Saturday, February 25, 2012

ఉద్దారకం మాకొద్దు-- - జిలుకర శ్రీనివాస్


అధికారం, రాజ్యం, దోపిడి, సకల పీడన రూపాలకు వ్యతిరేకం గా పీడిత కుల సాహితీవేత్తలు వ్యక్తీకరించిన అభిప్రాయాల పట్ల ఆధిపత్య సాహిత్య వ్యవస్థ తృణీకార భావాన్ని కనబరుస్తుందని మరో మారు రుజువైంది. సమాజ మౌలిక స్వభావవిశ్లేషణలో ఎస్సీ,ఎస్టీ,బిసీ,మైనార్టీలైన బహు జనుల దృక్పథానికి బ్రాహ్మణవాద దృక్పథానికి మధ్య శత్రు వైరుధ్యం అనుస్యూతంగా కొనసాగుతూనే ఉంది. బ్రాహ్మణీయ ఉదారవాదం, అణగారినవర్గాల వైయక్తిక అవకాశవాదం రెండూ ఈ శత్రువైరుధ్యాన్ని మిత్రవైరుధ్యంగా మార్చా లని చూశాయి.

ఈ ప్రయత్నాలన్నీ బానిసలను మరింత దాస్యంలోకి నెట్టేవిగా పరివర్తన చెందుతాయి. ఈ శత్రువైరుధ్యం బ్రాహ్మణాధిపత్య వ్యతిరేక పోరాట రూపం తీసుకొని సమాజంలోని సకలక్షే త్రాల నిర్బ్రాహ్మణీకరణకు మార్గంవేస్తుంది. ఈ క్రమం లో బ్రాహ్మణవాదం, వైయక్తిక అవకాశవాదం రెండూ తగి న మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. కాత్యాయని విద్మ హే, చల్లపల్లి స్వరూపరాణీ ప్రవచిత వ్యాసం అందుకొక సందర్భం. 

రంగనాయకమ్మ 'అస్తిత్వ' సమస్య విశ్లేషణ నవీనమూ అద్భుతమూ అని సంబురపడిన వారుండొచ్చు. కాని, గుర్తింపు, అస్తిత్వం, లింగం, లైంగికత వంటి అంశాల గురించి స్త్రీవాదుల మధ్య చర్చ జరిగిన సందర్భంలోనూ కులం, వర్గం, సమాజ వాస్తవికత, నిర్దిష్టత వంటి విషయాలు చర్చించిన సందర్భంలోనూ బ్రాహ్మణ, బ్రాహ్మణేతర సాహితీవేత్తలు తీవ్రమైన వాదోపవాదాలు చేసుకున్నారు. 

సమాజంలో వ్యక్తుల, సమూహాల జీవనం, ప్రవర్తన, ప్రమేయం వంటి విషయాలు దేనివల్ల నిర్ణయమవుతున్నాయనే చర్చ జరిగింది. ఈ చర్చకు శతాబ్దాల చరిత్ర ఉంది. మార్క్సు ప్రస్థాపితం చేసిన ఆర్థిక/వర్గ నిర్ణాయక సిద్ధాంతం మన సమాజంలోని ఎంతోమంది ఉదారవాద బ్రాహ్మణవాద మేధావులను ఆకర్షించింది.

అయితే, జాతిపిత మహాత్మా జ్యోతిరావు ఫూలే, బాబాసాహెబ్ అంబేద్కర్ వంటి మహనీయులు ఇండియా కుల సమాజం కావడం వల్ల కులమే సకల అంశాలనూ ఉత్పత్తి శక్తులనూ ఉత్పత్తి సంబంధాలనూ (మార్క్సి స్టు పరిభాషలో కాసేపు) మానవ సంబంధాలనూ అధికార సంబంధాలనూ నిర్ణయిస్తుందని నిరూపించారు. ఆర్థిక నిర్ణాయకవాదమే అంతిమ సత్యమని నమ్మే రంగనాయకమ్మ వంటి ఉదారవాద బ్రాహ్మణీయ మేధావులకు కుల నిర్ణాయకవాదంలోని తర్కం అంతుబట్టకపోవడం ఆశ్చర్యమేమీ కాదు.

