేశంలో ఉత్పత్తి కావు. ముడి సరుకులకే ఆ దేశంలో డిమాండ్ ఎక్కువగా ఉండేది. అంటే, ఖనిజాలు, ప్రాథమిక వస్తువులకు డిమాండ్ ఎక్కువగా ఉండేది. బ్రిటన్ నుండి వస్త్రాలు ఎక్కువగా ఎగుమతి అయ్యేవి వీటిని భారత్, ఇతర తూర్పు దేశాలకు ఎగుమతి చేసేది. బ్రిటన్ తమ వస్తువులను వలసవాద, అర్ధవలసవాద దేశాలకు ఎగుమతి చేసేది. బ్రిటన్ సరుకులను లోడింగ్ చేసేందుకు, మార్కెటింగ్ చేసేందుకు ఈ మార్కెట్లు ఉపయోగపడేవి. కావల్సిన మేరకు, ఏ సమయంలోనైనా ఈ సరుకులు దిగుమతి అయ్యేవి.
పెట్టుబడులు, సరుకుల రవాణా పెట్టుబడిదారీ వ్యవస్థలో అత్యంత సానుకూలంగా ఉండేది. 19వ శతాబ్దం మధ్య నుండి మొదటి ప్రపంచ యుద్ధం ముగిసే వరకు బూమ్ కొనసాగింది. మొదటి ప్రపంచ యుద్ధం తరువాత ఈ బూమ్ ముగిసింది. వలసప్రాంతాల్లో బూర్జువా శక్తులు విజృంభించాయి. ఆసియా మార్కెట్లలో బ్రిటన్‌కు జపాన్ పోటీగా తయారైంది. సరిహద్దు మూసివేయడంతో కొత్త ప్రపంచంలో పెట్టుబడులకు ఆస్కారం తగ్గిపోయింది. భారత్ వంటి దేశాల్లో కూడా పరిశ్రమల మూసివేత ప్రక్రియ ప్రారంభమైంది. 1930 దశకంలో మహా మాంద్యం పెట్టుబడిదారీ వ్యవస్థలో ఉత్సాహం నింపేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. పెట్టుబడిదారీ వ్యవస్థకు రెండవసారి భారీ ఎత్తున బహిరంగ ప్రోత్సాహకాలు అందించిన తరువాత గానీ మాంద్యం అంతం కాలేదు. ప్రభుత్వ వ్యయం యుద్ధ సన్నాహాలకు మాత్రమే పరిమితమైంది. యుద్ధం ముగిసిన తరువాత కార్మిక వర్గం ఒత్తిడి కారణంగా, సోషలిజం ఆవిర్భవించే పరిస్థితి ఎదురుకావడంతో ప్రభుత్వాలు అనివార్యంగా కొన్ని సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టాయి. డిమాండ్ మేనేజ్‌మెంట్‌లో ప్రభుత్వ జోక్యం కూడా క్రమంగా తగ్గింది. పెట్టుబడిదారీ వ్యవస్థలో ఆధిపత్యం చెలాయించే శక్తిగా అంతర్జాతీయ ఫైనాన్స్ పెట్టుబడి ఆవిర్భవించింది. ఇంతకుముందు పేర్కొన్న కారణాల రీత్యా ప్రభుత్వ జోక్యం మరింత తగ్గిపోయింది. నేటి పెట్టుబడిదారీ వ్యవస్థలో స్థిరమైన వృద్ధి సాధించేందుకు ఎటువంటి యంత్రాంగం లేదు.
