Saturday, February 25, 2012

ఆధిపత్యాన్ని కొనసాగించేవే ఐతిహ్యాలు - జిలుకర శ్రీనివాస్


ఆదిపత్య సాహిత్య క్షేత్రం అనేక కుట్రలు చేస్తుంటుంది. కుట్రలు చాలావరకు సానుకూలంగా ఉంటాయి. ప్రతికూలమైన కుట్రలను గుర్తించటం సులువు. సానుకూలమైన కుట్రలను పసిగట్టడం, వాటిని బట్టబయలు చేయటం అంత తేలికైన వ్యవహారం కాదు. సౌదా అరుణ రచించిన 'వర్ణ నిర్మూలన' అనే కుట్ర గురించి వివరించేందుకు ప్రయత్నిస్తే,ఆ ప్రయత్నాన్ని మరుగుపర్చేచర్చను నరేష్ నున్నా చేశారు. 'రాజకీయంగా ప్రళయన్‌కీ, సౌదాకీ మధ్య సారూప్యం ఉం ది' అని నరేష్ అంగీకరిస్తున్నారు. సత్యాన్ని సత్యంగా అసత్యాన్ని అసత్యంగా చెప్పటమే అంబేద్కరిజం. అందుకు భిన్నమైన వాదనలు చేయటం బ్రాహ్మణవాదం. 

సౌదా, నరేష్ ఇద్దరూ అంబేద్కరిజానికి విరుద్ధమైన వాదనలు చేస్తున్నా రు. సౌదాను రక్షించేందుకు రాజకీయ నేపథ్యాలను ముందుకు తేవటం హాస్యాస్పదం. వర్ణ నిర్మూలన పేరుతో అనిమిలేషన్ ఆఫ్ క్యాస్ట్ గ్రంథాన్ని అనువదించవచ్చా? వర్ణం, కులం రెండింటి మధ్య వున్న భావనాత్మక వైభిన్యత ఏమిటి? పారిభాషిక ప్రయోగంలో అనుసరించదగిన సంభావ్యత లేమిటి? కుల నిర్మూలనకు కులాంతర వివాహాలు, భోజనాలు పరిష్కారం కావని అంబేద్కర్ ఏనాడో చెప్తే సౌదాకు ఇప్పుడే ఎందుకు అర్థమైంది? మూలవాసీ పబ్లికేషన్ ట్రస్టు ప్రచురించిన 'జాతిప్రథ తోడ్‌నేకా సహీ తరీఖా' అనే పుస్తకం నుండి సౌదా తన వాదనను స్వీకరించాడా లేదా? వంటి కీలక అంశాలను చర్చించే సాహసం చేయలేక సౌదా సాహిత్య నిజాయితీని సృజనశీలతను ముందుకు తీసుకురావటం విచారకరం. 

జానపద సాహిత్య స్వభావం గురించి అర్థవంతమైన చర్చ నేటికీ జరగటం లేదు. ఆధిపత్య సాహిత్యం కన్నా జానపద సాహిత్యం ప్రజానుకూలమైనదనే పొరపాటు అవగాహన బలంగా నాటుకొని ఉంది. జానపద సాహిత్యం ఆధిపత్య భావజాలాన్ని సజీవంగా ఉంచేదే గానీ దాన్ని పరాస్తం చేసేది కాదు. కుల సమాజంలో కుల వ్యతిరేక ఐతిహ్యాలు కూడా అంతిమంగా ఆధిపత్య చట్రంలోనే సంలీనం చెందిన దాఖలాలు అనేకం ఉన్నాయి. ఒక సమాజం సమిష్టి స్వప్నాలే పురాణాలనీ, ఇతిహాసాలనీ భావించే ఉదారవాదం ప్రబలంగానే ఉంది. 

