Tuesday, February 14, 2012

మాయావతి అజేయురాలేనా? - ఎ.కృష్ణారావుఆరు దశల ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో మూడు దశలు పూర్తి కావస్తున్న తరుణంలో కూడా ఆ రాష్ట్రంలో ఎవరు అధికారంలోకి రాగలరన్న స్పష్టత ఏర్పడలేదు. భారత దేశంలో తొలి దళిత మహిళా ముఖ్యమంత్రి మాయావతి మళ్లీ అధికారంలోకి వస్తారా లేదా అన్నదే కీలక ప్రశ్న. ఎవరు కాదన్నా, మాయావతి దేశంలో దళిత చైతన్యానికి ప్రతీక. తమ వర్గానికి చెందిన బిడ్డ ముఖ్యమంత్రి అయ్యారని దళితులు సగర్వంగా చెప్పుకోవడానికి ఆస్కారం కలిగించిన మహిళ మాయావతి. కాంగ్రెస్‌లో దళిత నాయకుల మాదిరి ఏ అధిష్టానానికి తలవంచ వలసిన అవసరం మాయావతికి లేదు. ఏ అగ్రవర్ణ నాయకుడి అడుగులకు మడుగులు తొక్కాల్సిన అవసరం ఆమెకు లేదు. 

ఒక దళిత మహిళ తలెత్తుకుని, సగర్వంగా తిరుగుతూ, మంత్రులను, అధికారులను ఎడాపెడా మార్చేస్తూ చండశాసనురాలిగా కనపడడం దళితులందరికీ గొప్ప విషయం. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా మాయావతి దళితులకోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. పేద దళిత కుటుంబాలకు పింఛన్లు రెట్టింపు చేయడం, దళిత మహిళల వివాహాలకు రు. 10 వేల చొప్పున సహాయం చేయడం, దళితుల రుణాలను రద్దు చేయడం, ప్రభుత్వ నిర్మాణ కార్యక్రమాల్లో దళితులకు రిజర్వేషన్ కల్పించడం, వ్యవసాయదారులకు, చిన్న, మధ్యతరహా రైతులకు వేల కోట్ల రుణాలు కల్పించడం వంటి చర్యలెన్నో చేపట్టారు. 

ఇవన్నీ ఒక ఎత్తు అయితే దళిత, అత్యంత వెనుకబడిన వర్గాల్లో ఆత్మస్థైర్యం కల్పించే విధంగా వారి అభ్యున్నతికి పోరాడిన దళిత నేతలు అంబేద్కర్, జ్యోతిరారావు ఫూలే, సాహూజీ మహారాజ్, పెరియార్ రామస్వామి, కాన్షీరామ్ మొదలైన వారి విగ్రహాలను అడుగడుగునా నెలకొల్పారు. వాటితో పాటు తన విగ్రహాలనూ ఏర్పర్చి తననొక సజీవ చారిత్రక స్త్రీగా చిత్రించుకునే ప్రయత్నం చేయడంలో ఔచిత్యం అటుంచితే ఈ దేశంలో ముఠానాయకుల, దోపిడీదారుల అనేక విగ్రహాలను ఎన్నో నెలకొల్పిన సమయంలో మాయావతి నెలకొల్పిన విగ్రహాలు వేల కోట్లు మెరుగు. 

ఈ విషయంలో ఆమె నిర్ణయాలను ప్రజలు ప్రశ్నించే అవకాశం ఉన్నది కాని ఒక తొలి దళిత మహిళా ముఖ్యమంత్రి విగ్రహాలపై ముసుగులు కప్పిన ఎన్నికల కమిషన్ చర్య అనేక తప్పుడు సంకేతాలకు కారణమైంది. ఈ విగ్రహాలే కాదు, బౌద్ద్దమే దళితుల విముక్తి సాధనమని, అదే ఈ దేశంలోని అసమానతలను రూపుమాపగలదన్న అంబేద్కర్ సిద్దాంతాన్ని కార్యరూపం చేసేందుకు మాయావతి గౌతమ బుద్దుడి విగ్రహాలనూ నెలకొల్పారు. ఒక జిల్లాకే గౌతమ బుద్ద నగర్ అని పేరుపెట్టారు. 

