Saturday, February 25, 2012

జిన్నాకు ముందే ద్విజాతి సిద్ధాంతం - జిలుకర శ్రీనివాస్


సంస్కృతి నిర్వకల్పమైనది కాదనీ, అది ఆయా సమాజాల్లోని వివిధ సమూహాల ప్రత్యేకమైన, నైరూప్యమైన అంశాలతో పాటు ఆధిపత్య శక్తుల అభీష్టానుసారం నిర్మించబడుతోందనీ, దానికి సమాంతరంగా వ్యక్తీకరించబడే ప్రతివాదం కూడా సంస్కృతిలో అవిభాజ్యమైన అంశమని గుర్తించాలి. సాహిత్యం సాంస్కృతిక నిర్మాణమని భావిస్తే అది తప్పనిసరిగా రాజకీయ స్వభావాన్ని కలిగి ఉంటుంది. 

అందువల్ల పీడిత కులాలు, మతాలు చేసే సాహిత్య వ్యక్తీకరణలు నైరూప్యమైనవి కావు. వాటికి నిర్దిష్టమైన చారిత్రక నేపథ్యం, రాజకీయ పునాదీ ఉంటాయి. ముస్లిం కథలను అర్థం చేసుకోవాలంటే ఈ దృష్టిని అలవర్చుకోవాలి. స్కైబాబ అనేక ముస్లిం రాజకీయ కథలు రాశారు. అలాంటి ముస్లిం సంస్కృతిని వ్యక్తీకరించిన రాజకీయ కథల సంకలనమే 'అధూరె'. 

కనీజ్ ఫాతిమా ముందుమాటలో పేర్కొన్నట్టు ముస్లిం జీవితాలను అర్థం చేసుకోవటం ముస్లిమేతరులకు సులువేమీ కాదు. కాని, ఆ జీవితాలను నియంత్రిస్తున్న, నిర్దేశిస్తున్న పాలక కులాల రాజకీయాలు అర్థం చేసుకోలేని అమూర్త పదార్థమేమీ కాదు. ముస్లింలను పునరావాస శిబిరాల్లోకి నెట్టేసిన సమకాలీన దుస్థితికి గత రాజకీయ కారణాలను చారిత్రక దృష్టితో విశ్లేషించుకుంటేనే వాస్తవికత బోధపడుతుంది. సాహిత్యంలో వాస్తవికత పీడిత కులాలు రచనలు చేసే వరకు రూపొందలేదనేది విమర్శకులు అంగీకరిస్తున్నదే. 

అందువల్ల వాస్తవికత అనేది దానికదే ఆకృతి దాల్చేది కాదు. అది ఒక నిర్మాణం. రచయిత అనుభవంతోనూ గ్రహించిన జ్ఞానంతోనూ కొన్ని సామాజిక ప్రతిఫలనాలను వ్యక్తీకరిస్తాడు. అవి ఆ రచయిత కుల, మత, ప్రాంత, లింగ, జాతి వంటి నిర్దిష్టతల మీద ఆధారపడి ప్రతిఫలిస్తాయి. అందుకే బ్రాహ్మణ కథకులు రాసిన అనేక కథలు ఆ కులంలోని పరిస్థితులను, ఆ కులస్తుల మానసిక వర్తనను ప్రతిబింబించాయి. కాని, విశాలమైన బ్రాహ్మణేతర సమాజాన్ని అవి ప్రదర్శించలేకపోయాయి. శూద్రులు, అతిశూద్రులు, ముస్లింలు రచనలు చేయటం ప్రారంభించగానే అప్పటిదాకా వాస్తవికత అని భ్రమించినది కాస్తా కాల్పనికమైనదని రుజువైంది. 