ఉనికిలో వున్న ఐతిహ్యాలనూ విమర్శనాత్మకంగా చూడటమే కాదు వాటి పట్ల అనుమాన దృష్టితోచూడటం కూడా అవసరం. రామాయణ, మహాభారతాలను ఆధారంగా చేసుకొని అనేక జానపద కథలు ప్రచారంలో వున్నాయి. భగవద్గీత, మనుధర్మం, రామాయణం, మహాభారతం, అష్టాదశ పురాణాలను అంబేద్కర్, పెరియార్ అలాంటి విమర్శనాత్మక దృష్టితో చూశారు. అంతేకాదు వాటి పుట్టుకకు ప్రాతిపదిక కల్పించిన మౌలిక కారణాలనూ వారిద్దరూ విశ్లేషించారు. బౌద్ధం పునాదుల మీద నిర్మాణమైన మూలవాసీ రాజ్యాన్ని పుశ్యమిత్ర శుంగుడు హస్తగతం చేసుకొన్న తర్వాత ప్రతి విప్లవాన్ని నిర్మించేందుకు సామాజిక, సాంస్కృతిక, సాహిత్య వ్యవస్థలు అవసరమయ్యాయి. 

కులం అనే అమానవీయమైన వ్యవస్థను బ్రాహ్మణవాదులు మూలవాసీ ప్రజల మీద రుద్దారు. ఆ కుల వ్యవస్థను సమర్ధించే ఇతిహాసాలు, పురాణాలు, బ్రాహ్మణ ధర్మశాస్త్రాలు ఆ క్రమంలోనే నిర్మాణమైనాయి. మూలవాసీ సమాజాన్ని భావబానిసత్వంలో బంధీలను చేసేందుకు తయారుచేసిన సాహిత్యమే ఇతిహాసాలు, పురాణాలు. వాటిని కాలక్రమంలో ప్రజలకు మరింత చేరువ చేశారు. కులపురాణాలు, జానపద కథలు అందుకు ఉపకరించాయి. బౌద్ధ సమాజాన్ని నిర్మూలించిన మనువాదులు మూలవాసీ ప్రజల మెదళ్ల మీద దురాక్రమణ చేశారు. 

అనేక జానపద కథలను ఆ క్రమంలో తయారుచేశారు. ఈ పరిణామం ఏ మాత్రం ప్రగతిశీలమైంది కాదు. రాముడు, కృష్ణుడు చారిత్రక పురుషులుగా అల్లిన కట్టుకథలు, వాటికి అనేక సవరణలతో మూలవాసీ ప్రజలు చెప్పుకుంటున్న పుక్కిటి పురాణాలన్నీ మనువాద వ్యవస్థను నిలబెట్టేవే తప్ప కూల్చేవి కావు. ప్రళయన్, సౌదా ఇద్దరూ ప్రతివిప్లవ కథలను విప్లవ కథలుగా మార్చే పని చేసి విఫలమయ్యారు. 

కృష్ణుడిని మూలవాసీ ప్రజానీకానికి స్నేహితుడని సౌదా అల్లిన బర్బరీకుని కథ అంబేద్కరిజానికి వ్యతిరేకమైంది. మహాభారతమే ఈ దేశ మూలవాసీ ప్రజలకు వ్యతిరేకమైంది. దానిలోని కథానాయకుడు మనుధర్మాన్ని ప్రవచించి ఆ వ్యవస్థను చెక్కుచెదరకుండా నిలబెట్టేందుకు అన్ని రకాలుగా కృషి చేశాడు. అలాంటి కృష్ణున్ని ఒక వాస్తవంగానూ మూలవాసీ ప్రజల హితుడుగానూ సౌదా చిత్రించాడు. నాటకం ప్రదర్శించాడు. 'ఆధిపత్య శ్రీకృష్ణుడి పాత్ర అణగారిన వర్గాలకు కర్తవ్య బోధ చేసిన పాత్రగా ఎన్నో రెట్లు విశిష్టమైనది, నిష్పాక్షికమైనది' అని నరేష్ నున్నా కీర్తిస్తున్నాడు. ఏ రూపంలో శ్రీకృష్ణుడి పాత్రను చిత్రించినా అది అంతిమంగా అంబేద్కర్ ఆలోచనకు వ్యతిరేకంగానే నిలబడుతుంది. 

