Monday, February 6, 2012

విలువల విధ్వంసం - సుజాత సూరేపల్లి


బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహాలని విధ్వంసం చేస్తే దళితులు అందరూ నిరసన తెలుపుతున్నారు, కొంత మంది ప్రజాస్వామిక వాదులు, సంఘాల వారు కూడా అక్కడక్కడా నిరసన తెలుపుతున్నారు. ఈ దేశానికి దశా దిశా నిర్దేశించిన మహానుభావుడిని కేవలం దళిత వర్గానికే కుదించి పడేసిన కుల రాజకీయాలు మరోసారి భగ్గుమంటున్నాయి. అగ్ర కులాలలో ఉన్న రాజకీయ పార్టీలలో దళితులకు న్యాయం జరుగుతుంది అని నమ్మినంత కాలం ఈ గతి తప్పదు. అణగారిన కులాలలో చిచ్చు రేపడానికి, మనోభావాలని దెబ్బతీయడానికి అంబేద్కర్‌ని అడ్డం పెట్టుకున్నంత కాలం బాబా సాహెబ్‌కి ఈ దుర్గతి తప్పదు. 

కేవలం ఎవరి కుల నాయకులను వారు విగ్రహాల రూపంలో ప్రతిష్ఠించుకుంటే అది దేనికి చిహ్నం? ఎవరి పిల్లల, తల్లులు, తండ్రుల పేర్లు డబ్బుంది కదా అని ప్రభుత్వ స్థలాలకి, సంస్థలకి పెడితే ఇంక నిజంగా నిస్వార్థ నాయకులకి చోటు ఎక్కడ? అంబేద్కర్ కేవలం ఒక కులానికే ప్రతినిధా? ఇది చరిత్ర ఈ జాతికి చేసిన అన్యాయం కాదా? మనం కూడా ఇందులో భాగమా? మనం అర్థం చేసుకోవడంలో ఎక్కడ పొరపాటు పడుతున్నాం? పెద్ద బాలశిక్షలాగా అంబేద్కర్ సిద్ధాంతాలని రూపొ ందించి మళ్లీ బయటికి తీసుకురావాల్సిన అవసరం ఉందా? 

ఈ దేశంలో గాంధీకి, నెహ్రూకి ఉన్న స్థానం కంటే సమానత్వ పునాదులపై ఈ దేశాన్ని నిర్మించాలని కలలు గన్న అంబేద్కర్ ఎందుకు దళిత బస్తీలకు పరిమితం చేయబడ్డారు? బాబా సాహెబ్ బతికున్నపుడే 'నా సిద్ధాంతాలని ప్రచారం చేయండి నా విగ్రహాలని కాదు' అని చెప్పిన విషయం గుర్తుందా? విగ్రహారాధనలు మానండి, వ్యక్తి ఆరాధనలు కూల్చి వేయండి అని చెప్పిన మాటలను మరిచి, ఇవాళ విగ్రహాల చుట్టూ ఆయన ఆశయాలని తిప్పుతున్న నాయకులని, పార్టీలని ఏమని వర్ణించాలి? 

ఇపుడు ఉన్న అన్ని రాజకీయ పార్టీలలో దళితులకు ఉన్న స్థానం ఎక్కడ? ఎందుకు ఇన్ని దశాబ్దాల తరువాత కూడా ఇంకా దళితులపైన ఊచకోతలు ఆగట్లేదు, ఈ రోజు కూడా నేరాలు వారి పైననే ఎక్కువ జరుగుతున్నాయని అధికారిక లెక్కలే చెబుతున్నాయి. పార్లమెంటులో, అసెంబ్లీలో ఉన్న నాయకులు అందరూ కాకపోయినా కొందరు ఎప్పుడన్నా మాట్లాడారా? ఓటు బ్యాంక్ లాగా తప్పితే, నోటు, సీసా, బిర్యానీ, చీరలు, సారెల తోటి వోట్లు కొనుక్కునే దుస్థితికి రాజకీయాలను దిగజార్చిన వారు ఎవరు? 

