Saturday, February 25, 2012

'సపాత్ర దానం' సక్రమమేనా? - డా. డి.ఎల్. విద్య


మా ఎదురింట్లో ఉండే 80 ఏళ్ళ లాయరుగారు చనిపోయారు. సువర్ణదానం, గోదానం, భూదానం, అన్నదానం, ఆఖరికి ఆయన పోయిన నెల లోపలే కన్యాదానం కూడా చేసేస్తున్నారని అందరూ మెచ్చుకుంటూ చెప్పుకున్నారు. 'సపాత్ర దానం' (జనవరి 22, ఆంధ్రజ్యోతి) అన్న జాహ్నవి శీర్షిక చూసి, నేను విన్న పై దానాల్లాంటివన్నీ అపాత్ర దానాలు, వేరే ఏవో నిజమైన దానాలు ఉన్నాయి, వాటి గురించి కాబోలు చెబుతున్నారనుకున్నాను. పైవన్నీ, అందులోకీ కన్యాదానం (ఓ కన్యను, జీవంలేని వస్తువులా, నోరులేని, ఆలోచన లే ని జంతువులా దానం చెయ్యడం) తప్పుడు దానాలూ, అపాత్ర దానా లే కదా మరి! అలాంటి వాటి మీద విమర్శ, సరయిన దానాలేం టో చెప్పే విజ్ఞానం ఉంటాయేమోనన్న ఆత్రుతతో ఆ వ్యాసం చదివాను. 

కానీ జాహ్నవి చెప్పిన సపాత్ర దానాలేమిటంటే.. 1.ఉద్యోగం చేసి, జీతం తీసుకుంటామా! దాన్ని జీతం తీసుకోవడం అనుకోకూడదు -దానం పుచ్చుకోవడం అనుకోవాలి; 2. సబ్బులో, జబ్బులొచ్చి మం దులో, డబ్బులిచ్చి కొనుక్కుంటామా! దాన్ని కొనుక్కోవడం కాదు. దానం పుచ్చుకోవడం అనుకోవాలి. ఈ రెండూ సపాత్ర దానాలు. సపాత్ర దానానికి ఉండవలసిన ముఖ్యమైన మూడు లక్షణాలూ వీటికి ఉన్నాయని కూడా వివరించేరు జాహ్నవి. 3.ప్రభుత్వ సంక్షేమ పథకాలు అపాత్ర దానాలన్నారు. ఆయన చెప్పిన అపాత్ర దానం విషయం పక్కన పెడదాం, ఆ సపాత్ర దానాలని, దానాలని ఒప్పుకోగలమా? 

"సామ్యవాద, కమ్యూనిస్టు విధానాల్లోని జాతీయీకరణ, పన్నుల రూపంలో దొంగిలించిన, బలవంతంగా వసూలు చేసిన సొమ్మును 'సంక్షేమ పథకాల' రూపంలో పంచిపెట్టడం దానం కాదు, నిజమైన దానం ప్రభుత్వేతర (ప్రైవేటు) వ్యక్తులు, వారి పెట్టుబడుల ద్వారా మాత్రమే సాధ్యం'' అన్నారు జాహ్నవి. సామ్యవాద, కమ్యూనిస్టు సిద్ధాంతాల ప్రకారం అన్ని పరిశ్రమల్నీ, భూముల్నీ జాతీయీకరణ చెయ్యడం జరిగితే, సొంత ఆస్తి అనేది ఉండదు. సొంత ఆస్తినే నిర్మూలించినప్పుడు ఆస్తుల మీద పన్నులూ ఉండవు. ఆస్తుల్ని పెంచుకునే అవకాశమూ ఉండదు, అవసరమూ ఉండదు. కమ్యూనిజంలో పన్నుల విధానమే రద్దయిపోతుంది. 

పన్నుల రూపంలో దొంగిలించి, బలవంతంగా వసూలు చేసి సంక్షేమ పథకాల రూపంలో పెట్టడం ఎలా జరుగుతుంది? ప్రభుత్వం, ప్రభుత్వేతరులూ అంటూ లేదు, రెండూ ఒకటే. 'సార్వత్రక వయోజన ఓటింగు' ఉండడం వల్ల అలా కనిపిస్తోంది. దాన్ని తీసేసి, పెట్టబడిదారులకు మాత్రమే 'ఓటు హక్కు' మిగిలిస్తే, ఆ భ్రమ తొలిగిపోతుంది. ప్రభుత్వం అంటే పెట్టుబడిదారుల ప్రతినిధులే అన్నది స్పష్టం అవుతుంది. జాహ్నవి ఆశించినది నిజమౌతుంది. అప్పుడు కార్మికులకీ, వినియోగదారులకీ, పెట్టుబడిదారులు పనిచేయించుకొని జీతాలిచ్చి, డబ్బులు తీసుకుని సరుకులు ఇచ్చి 'సపాత్రదానాలు' చేస్తూ ఉండవచ్చు. 