మహాభారతం, రామాయణాలను ప్రాతిపదిక చేసుకొని అల్లే ఏ కథైనా కళారూపమైనా అంతిమంగా అది అసత్యాలనే అందిస్తుంది. పురాణం, ఐతిహ్యాలను వర్తమాన అవసరాలకు అనుకూలంగా స్వీకరించటంలో తప్పేముందని భావించొచ్చు. విప్లవ ప్రతిఘాత వ్యవస్థ నిర్మాణం కోసం అల్లిన కథలు ఆ వ్యవస్థను కూలదోసేందుకు ఉపయోగపడవు. 'అపూర్వ పురాణ కథలు' వ్యవస్థ పరివర్తన కోరేవి కావు. అవి వ్యవస్థలో ఒక మెరుపు లాంటివి మాత్రమే. ఊహ వేరు. అవగాహన వేరు. 

'అవగాహనలో సౌదా ఎంత ముందు యుగం దూతో అపూర్వ పురాణ కథలు నిరూపిస్తాయి' అని నరేష్ అంటున్నారు. ప్రతినాయకున్ని నాయకునిగా చేయటంలో ఆయన ఊహాశక్తి వ్యక్తమవుతోంది. కాని, ఐతిహ్యాలను మూలవాసీ వ్యవస్థలో అంతర్భాగం చేయాలనే ఆయన అవగాహన లోపభూయిష్టమైంది. ఈ అవగాహన 'ఆధిపత్య సాంస్కృతిక వ్యవస్థ మూలాలను పెళ్లగించ'కపోగా మరింత వ్యవస్థీకృతం చేస్తుంది. అందుకే ఆయన వెనక యుగం దూత. 

ప్రత్యామ్నాయ సంస్కృతులు అంటేమిటి? ఆధిపత్య సంస్కృతికి సమాంతరం గా వర్ధిల్లుతూ మరో విముక్తి మార్గం చూపించే ప్రజల జీవన విధానమే ప్రత్యామ్నాయ సంస్కృతి. రామాయణ, మహాభారతాల నుండి అలాంటి ప్రత్యామ్నాయ సంస్కృతిని నిర్మించుకోవటం వీలవుతుందా? ఆధిపత్య సంస్కృతిలో కనిపించే పల్చని వెసులుబాట్లు, లేదా దానికి పూరకంగా తయారు చేసుకొనే వ్యక్తీకరణలు ఆధిపత్య సంస్కృతిలో అంతర్భాగం అవుతాయి గానీ ప్రత్యామ్నాయం కాలేవు. అపూర్వ పురాణ కథలు ఆధిపత్య సంస్కృతిని కూలగొట్టేవి కావు. ఆ సంస్కృతికి కళాత్మక పూరకాలు మాత్రమే. కాబట్టి నరేష్ నున్నా 'అపూర్వం' అని కీర్తించటం అతిశయోక్తి. వాటిని కళాఖండాలని నరేష్ స్వీకరించొచ్చు గానీ అంబేద్కర్‌వాదులు మాత్రం తిరస్కరిస్తారు. 

ప్రళయన్ రాసిన ఉపకథలు చదివిన వారికి సౌదా కొల్లగొట్టిన ప్రత్యామ్నాయ సాంస్కృతిక సంపదెంతో తెలుస్తుంది. ప్రళయన్ చిత్రించిన ఏకలవ్యుడి బొటనవేలు నరికిన ద్రోణుడి కుటిలత్వం, శంభూకుడి శిరచ్ఛేదం చేసిన రాముడు, రేణుక శిరస్సును నరికిన పరశురాముడు- అన్ని కథలు సౌదా సాహిత్య స్థిరీకరణకు ఉపయోగపడ్డాయి. ప్రళయన్ నాటకం పుస్తక రూపంలోకి రావటానికి ముందే తమిళనాడులో పెనుసంచలనం సృష్టించింది. ఆయన మరెన్నో కథలు పురాణ ఐతిహ్యాల నుండి స్వీకరించి అనుసృజించారు. వాటిని సౌదా కళాత్మకంగా ఎత్తిపోశాడు. ఎవరూ గుర్తు పట్టలేనంత సృజనాత్మకంగా రాసుకున్నాడు. వాటి మార్గంలో అనేక కొత్త కల్పనలు చేశాడు. ప్రళయన్‌లోని ఒరిజినాలిటీ, సౌదాలోని అనుకరణ రెండూ పోల్చలేనివి. 

- జిలుకర శ్రీనివాస్
Andhra Jyothi News Paper Dated 29/11/2011

No comments:

Post a Comment