మరి ఇలాంటి మాయావతి ఈ సారి ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో ఎదురుగాలులు ఎదుర్కొంటున్నారంటే, తిరిగి అ«ధికారంలోకి రావడం అంత సులభం కాదని పరిశీలకులు చెబుతున్నారంటే దళితుల చైతన్యాన్ని కోరుకునే వారికి బాధ కలిగించే విషయమే. మాయావతి అధికారంలో ఉండడం అనేక ఆధిపత్య శక్తులకు సహించలేని విషయం. ఈ సారి అన్ని శక్తులూ ఎదురై మాయావతిని గద్దెదించేందుకు సమాయాత్తమవుతున్నారు. 

దళితుల ఆశాకిరణం, చైతన్య జ్యోతి, స్ఫూర్తి కావల్సిన మాయావతి ఎందుకు పరాజయపు టంచుల్లో ఉన్నారు? ఈ దేశంలో దళితులు మళ్లీ తమ బిడ్డను ముఖ్యమంత్రిగా చూడగలుగుతారా? లేక వారు ఎప్పటికీ అగ్రవర్ణ దయాదాక్షిణ్యాలపై, వారిచ్చే రాయితీలు, రిజర్వే,న్లకోసం పోరాడుతూ ఉండాల్సిందేనా? మళ్లీ అధికారంలోకి మాయావతి రాలేకపోతే అందుకు ఆమె తప్పిదాలు ఎంతవరకు కారణం? 

2007లో మాయావతి భారీ మెజారిటీతో అధికారంలోకి రావడానికి అనేక కారణాలు దోహదం చేశాయి. సమాజ్‌వాది పార్టీ సర్కార్ చేసిన అనేక ఘోర తప్పిదాలు, పెంచి పోషించిన నేర సంస్క­ృతి నేపథ్యంలో ఎస్‌పిని ఢీకొనగల ప్రత్యామ్నాయ పార్టీగా ప్రజలు బిఎస్‌పిని గుర్తించారు. మాయావతి దీన్ని అవకాశంగా మలుచుకుని బహుజనుల నుంచి సర్వజనుల పార్టీగా బిఎస్‌పిని తీర్చిదిద్దారు. తొలుత దళితులు, అత్యంత బలహీన వర్గాలను తమ వైపుకు తిప్పుకున్న బిఎస్‌పి బ్రాహ్మణులు, అగ్రవర్ణాలు, ముస్లింలను కూడా తమ రాజకీయ సమీకరణల్లో ఉపయోగించుకున్నారు. 

ఉత్తరప్రదేశ్ జనాభాలో దళితులు 21 శాతం కాగా ఆమెకు మొత్తం ఓట్లలో 30 శాతం దక్కాయంటే ఆమె రాజకీయ సమీకరణలు ఎంత విజయవంతం అయ్యాయో అర్థం చేసుకోవచ్చు. ఇందులో తప్పేమీ లేదు. అగ్రవర్ణాలు తమ రాజకీయ సమీకరణల్లో దళితులను ఉపయోగించుకున్నప్పుడు దళితులు తమ సమీకరణల్లో అగ్రవర్ణాలను ఉపయోగించుకోవడం తప్పెలా అవుతుంది? కాని మాయావతి ఈ ప్రయోగాన్ని ఆచరణలో కూడా శాశ్వతం చేసి దళితుల రాజ్యాధికారాన్ని పూర్తిగా శాశ్వతం చేయగలిగిన అవకాశాన్ని కోల్పోయారా అన్న అనుమానం యుపి ఎన్నికల గురించి పరిశీలకుల అంచనాలను గమనిస్తే కలగక తప్పదు. 