కానీ సామాన్య ప్రజల ఓటింగు హక్కు తీసెయ్యడం జరగదు. భూస్వామ్య వ్యవస్థ పోయి బూర్జువా వ్యవస్థ వచ్చే విప్లవాలన్నిటిలో, కార్మికుల, కర్షకుల పాత్ర అనన్య సామాన్యం. వాళ్ళ సహాయం లేకుండా ఉంటే బూర్జువా ప్రభుత్వాలు ఏర్పడగలిగేవి కావు. ఆ తర్వాత కూడా శ్రామికులు చేసిన ఎన్నో పోరాటాల వల్లే, ఈ 'సార్వత్రక వయోజన ఓటింగు హక్కు' వచ్చింది. దీని వల్ల ఒరిగే ప్రయోజనం ఎంత కొంచెమైనా సరే, దీన్ని కూడా తీసేసి స్వచ్ఛమైన బూర్జువా తత్వంతో పాలిద్దామనుకుంటే, అది చరిత్రని వెనక్కి మళ్ళించడం అవుతుంది, అది జరగదు. 

'సంపాదన, పొదుపు, పెట్టుబడి, ప్రైవేటు యాజమాన్యంలో ఉత్ప త్తి సాధనాలు-ఇదే ధర్మ మార్గం, సపాత్ర దానం' అంటారు జాహ్నవి. సంపాదించి, కడుపు కట్టుకుని పొదుపు చేసి, ఆ పెట్టుబడితో చిన్న కంపెనీ పెట్టేడనుకోండి ఎవడైనా ఓ సామాన్య ఉద్యోగి. కంపెనీ పెట్టడంతోనే సరిపోదు, పని వాళ్ళని పెట్టుకోవాలి. వాళ్ళకి జీతాలు మాత్రమే ఇవ్వాలి. అదనపు విలువని తను లాక్కోవాలి. అలా చెయ్యకపోతే పెట్టబడి వృద్ధి చెందదు. పెట్టుబడి పెట్టిన నాటి నుంచే అతడు పెట్టుబడిదారుడు అయిపోతాడు, అంటే పీడించేవాడు అయిపోతాడు. 

అప్పట్నుంచీ అతను ఇంక ఏ పనీ చెయ్యనక్కరలేదు. తన అవసరా లూ, విలాసాలూ అన్నీ శ్రామికుల శ్రమ వల్లే తీరుతాయి. శ్రామికుల శ్రమనే తను దోచేస్తూ, ఇంకా 'సపాత్రదానం' అనడం ఏంటి? కానీ ఇలా ఎప్పుడూ జరగదు. దోపిడీకి గురయ్యే శ్రామికులెవరూ, వారి అవసరాలే తీరక కృశించిపోతారు తప్ప, పెట్టుబడులు పెట్టే స్థాయికి రారు. 

"ఒక మనిషిని, దానం ఆశించకుండా సశక్తుడిగా చెయ్యడమే మహోత్కృష్టమైన దానం' అన్నారు జాహ్నవి. దానం ఆశించకుండా సశక్తుడిగా అవడం ఎప్పుడు జరుగుతుంది? చెయ్యడానికి పని దొరికి, పనికి తగ్గ ప్రతిఫలం దొరికినప్పుడు. పని చేసేరు=ప్రతిఫలం దక్కింది. దానం అనే శేషం ఎక్కడ్నుంచి వచ్చింది? దానం ఆశించకపోతే, దానం పట్టే ఖర్మం లేకపోతే మహోత్కృష్టమైన దానం వస్తుందా?! 

