Thursday, February 2, 2012

చారిత్రక తప్పిదాలకు సెలవెప్పుడు? - పసునూరి రవీందర్


'మార్క్సిజం పిడివాదం కాదు. నిర్దిష్ట పరిస్థితుల నిర్దిష్ట విశ్లేషణే మార్క్సిజానికి ప్రాణం' - వి.ఐ.లెనిన్. సమాజ గమనాన్ని అర్థం చేసుకోవడానికో, లేదా ఆ గమనం సరైన దిశలో లేనట్లైతే మార్చడానికో, సరిచేయడానికో శాస్త్రీయ సిద్ధాంతాల అవసరం ఏర్పడుతుంది. అలా భారతదేశంలోకి ఇంచుమించు ఒక శతాబ్దకాలం కిందట (1920లో) అడుగుపెట్టిందే కమ్యూనిస్టు సిద్ధాంతం. దానికి తాత్విక పునాదిగా ఉన్న మార్క్సిజం ఆధారంగా అనేక రకాల కమ్యూనిస్టు పార్టీలు పుట్టుకొచ్చాయి. వీటన్నింటి లక్ష్యం విప్లవ సాధనే. కానీ, ఆయా పార్టీలను నడిపిస్తున్న నాయకత్వాలు చేసే అసమగ్ర దిశానిర్దేశం ఈ పార్టీలకే శాపంగా పరిణమిస్తున్నది. 

భారత కమ్యూనిస్టు పార్టీ(మార్క్సిస్టు)గా పిలువబడే జాతీయ పార్టీ అయిన సిపిఎం తెలుగు సమాజంలో ఈ కోవలోనే పయనిస్తున్నది. సిపిఐ నుండి విడిపోయినప్పటికీ తనదైన ముద్రతో పోటాపోటీగా తెలుగు నేల మీద అనేక పోరాటాలు చేసి, రాష్ట్రంలో తన ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేసింది. ఐదేళ్లకొకసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూ దినదిన కార్యాచరణతో 'బతుకు జీవుడా' అనుకుంటూ ముందుకు సాగుతున్నది. ఐదేళ్ల పొడవునా ఎన్నిసార్లు రోడ్లెక్కి గొంతు చించుకున్నా ఓట్లు ఎట్లాగు రాలవన్న అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని, ఏ 'ప్రపంచబ్యాంకు ఏజెంట్ల'తోనైనా జట్టుకట్టి అభాసుపాలవుతున్నది. 

చేసేదంతా చేసి ఐదు పదేండ్లకో, కుదరకపోతే యాభైయేళ్ల తరువాతనో ఒక సమీక్ష సమావేశంలో 'కామ్రేడ్స్ మనం ఆ విషయంలో చారిత్రక తప్పు చేశాం' అని జరగాల్సిన నష్టం జరిగిపోయాక లెంపలేసుకోవడం, ఆ తరువాత అలాంటి తప్పే మరోసారి చేయడం వీరికి రివాజుగా మారింది. రాజకీయ పార్టీ అన్న తర్వాత రాజకీయాలు చేయకుండా ఎలా ఉంటుంది. అది ఆ పార్టీకి చెందిన విషయంగా వదిలెయ్యొచ్చు. కానీ, ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎక్కడైనా ఏ దేశ కమ్యూనిస్టు పార్టీలైనా పనిచేయాలి. అది మార్క్సు చెప్పినా, మావో చెప్పినా మాకినేని బసవపున్నయ్య చెప్పినా సారాంశం ఇదే. 

సిపిఎం తెలుగు రాష్ట్రంలో ఒక్కే ఒక్క సామాజిక వర్గ నాయకత్వం కింద పనిచేస్తూ, ఒక ప్రాంత ప్రయోజనాలకే కొమ్ముకాయడం బహుశా ఈ శతాబ్దపు విషాదాల్లో ఒకటిగా నమోదుకాక తప్పదు. ఇందుకు ఈ పార్టీలో ఎక్కువమంది కోస్తాంధ్రకు చెందిన ధనిక రైతు సామాజిక వర్గానికి చెందినవారు ఉండడమే కారణమనేది బహిరంగ రహస్యం. అందుకే ఔట్‌డేటెడ్ పచ్చడిలా మారిన భాషా ప్రయుక్త రాష్ట్రాల సిద్ధాంతాన్ని వల్లిస్తూ తన పబ్బం గడుపుకుంటున్నది. రాష్ట్రంలో సగం జనాభా మనోభావాల్ని, ప్రజాస్వామిక హక్కుల్ని కాలరాస్తూ మరో చారిత్రక తప్పిదానికి తెరలేపుతున్నది. 

ఫ్యూడల్ సమాజాన్ని మార్చడానికి ముందుకొచ్చిన మార్క్సిజం అగ్రవర్ణాల చేతిలో పడడమే ఈ దేశానికి నష్టంగా పరిణమించింది. అందువల్లనే మూడువేల ఏళ్లుగా వేళ్లూనికుని ఉన్న మనువాద కులవ్యవస్థను ఒక సమస్యగా గుర్తించడంలో భారత కమ్యూనిస్టులు విఫలమయ్యారు. ఒక్క కుల సమస్య విషయంలోనే కాకుండా, ప్రాంతీయతను అర్థం చేసుకోవడంలో కూడా ఇంకా విఫలం చెందుతూనే ఉన్నారు. ఈ ప్రాంతానికి జరిగిన అనేక అన్యాయాల పునాదిగా తెలంగాణ రాష్ట్ర కాంక్ష ముందుకొచ్చింది. 

