2009లో వచ్చిన కథలన్నీ చూసినప్పుడు రచయితలు స్థూలంగా ఉపయోగించిన భాషా సౌందర్యం గురించీ, సామెతలు, నుడికారాల గురించీ, ప్రకృతి వర్ణనల గురిం చీ, కథన శైలుల గురించీ ఒకటి రెండు మాటలు చెప్పాలి. ఈ సంవత్సరం కథల్లో చాలమంది రచయితలు తమ ప్రాంతానికీ, తమ సామాజిక వర్గానికీ ప్రత్యేకమైన భాష ను అద్భుతంగా వినియోగించుకున్నారు.
ప్రత్యేకించి కర్నూలు, కడప, చిత్తూరు, ఉత్తరాంధ్ర, మహబూబ్‌నగర్, కరీంనగర్, గుంటూరు- ప్రకాశం ప్రాంతాల భాషా ప్రయోగాలు వాటి సొగసుతోనూ, అర్థస్ఫోరకంగానూ వచ్చాయి. ఈ సంవత్సరం కథలు చదవకపోతే తెలుగు సమాజంలో ఒక ప్రాంతంలో సుడిగుండాన్ని తిరుగుడు గుమ్మి అంటారనీ, ఒక ప్రాంతంలో ఉజ్జిడి అనే ప్రత్యేక గ్రామీణ ఆచారం ఉందనీ, చిత్తూరు ప్రాంతంలో పెళ్లి తంతులో కొన్ని ప్రత్యేకతలున్నాయనీ నాకు తెలిసేది కాదు.
అలాగే ఈ సంవత్సరం కథల్లో బహుశా కథకులు మూలాల్లోకి పయనించాలని ప్రయత్నించినందువల్ల ఎన్నో మంచి సామెతలు, నానుడులు వచ్చి చేరాయి. గుర్తించినవాటిలో కొన్ని: 'మిన్ను కురవక చేను పండదు, కన్ను కురవక బతుకు పండదు' 'ఉరికిన శాలోడు గదే అంగడి, ఉరకని శాలోడు గదే అంగడి' 'చెప్పితె ఇననోన్ని చెడంగ జూడాలె' 'పేరు పెద్దిర్కం, ఇల్లు జలతంత్రం' 'కొంచెపోని కొంగు పడతె మంచోని మానం పోయిందట' 'నూనెవోసి అలుక్కున్నట్టే' 'అయ్యోడు గాదు అవ్వోడు గాదు జంగమోన్ని పట్టుకుని జామేడ్సినట్టు'... ఎంత విస్తృతమైన జీవతానుభవం నుంచి, ప్రాచీన వివేకం నుంచి ఈ నానుడులు వచ్చి ఉంటాయి!
అట్లాగే ఈ సంవత్సరం కథలలో జరిగిన కొన్ని పొరపాట్లు కూడ చెప్పాలి. జీవిత దృశ్యాల చిత్రణ ఉన్నప్పటికీ పాత పద్ధతి కథన శైలితో ఉట్టి చిత్రం మాత్రమే, లేదా ఉట్టి చమత్కారం, కొస మెరుపు మాత్రమే కథ అనుకునే ధోరణి ఇంకా ఉంది. ఇతరంగా మంచి కథలు రాసిన కథకులు, నిశిత దృష్టి ఉన్న కథకులు కూడ ఈ పొరపాటు చేసినట్టు కనబడుతున్నది.
ఈ సంవత్సరం వచ్చిన కథలలో రెండిటి గురించి మాత్రం నా విమర్శను కూడ నమోదు చేయవలసి ఉంది. డా.వి చంద్రశేఖరరావు రాసిన 'ఎచ్.నరసింహం ఆత్మహత్య' (నిజానికి ఇది జనవరి 2010లో అచ్చయింది గనుక కచ్చితంగా చెప్పాలంటే ఈ సింహావలోకనం పరిధిలోకి రాదు) నిర్దిష్ట స్థాయిలో అవాస్తవమేమో అనిపించే ఒక సాధారణ వాస్తవాన్ని వెటకరించడానికి, చిన్నచూపు చూడడానికి ప్రయత్నించింది.
ఎప్పుడయినా సాధారణ స్థాయిలో వాస్తవమయినది ప్రత్యేక, నిర్దిష్ట స్థాయిలో నిజం కాకపోయే అవకాశం ఉంటుంది. కొంత వైవిధ్యం, తేడా ఉంటుంది. కాని ఆ ఒక్క ఉదాహరణ వల్ల సాధారణ వాస్తవం, వాస్తవం కాకుండా పోదు. ఈ కథ చెప్పే ప్రధాన పాత్ర హైదరాబాదును ప్రేమించే, తనను తాను హైదరాబాదీనే అనుకునే ఒక సుకుమార యువతి పి.కృష్ణవేణి.
