Wednesday, February 8, 2012

ఎందుకీ 'రాజ్య' హోదా?
- మైపతి సంతోష్‌కుమార్

అతిపెద్ద జాతర అయిన సమ్మక్క సారలమ్మ జాతరను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 'స్టేట్ ఫెస్టివల్'గా ప్రకటించింది. స్వాతంత్య్రం లభించి 64 సంవత్సరాలు పూర్తైన తరువాత కూడా గిరిజనులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో విఫలమైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనుల పట్ల తమకు ఎనలేని ప్రేమ ఉన్నట్లు నటిస్తూ ఈ జాతరను 'స్టేట్ ఫెస్టివల్'గా ప్రకటించడం హాస్యాస్పదం. దీని వల్ల గిరిజనులకు అదనంగా జరిగిందేమీలేదు. ఒకవైపు ఆదివాసీల మీద 'ఆపరేషన్ గ్రీన్ హంట్' పేరుతో ప్రభుత్వం యుద్ధం ప్రకటించింది. 

కవ్వాల్ అభయారణ్య ప్రాంతాలలో నివశిస్తున్న గోండులను తరిమి వేయడానికి కుట్రపన్నింది. పోలవరం పేరుతో ఖమ్మం జిల్లాలోని ఆదిమవాసులను ముంచడానికి ప్రయత్నిస్తోంది. బాక్సైట్ నిక్షేపాల పేరుతో ఆంధ్ర ప్రాంత ఆదిమవాసులను బహుళజాతి కంపెనీలకు తాకట్టు పెట్టింది. ఇప్పుడు మేడారం గూడెం వాసులను కూడా తరలించేందుకు కుట్రపన్నుతోంది. ఆదివాసీ ప్రజాసమస్యలను పరిష్కరించడంలో విఫలమయిన ప్రభుత్వాలు ప్రజలను పక్కదారి పట్టించేందుకు చేసే ప్రయత్నాలుగా వీటిని ప్రజలు భావిస్తున్నారు. ఆదివాసులకే పరిమితమైన ఈ జాతరలో గిరిజనేతరులు ప్రవేశించారు. అడవుల సంరక్షణ తమ ధ్యేయంగా ప్రకటించే ప్రభుత్వం యాత్రికుల సౌకర్యార్థం పేరుతో విచక్షణా రహితంగా అడవులను చట్టబద్ధంగా నాశనం చేస్తున్నది. 

ఈ జాతర వల్ల రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు అధిక సంఖ్యలో లాభం చేకూరుతుంది. కానీ మేడారం, కాల్వపల్లి, ఊరట్టం, నార్లాపూర్ పరిసర గ్రామాలలోని ప్రజల జీవనవిధానం చిన్నాభిన్నమౌతుంది. సుమారు కోటి మందికి పైగా హాజరయ్యే ఈ జనసందోహం అక్కడ ప్రజల జీవన పరిస్థితులను అతలా కుతలం చేస్తోంది. కాకతీయుల కాలం నుంచి ఆంగ్లేయుల వరకు గిరిజనులు తమ స్వయం ప్రతిపత్తి కోసం పోరాటాలు చేస్తూ ఉన్నారు. 1890లో ఆంగ్లేయులకు వ్యతిరేక పోరాటం సాగించిన భిర్సాముండ బ్రిటీష్ ప్రజాస్వామ్య వాదుల గుండెల్లో రైళ్ళు పరిగెత్తించారు. 

1940 ప్రాంతంలో ఆదిలాబాద్ జిల్లాలో గిరిజనుల హక్కుల కోసం నైజాంకు వ్యతిరేకంగా కొమురంభీం చేసిన పోరాటం చరిత్రలో మరువలేనిది. ఈ చార్రితక పోరాటాల క్రమాన్ని అర్థం చేసుకొని గిరిజనులు మెలగాల్సిన సమయమిది. పెట్టుబడిదారీ సమాజం నాశనం చేసిన కళాత్మక, సామూహిక జీవనం గిరిజనులలో ఉంది. అన్యాక్రాంతమయిన భూములను గిరిజనులకు స్వాధీనం చేసే విషయంలో 1980 నుంచి ప్రభుత్వం చూపుతోన్న అలసత్వానికి వ్యతిరేకంగా పోరాడాలి. 

