Saturday, February 25, 2012

అన్ని అనర్థాలకు మూలమైన దినం -సంగిశెట్టి శ్రీనివాస్


సెప్టెంబర్ 17కు చరిత్రలో ఎలాంటి ప్రాధాన్యముందో చూద్దాం. 1998లో బిజెపి ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు 'విమోచన' అనే పదం మొదటిసారిగా తెరమీదికి వచ్చింది. ఆ పార్టీ అంటున్నట్టు 1948 సెప్టెంబర్ 17న 'ముస్లిం పాలకుని నుంచి విముక్తి' దొరికితే ఆ తర్వాత కూడా సర్వాధికారిగా నిజాం ఎలా కొనసాగాడు? 1950 ఏప్రిల్ 1న నిజాంకు, భారత ప్రభుత్వానికి ఒక ఒప్పందం కుదిరింది. 

దాని ప్రకారం నిజాంకు ఏడాదికి (ఎలాంటి పన్నులు లేకుండా) యాభై లక్షల రూపాయల భరణం చెల్లించడానికి నిర్ణయం జరిగింది. అలాగే నిజాం ప్రపంచంలో ఎక్కడ పర్యటించినా ఆయనకు హైదరాబాద్ రాజుగా పూర్వపు బిరుదులు యథాతథంగా కొనసాగించేందుకు భారత ప్రభు త్వం అంగీకరించింది. 1950 జనవరి 26వరకు ప్రభుత్వాధినేతగా, తర్వాత 1956 అక్టోబర్ 31 వరకు రాజ్ ప్రముఖ్‌గా నిజాం ఉన్నారు. ఈ గౌరవం కాశ్మీర్‌ని భారత్‌లో కలిపిన హరిసింగ్‌కు కూడా దక్కలేదు. 

ఏకు మేకై తన మాటని కూడా ఖాతరు చేయని కాసిం రజ్వీ నాయకత్వంలోని రజాకార్లను అణచివేయడానికి తప్పనిసరి పరిస్థితుల్లో నిజాం కూడా భారత ప్రభుత్వానికి సహకరించాడు. రజాకార్లు తీవ్రం గా వ్యతిరేకించినా హైదరాబాద్ న్యాయ సలహాదారుగా సర్ వాల్టర్ మాంక్‌టన్‌ని కొనసాగించడం ఇందుకు నిదర్శనం. 

రజాకార్లంటే కేవలం ముస్లింలనే భావన ఉంది. ముస్లింలతో బాటుగా శ్యామ్ సుందర్, బి.ఎస్.వెంకటరావు, పీసరి వీర న్న లాంటి దళిత నాయకుల ప్రభావంతో ముస్లింలుగా మారిన దళితులు, దొరలు, భూస్వాములతో పాటుగా వారి అనుచరగణం కూడా రజాకార్లలో ఉన్నారన్న విషయం మరువరాదు. 

'విమోచన' అంటే స్వేచ్ఛ లభించడం. హైదరాబాద్ సంస్థాన ప్రజలకు విమోచనద్వారా స్వేచ్ఛ లభించకపోగా 'పెనం నుంచి పొయ్యి'లో పడ్డట్టయింది. మరట్వాడా, కర్ణాటక ప్రాంతాల్లో భార త సైన్యం వేలసంఖ్యలో అమాయక ముస్లింలను ఊచకోత కోసిం ది. ఈ విషయాన్ని నెహ్రూ నియమించిన సుందర్‌లాల్ కమిటీ తేల్చిచెప్పింది. కొంతమంది మేధావులు యుద్ధం జరిగితే ప్రాణనష్టం ఉంటుందని చెబుతున్నారు. 

యుద్ధంలో మరణాలు ఏకపక్షంగా ఉండవనేది తెలిసిందే. నిజాంపై యుద్ధాన్ని 'పోలీస్ చర్య' గా భారత ప్రభుత్వం ప్రచారం చేసింది. అంతర్జాతీయ సమాజం నుంచి వచ్చే విమర్శలను తప్పించుకునేందుకే ఆ సైనిక దాడిని పోలీస్‌చర్యగా పిలిచారు. భారత ప్రభుత్వ చర్యను ఖండిస్తూ నిజాం ప్రభుత్వం ఐక్యరాజ్యసమితికి ఫిర్యాదు చేసింది. భద్రతామండలిలో కేసు విచారణకు వచ్చి భారత్‌పై చర్య తీసుకోవడం ఖాయం అనిపిస్తున్న దశలో నిజాంను ఒప్పించి కేసు ఉపసంహరించుకునేలా చేశారు. 