అందుకే సమాజ వాస్తవికతను అర్థం చేసుకునేందుకు సాహిత్యేతర అంశాలను పరిగ్రహించాలి. 'అధూరె' సంకలనంలోని ముందుమాటలు స్కైబాబ కథలను అర్థం చేసుకొనేందుకు అవసరమైన సాహిత్య, చారిత్రక, రాజకీయ నేపథ్యాన్ని విభిన్న రూపాల్లో ఆవిష్కరించాయి. అఫ్సర్, కె.శ్రీనివాస్, కనీజ్ ఫాతిమా రాసిన ముందుమాటలు పాఠకులలో ఆసక్తి రేకెత్తిస్తాయి. వాచకానికి ముందుమాటలు అవసరం లేదనీ, ఆ రెండింటి మధ్య వున్న పితృపౌత్ర సంబంధాన్ని తెంచి పితృ హత్యకు పాల్పడాలని డెరిడా ఘీంకరించాడు. కానీ, పీడిత సమాజాల వ్యక్తీకరణలను వివేచించేందుకు డెరిడా సూత్రీకరణ సరిపోదు. 

కాలాన్ని పునర్నిర్మించుకొనేందుకు రచయిత ఆధునికత మీద ఆధారపడతాడనీ, ఆ క్రమంలో వర్తమానంలో నిలబడి గతాన్ని, అది సృష్టించిన మిధ్యా వాస్తవికతను గుచ్చి గుచ్చి ప్రశ్నిస్తాడు ఈ చారిత్రక స్పృహ వున్న రచయిత అంటారు, అఫ్సర్. స్థానిక అస్తిత్వ పునర్నిర్మాణంలో ఇది చాలా అవసరమైన సైద్ధాంతిక సాధనం అని కూడా ఆయన అంటారు. వాస్తవానికి ఆధునికత పేరుతో మన సమాజంలో చలామణిలో ఉన్నదంతా కులాధునికతే. బ్రాహ్మణ్యం ఆధునికత ముసుగు ధరించి వేసిన ఎత్తుగడలు, రాసిన రాతలు కాలాన్ని, దానికి సంబంధించిన అవగాహనను సెక్టేరియన్ పరిమితులలో బంధించింది. 

ఆధునికత గురజాడతో మొదలైనా గిడుగుతో వర్ధిల్లినా అంతా బ్రాహ్మణ్యమే. వలస పాలనలో ఆధునిక చరిత్ర రచన పేరుతో జరిగిన పుక్కిటి పురాణాల అల్లిక ముస్లిం వ్యతిరేకతనూ బ్రాహ్మణ కాల్పనిక స్వర్ణ యుగాలనూ సృష్టిస్తే, ఆ సృష్టికి మనువాదులే బాధ్యత వహించాలి. కాని, ప్రపంచంలో ఏ మానవ సమూహానికీ లేని సౌలభ్యం బ్రాహ్మణులకే ఉంది. 

అన్ని పొరపాట్లకూ చారిత్రక ఉత్థాన పతనాలకు తెల్లదొరలను బాధ్యులను చేసి చేతులు దులుపుకొనే ఆచారాన్ని నేటికీ కొనసాగిస్తున్నారు. కె.శ్రీనివాస్ కూడా హిందూ ముస్లింల మధ్య విభజనకూ ముస్లింల పట్ల వ్యతిరేకతకూ తెల్లదొరలనే బాధ్యుల్ని చేస్తున్నారు. కాని, కనీజ్ ఫాతిమా మాత్రం కుల వ్యవస్థలోని విభజన సూత్రమే మతపరమైన విభజనకూ రాజకీయ విభజనకూ పాదులు వేసిందనీ, ఆ విభజన సూత్రాన్ని తెల్లదొరలు తెలివిగా ఉపయోగించుకున్నారని చెప్తున్నారు. 

చరిత్రను కె.శ్రీనివాస్ వ్యాఖ్యానించే తీరు ప్రధాన స్రవంతి వైధానిక పద్ధతిలో ఉంటుంది. ఫూలే గురించి ఆయన అవగాహన దీనికి అద్దం పడుతుంది. 'దేశంలోని భిన్న కులాల అంతస్తుల సంబంధం మీద కాక, సొంత కులాన్ని ఆధునీకరించుకోవడం మీదనే సంస్కర్తల దృష్టి. దొంతరల సామాజిక వ్యవస్థ మీద తక్కిన సమకాలీన సంస్కర్తలందరి కంటె లోతైన అవగాహన, విమర్శ ఉన్నప్పటికీ ఫూలే కూడా ఆచరణ రంగంలో విద్యావకాశాలను అందరికీ అందించటం వంటి సంస్కార చర్యల మీదనే దృష్టి నిలిపారు' అని సూత్రీకరించారు. 

