Wednesday, February 22, 2012

మహాసముద్రం ఇంకిపోతుందా? - గీతాంజలి మూర్తి


'ఎక్కడ ఆత్మ గౌరవం నిర్భయంగా తలెత్తుకుని తిరుగుతుందో ఎక్కడ లోకం సంకుచిత అడ్డుగోడలతో విచ్ఛిన్నం కాదో
అట్టి సర్వ స్వతంత్ర స్వర్గంలోకి, తండ్రీ, నా దేశాన్ని నడిపించు'
- రవీంద్రనాథ్ టాగూర్
'గీతాంజలి'

'ఆధ్యాత్మిక ప్రజాస్వామ్యం ఉండాలి. ఆధ్యాత్మిక ప్రజాస్వామ్యం లేనందువల్లే భారతదేశంలో శ్రామిక కులాలు అణచివేయబడ్డాయని' కంచ ఐలయ్య తన 'హిందూ మతానంతర భారతదేశం'లో అన్నారు. ఇది పూర్తిగా తప్పుడు అవగాహనతో చేసిన ఆరోపణ. ఆధ్యాత్మిక రంగంలో రాజకీయ సామాజిక రంగాలలో వలే ప్రజాస్వామ్యం ఉండటమేమిటి? మనమేదో కొత్త భావాలు, 'పదజాలం' నేర్చుకున్నాం కాబట్టి, వాటిని అలౌకికమైన ఆధ్యాత్మిక రంగానికి పులమటమే తప్పు. అయినా హిందూ వ్యవస్థలో, మానవులందరూ సమానమేననీ, అందరికీ ఆ భగవంతుని దృష్టిలో సమానావకాశాలు ఇవ్వబడినాయనీ శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. 

దార్శనికులైన భారతీయ ఋషులు సమస్త మానవ జాతి సుఖ సంతోషాలతో ఏ భేద భావం లేకుండా జీవించాలనీ, పశుపక్ష్యాదులను సైతం కరుణతో చూడాలనీ బోధించారు. వారి స్ఫూర్తితోనే మహాత్మా గాంధీ 'సత్యాహింసలను' ఉద్యమ సాధనలుగా చేసుకొని దేశ స్వాతంత్య్రం సాధించారు. అయితే పూర్వకాలంలో అజ్ఞానంతో, అహంభావంతో కొందరు మూర్ఖులు, కొన్ని మూఢాచారాలతో సమాజంలో ఎక్కువ తక్కువలను పాటించిన మాట వాస్తవం. అయినా కాలక్రమంలో ఇప్పుడు చాలా మంది అవన్నీ వదిలివేసి, సర్వ మానవ సౌభ్రాతృత్వాన్ని ఇష్టంగా ఆచరణలో పెడుతున్నారు. 

ఆధునిక జీవన విధానంలో, విప్లవాత్మక మార్పులు వచ్చి, సమాజంలో, కులాంతర, మతాంతర వివాహాలు కూడా చాలా అసాధారణంగా జరిగిపోతున్నాయి. పెద్దలు కూడా విశాల హృదయంతో వాటిని ఆమోదించి, పరిణతి చెందిన మనసులతో అందరూ కలిసి మెలసి ఉండటం చూస్తున్నాం. హిందువులలో ఇలా విప్లవాత్మక మార్పులు నిశ్శబ్దంగా చోటుచేసుకోవటం గమనార్హం. ఇదొక గొప్ప మార్పు. ఇలా మార్పు జరిగింది. ఇంకా జరుగుతోంది. దీనిని ఐలయ్య గుర్తించి హర్షించరా? అంతేకాక అన్ని దేవాలయాలలోనూ, పరిపాలనా మండలులు చాలావరకు బ్రాహ్మణేతరుల చేతిలోనే ఉన్నవి కదా. 