మహారాష్ట్ర, కర్ణాటకలలో 'విమోచన' జరుపుతున్నారు కాబట్టి తెలంగాణలో కూడా 'విమోచన' పండుగ జరపాలని బిజెపి డిమాండ్ చేస్తున్నది. నిజానికి బిజెపి భాగస్వామ్య ప్రభుత్వాలున్న కాలంలోనే ఆయా రాష్ట్రాలలో 'విమోచ న' పండుగ జరపడం ఆరంభమయింది. అంతేకాకుండా మర ట్వాడా, కర్ణాటక ప్రాంతాలు భాషా పరంగా ఆయా రాష్ట్రాలతో మమేకమయ్యాయి. కాని తెలంగాణలో ఆ పరిస్థితి లేదు. ఆంధ్ర వారితో తెలంగాణ వాసులు మమేకం కాలేకపోయారు. అందుకే ఇక్కడ 'విమోచన'కు భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. 

'పోలీస్ చర్య'ను విలీనం అనడానికి వీల్లేదు. ఇరువర్గాల సమ్మ తి మేరకు కలిసిపోతే విలీనం జరిగినట్టు లెక్క. భారత సైన్యం చర్యను నాటి అంతర్జాతీయ పత్రికలన్నీ దురాక్రమణగా పేర్కొన్నా యి. సెప్టెంబర్ 17 తరువాత కూడా నిజాం పేరిటనే ఫర్మానాలు విడుదలయ్యాయి. భారత సర్వోన్న త న్యాయస్థానం కూడా అనేక సందర్భాల్లో హైదరాబాద్ స్వతంత్రదేశం కనుక దానికి సంబంధించిన విషయాలు తమ పరిధిలోకి రావని తీర్పునిచ్చింది. 

నిజానికి విలీనమంటే ఇక్కడి ప్రజలకు ఎంతో కొంత మేలు జరగాలి. కానీ తెలంగాణకు తీరని అన్యాయం జరిగింది. ఉద్యోగాలు పోయాయి. పరాయి పాలనకు తెర లేచింది. ప్రజలు సాధించుకున్న భూమి భూస్వాముల పాలయింది. అన్ని అనర్థాలకు మూలకారణమైన దినాన్ని పండుగలాగా ఎలా చేసుకోగలం? 

పోలీస్ యాక్షన్ తర్వాత ప్రభుత్వం మద్రాసు నుండి ఇబ్బడి ముబ్బడిగా ఉద్యోగులను దిగుమతి చేసుకుంది. వీరందరూ అప్పటివరకు హైదరాబాద్ రాజ్యంలో ఉన్నతోద్యోగాల్లో ఉన్న ముస్లింలు ఇతర దేశాలకు వలసపోగా వారి స్థానాల్లో వచ్చినవారే! వీరు ఇక్కడి ప్రజలకు భాష రాదు, తెలివిలేదు, తాము అవి నేర్పడానికి వచ్చినవారమన్నట్టు అహంభావం ప్రదర్శించారు. అది ఇప్పటికీ కొనసాగుతున్నది. వీరంతా కిందిస్థాయి ఉద్యోగాలు కూడా తమ ప్రాంతం వారికే కట్టబెట్టేవారు. 

దీనికి నిరసనగా 1952 సెప్టెంబర్‌లో ముల్కీ ఉద్యమం ఉధృతంగా వచ్చింది. డజన్‌కు పైగా విద్యార్థులు పోలీసు కాల్పుల్లో చనిపోయారు. ఇందుకు కారణమైన సెప్టెంబర్ 17ను పండుగలాగా చేసుకుందామా? ఆనాడు 'ఆజాద్ హైదరాబాద్' అనే నినాదమిచ్చిన కమ్యూనిస్టులు కూడా నేడు సెప్టెంబర్ 17ను పండుగలాగా చేసుకోవాలంటే ఆశ్యర్యంగా ఉంది. తెలంగాణకు ఏమీ ఇవ్వని సెప్టెంబర్ 17 కన్నా రాబోయే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు రోజునే పెద్ద పండుగలాగా జరుపుకుం దాం. ఆ శుభ దినం కోసం అందరం కలిసికట్టుగా పోరాడుదాం. 

-సంగిశెట్టి శ్రీనివాస్, తెలంగాణ హిస్టరీ సొసైటీ
Andhra Jyothi News Paper Dated : 15/9/2010

No comments:

Post a Comment