సామాజిక విప్లవానికి సైద్ధాంతిక పునాదులు వేసిన ఫూలే దార్శనికత, సైద్ధాంతిక వివేచన పట్ల అనేక వక్రీకరణలు జరిగాయి. ఫూలే కేవలం విద్యారంగంలో కృషి చేసిన ఉద్యమకారుడని పరిమితం చేయటం సంకుచితవాదం. బ్రాహ్మణాధిపత్యం నుండి మూలవాసులను విముక్తి చేసి బలిరాజ్యం స్థాపించాలన్న ఆశయమే ఆయన్ను ప్రజలను విజ్ఞానవంతులను చేయాలని సంకల్పించింది. దీని అర్థం అందరికీ బ్రాహ్మణీయ లేదా వలసవాద విద్యను అందించటం ఆయన ఉద్దేశ్యం కాదు. 

కుల వ్యతిరేక, బ్రాహ్మణ భావజాలానికి వ్యతిరేకమైన మూలవాసీ తత్వ చింతనను ప్రచారం చేయటం. ఆ భావజాలంతో ఎదిగిన తరాలను తన పోరాటానికి సంసిద్ధం చేసే రణనీతి ఆయన అనుసరించారు. 1848లో ప్రణాళికాబద్ధంగా ఆయన నడిపిన ఉద్యమం 1873లో వ్యవస్థీకృత నిర్మాణం పొందింది. సత్యశోధక్ సమాజ్ ఆధ్వర్యంలో శూద్ర రైతాంగ ఉద్యమం, కార్మికోద్యమం, వ్యవసాయ కార్మిక పోరాటం, మహిళా ఉద్యమం ఆయన నడిపారు. విధవ స్త్రీలకు శిరోముండనం చేసేందుకు నిరాకరిస్తూ మంగళి కులస్తులతో పుణా పట్టణంలో తొట్టతొలిసారి సార్వజనీన నిరవధిక సమ్మె చేయించిన విప్లవకారుడు ఫూలే. 

తన ఉద్యమంలో ముస్లింలు, సిక్కులు, క్రిష్టియన్లను భాగస్వాములను చేసి సామాజిక పరివర్తనకు అంకురార్పణ చేశాడు. అందువల్ల ఫూలే ఆచరణ రంగం బహు విశాలమైంది. అది ఈ దేశ కుల అంతర్వులను, వాటి మధ్య వున్న నిచ్చెన మెట్ల అధికార సంబంధాలను నిర్మూలించేది. కాని, ఫూలేని మరింత కురుచవాదంలో ఇరికించే ప్రయత్నం కె.శ్రీనివాస్ చేయటం విచారకరం. ఫూలేతో జిన్నాను పోల్చటం అహేతుకమైంది. 

మహ్మద్ అలీ జిన్నా వాస్తవానికి వైశ్యుడు. ఇస్లాం స్వీకరించిన వైశ్య కుటుంబసభ్యుడు. కాశ్మీరీ బ్రాహ్మణుడైన మోతిలాల్ నెహ్రూ వ్యక్తిగత కార్యదర్శిగా అనేక సంవత్సరాలు పనిచేశాడు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు. ఏ విధంగానూ ఇస్లామీయ జీవనం సాగించనివాడు. ఆయన్ని లౌకికవాది అంటారు. కాని వాస్తవానికి ఆయన బ్రాహ్మణవాది. కులాధిపత్య సామాజిక అంతర్వులున్న ఈ సమాజాన్ని స్వతంత్రం, సమానత్వం, బంధుత్వం, న్యాయం అనే విలువల ఆధారంగా పునర్నిర్మాణం చేయాలనే సంకల్పం ఏ కోశానా లేనివాడు. 

అందుకే కాంగ్రెస్ పార్టీ ఆయన్ని ఆల్ ఇండియా ముస్లిం లీగ్‌లో ప్రవేశపెట్టింది. ముస్లిం సమాజానికి నాయకత్వం వహిస్తున్న సర్ సయ్యద్ ఆగాఖాన్ వంటి వారిని దెబ్బతీయడానికీ, కాంగ్రెస్ రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకొనేందుకు అలీ జిన్నాను బ్రాహ్మణులే ప్రమోట్ చేశారు. రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగే వరకు అలీ జిన్నాకు గాంధీ పెద్ద గుర్తింపు ఇవ్వలేదు. 