జాహ్నవి చెప్పిన నిజమైన దాతృత్వానికి ఉండే మూడు ప్రధాన లక్షణాలు: 1. 'మొదటిది ఒక విలువైన వస్తువు యొక్క యాజమాన్యం దాత చేతినుంచి గ్రహీత చేతికి మారాలి'. సమాధానం-శ్రామికుడు శ్రమించి వస్తువులు తయారు చేస్తాడు. ఇతని చేతి నుంచి ఆ వస్తువులపై అధికారం పెట్టుబడిదారుడి చేతిలోకి పోతుంది. 2. 'ఇచ్చిన వస్తువు లేదా సంపద ఇచ్చేవాడి సొంతమై ఉండాలి'. సమాధానం- భూగోళాన్ని ఏ మానవుడు సృష్టించలేదు. భూమిపైన వనరుల్నీ ఎవరూ సృష్టించలేదు. భూమి మీది సహజ వనరులతో శ్రమించడం వల్లే వస్తువులు తయారవుతాయి. శ్రమనే ఇచ్చి పుచ్చుకోవడం జరుగుతుంది. 

'శ్రమ' శ్రామికుడి సొం తం. పెట్టుబడిదారుడికి శ్రామికుడు సమర్పిస్తున్నది తన సొంతం. 3. 'ముఖ్యమైన మూడో లక్షణం, దానం గుప్తమైనదై ఉండాలి'. సమాధానం- శ్రామికుడు తన శ్రమను పెట్టుబడిదారుడికి ఇ స్తాడు. పెట్టుబడిదారుడు శ్రామికుడికి తిరిగి ఏమీ ఇవ్వడు. ఏ పె ట్టుబడి దారుడూ తాను ఏమీ ఇవ్వకుండానే శ్రామికుడి శ్రమ ఫలా న్ని లాక్కుంటున్నాననే స్పృహతో ఉండడు. అంచేత శ్రామికుడు చే సే ఈ దానం 'గుప్త దానమే'!. దానానికి ఉండవలసిన మూడు లక్షణాలూ, ముఖ్యమైన మూడో లక్షణంతో సహా నెరవేరాయి. శ్రామికుడు దాత, పెట్టుబడిదారుడు గ్రహీత. ఎవరు ఎవరికి దానం చేస్తున్నారో జాహ్నవికి అర్థం అవుతోందా? ఒప్పుకుంటారా? 

శ్రమతో తయారయిన ఒక వస్తువు, శ్రమతోటే తయారయిన మరో వస్తువుతో మారుతుంది. పెట్టుబడిదారుడు ఏ శ్రమ చెయ్యడు. (ఒకవేళ ఏ చిన్న శ్రమ అయినా చేసిన దానికి పొందవలసిన దానికంటె చెప్పలేనంత ఎక్కువ ప్రతిఫలం పొందుతాడు) అతని దగ్గర మారకానికి ఏమీ లేదు, పుచ్చుకోవడం తప్ప. అసలు సిసలైన దాన గ్రహీత పెట్టుబడిదారుడే! 'విలువగల యంత్ర పరికరాలు, పనిముట్లు, ఉత్పత్తికి దోహదపడి, అందరికీ మేలు చేస్తాయి. నిజమైన దాన ధర్మాలకు మూడు లక్షణాలు దీనిలో ఉన్నాయి' అంటారు జాహ్నవి. 

విలువ గల యంత్ర పరికరాలు, పనిముట్లూ ఉత్పత్తికి దోహదపడి, అందరికీ మేలు చెయ్యడం జరిగేది కమ్యూనిస్టు ఆర్థిక వ్యవస్థలోనే. అలా కాని దాన్లో, అవి, శ్రామికుడు పెట్టుబడిదారుడికి చేసే గుప్త దానాలయిపోతాయి. తాము ఇలా గుప్త దానాలు చేస్తున్నామన్న సంగతి పాపం శ్రామికులకి కూడా ఇంకా తెలియదు. కమ్యూనిస్టు వ్యవస్థలో 'దానం' అన్న ప్రసక్తి లేదు. 

ఆర్థికవేత్త కీన్స్ తన 'దేశ స్వయం సమృద్ధత' అన్న వ్యాసంలో, 'అంతర్జాతీయ విపణి నుంచి కొంతయినా తప్పుకోవడం, విజ్ఞానం అందించిన జీవితాన్ని మనోహరంగానూ ఉపయుక్తంగానూ మలచుకోవడానికి అవసరం' అన్న విషయం మీదే దృష్టి పెట్టేడు. 'మనపై మనమే యజమానులం' అవడానికి, 'భావిలో ఆదర్శవంతమైన, స్నేహమయమైన ప్రజారాజ్యాన్ని స్థాపించడానికి - మనకి ఇష్టమైన ప్రయోగాలు చేసుకోవడానికి', అంతర్జాతీయ వ్యాపార సంబంధాల్ని సూక్ష్మీకరించుకోవాలి కానీ విస్తృతపరచుకోకూడదు'' అని ఆశించేడు. "ఈ వాస్తవాలు మార్క్స్ ప్రతిపాదించిన 'అదనపు విలువ' సిద్ధాంతానికి సమాధానం చెబుతాయని' జాహ్నవి అన్నారు. 