ఈ పరిణామాన్ని అధ్యయనం చేయకుండా దీన్ని కేవలం ప్రాంతీయతత్వంగా కొట్టిపారేయడం సిపిఎంకు గల కోస్తాంధ్ర ఆధిపత్యాన్ని సూచిస్తుంది. 'తెలంగాణ ఇస్తే వద్దనం, కేంద్రం దీన్ని వీలైనంత త్వరగా తేల్చాలి' అనే సిపిఎం గోడమీది పిల్లవాటపు వైఖరి ఏ వర్గ ప్రయోజనాల కోసం? 1969 నాటి ఉద్యమానికి ఇప్పటి ఉద్యమానికి ఉన్న తేడాను సిపిఎం గుర్తించలేకపోతున్నది. ఆనాడు మధ్యతరగతి కేంద్రంగా ఉద్యమం మొదలైతే ఇవాళ సాధారణ కూలితల్లి కూడా తెలంగాణ ఎప్పుడొస్తదని రోజూ అడిగి తెలుసుకునే స్థాయి వరకు ఉద్యమం వెళ్లిందనేది సత్యం. 

శ్రామికవర్గ విముక్తి మాత్రమే లక్ష్యంగా రూపొందించబడ్డ సిద్ధాంతం కింద పనిచేసే పార్టీ కులనిర్మూలన జరగాలని ఎందుకు తన వైఖరి మార్చుకున్నది. పైగా కులసంఘాలను కూడా ఏర్పాటు చేసుకొని ఎందుకు పనిచేస్తున్నది. పార్టీ పుట్టిన నాడు లేని కులపోరాటం మధ్యలో ఎందుకు చొప్పించవలసి వచ్చింది? అంటే కుల సమస్యను పట్టించుకోకపోవడం అనేది ఒక చారిత్రక తప్పిదంగా గుర్తించడమే. సోషలిజం పాఠాలు వల్లించే వారు తెలంగాణ ప్రజాస్వామిక డిమాండ్ సోషలిజానికి ఏ విధంగా వ్యతిరేకమో చెప్పడం లేదు. 

సీమాంధ్ర పెట్టుబడిదారులు తెలంగాణను వట్టిపోయిన ఆవుగా మార్చి, సంపదనంతా తరలిస్తున్న దోపిడీపై సిపిఎం వైఖ రి ఏమిటి? ఏడువందల మంది విద్యార్థుల బలిదానాలు జరిగితే సిపి ఎం నోరుమెదపకుండా ఎందుకున్నది? తెలంగాణ సాయుధపోరాటానికి మద్దతుగా నిలిచిన సుందరయ్యలాంటి నాయకులు తెలంగాణ మే లు కోరుకుంటే, ఇవాళ్టి నాయకత్వం ఆంధ్రా సంపన్న వర్గాల ప్రయోజనాలకు వంతపాడుతున్నారు. తెలంగాణ ప్రజలకు, సీమాంధ్ర పెట్టుబడిదారులకు మధ్య జరుగుతున్న చారిత్రక ఉద్యమమిది. ఈ కీలక సమయంలో ప్రజలకోసం పనిచేసే పార్టీ, ఎటువైపో ఆలోచించుకోవాలి. 

అవకాశవాద ప్యాకేజీల డిమాండ్ ఎప్పుడో బూటకమని తేలిపోయింది. ప్రస్తుతం జరుగుతున్న రాష్ట్ర మహాసభల్లో మరోసారి అమెరికన్ సామ్రాజ్యవాదం మీదో, ప్రజల ఆకలిమంటలొదిలేసి అణుఒప్పందాల మీదో, లేదా బిజెపి మతతత్వం మీదో కాకుండా తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవిస్తూ సిపిఐ దారిలో తెలంగాణకు అనుకూల వైఖరి తీసుకోవాలి. పోరాటాల గుమ్మంగా ఉన్న ఖమ్మం జిల్లా తెలంగాణకు సరిహద్దు. ఇప్పుడు సిపిఎం 23వ మహాసభలు నాయకుల సామాజిక వర్గం అండతో ఈ సరిహద్దుల్లో జరుగుతున్నాయి. ఇప్పుడు కూడా తెలంగాణకు వ్యతిరేకమైన ప్రతికూల వైఖరి తీసుకుంటే ఇక ఆ సరిహద్దు అవతలే సిపిఎం పార్టీ ఉంటుందన్న సత్యాన్ని గుర్తిస్తే మరో చారిత్రక తప్పిదానికి తావుండదు. 

- పసునూరి రవీందర్
(ఖమ్మంలో సిపిఎం రాష్ట్ర మహాసభలు జరుగుతున్న సందర్భంగా)
Andhra Jyothi News Paper Dated 03/2/2012 

No comments:

Post a Comment