- రాష్ట్రంలో మందకొడిగా బీసీ భావజాల వ్యాప్తి
- ముందుకు వస్తున్న యువతీ యువకులు, సంస్థలు
- విద్య, ఉద్యోగ, స్థానిక రిజర్వేషన్లకోసం పోరాటాలు
- స్థానిక సంస్థల అధికారంలో అవకాశాలు
- వృత్తులు కోల్పోయి దుర్భర పరిస్థితులు
- అందని అభివృద్ధి పథకాలు
- రాజ్యాధికారమే సర్వ సమస్యల పరిష్కారం
ఆలోచనను, ఆచరణను ప్రేరేపించే రచనలు
మహాత్మా జ్యోతిరావు ఫూలే నుంచి పెరియార్ రామస్వామి వరకూ, ఆ తర్వాత ఉత్తర భారతంలో రామ్ మనోహర్ లోహియా నుంచి కాన్షీ రాం వరకూ అనేకమంది ఉద్యమ నాయకులు సమాజంలోని బడుగు బలహీన కులాల గురించి తమ జీవిత కాలం చేసిన పోరాటాల ఫలితంగా దేశంలోని కొన్ని ప్రాంతాల్లో బీసీ ఉద్యమాలు బలపడ్డాయి. కొన్ని రాష్ట్రాల్లో రాజ్యాధికారాన్ని కైవసం చేసుకునే మార్గాన్ని సుగమం చేశాయి. బీసీలు కొన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలను ఏర్పాటు చేసుకుని అధికారాన్ని సాధించడమే కాకుండా తమ అధికారం ఆయా రాష్ట్రాలలలో నిలదొక్కుకునే విధంగా ముందుకు పోగలిగారు. కొన్ని రాష్ట్రాల్లో బీసీలు తప్ప మరెవరూ మళ్ళీ అధికారంలోకి రాలేని పరిస్థితులు పదిలంగా ఉన్నాయి. అయితే ఆ రాష్ట్రాలకు భిన్నమైన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్‌లో విచిత్రంగా నెలకొన్నాయి. బీసీ భావజాల వ్యాప్తి బలంగా ఈ రాష్ట్రంలో ముందుకు రాలేకపోయింది. బీసీ అస్తిత్వ గుర్తింపు ఉద్యమాలు కూడా ప్రారంభ స్థాయిలోనే ఉండిపోయాయి. గౌతు లచ్చన్న, కొండా లక్ష్మణ్ బాపూజీ, బాల గౌడ్, ఆర్.కృష్ణయ్య, ఉసా, జ్ఞానేశ్వర్, నారగోని, కొండలరావు, పాలూరు రామకృష్ణయ్య- ఇంకా అనేకమంది వివిధ సంస్థల ఆధ్వర్యంలో బీసీల అస్తిత్వం, హక్కుల పరిరక్షణకు వివిధ స్థాయిల్లో నిర్వహించిన పోరాటాలు రాష్ట్ర ప్రభుత్వంపై కొంత మేరకు ఒత్తిడులు పెంచి కొన్ని విజయాలు సాధించాయి.
రాజారాం, కొండా లక్ష్మణ్ బాపూజీ, దేవేందర్‌గౌడ్ వంటివారు రాష్ట్రంలో, శివశంకర్ కేంద్ర మంత్రివర్గంలో ఉండి బీసీలకు కొంత మేరకు ఆత్మస్థైర్యాన్ని పెంచడంలో తోడ్పడితే, ప్రస్తుతం కాంగ్రెస్‌లో బొత్స సత్యనారాయణ, తెలుగు దేశంలో దేవేందర్ గౌడ్, బీజేపీలో లక్ష్మణ్, తెరాసలో ఈటెల రాజేందర్, సీపీఐలో రామకృష్ణ, సీపీఎంఎల్‌లో అమర్ వంటి నాయకులు, అదే విధంగా ఈమధ్య కాలంలో ఏర్పడిన బలహీన వర్గాల సాధికార వేదిక, మహాత్మ జ్యోతిరావు ఫూలే బ్యాక్‌వర్డ్ కాస్ట్‌స డెవెలప్‌మెంట్ అండ్ ఎంపవర్‌మెంట్ ఫోరం వంటి సంస్థలతో బాటు ‘సూర్య’ వంటి దినపత్రిక చేసిన ప్రత్యేక కృషి ప్రస్తుతం బీసీ ఉద్యమంలోకి వస్తున్న అనేకమంది యువతీ యువకులకు, నూతన సంస్థలకు ప్రేరణ కల్పించి భవిష్యత్తుపై ఆశాభావాన్ని, ముఖ్యంగా 2014లో సంభవించబోయే మార్పులకు సూచికలుగా నిలుస్తాయనడంలో సందేహం లేదు. కంచ ఐలయ్య, ఉసా, కొండలరావు, బిఎస్ రాములు, నారగోని ఇంకా అనేకమంది యూనివర్సిటీ ప్రొఫెసర్లు చేసిన రచనలు సరైన భావజాల వ్యాప్తికి తోడ్పడడమే కాకుండా బీసీలలో ఆలోచనలను రేకెత్తించి ఆచరణకు ప్రేరేపించే విధంగా ఉన్నాయి.