పడిపోతున్న నిజ వేతనాలు
అటువంటి యంత్రాంగం మరింత ఎక్కువ అవసరమైన తరుణంలో పెట్టుబడిదారీ వ్యవస్థ దానిని కోల్పోతోంది. ప్రపంచీకరణ కారణంగా పెట్టుబడుల ప్రవాహం మునుపటి కంటే ఎక్కువైంది. విదేశీ రుణాలతోపాటు సరుకులు, సర్వీసుల ప్రవాహం ఇంతకంటే అధికమైంది. పెట్టుబడిదారీ వ్యవస్థ చరిత్రలోనే మునుపెన్నడూ లేనంత ఎక్కువగా ఈ ప్రవాహం ఉంది. మెట్రొపాలిస్ నుండి పెట్టుబడులు వర్థమాన దేశాలకు పెద్ద ఎత్తున తరలివెళుతున్నాయి. పెద్ద ఎత్తున కార్మిక రిజర్వ్‌లు ఉండటంతో ఆ దేశాల్లో కార్మికులు చౌకగా లభిస్తారు. ఉత్పత్తి అయిన వస్తువులు మెట్రోపాలిస్‌కు ఎగుమతి అవుతున్నాయి. వర్ధమాన దేశాల్లో కార్మికులు పెద్ద ఎత్తున అందుబాటులో ఉండటంతో మెట్రొపాలిటన్ దేశాల్లో నిరుద్యోగం ఎక్కువైపోతోంది. ఉదాహరణకు అమెరికాలో గత మూడు దశాబ్దాల్లో కార్మికుల నిజవేతనాలు సుమారు 30 శాతం తగ్గిపోయాయి. వర్ధమాన దేశాల్లో సైతం కార్మికుల నిజ వేతనాల్లో ఎటువంటి పెరుగుదల లేదు. దీనికి బదులుగా చిన్న కార్మికులు, చిన్న రైతులు ఉపాధి అవకాశాలు కోల్పోతున్నారు. ఇది కూడా ప్రపంచీకరణ ఫలితమే. దీంతో ఉపాధి లేని కార్మిక సైన్యం పెరిగిపోతోంది. పెట్టుబడిదారీ వ్యవస్థలో క్రియాశీలక పాత్ర పోషించే కార్మికుల నిజ వేతనాలు పడిపోతున్నాయి. మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఈ పరిణామం ద్యోతకమవుతోంది. నిజవేతనాలు తగ్గకపోయినా పెరుగుదల లేని పరిస్థితి నెలకొంటోంది. అదే సమయంలో కార్మికుల ఉత్పాదకత క్రమంగా పెరుగుతోంది.
కార్మికులకు లభించే ఉత్పత్తి విలువ పెట్టుబడిదారులకు లభించే రూపాయి విలువను పెంచుతోంది. మిగులు విలువలో కార్మికులకు లభించే వాటా క్రమంగా తగ్గిపోతోంది. ఇది కార్మికుల డిమాండ్ తగ్గిపోవడానికి కారణమవుతోంది. పెట్టుబడిదారుల పెట్టుబడులు పెరిగేకొద్దీ వారికి అదనపు ఆదాయం లభిస్తుంది. ఫలితంగా కార్మికుల డిమాండ్ తగ్గే పరిస్థితిని అధిగమించవచ్చు. అయితే పెట్టుబడిదారులు పెట్టే పెట్టుబడులు పెరగకపోవడం కాదు కదా, మరింతగా తగ్గుతున్నాయి. వారి పెట్టుబడులకు స్థిరమైన వృద్ధి లేకపోవడమే ఇందుకు కారణం. అవసరం కంటే అధిక స్థాయిలో ఉత్పత్తి కావడానికి ఈ పరిస్థితులు దోహదం చేస్తున్నాయి. ఫైనాన్స్ పెట్టుబడి వ్యతిరేకించడంతో ప్రభుత్వం ఈ పరిస్థితిని నివారించేందుకు అది వివిధ ప్రాజెక్టులు, పథకాలపై వ్యయం చేయలేని పరిస్థితిలో ఉంది. అందువల్ల తన అవసరాలకు అనుగుణంగా డిమాండ్‌ను సృష్టించే పెట్టుబడిదారీ వ్యవస్థ నిలకడైన అభివృద్ధికి దోహదం చేయకపోగా అభివృద్ధి స్తంభించిపోవడానికి దారితీస్తుంది. ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థ తప్పించుకోవడానికి మార్గాలు లేని వ్యవస్థాగత సంక్షోభంలో కూరుకుపోయింది. అంటే, దీనర్థం పెట్టుబడిదారీ వ్యవస్థ కుప్పకూలిపోతుందని అర్థం కాదు. 30వ దశకంలో మాదిరిగా ఇది చారిత్రాత్మక పరిణామాలకు దారితీసే పరిస్థితిలో ఉంది.
Prajashakti News Paper Dated 2/2/2012
-ప్రభాత్ పట్నాయక్
No comments:
Post a Comment