జాహ్నవి చెప్పిన ఏ విషయాలైనా మార్క్స్ ప్రతిపాదించిన 'అదనపు విలువ' సిద్ధాంతాన్ని సమర్ధిస్తాయే తప్ప సమాధానం చెప్పగలిగేవి కాదు. జాహ్నవి దోపిడీని సమర్థిస్తున్నారు. 'దోపిడికి' సమాధానం మార్క్స్ ప్రతిపాదించిన 'అదనపు విలువ' సిద్ధాంతం. 'పెట్టుబడిదారుడు పొందే 15 శాతం కూడా వినియోగదారులకే చెందుతుంది'. జాహ్నవి కూడా మార్క్స్ ప్రతిపాదించిన 'అదనపు విలువ' సిద్ధాంతాన్ని ఒప్పుకుంటున్నట్టే కనబడుతోంది! కానీ, చిన్న సవరణ, 'వినియోగదారులకే చెందుతుంది' అని కాదు, 'శ్రామికులకే చెందుతుంది'. వినియోగదారులంటే పెట్టుబడిదారులు కూడా వచ్చేస్తారు. 

పెట్టుబడిదారులు తినే ప్రతి గింజా శ్రామికులదే. 'కాకపోతే ఆ పెట్టుబడిదారుడి పొదుపు, పెట్టుబడి, యంత్రాలు లేని నాడు, అదనపు ఉత్పత్తే జరగదని, అప్పుడు ఈ అదనపు ఉత్ప త్తి ఎవరికి చెందాలనే ప్రశ్నే ఉదయించదని గ్రహించాలి'. ఇంకా గ్రహించాలి - అసలు పెట్టుబడి కూడా శ్రామికులదేనని,యంత్రా లు కూడా శ్రామికులు తయారు చేసినవేనని, శ్రామికుల హస్తం పడందే యంత్రాలు కదలవనీ జాహ్నవి గ్రహించాలి. పెట్టుబడి, పెట్టుబడిదారులూ లేకపోయిన రోజున శ్రామికవర్గ ప్రభుత్వం ఏర్పడుతుంది. వాళ్ళు పని చెయ్యరు. కాబట్టి అడవుల్లోకి పోయి కందమూలాలు తింటూ బ్రతక గలిగినన్నాళ్ళు బ్రతుకుతారు. 

పెట్టుబడులన్నీ ఉత్పత్తి సాధనాలుగా, శ్రామికులందరూ ఉత్పత్తి దారులుగా, అదనపు ఉత్పతి,్త సంక్షోభాలు సృష్టించే గుణంలేని 'సమాజ నిధి'గా (సంచిత శ్రమ) మారుతాయి. పెట్టుబడిదారుడి 'కోడి, కుంపటి' లేనంత మాత్రాన తెల్లారడం ఆగదు. కాలచక్రమూ ఆగిపోదు. ఉత్పత్తీ ఆగిపోదు. 'దోపిడీ సంబంధాలు' పోయి, సమాన త్వ సుహృద్భావం వస్తుంది. 'శ్రామిక శాస్త్రమైన' కార్లమార్క్స్ రా సిన 'దాస్ కేపిటల్'ని, శ్రామికులందరూ జాహ్నవి చెప్పేవన్నీ త ప్పులని నిర్ద్వంద్వంగా గ్రహించగలగడానికి చదవాలి. అంతకన్నా ముందు రంగనాయకమ్మ రాసిన 'కేపిటల్ పరిచయం' చదవాలి. 

జాహ్నవి ఏదో ఉద్యోగం చేసి వేతనం తీసుకుంటూ, వినియోగదారుడుగా ప్రతినిత్యం ఏవో ఒకటి కొంటూ, సపాత్ర దానాలు పట్టి పట్టి చేతులు అరగ్గొట్టుకొని ఉంటారు. ఆ దానాలు పట్టడం ఎలాగూ మానలేరు, ఇలాంటి రాతలైనా రాయడం మానేస్తే చేతులు అరగడం తగ్గుతుంది.
- డా. డి.ఎల్. విద్య 

అసిస్టెంట్ ప్రొఫెసర్, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, కాకినాడ
Andhra Jyothi News Paper Dated : 26/02/2012

No comments:

Post a Comment