మార్క్సిస్టు సిద్ధాంత విశ్వాసులెవరూ అస్తిత్వం, గుర్తింపు వంటి అమూర్త విషయాలను అంగీకరించరు. అస్తిత్వ ఉద్యమాలు రాజ్య ప్రాయోజితమైనవనీ, అవి విశాల ప్రజా పోరాటాలను విచ్ఛిన్నం చేస్తాయనీ వర్గ సమైక్యతావాదానికి అవి గొడ్డలిపెట్టనీ, శకలీకరణ రూపాల పట్ల కార్మిక వర్గ మేధావులు అప్రమత్తంగా ఉండాలనీ విశ్వసిస్తారు. 

పార్టీ నిర్మాణ శ్రేణులకు ఆయా అంశాల పట్ల స్పందించాల్సిన వైఖరుల గురించి తగిన శిక్షణ కూడా మార్క్సిస్టులు అందిస్తూ ఉంటారు. అస్తిత్వ ఉద్యమాల పరిభాషను ఇంతగా ద్వేషిస్తున్న వర్గ నిర్ణాయకవాదులు చరిత్రను మసిబూసి మారేడుకాయ చేస్తున్నారు. రంగనాయకమ్మ ప్రకారం అస్తిత్వం, గుర్తింపు వంటివి ఎస్సీ, ఎస్టీ, బిసీ, మైనార్టీలు తయారు చేసినవి. వాటిని స్వార్థ ప్రయోజనాల కొరకు ఉపయోగించుకొంటూ శాశ్వతీకరిస్తున్నారు. ఇవి పూర్తిగా అసంబద్ధమైన వక్రీకరణలు. 

మహాత్మా ఫూలే, అంబేద్కర్, పెరియాల రచనల్లో ఎక్కడా అస్తిత్వం, గుర్తింపు అన్న పరిభాష కనిపించదు. బ్రాహ్మణుల గుర్తింపు కోసం, వారి దయాదాక్షిణ్యాల కోసం ఫూలే, అంబేద్కర్, పెరియార్‌లు ఏనాడూ దేబిరించలేదు. బ్రాహ్మణ వ్యవస్థ నిర్మూలన కొరకు సైద్ధాంతిక పోరా టం నెరిపిన మహనీయులు వారు. మరి దళిత ఉద్యమం ఎక్కడి నుండి వచ్చింది? స్త్రీవాద ఉద్యమం వలె బహుజన పోరాటం అస్తిత్వ ఉద్యమ పరిభాషలో ఎప్పుడు చిక్కుకపోయింది?

'అస్తిత్వ' ఉద్యమాలు 1960 దశకంలో ప్రారంభమైనవి. అందులో ప్రధానమైంది స్త్రీవాద ఉద్యమం. 1848లో మొదలైన కుల వ్యతిరేక బహుజనోద్యమం అస్తిత్వ ఉద్యమ పరిధిలోకి ఎలా వస్తుంది? కాలిక సమస్య కాదు మౌలిక స్వభావానికి సంబంధించిన సమస్య అని అంగీకరిస్తే సమస్త కుల పీడన దోపిడీల నుండి సమాజ విముక్తిని ప్రతిపాదించిన బహుజనోద్యమం రాజకీయ పోరాటానికి సమాజ సమూల పరివర్తనకూ మార్గం చూపుతున్న విప్లవ ఉద్యమం అవుతుంది తప్ప అస్తిత్వ ఉద్యమం ఎలా అయింది?

దాని విప్లవకర స్వభావాన్ని తగ్గించి అస్తిత్వ పరిభాషలో ఇరికించిన కుదింపువాదం ఎవరి మేధోమధన జనితం? దీనికి సమాధానం బ్రాహ్మణవాదమే ఈ కుదింపువాదానికి బాధ్యత వహించాలి. ఫూలే, అంబేద్కర్‌ల వరకు సాగిన పీడిత కుల విముక్తి పోరును విప్లవ ఉద్యమంగా గుర్తించడానికి స్వయం ప్రకటిత విప్లవకారులు సిద్ధంగా లేరు. అంబేద్కర్ హత్యానంతరం ఆయన నిర్మాణం చేసిన రాజకీయ ఉద్యమాన్ని బ్రాహ్మణులు సర్వనాశనం చేశారు. కాని ఆయన నిర్మాణం చేసిన ఆలోచనా విధానం బలమైంది.