అయితే గత పోరాటాలు విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో రాజకీయ రిజర్వేషన్లు మొదలైన విషయాల్లో రక్షణలు కల్పించుకుంటూనే మరొకవైపు అదనంగా స్కాలర్‌షిప్పులు, హాస్టళ్ళు, ఫీ రియింబర్స్‌మెంటు, అక్కడక్కడ కొంత మేరకు ఇళ్ళ స్థలాల కేటాయింపులు, కొన్ని రుణాలు, సబ్సిడీలు, మార్జిన్ మనీ మొదలకు విషయాల్లో అమోఘమైన విజయాలు సాధించడం జరిగింది. ఆర్ కృష్ణయ్య ఈ విషయంలో ముందు వరుసలో ఉండగలిగారు. ఈ పోరాటాలు, సాధించుకున్న విజయాల వల్ల కేంద్ర- రాష్ట్ర సంస్థల్లో విద్య, ఉద్యోగ అవకాశాలను మెరుగు పరచుకుని ముఖ్యంగా పట్టణ ప్రాంతాలలో నివసించే బీసీలు లబ్ధి పొందగలిగారు. అదే విధంగా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల వల్ల గ్రామీణ- పట్టణ ప్రాంతాల్లో ఉండే రాజకీయాల పట్ల ఆసక్తి కలిగిన యువకులు కొంత మేరకు తమ నాయకత్వ స్థాయిని పెంపొందించుకుని అధికారంలో పాలు పంచుకోగలిగారు. అంత మేరకు ఈ చర్యలు కొంత గుణాత్మక మార్పుకు దోహదపడ్డాయి.
అయితే, బీసీలు ఆంధ్రప్రదేశ్‌లో అనేక చారిత్రక కారణాల వల్ల మౌలికమైన జీవన్మరణ సమస్యలను ఎదుర్కొంటూ బతుకులు ఛిద్రమై కనీస అభివృద్ధికి నోచుకోక కోట్లాదిమంది వెనుకబాటుతనానికి గురి కావడం బీసీల సమస్యలను మరింత జటిలం చేసింది. ఈ అంశాలపై అనేక బీసీ సంఘాలకు సరైన అవగాహన లేకుండా పోయింది. ఈ పరిస్థితులకు కారణాలేమిటనే విషయంపై కూడా వారికి సమాచార లోపం ఉంది. ఆర్ధిక రంగంలో, అభివృద్ధి విధానాల్లో వచ్చిన అనేక మార్పుల వల్ల బీసీల చేతి వృత్తులు విధ్వంసానికి గురి కావడం, వ్యవసాయం అధిక భారమవడం, అప్పులు పెరగడం, సర్వీసు కులాలకు మార్కెట్ పోటీ ఏర్పడి వారు ఆదాయ వనరులు కోల్పోవడం, అనేక సాంప్రదాయ, సాంస్కృతిక కుల వృత్తులు కలిగిన సంచార కులాలు, ఉపాధి కోల్పోయి రోడ్డున పడి వారి కుటుంబాలు విచ్ఛిన్నం కావడంతో గ్రామీణ సామాజిక ఆర్ధిక వ్యవస్థ మొత్తం విధ్వంసానికి గురై వలసలు, ఆకలి చావులు, ఆత్మహత్యలు అధికమై కోట్లాది ప్రజానీకం దుర్భర జీవనం గడపవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయాల్లో ఎప్పుడూ దృష్టి సారించడం జరగలేదు. ప్రణాళికా సంఘం దారిద్య్ర రేఖను మళ్ళీ మళ్ళీ నిర్వచించే పనిలో ఉండి, గణాంకాలు లేవనే సాకుతో బీసీల గురించి పట్టించుకునే స్థితిలో లేదు. వారు రూపొందించిన అభివృద్ధి విధానాలు, కార్యక్రమాలు బీసీలకు ఏ మాత్రం ఉపయోగపడే అవకాశం కలగకుండా చేశాయి. వివిధ సాంప్రదాయ వృత్తులతో జీవిస్తూ సమాజానికి తర తరాలుగా సేవ చేస్తూ నాగరికతను పెంచి పోషిస్తున్న అనేక వృత్తి సంబంధిత, సర్వీస్ సంబంధిత- ఇంకా అనేక సంచార కులాలను ఎన్నడూ ప్రభుత్వాలు తమ ప్రణాళికాభివృద్ధి పరిధిలోకి తెచ్చుకునే ప్రయత్నం చేయలేదు. ప్రభుత్వ పథకాలు ఈ కులాల దైనందిన జీవిత సమస్యలపై కానీ, అభివృద్ధి సమస్యలపై కానీ ఎన్నడూ కేంద్రీకరించడానికి ప్రయత్నం చేయలేదు. అది వారి ప్రాధాన్యతాంశంగా కూడా ఎన్నడూ లేకుండా పోయింది.