ఆగాఖాన్ వంటి ముస్లిం నేతలు డా.అంబేద్కర్‌ను రౌండ్ టేబుల్ సమావేశాల్లో బలపర్చారు. ముస్లింల సహకారం వల్లే నా జాతి ప్రజలకు ప్రజాస్వామిక హక్కులను సాధించాను అని అంబేద్కర్ అన్నారు. ముస్లిం, అణగారిన వర్గాల మైత్రి బ్రాహ్మణీయ అగ్రకులాల ఆధిపత్యానికి గండి కొడుతుందని గ్రహించిన గాంధీ, నెహ్రూలు అలీ జిన్నాను ముస్లిం లీగ్ నేతగా ఎదిగేలా చేశారు. అలీ జిన్నా ముస్లిం నేతగా ఎదిగిన నాటినుండి అణగారిన వర్గాలకు దూరమై అగ్రకులాలకు చేరువయ్యాడు. 

వాస్తవానికి జిన్నా రాజకీయాల్లోకి రావడానికన్న ముందే ద్విజాతి సిద్ధాంతం ఉనికిలో ఉంది. 1857 తిరుగుబాటు కన్న ముందే బ్రాహ్మణులు, బ్రిటీషువాళ్లు జాతిఐక్యత సిద్ధాంతాన్ని ఆచరణలో పెట్టారు. 1875లో ఆవిర్భవించిన ఆర్యసమాజం ఆర్యజాతి సిద్ధాంతంతో రూపొందింది. ముస్లింలను ఒక జాతిగా చిత్రిస్తూ ముస్లిమేతరులను బ్రాహ్మణీకరించే క్రమం అప్పటికే మొదలైంది. బంకించంద్ర చటర్జీ ఆనంద్‌మఠ్ నవలలోనూ వివేకానంద, తిలక్ రచనల్లోనూ ఆర్యజాతి సిద్ధాంతం స్పష్టమవుతోంది. 

అది ముస్లిం వ్యతిరేకతను కేంద్రంగా చేసుకొని ప్రచారమైంది. పీడిత కులాలను బ్రాహ్మణీకరించేందుకు తయారు చేసినదే ద్విజాతి సిద్ధాంతం. దీనికి ద్విజులే జన్మప్రదాతలు. అందువల్ల ముస్లిం జాతి అనే భావన అలీ జిన్నాతో ఉనికిలోకి వచ్చింది కాదు. బ్రాహ్మణీకరించే (హిందూవీకరణ) క్రమం స్వతంత్రం తర్వాత మొదలైంది కాదు. కమ్యూనల్ రిప్రజెంటేషన్ అనే ప్రజాస్వామిక సూత్రాన్ని బ్రిటీషు వాళ్లు ప్రవేశ పెట్టడాని కన్న ముందే అది మొదలైంది. ఆ క్రమంలోనే అది చట్టసభల పరిచయంతో తీవ్రమైంది. 

సి.రాజగోపాలాచారి కాంగ్రెస్ పార్టీలో ప్రతిపాదించిన దేశ విభజన పథకాన్ని సి.ఆర్ ఫార్ములా అంటారు. దేశ విభజనకు ఎవరు కారకులనే దాని మీద నేటికీ విస్తృత చర్చ జరుగుతోంది. అలీ జిన్నాను బాధ్యున్ని చేసిన వారు సి.ఆర్ ఫార్ములా గురించి గానీ, గాంధీ నేతృత్వంలో బిర్లా హౌజ్‌లో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశంలో దేశ విభజనకు సమ్మతి తెలుపుతూ తీర్మానం చేసిన సంగతిని గానీ అస్సలే ప్రస్తావించరు. కానీ కనీజ్ ఫాతిమా విభజన రాజకీయాలను విపులీకరించిన తీరు ముదావహం. 