ఈ పేద దళితులని కష్టాలలో ఎపుడైనా ఆదుకున్నారా? అపుడు స్పందించని నాయకులు ఇపుడు స్పందించడం దురదృష్టకరం కాదా? సెజ్‌లు, ప్రాజెక్టులు, ఎఫ్.డి.ఐ.లు, అని పేద, బడుగు వర్గాల జీవితాల మీద కత్తిబెట్టి నిలబెడుతున్న అభివృద్ధి పథకాలకు కొమ్ముకాస్తున్న ఈ జాతి నాయకులు ఏ మొహం పెట్టుకొని బాబా సాహెబ్ విగ్రహాలకు నష్టం జరుగుతుంది అని మాట్లాడతారు? జీవితాలకంటే విగ్రహాలు ఎక్కువ అని బాబా సాహెబ్ చెప్పారా? ఆర్థికం వేరు, సామాజికం వేరు, సంస్కృతి వేరు, రాజకీయం వేరు అని ఏ సిద్ధాంతం చెబుతుంది? 

ఎస్సీ, బీసీ హాస్టళ్ళు అంటే నరక కూపాలు, ఒక్క పూట పచ్చి పులుసు అన్నం కోసం బడికి పోతున్న విద్యార్థులు, కూలి దొరకక కూలిపోతున్న బతుకులు, నిండు జీవితాలని భారంగా ఈడుస్తూ, ఏడుస్తూ, బొంబాయికి, దుబాయి లాంటి దేశాలకు రక్త మంసాలని అమ్ముకుని వలసలు పోతూన్న ఈ కులాలని ఎవడు కాపాడుతున్నారు? 

ఇంక అత్యాచారాలు, వ్యభిచార గృహాలు, ట్రాఫికింగ్‌కి అమ్ముడైపోతన్న ఆడపిల్లల సంగతి చెప్పకపోతేనే బాగుంటది, బతికుండగానే జీవచ్ఛవాలుగా ఉన్న ప్రజల దుస్థితి చుస్తూ, పట్టించుకోని నాయకులకు, ప్రజాస్వామిక వాదులకు ఏరోజైనా అంబేద్కర్ సిద్ధాంతాలు బొంద పెడుతున్నారు అని ఉద్యమాలు చేసిన్రా? (నిస్వార్ధంగా పనిచేసే వాళ్ళు ఎప్పుడూ చేస్తూనే ఉన్నారు) రాజకీయ పార్టీలలో లొల్లిచేసిన్రా? ఈ దేశంలో అంబేద్కర్ కలలు కన్న రాజ్యం ఎక్కడ? జాడ చెప్పగలరా? 

అన్యాయాన్ని ఎదిరించండి, కులం పునాదుల మీద ఉన్న మతాలని, మతాచారాలని వదిలి వేయండి అని తను బతికున్నంత కాలం విలువైన జీవితాన్ని ఫణంగా పెట్టి బలి అయిన మహా వ్యక్తిని చనిపోయిన తరువాత కూడా చంపుతున్న రాజకీయాలని ప్రశ్నించి, ప్రక్షాళన చేసే సమయం ఆసన్నమైంది. దళితులకు సముచిత స్థానం ఇవ్వండి అని అగ్రకుల నాయకుల ఆధీనంలో నడుస్తున్న రాజకీయ పార్టీలలో పోరాటం చేయడం గొంగట్లో కూచొని వెంట్రుకలు వేరుకోవడమే. 

ఈ చిన్న విషయం మన నాయకులకు తెలవదా? తరాలు మారాల్సిందే కాని ఎన్నటికీ క్రింది కులాలు / వర్గాల వారికి స్థానం దొరకదు. ఇవాళ సామాజిక న్యాయం అడిగినందుకు సమాధానంగా అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహం అనే సరికొత్త ఉద్యమం జరుగుతుంది. విగ్రహాలను ప్రతిష్టించే వారికందరికీ ఒక మనవి. మీరు మీ సంస్థలలో, పార్టీలలో ముందు ఈ కులాలకి సముచిత స్థానం కల్పించండి, మీకు అనుకూలంగా ఉండే వాళ్ళను కాదు, ప్రజలు కోరుకున్న వాళ్ళను. ముందు మీ భావాలలో, ఆఫీసులలో, ఇళ్ళలో, ఆచరణలో అంబేద్కర్‌ని ప్రతిష్టించుకుని, ఆయన సిద్ధాంతాలను ఆచరణలో చూపెట్టి అపుడు వేరే దగ్గర విగ్రహాల ప్రతిష్టకు కొట్లాడదాం. 