మాయావతి సర్కార్ తీవ్రమైన ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్న విషయం ఆమె స్వయంగా గ్రహించినట్లు స్పష్టమవుతున్నది. మంత్రులతో సహా దాదాపు వందకు పైగా సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఆమె మార్చారు. 13 మంది మంత్రులకు ఉద్వాసన పలికారు. ములాయం సింగ్ యాదవ్ సర్కార్‌లో పెంచి పోషించిన నేర సంస్క­ృతి ఇప్పుడు మరింత తీవ్రమైనదని, ఇక అవినీతి గతంలో కంటే అవధులు దాటింద ని అంటున్నారు. అవినీతిని ఆపడంలోనే కాక, శాంతి భద్రతల పరిస్థితిని అదుపుచేయడంలో మాయావతి విఫలమయ్యారు. దళితులపైనే అనేక అత్యాచారాలు, దాడులు జరిగాయి. బిఎస్‌పి నేతలపైనే అనేక నేరారోపణలున్నాయి. ఇక సర్వజనులను తిప్పుకునేందుకు మాయావతి చేసిన రాజకీయ సమీకరణలు కూడా ఇప్పుడు పటాపంచలయ్యాయని అంచనాలు వినిపిస్తున్నాయి. 

ఈ అంచనాల ప్రకారం ముస్లింలు ఎస్‌పి, కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. బ్రాహ్మణులు, ఇతర అగ్రవర్ణాలు బిజెపి, కాంగ్రెస్‌ల మధ్య చీలిపోయారు. అత్యంత వెనుకబడిన బలహీన వర్గాలు కూడా మాయావతి నుంచి దూరమయ్యారనడానికి నిదర్శనం కుష్‌వా వంటి నేతలు ఇతర పార్టీలను చూసుకోవడమే. మరి దళితులు కూడా పూర్తిగా మాయావతి వైపు ఉన్నారా అంటే ఈ సారి దళితులు మూకుమ్మడిగా మాయావతివైపు మొగ్గు చూపడం కష్టమని, మాయావతి ప్రకటించిన సంక్షేమ కార్యక్రమాలు దళితుల్లో అందరికీ చేరలేదనే ప్రచారం కూడా వినపడుతున్నది. 

ఒకవేళ ఈ అంచనాలన్నీ నిజమైతే మాయావతి తొలి దళిత మహిళాముకఖ్యమంత్రి అయినప్పటికీ అందరు ముఖ్యమంత్రుల మాదిరే వ్యవహరించారని అర్థం చేసుకోవల్సి ఉంటుంది. అధికారంలోకి రావడానికి ఇతర రాజకీయ పార్టీలు ఉపయోగించుకున్న వ్యూహాలను అవలంబిస్తే ఫర్వాలేదు కాని అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇతర రాజకీయ పార్టీ నేతల్లాగా వ్యవహరిస్తే మాయావతి సామాజిక దృక్పథాన్ని ప్రశ్నించవలిసి ఉంటుంది. 

ఒక వైఎస్‌కూ, ఒక నవీన్ పట్నాయక్‌కూ, ఒక యడ్యూరప్పకూ, ఒక మాయావతికీ తేడా లేకపోతే ఎలా? ఇక్కడ మాయావతి ఆదాయానికి మించిన ఆస్తుల గురించి కానీ, ఆమె నగలు, ఇళ్లు, చెప్పులు, మెడలో వేసుకునే వేయి రూపాయల నోట్లకట్టల గురించి ప్రశ్నించడం లేదు. గుడిలో అమ్మవారు వేసుకునే నగలూ నాణ్యాల గురించి ఎవరూ మాట్లాడరు. కాని ఆమె అందరిపై కరుణాకటాక్షాలు ప్రసారిస్తున్నారా లేక తనకు జరిపే పూజలపైనే ఆసక్తి ప్రదర్శిస్తున్నారా అని ఆలోచించవలిసి ఉంటుంది. అమెరికా అధ్యక్షుడు ఒబామాకూ మాయావతికీ అప్పట్లో పోల్చి సంతోషపడే ప్రయత్నం కొందరు చేశారు. 