బ్రాహ్మణీయ శక్తులు దేశాన్ని హస్తగతం చేసుకొనేందుకు చేసిన దుర్మార్గమైన రాజకీయమే దేశ విభజన. ముస్లింలు, ఎస్సీ, ఎస్టీ, బిసీలు అధికార వంచితులు కావడానికీ, అధికార బదలాయింపు తర్వాత బానిసలుగా మారడానికి కారణమైంది. తెలంగాణ ముస్లింలు ఆంధ్ర వలసవాదంలో మగ్గిపోవడానికీ, హైదరాబాదీ తెహ్‌జీబ్ నాశనం కావడానికీ దేశ విభజన పేరుతో బ్రాహ్మణవాదులు అధికారం హస్తగతం చేసుకోవటమే కారణం. 

అందువల్ల ముస్లింల పతనానికీ, దురవస్థకూ, అణచివేతకూ స్థానిక మూలాలు వెతికితే సమాధానం దొరకదు. జాతీయ రాజకీయ పరిణామాలు, ఆధిపత్య భావజాల పునాదులను పట్టుకుంటేనే తెలంగాణ ముస్లింల దైన్యానికి కారణాలు బోధపడుతాయి. అందుకే కాబోలు కనీజ్ ఫాతిమా హక్కుల కార్యకర్తగా ముస్లిం అణచి వేతను ప్రత్యామ్నాయ దృక్పథం నుండి విశ్లేషించింది. వాస్తవానికి కనీజ్ ఫాతిమా ముందుమాట విషయ అవగాహనకే కాదు, సాహిత్య క్షేత్రంలో విశాలం కావాల్సిన నవీన దృక్పథానికి మార్గం చూపుతుంది. చరిత్రను ముస్లిం దృక్పథం నుండి చూడాలనే స్పృహను కలిగిస్తుంది. 

ముస్లిం కథా చరిత్రను నిర్మాణం చేసుకోవాల్సిన తక్షణ కర్తవ్యం మన ముందు ఉంది. సాహిత్య చరిత్ర రచనలో దేశ విభజన కాలం విస్మరించబడింది. స్వతంత్రానికి పూర్వం, స్వాతంత్య్రోత్తర తెలుగు కథ వంటి భావనలే సాహిత్యకారులు నమ్ముతూ వచ్చారు. కానీ దేశ విభజన సందర్భంగా ముస్లిం రచయితలు రాసిన కథలేమిటి? వాటిలో వ్యక్తమైన ప్రతిస్పందనలేమిటీ? వాటిని పాఠకులు ఏ రకంగా స్వీకరించారు? దేశ విభజన సమయంలో ముస్లిమేతర రచయితలేమి రాశారు? 

అభ్యుదయ కథకులు, సంప్రదాయ కథకులు ఆ సమస్యను ఏ విధంగా అర్థం చేసుకున్నారు? ఒకవేళ ఆ ముఖ్యమైన సంఘటన పట్ల రచయితలు మౌనం వహిస్తే, దానికి గల కారణాలేమిటి? వంటి అనేక అంశాలను పరిశీలించాలి. దేశ విభజన వల్ల తలెత్తిన సామాజిక అశాంతి, ముస్లింల మీద జరిగిన దమనకాండ ఆనాటి ప్రజల మనసులను వెంటాడుతూనే ఉంటుంది. దేశ విభజన సమయంలో హైదరాబాదు రాజ్యంలో సంభవించిన రాజకీయ మార్పులు ముస్లింలనే కాదు ఇతర కులాలను కూడా తీవ్రంగా ప్రభావితం చేశాయి. 

ఆ జాతీయ సమస్యకు హైదరాబాదీ రచయితలు ఏ విధంగా స్పందించారో పరిశోధించాల్సి ఉంది. కోస్తాంధ్ర రచయితలే కాదు, మద్రాసు కేంద్రంగా పనిచేసిన రచయితల అవగాహన ఏమిటో కూడా నమోదు కాలేదు. అవి నమోదు అయి ఉంటే, ఆ రచనలు అందుబాటులో ఉండి ఉంటే ముస్లిం సాహిత్య గమనం, గమ్యం మరోవిధంగా ఉండేది. ముస్లిం సాహిత్యం బాబ్రీ మసీదు విధ్వంసం తర్వాత ఆరంభమయ్యేది కాదు. స్కైబాబ కథలు మరో విధంగా ఉండేవి. 

- జిలుకర శ్రీనివాస్
Andhra Jyothi News Paper Dated 23/1/2012 

No comments:

Post a Comment