ఇవాళ మా దురదృష్టం కొద్దీ అన్ని పార్టీలలో కేవలం కీలుబొమ్మలుగా మిగిలిన నాయకులను మాత్రమే సృష్టించుకున్నాము. ఒక దళితుడికి వ్యతిరేకంగా మాట్లాడడానికి మరొక దళితుడిని, స్త్రీల కొరకు స్త్రీలని, మైనారిటీల కొరకు మైనారిటీలను మాత్రమే అన్ని పార్టీలు నింపుకున్నాయి. దాని పేరు సామాజిక న్యాయం అని పెట్టుకున్నాయి. ఇవి మా దౌర్భాగ్యపు ప్రజాస్వామిక రాజకీయ పార్టీలు. ఈ కుళ్ళు రాజకీయాలను ఆ మహానుభావుడు ఆనాడే పసిగట్టి మా వోట్లు మాకే అని కొట్లాడిండు కాని గాంధీ అడ్డంపడి ఆయన 'హరిజన' వాదాన్ని నెగ్గించుకుని, దేశ జాతి, ప్రగతికి కాకుండా తమ జాతి ప్రయోజనాలను కాపాడుకున్నాడు. 

అంబేద్కర్ విగ్రహాలను కూల్చివేస్తే ఒక్క దళిత జాతే కాదు ప్రతి ఒక్కరూ స్పందించాలి. రాజశేఖర్ రెడ్డి విగ్రహం కూల్చితే ఒక్క రెడ్లే నిరసన తెలిపారా? అట్లనే ఎన్టీఆర్, ఇప్పుడు కొత్తగా వంగవీటి రంగా విగ్రహం, ఏ కులాలు మున్దున్నై? అంబేద్కర్ని కేవలం క్రింది కులాలకు చెందిన వాడు అన్న భావన ఉన్నన్ని రోజులు ఈ దాడులు ఆగవు. మా కులపోడే, మా నాయకుడే అని వెనకేసుకొచ్చినన్నాళ్లు ఈ తిప్పలు తప్పవు, మనోళ్లను ప్రశ్నిస్తే అగ్రకులాల పంచన జమకట్టే మేధావులున్నన్ని రోజులు ఈ దేశ రాజకీయాలు ఇంతే. 

ఈ కుట్రలు, కుతంత్రాలతో రాజకీయాలు కంపుకొడుతున్నై. కుల ప్రతీకలైన విగ్రహాల విధ్వంస సంస్కృతిని బందు పెట్టకపోతే, రాబోయే రోజుల్లో కులానికి ఒక ఊరు, వాడా పేర్లు పెట్టుకోవాల్సి వస్తుందేమో, కులానికి ఒక పార్టీ, పదవి కూడా. ప్రజలకి, సమానత్వానికి, ప్రజాస్వామ్యానికి ప్రతీకలైన నాయకులని, వారి ఆశయ సాధనకు, విలువలు, సిద్ధాంతాలకు చిహ్నంగా విగ్రహాలను ప్రతిష్టించు కోవాలి, ఆచరణ లేని వారి అంబేద్కర్ నినాదాలను బహిష్కరించాలి. రాజకీయ నాయకుడు ఎవ్వడైనా, ఏ కులం వాడైనా అంబేద్కర్‌ని తమ స్వార్థ ప్రయోజనాలకు వాడుకుంటే శాశ్వతంగా రాజకీయాల్లోంచి పక్కకు పెట్టాల్సింది. 

కొత్త ప్రజాస్వామిక రాజకీయాల కోసం, కొత్త నీరు అవసరం, కొత్త తరం అవసరం. కుల, మత, ప్రాంత, జెండర్ సమానత్వంతో కూడుకున్న దేశ రాజకీయాలకి పునాదులు వేసే బాధ్యత మన అందరిదీ, కాదంటారా? 

- సుజాత సూరేపల్లి
Andhra Jyothi News Paper Dated 07/02/2012 

No comments:

Post a Comment