ఇంత వరకు జరిగిన అభివృద్ధి, లక్షల కోట్ల రూపాయలు వెచ్చించి అమలు జరిపామని గొప్పలు చెప్పుకుంటున్న అనేక పథకాలు సాధించిన ఫలితాలు వారికి అసలు చేరే అవకాశాన్ని కూడా సృష్టించలేదు. మెజారిటీ బీసీలు విద్యకు దూరం కావడం వల్ల, వృత్తులు కోల్పోయి భౌతిక శ్రమ దోపిడీకి గురవుతూ, వృద్ధి చెందుతున్న మార్కెట్ సదుపాయాలు, పెరుగుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలను కనీస స్థాయిలో కూడా అనుభవించే స్థితిలో లేకుండా పోయారు. ఈ విషయాలపై బీసీ సంఘాలు కూడా ఎన్నడూ సీరియస్‌గా ఆలోచించే పరిస్థితులు లేవు. కేంద్రంలో గాని, రాష్ట్రంలో గాని ఇంతవరకూ నియమించిన అనేక బీసీ కమిషన్ల సిఫారసులను అధికారంలో ఉంటూ వచ్చిన అగ్రకుల ప్రభుత్వాలు బుట్టదాఖలు చేయడం వల్ల, పరిస్థితులు మెరుగు పరచే అవకాశాలను కోల్పోయి కోట్లాది బీసీలు అనాధలుగా మిగిపోయే పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితులను అర్ధం చేసుకుని అందుకు తగిన విధంగా బీసీలు సమీకృతమై పోరాడే స్థితిని బీసీ ఉద్యమ శ్రేణులు కల్పించలేకపోయాయి. అందుకు అనేక కారణాలను పరిశీలించవచ్చు.
బీసీ సంఘాలు, విడి విడి కుల సంఘాలు తమకు అవసరమైన భావజాల నిర్మాణం రూపొందించుకోలేక పోవడం, పటిష్ఠమైన వ్యవస్థీకృత నిర్మాణాలు లేకపోవడం, నాయకత్వ లోపం- అంటే గ్రామ స్థాయినుంచి రాష్ట్ర స్థాయి వరకూ సంఘాలను తమ నిర్మాణాలను ఏర్పరచుకుని తమ సభ్యులను చైతన్యపరచలేకపోయాయి. ప్రతి కులంలో అనేక సంఘాలు ఏర్పడ్డాయి. రాజకీయ పార్టీల వారీగా విడిపోయి శత్రు శిబిరాలుగా రూపొందాయి. బీసీలుగా గుర్తింపు పొందిన అనేక కులాలు తాము సమష్ఠిగా ఒకే బీసీ సమూహంగా, ఒకే వర్గానికి చెందిన వారమన్న భావన, స్పృహ లోపించాయి. వారందరినీ ఒక తాటిమీదకు తీసుకువచ్చే సంస్థలు లేవు. కనీస కార్యక్రమాన్ని రూపొందించుకోవడం జరగలేదు. ఏ కులానికి కూడా రాజకీయ అజెండా స్వతంత్రంగా కానీ, సమష్ఠిగా కానీ లేదు. అదే విధంగా ఇదివరకే రాజకీయాలలోకి రాగలిగిన వారికి ఉన్నత రాజకీయ లక్ష్యాలు లేవు. అందరూ కలిస్తేనే తమ శక్తి చాటుకునే పరిస్థితి ఏర్పడుతుందనే భావనలేక ఐక్యత లోపించింది. ఒకరిపై ఒకరు నిష్కారణమైన విమర్శలు చేసుకోవడం జరుగుతోంది.