ఆదిమవాసుల భూముల పరిరక్షణ కోసం నిర్దేశించిన 1/70 చట్టాన్ని యథాతథంగా అమలు చేయడానికి ఆదిమవాసులు మరోసారి ఉద్యమించాల్సిన అవసరముంది. అంతేకాకుండా శ్రామికవర్గ ప్రజాస్వామ్యాన్ని అమలుచేసే క్రమంలో ఆదిమవాసులు మమేకం కావాలి. దేశవ్యాప్తంగా శ్రమైక జీవన సౌందర్యానికి జీవం పోసే సంస్కృతిలో ఆదిమవాసులు భాగం పంచుకున్నప్పుడే తమ పూర్వీకులు చేసిన పోరాటాలకు నిజమైన సార్ధకత కలుగుతుంది. అందుకోసం గిరిజనులంతా ఉద్యమించాలి. అప్పుడే సమ్మక్క సారలమ్మలకు నిజమైన నివాళి. సమ్మక్క సారక్క జాతరలో లభించే మొత్తం ఆదాయాన్ని మేడారం పరిసర గ్రామాల అభివృద్ధికి ఖర్చు చేయాలి. 1/70 చట్టాన్ని ఖచ్చితంగా అమలుచేసి ఆదివాసేతరులు ఆక్రమించుకున్న భూములను ఆదివాసీలకు అప్పగించాలి. 

'స్టేట్ ఫెస్టివల్' కాదు గిరిజన గ్రామాల స్వయం అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేయాలి. గిరిజనులకు ప్రభుత్వం అన్నివిధాలుగా సౌకర్యాలు కలిగించాలని, తోడ్పడాలని, ఎలుగెత్తే హేతువాదులు ఆదివాసీల నమ్మకాలను సైతం గౌరవించాలి. అప్పుడే వారిని నిజంగా అర్థం చేసుకున్నట్లు. జాతిజీవన విధానమే సంస్కృతి. సంస్కృతిని వేరు చేసి జాతిని ఉద్దరించే కార్యక్రమం వేరుగా ఉండదు. (మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర సందర్భంగా 2000 సంవత్సరంలో జాతర సమయంలో ఒక కరపత్రం చేశారు. అందులో సంక్షిప్తంగా ఒక పుట సమ్మక్క చరిత్ర ప్రచురించారు. ఇవికాక ఒగ్గుకథలు ప్రచారంలో ఉన్నాయి. 

ఇంకా 'ఉయ్యాలపాటలు', 1991 అక్టోబర్‌లో ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ సంక్షేమశాఖ వారు సాంస్కృతిక పరిశోధన శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో డా.వి.ఎన్.వి.కె.శాస్త్రి, ఎ. శ్రీరాములు గార్ల పన్నెండు పుటల కరపత్రం ఒకటి విడుదల చేశారు. ఇంకా ఆ ప్రాంతపు పూజారులు కథలు చెప్పున్నారు. ఇలా భిన్నమైన కథలు ప్రచారంలో ఉన్నవి. వాటిలో ఏవి సత్యాలో ఏవి అసత్యాలో చెప్పడం కష్టం. శిలాశాసనాలు, నాణేలు, 'మార్కోపోలో' వంటి వారి రాతలు ఇలాంటివేవి లభించనప్పుడు ఎవరికి వారు తాము రాసిందే ప్రామాణికమని చెప్పవచ్చు. కొన్ని కథలు పరిశీలిస్తే సమ్మక్క బంధువుల పేర్లు ఒకరు చెప్పింది మరొకరు చెప్పడం లేదు. 