చాలాచోట్ల అన్ని కులాల, వర్గాల ప్రజలకు దేవాలయ ప్రవేశం నిరాటంకంగా హాయిగా జరుగుతోంది కదా. ఈ మధ్య మా తెనాలిలో శ్రీశ్రీ దండి స్వాముల వారి ఆధ్వర్యంలో సహస్ర హోమయాగం జరిగింది. అందులో అన్ని కులాల వారికీ వర్గాల వారికీ ఏ భేద భావం లేకుండా, ఆ యజ్ఞం స్వయంగా జరుపుకునే అవకాశం ఇవ్వబడింది. ఎందరో, ఎవరెవరో చుట్టు పక్కల ఊళ్ళ నుంచీ స్వేచ్ఛగా వచ్చి మహదానందంగా ఆ యజ్ఞంలో పాల్గొన్నారు. తరువాత, అందరికీ సమానంగా ప్రసాదం (భోజనాలు) అందజేయ బడినాయి. నేను ఈ దృశ్యాన్ని ప్రత్యక్షంగా చూసి చాలా ఆనందించాను. ఇలా ఎన్నో కార్యక్రమాలు కుల భేదం లేకుండా అనేక చోట్ల జరుగుతున్నది వాస్తవం. 

మరొక అద్భుత మార్పు. డాక్టర్ అంబేద్కర్ వంటి మహనీయుని, దార్శనికుని నేతృత్వంలో రాజ్యాంగంలో పొందుపరిచిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారికి కలిగించిన రిజర్వేషన్ల వలన అన్ని రకాల క్రింది వర్గాల వారికి విద్య/ఉపాధి ఇతర రంగాలలో అవకాశాలు మెండుగా ఇవ్వబడుతున్నాయి కదా. అన్ని రకాల, రాజకీయ పరిణతి వలన వివిధ అత్యున్నత రాజ్యాంగ పదవులను సైతం ఆ వర్గాల వారు అలంకరించటం కూడా వాస్తవమే కదా. నాకైతే ఈ ప్రగతిశీల పరిణామాలు ఎంతో సంతోషదాయకంగా ఉన్నవి. 

ఇలా అన్ని భేద భావాలూ పోగొట్టుకుని అందరూ సమానావకాశాలతో ముందుకు సాగుతున్న ఈ రోజులలో ఐలయ్య లాంటివారు పనిగట్టుకొని కులద్వేషాన్ని రెచ్చగొట్టే రాతలు రాయటం ఎంత మాత్రం సబబు కాదు. అంతే కాదు ఎంతమందో మఠాధిపతులు, పీఠాధిపతులుగా కూడా బ్రాహ్మణేతరులే ఉన్నారు. నేను శిష్యుడిగా ఉన్న యోగదా సత్సంగ సొసైటీ (రాంచి)లో నిర్వాహకులు (అధిపతులు) దాదాపు అందరూ బ్రాహ్మణేతరులే. చక్కగా సన్యాసం పుచ్చుకొని, అందరికీ యోగ సాధనలను శాస్త్రీయంగా నేర్పుతున్నారు. 

ఆశ్రమంలో, నాకు దీక్షనిచ్చిన సాధువు, హిందూ మతాన్ని ఇష్టంతో స్వీకరించిన ఒక విదేశీ సాధువు అంటే నమ్ముతారా? ఇది నా అనుభవంలో జరిగిన వాస్తవం. ఈ వాస్తవ నేపథ్యంలో కంచ ఐలయ్య లాంటివారు కళ్ళు బాగా తెరిచి, వారి భాషలోనే 'ప్రజాస్వామ్యం' హిందూయిజంలో సజావుగా అమలవుతోందనీ, వారేమీ ఆందోళన పడనవసరం లేదని, ఉచిత సలహాల పేరుతో, తప్పుడుభాష్యాలు చెప్పొద్దనీ నా సలహా. 

ఇక భారతదేశంలో శ్రామిక కులాలు అణచివేయబడటానికీ హిందూయిజం మాత్రమే కారణం కాదు. కొన్ని ఆచార వ్యవహారాలు పాటించలేకపోవటం వలన, పూర్వం క్రింది వర్గాలను దేవాలయాలలోకి రానివ్వక పోవటం, దూరంగా ఉంచటం జరిగిన మాట వాస్తవమే. ఇది చాలా తప్పే కాని శ్రామిక వర్గాలను అణచివేసింది ఆనాటి/నేటి వ్యాపార వర్గాలు, రాజకీయులు, పాలకవర్గాలనేదే వాస్తవం. పాలనలో ఎవరుంటే వారు శ్రామికులకు న్యాయమైన ప్రతిఫలం ఇవ్వక దోపిడీ చేసి పైకిరానివ్వలేదు. హిందుయిజానికీ శ్రామికులకు ప్రత్యక్ష విరోధమెప్పుడూ లేదే. 