కాని వారు వ్యవస్థ ఉపయోగించుకునే పావులైనా కావచ్చు లేదా పావులుగా ఉపయోగపడేందుకు సిద్దమై వ్యవస్థను వాడుకున్నవారు కావచ్చని అంచనాలు కూడా ఉన్నాయి. మాయావతి ఈ దేశంలో నిజమైన దళిత చైతన్యం పెల్లుబుకినందువల్ల ముఖ్యమంత్రి అయ్యారా లేక రామజన్మభూమి ఆవేశం మాదిరి ఒక వాపు ఊపుగా మారి ముఖ్యమంత్రి అయ్యారా అన్నది ప్రశ్నించుకోవాల్సి ఉంటుంది. ఏమైనా మాయావతి ముఖ్యమంత్రి కావడం ఒక సంధి దశలో పరిణామం. ఇది పరిపక్వ దశగా మారేందుకు దళితులు ఇంకెన్నో పోరాటాలు చేయవలిసి ఉంటుంది. ఇంకెంతో చైతన్యాన్ని సమకూర్చుకోవాల్సి ఉంటుంది. మాయావతి నిజంగా ఓడిపోయినా వారు క్రుంగిపోనక్కర్లేదు. 

నిజానికి బుద్దులు, అంబేద్కర్‌లూ విగ్రహాలు కారు. వారు ఒక కులానికి పరిమితులు కారు. వారు సామాజిక సిద్దాంత కారులు. వారి సామాజిక సిద్దాంతాన్ని ఆచరణలో తెచ్చేందుకు చైతన్యవంతంగా ప్రయత్నించనంతవరకూ విగ్రహాలను చూసుకుని తృప్తి పడవలిసి ఉంటుంది. లేదా ఎవరైనా పడగొడితే కొంతకాలం ఆవేశపడాల్సి ఉంటుంది. ఒకప్పుడు అణిచివేబడ్డ బౌద్దం మళ్లీ పునరుజ్జీవనం చెందడం, అది సర్వజనులను ఆవహించడం దళితుల చేతుల్లోనే ఉంది. ఈ సారి చరిత్ర క్రింది నుంచి తిరగబడి అదే ఆధిపత్య భావజాలం కావాలి. 

మనం సామాజికవైరుధ్యాల మధ్య ఎంతకాలం జీవించగలం? మన సామాజిక, ఆర్థిక జీవనంలో వ్యత్యాసాలు ఎంతకాలం కొనసాగుతాయి? అని అంబేద్కర్ ప్రశ్నించారు. సామాజిక ప్రజాస్వామ్యం సాధించనంతవరకూ రాజకీయ ప్రజాస్వామ్యం విజయవంతం కాదని అన్నారు. ఒక మనిషికి ఒక ఓటు మాత్రమే కాదు. ఒకే విలువ ఉండాలి.. అని అభిప్రాయపడ్డారు. కాని ఈ దేశంలో దళితులు, గిరిజనుల పట్ల దారుణాలు పెద్ద ఎత్తున జరుగుతూనే ఉన్నాయి. వేల సంఖ్యలో ప్రజలు నిర్వాసితులవుతూనే ఉన్నారు. బుల్‌డోజర్లు వారి గుడిసెలను కూల్చివేస్తూనే ఉన్నాయి. మాయావతి దళితులకు విలువ కల్పించడంలో కన్నా విగ్రహాలను నెలకొల్పేంతవరకే విజయవంతమయ్యారని చెప్పకతప్పదు. 

(ఆంధ్రజ్యోతి డిల్లీ ప్రతినిధి)

Andhra Jyothi News Paper Dated 15/2/2012 

No comments:

Post a Comment