సమ్మక్క పులిఎక్కి తిరగడం, రోగాలను నయం చేయడం, పాములను వెంట వేసుకొని తిరగడం వంటి ఆమె మహత్తులకు నిదర్శనాలను, నమ్మకాలను కల్పితాలు అనడానికి ఆధారాలేమిటి? సమ్మక్క-సారలమ్మ చరిత్ర నేటికీ ఒక ప్రశ్నగానే మిగిలిపోయింది. అందుకు పరిష్కార దశలో పరిశోధనలు జరగకపోవడం ఒక కారణం అయితే సమ్మక్క-సారలమ్మ చరిత్ర తప్పుడు ప్రచారం చేయడం ఒక భాగం. నాగరిక సమాజానికి సంస్కృతి నేర్పిన ఆదిమవాసీ సంస్కృతి మరుగున పడిపోయింది. 

అయినప్పటికీ నేడు జరిగే సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చే భక్తులను చూస్తుంటే, దయానంద సరస్వతి చెప్పినట్లుగా (ఎౌ ఆ్చఛిజు ్టౌ గ్ఛఛ్చీట) అన్పిస్తుంది. నేటికీ ప్రచురణలో ఉన్న చరిత్ర నమ్మశక్యంగా లేదు. ఎందుకంటే ఆదిమవాసీ సంస్కృతిని హిందూ సంస్కృతితో పోల్చ డం ద్వారా కల్మషమవుతుంది. కొందరు సమ్మక్క సారలమ్మలు కాకతీయులతో యుద్ధంచేసి అమరులైనారు అంటారు మరికొందరు మహాభారత కథకు సంబంధం ఉందంటారు. ఇది అవాస్తవం. 

ఆదిమవాసులు ప్రకృతిని దైవంగా భావిస్తారు. చెట్లను, జంతువులను, పుట్టలను మొదలగువాటిని ఆరాధిస్తారు, రక్షిస్తారు. విగ్రహ ఆరాధన హిందువుల లాగా చేయరు. కానీ ఇప్పుడు ఆదిమవాసీ సంస్కృతి క్రైస్తవ, హైందవ పరాయీకరణ దిశగా ఉంది. సమ్మక్క-సారలమ్మ చరిత్ర ప్రపంచానికి తెలియాలంటే ఆదిమవాసుల్లో ఒకరుగా అందరూ అంగీకరించే కోయదొరల చరిత్ర బయటకు రావాలి. వీరి సంస్కృతి, సంప్రదాయాలు చరిత్రలో రాయాలి. సరిగ్గా మాఘశుద్ధ పౌర్ణమి మాసంలోనే దండకారణ్య ప్రాంతంలో చత్తీస్‌ఘడ్, ఒరిస్సా, ఆంధ్ర, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ప్రాంతాలలో నివసించే ఆదిమవాసులు వారివారి దేవతలను పూజించుకుంటారు. 

నాగరిక ప్రపంచానికి సమ్మక్క-సారలమ్మ చరిత్ర కేవలం 5 శాతం మాత్రమే తెలుసు. ఇంకా 95 శాతం మరుగున పడి ఉంది. దండకారణ్యంలో నివసించే కోయదొరలలో 23 మంది దేవుళ్లుగా చెప్పుకుంటారు. ఒక్కొక్కరి చరిత్ర ఒకరితో ముడిపడి ఉంటుంది. అలాగే సమ్మక్క చరిత్ర కూడా మిగతా దేవుళ్ళతో అనుబంధం ఉంటుంది. సమ్మక్క అసలు పేరు కొరుకొండ సడలమ్మ అంటారు. (తూర్పుగోండ్వానా ప్రాంతాన్ని పరిపాలించే చెరంపోయినా రాజు వంశస్థురాలు) ఆదిమవాసీ దేవతల చరిత్ర మొత్తం దాల్వాయి దలపతి, ఆర్తిబిడ్డ వారితో ఉంటుంది. కోయలలో 3వ గొట్టు, 4వ గొట్టు, 6వ గొట్టు, 7వ గొట్టుగా చెప్పుకోవ చ్చు. వీరి పూర్తి చరిత్ర ఒకరితో ఒకరికి ముడిపడి ఉంటుంది. వీరిని పూర్తిగా పరిశోధన చేసినప్పుడే చరిత్రపూర్తిగా తెలుసుకోవచ్చు. 