అవకాశాలు తక్కువగా ఉండడం వల్ల ఎదిగిన, ఎదుగుతున్న బీసీ కుటుంబాలు తాము ఏదో ఒక అగ్ర కుల నాయకుని ప్రాపకంలో ఉంటే వ్యక్తిగతంగా కొంత అధికారాన్ని, అవకాశాలను పొందవచ్చుననే తప్పుడు అవగాహనలో ఉంటున్నాయి. స్వంతంత్ర ప్రత్యామ్నాయ బీసీ ఉద్యమం లేక పోవడం వల్ల ఇటువంటి పరిస్థితులను అధిగమించడానికి లోతైన ప్రయత్నం చేసేవారు లేకుండా పోయారు. ఉన్నవారికి సరైన తోడ్పాటు ఇవ్వడానికి బీసీల్లో కలిగి ఉన్నవారు ముందుకు రావడం లేదు. బడుగుల గురించి ఉద్యమిస్తున్న కమ్యూనిస్టు పార్టీలు కులం- కుల ప్రాధాన్యత- రాజకీయాల్లో కులం పాత్రలను ఇంతవరకూ గుర్తించకపోవడం వల్ల, వారు అనేక త్యాగాలు చేస్తున్నప్పటికీ అవి కోట్లాది బడుగులకు రాజకీయంగా, ఆర్ధికంగా సత్వర న్యాయం కలిగే విధంగా కార్యక్రమాలను రూపొందించుకోవడం లేదు. ఈ కారణాలన్నీ బీసీ ఉద్యమానికి ప్రారంభావరోధాలుగా ఉండిపోయాయి.
అందుకే బీసీల పోరాటాలు రాజకీయ ఉద్యమాలుగా రూపొందలేకపోయాయి. రాజ్యాధికారం వైపు దృష్టి సారించే సమగ్రమైన బీసీ ఉద్యమాలను రాష్ట్రంలో నిర్వహించడం జరగలేదు. రాజకీయాధికారం రానంతవరకూ ప్రభుత్వాధికారం, అభివృద్ధి, సమానత్వం, మెరుగైన జీవనం, కనీస సమస్యల పరిష్కారం సాధ్యం కాదన్న విషయాన్ని అందరూ గమనించాలి. ఏ ఒక్క బీసీ కులమో ఉద్యమిస్తే సరిపోదనీ, మితగతా కులాలతో కలసి సమష్ఠిగా, స్పష్టమైన రాజకీయ అజెండాతో మాత్రమే కదిలి ముందుకు కదిలినప్పుడు తమ సమస్యలు పరిష్కారం కావడమే కాక అధికారం తమ చేతుల్లోకి వస్తుందని ప్రతి బీసీ కులం గుర్తించవలసి ఉన్నది.
రాజకీయ లక్ష్యాలు కలిగి ఉన్నామన్న బీసీవాదులు, నాయకులు అనేకమంది ముందు తమ మధ్య, తమ తోటివారి మధ్య ఇతర కులాలతో కలిసి ఏదో ఒక స్థాయిలో కనీస అవగాహన రూపొందించుకుని అసంఖ్యాక బీసీ ప్రజానీకానికి ఆత్మస్థైర్యాన్ని పెంపొందించవలసి ఉన్నది. అది గుర్తించనంత వరకు వారంతా ప్రస్తుత పరిస్థితిని యథాతథంగా కొనసాగించడానికే ఉపయోగపడతారు. మార్పుకు ఛోదక శక్తులు కాలేరు. అందుకే బీసీ మేధావులు, కుల సంఘాలు, బీసీ వృత్తి- ఉద్యోగ సంఘాలకు విడి విడిగా- సమష్ఠిగా ఐక్యత ప్రాతిపదికపై స్పష్టమైన రాజకీయ అజెండా, సమీకృత భావజాల దృక్పథం అవసరం. దీనిని గుర్తించనంతవరకూ ఎక్కడ వేసిన గొండళి అక్కడనే ఉంటుంది.
Surya News Paper Dated 3/2/2012
Prof, K Murali Manohar Kakatiya University
Prof, K Murali Manohar Kakatiya University
No comments:
Post a Comment