ఆమె కుటుంబం ముప్పై ఏళ్లకిందనే ఇతర ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడింది. ఆమె ప్రేమించిన మనిషి ఎచ్.నరసింహం. మొరటుగా ప్రేమిస్తాడు. రెండురోజుల పాటు మంటపుట్టేలా ముద్దు పెట్టుకుంటాడు. గేదె పాల వ్యాపారం చేసే కుటుంబం నుంచి వచ్చాడు. ఆ యువకుడు ఏ కారణం వల్లనో ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ ఆత్మహత్యను ప్రాంతీయవాదులు కైవసం చేసుకుని అతనికి కొత్త చరిత్ర కల్పిస్తారు.
ప్రతి ఆత్మహత్య వెనుకా సంక్లిష్టమైన కారణాలు ఉంటాయి. ఏదో ఒక కారణాన్ని ఆపాదించడం బతికి ఉన్నవాళ్ల ప్రయోజనాల కోసమే అనేది కూడ నిజమే. ఆత్మహత్యలను ఎంతమాత్రం సమర్ధించనక్కరలేదు. కాని ఒక సంక్షుభిత వర్తమాన ఘటన మీద ఇంతగా వెటకరించడం కూడ సాహిత్యకారులకు తగదేమో.
అలాగే సెజ్ మీద తుమ్మేటి రఘోత్తమరెడ్డి రాసిన కథ సెజ్‌లను విమర్శించేవారిని వెటకరించింది. సెజ్ అనే విధానం వల్ల విమర్శకులు చెపుతున్న కీడు జరగదనీ, మేలే జరుగుతుందనీ అనుకునే అవకాశం, అధికారం ఎవరికైనా ఉన్నాయి. ఆ పని ప్రభుత్వం చేస్తూనే ఉంది. ఆ మేలును చిత్రిస్తూ కథ కూడ రాయవచ్చు. కాని ఆ విధానం వల్ల బాధితులైనవారి పక్షం తీసుకున్నట్టు కనబడుతూ, విధానాన్ని విమర్శించే వారి పట్ల వెక్కిరింతతో, విమర్శతో రాయడం చేయదగిన పని కాదు.
పరభాషా పదాల, ముఖ్యంగా ఇంగ్లిష్ పదాల, అక్షరక్రమాన్ని తప్పుగా రాయడం కూడ తెలుగు కథకుల్లో కనబడుతున్నది. నిజానికి ఆయా స్థలాలలో పరభాషా పదాల అవసరం లేకపోవడం ఒక ఎత్తయితే, వాటిని సరిగా వాడకపోవడం మరొక ఎత్తు. ఇది వారి నేర్పు మీద, అవగాహనా స్థాయి మీద వ్యాఖ్య కాదు గాని, అజాగ్రత్త ఫలితం కావచ్చు.
రచయిత అజాగ్రత్త పాఠకులలో ఆ రచయిత మీద గౌరవాన్నీ విశ్వాసాన్నీ తగ్గిస్తుంది, రచయిత ఎంత గొప్ప విషయం చెప్పినా ఇలా గౌరవాన్నీ, విశ్వాసాన్నీ కోల్పోతే, చెప్పే విషయానికి విలువ తగ్గుతుంది. అలాగే విరామ చిహ్నాల వాడకంలో కూడ తెలుగు కథకులలో అత్యధికులు అవసరమైన, తగిన శ్రద్ధ తీసుకోవడం లేదనిపిస్తున్నది. ఒక్క ఫుల్‌స్టాప్ మినహాయిస్తే, మిగిలిన అన్ని విరామ చిహ్నాలనూ అనవసరంగానో, తప్పుగానో వాడుతున్నారు.
ఈ చిన్న పొరపాట్లను అలా ఉంచి తెలుగు కథ తప్పనిసరిగా 2009లో నడవవలసిన దారిలోనే నడిచింది. సమాజాన్ని అర్థం చేసుకోవలసిన పద్ధతిలోనే అర్థం చేసుకున్నది, సరిగానే చిత్రించింది. విశ్లేషించింది. వంద సంవత్సరాలకు పైగా సమాజ సాహిత్య సంబంధాల అన్యోన్యతకు ప్రతీకగా ఉన్న తెలుగు కథ తన ఘనమైన వారసత్వాన్ని కొనసాగించింది. ఉజ్వల భవిష్యత్తుకు హామీగా నిలిచింది.
- ఎన్.వేణుగోపాల్
'కథావార్షిక 2009'కు రాసిన సింహావలోకనం నుంచి

Andhra Jyothi News Paper Dated : 6/12/2010
No comments:
Post a Comment