కోయదొరల సంస్కృతి, సంప్రదాయం వారి కట్టు, బొట్టు వారి గొట్టులను బట్టి ఉంటుంది. వడ్డెబోయిడు లేనిదే ఏకార్యం కూడా జరగదు. అటవీ ప్రాంతమైన ఆదివాసీ మనుగడకోసం వేటనూ ప్రారంభించిన మన నీతి, నియమాలు, ఆచార వ్యవహారాలు, సం స్కృతి ఎంతో విశిష్టంగా కనిపిస్తాయి. వారు నమ్మే దేవత చుట్టూ అవి అల్లుకొని ఉంటాయి. ఏడాది పొడవునా దేవతను కొలుస్తూ అడవిలో లభ్యమయ్యే వస్తువులను మనంచేసే పనులను కార్తెల ప్రకారం అత్యంత వైభవంగా పండుగలు చేస్తూ పిల్ల, పెద్ద, ముసలి ముతక సంబరాలు చేసుకుంటారు. అదే మన నమ్మకం. 

సూరాల పండుగ, వెన్నుగట్టిపండుగ, కొత్తల పండుగ, చిక్కిడుకాయకోత పండుగ, మండమెలిగి పండుగ, విప్పపూవు పండగలుగా పిలుచుకుంటూ నీతి నియమాలు మరువక ఆచార వ్యవహారాలలో అత్యంత వైభవంగా పండుగలు చేసుకోవడం ఆదిమవాసులలో ఇప్పటికీ ఆనవాయితీగా వస్తోంది. కోయవారి జీవన సమరంలో జరిగే ప్రతి అంశానికి సమ్మక్కతో అవినాభావ సంబంధం ఉంది. పెళ్లికి ముందు పెళ్లిలో, పెళ్లి తర్వాత పండుగలో మంచికీ చెడుకూ సమ్మక్కే ప్రధాన దైవం. ఈ జాతర పూర్వాపరాలను పరిశీలిస్తే ప్రకృతిని దేవతగా భావించి పూజించడం ప్రకృతిలో లభించే వాటికి పండుగలు చేయడం ఆదిమవాసీ సంస్కృతిలో ఒకభాగం అని అర్థమవుతుంది. 

భర్తగా పగిడిద్దరాజు ఉన్నా, స్త్రీ శక్తికి (సమ్మక్క) ఎక్కువగా విలువ ఇవ్వడం మాతృస్వామ్య వ్యవస్థకు సంకేతంగా కనబడుతుంది. మాదేవుళ్ళు, దేవతల పేర్లమీద ఆదిమవాసులలో చాలామంది స్త్రీ, పురుషులకు పేర్లు పెట్టుకోవడం విశేషం. రోళ్ళగోడ్డ రాజ్యంలో బండానిరాజు (5వగట్టు) పెద్దవాడు దాట్లవారి ఇంట్లో సమ్మక్క పుట్టింది. దనసరి వారింటికి వచ్చి దంచడం నేర్చింది. చెలవారి ఇంటికి వచ్చి చెరగనేర్చింది. ఆలం వారి ఇంటికొచ్చి ఆరుగలకడం నేర్చింది. మల్లెలవారింటికి వచ్చి ముగ్గులు వేయడం నేర్చింది. సిద్దబోయిన వారింటికి పోయి దివిటి సెద్దెలు మోసింది. అక్కడి నుండి బయక్కపేట చందవారి ఇంటికివెళ్ళి నాకెవ్వరూ లేరు అని బొంకింది. 

- మైపతి సంతోష్‌కుమార్
కాకతీయ యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్
(మేడారం ప్రాంత స్థానిక ఆదివాసీ)
Andhra Jyothi News Paper Dated 09/02/2012 

No comments:

Post a Comment