దాన్ని నిర్వీర్యం చేయడానికి బ్రాహ్మణులు పన్నిన మేధో కుట్ర దళితవాదం. దళిత పాంథ ర్స్ ఆ కుట్రలో భాగం. మహారాష్ట్ర కేంద్రంగా సాగిన దళిత పాంథర్స్ ఉద్యమం అంబేద్కరిజం మీ ఒక అత్యాచారం. మార్క్సిస్టు ఆలోచన తప్ప అంబేద్క ర్ ఆలోచనావిధానం అందులోలేదు. దళిత ఉద్య మాలను విశ్లేషణ చేయడానికి బ్రాహ్మణీయ మేధావులు అస్తిత్వ ఉద్యమాల వైధానిక పద్ధతి ని అనుసరించారు.

దళిత ఉద్యమాన్ని వివరించాలంటే మహారాష్ట్రలో 1960 దశకంలో వచ్చి న మేధో ఉద్యమాన్ని, 1980 తర్వాత ఆంధ్ర లో వచ్చిన సామాజిక ఉద్యమాన్ని ప్రస్తావించే అలవాటు ఒకపద్ధతిగా చేశారు. శతాబ్దాల విము క్తి ఉద్యమాన్ని గుర్తింపు ఉద్యమాల చట్రంలో బం« దించిన రంగనాయకమ్మన్యులు నెపం బహుజనుల మీద వేస్తున్నారు. ఈ గుర్తింపు బ్రాహ్మణులిచ్చింది. ఈ కులం బ్రాహ్మణులు నిర్మాణం చేసింది. ఈ కుల వ్యవస్థను సజీవంగా నిలబెడుతుంది బ్రాహ్మణులు. అందుకే కుల నిర్మూలన పోరాటం బహుజనులు చేస్తున్నారు.

అన్ని అస్తిత్వ ఉద్యమాలను నిర్ణయించే ప్రధానమైన అస్తిత్వం (రంగనాయకమ్మ వర్గాన్ని అస్తిత్వం, గుర్తింపు అనడం విచిత్రం) ఈ సమాజంలో వర్గం ఆర్థికం కాదనీ, అది కులమనీ, దాన్ని కాపాడుతున్నది బ్రాహ్మణీయ శక్తులనే ఎరుక ఎస్సీ, ఎస్టీ, బిసీ, మైనార్టీ రచయితలకు ఉంది. బహుజనులు సృష్టించిన సాహిత్యం పఠించకుండానే అధ్యయనం చేయకుండానే కులాన్ని పాడుతూ ప్రయోజనాలు పొందుతున్నారని ఆరోపన చేయడం ఏ రకమైన మేధో నిజాయితీ?

రంగనాయకమ్మ సంధించిన పాత ప్రశ్నలకు పాత సమాధానాలు రెడీమేడ్‌గా ఉన్నాయి. రంగనాయకమ్మకు పాత సమాధానాలే లభిస్తాయనీ, అవి గతంలోనూ వర్తమానంలోనూ భవిష్యత్తులోనూ ఆమె అంగీకరించదనీ అందరికీ తెలుసు. కాని ప్రాభవం కోల్పోయిన బ్రాహ్మణవాద స్త్రీవాదానికి పూర్వ వైభవం తేవడానికి ఒక ప్రయత్నం జరిగింది. అది 'మనలో మనం'గా ఆరంభమై 'ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక'గా అంతమైంది. 

ఇండియా సమాజంలో స్త్రీలంతా సమానులు కారనీ బ్రాహ్మణీయ అగ్రకుల, పీడిత కుల స్త్రీల సమస్యలు వాటి పరిష్కారం స్వభావరీత్యా విభిన్నమైనవనీ సుభద్ర, షాజహానా,విజయలక్ష్మి లేవనెత్తిన సవాళ్లకు సమాధానం చెప్పా ల్సిన బాధ్యత 'మనలో మనం' నిర్వాహకులది. గత రెండు ఏళ్లుగా మౌనం వహించిన కాత్యాయని అండ్ కో గుండుగుత్తగా ఒక్క వ్యాసంతో తప్పంతా పీడిత కుల స్త్రీల మీదికి నెట్టేశారు. కాత్యాయని, చల్లపల్లి ప్రకటించిన వ్యాసంలో నిర్మాణపరమైన అంశాలు తప్ప సారభూతమైన సైద్ధాంతిక అంశాల విశ్లేషణ ఒక్కటీ లేదు.

ఎక్కడ ఏ సమావేశం జరిగిందనే సాంకేతిక విషయాలు చర్చించిన కాత్యాయని, చల్లపల్లి పీడిత స్త్రీలు లేవనెత్తిన ప్రశ్నలకు ఒక్కదానికీ జవాబివ్వలేదు. సిడీలు చూస్తే నిజాలు తెలుస్తాయని బెదిరింపొకటి. పైగా ఎస్సీ, ఎస్టీ, బిసీ, మైనార్టీల సాహిత్యానికి ఏదో ఉద్దారకం చేయాలని సంకల్పించినట్టూ వారు విస్మరిస్తే దానికి ఉనికే లేదన్నట్టు డాంబికం ప్రదర్శించడం వ్యాసంలో ఒక మెరుపు. రెండు దశాబ్దాలుగా వెల్లువెత్తుతున్న అణగారిన కులాల సాహిత్యాన్ని విద్యారంగంలో వైజ్ఞానిక క్షేత్రంలో తొక్కిపెట్టింది బ్రాహ్మణాధిపత్యవాదులు కాదా?

బ్రాహ్మణీయ స్త్రీవాదులు జవసత్వాలుడిగి భయంకరమైన మొనాటనీతో పాఠకులను విసిగించి నిరాదరణకు గురై సకల సాహిత్య ప్రక్రియల్లో పరవల్లు తొక్కుతున్న బహుజన సాహిత్యం ముందు కుదేలై తిరిగి పునరుత్థానంకోసం కింది కుల స్త్రీల నెత్తిమీద ఎక్కి కూర్చుంది నిజం కాదా? బ్రాహ్మణీయాధిపత్య వ్యవస్థ ప్రసన్న దృక్కుల కొరకు ప్రశంసల కొరకు అవార్డులు రివార్డులు అందలాల కొరకు కెరియరిజం కొరకు స్వాభిమానం విలువ విరూపం చేసిన చల్లపల్లి స్వరూపరాణి వంటి అవకాశవాదుల వల్ల బహుజన స్త్రీ సాహిత్యం నష్టపోతున్నది సత్యం. 

అగ్రవర్ణ బ్రాహ్మణాధిపత్యం మీద పోరాటం ఎంత అవసర మో ఇలాంటి అవకాశవాద దివాళాకోరుతనంమీద అంతే స్థాయిలో పోరాటం చేయాలి. కులం ఒక వాస్తవమనీ అదే నిర్ణాయక అంశమనీ ఇకనైనా అర్థం చేసుకోమని బ్రాహ్మణాధిపత్య శక్తులను బతిమాలాడే పని వదిలేయండి. బహుజనులు నిర్మిస్తున్న సాహితీ సౌధాన్ని వీక్షించడానికీ దానిలో సేదతీరి ఓలలాడడానికీ సంశయిస్తూ సాహిత్య ప్రమేయాన్ని అవమానిస్తున్న వారికి దూరం జరగడం మేలు. బ్రాహ్మణవాదుల 'సహజీవనవాదం' జాతి హననానికేమీ తీసిపోదనీ, బహుజన స్త్రీ దృక్పథం నుండి సమస్త రంగాలను నిర్‌బ్రాహ్మణీకరించే మార్గంలో నడిస్తేనే 'మట్టిపూలు' మానని వ్రణాలను నయం చేసే ఔషధమవుతుందని గ్రహించండి. కాని ఒక విన్నపం. చల్లపల్లి స్వరూపరాణులుంటారు తస్మాత్ జాగ్రత్త. 

- జిలుకర శ్రీనివాస్
Andhra Jyothi News Paper Dated :  9/8/2010

No comments:

Post a Comment