అయితే పారిశ్రామికీకరణ జరిగిన/జరుగుతున్న క్రమంలో కమ్యూనిస్టు ఉద్యమాల ఫలితంగా మాత్రమే శ్రామికులు అభివృద్ధిలోకి వచ్చారనేది కాదనలేని వాస్తవం. ఈరోజు రైతులనూ, కూలీలనూ గిరిజనులనూ/క్రింది తరగతుల వారినందరినీ, వారి మనుగడనూ కాలరాసే వారు ఎవరు? కేవలం ఒక మతపరమైన హిందువులా లేక వ్యాపార రాజకీయ వర్గాలా? శ్రామికుల తరఫున పోరాడితే వామపక్షాలతో కలిసి పోరాడండి. ఫలితం రావచ్చు. అసలు వామపక్షాల వారు మీ పిడివాదమైన హిందూయిజం వ్యతిరేకత జోలికిరారే. వారికి ఉన్న ఇంగిత జ్ఞానం ఆచార్య పదవిని అలంకరించిన ఐలయ్యకు ఎందుకు లేదో ఆశ్చర్యం కలుగుతుంది. మోటుగా వాదిస్తే అది హేతుత్వానికి నిలవదు సుమా! 

"క్రైస్తవ సమాజం ఆధ్యాత్మిక ప్రజాస్వామ్యాన్ని ఆచరించినందువల్లే, క్రిస్టియానిటీ 'వ్యాపించే గమనాన్ని' (స్ప్రెడింగ్ క్యారెక్టర్) సంతరించుకుని వేగంగా ప్రపంచ వ్యాప్తంగా వ్యాప్తి చెందుతూ ఉందని'' డాక్టర్ గోపీనాథ్ ('ఆధ్యాత్మిక ప్రజాస్వామ్య మేదీ?' జనవరి19, ఆంధ్రజ్యోతి) అన్నారు. ఆయనే మరో మాట శెలవిచ్చారు: 'హిందూ మతం కనీసం భారతదేశంలోనైనా బ్రతకాలంటే, అది తనను తాను సంస్కరించుకోవడం ఒకటే మార్గం'. ఎంత గొప్ప అవగాహన! 

ఇందుకే కాబోలు, ఆ మధ్య గౌరవనీయులు పోప్ పాల్ అన్నారు:"there is a lot of untapped potential in india, for christianity to expand...' (సరిగ్గా ఈ మాటలే కాకపోయినా, ఈ భావవ వచ్చే మాటల్లో). నేను ఒప్పుకుంటున్నాను. క్రైస్తవ మతం తన సామ దాన భేద దండోపాయాలతో ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోంది. తన కపట నాటకంతో, మాయ మాటలతో అమాయక పేదలు, గిరిజనులనే కాకుండా మితిమీరిన ధనాశ చూపించి, పెద్ద రాజకీయ నాయకులను కూడా బుట్టలో వేసుకోవటం జరుగుతోంది. మరి హిందువులు అస లు దురాశాపరులు కాదు కదా! వారిలాగా హిందూయిజం ఎలా వ్యాప్తి చెందుతుంది? చెందదు. 

ప్రొఫెసర్ భూక్యా ఇలా రాశారు ('హిందూ ఫాసిజమే భారత్‌కు హాని' జనవరి 25, ఆంధ్రజ్యోతి): 'భోపాల్ గ్యాస్ దుర్ఘటనకు కారకుడైన వ్యక్తిని (ఇటలీ దేశస్థుడైన ఖత్రోచీ) చట్ట విరుద్ధంగా స్వదేశానికి వెళ్ళిపోవడానికి మన పాలకులే సహకరించలేదా?' హిందూయిజానికీ, ఖత్రోచీ పారిపోవటానికీ సంబంధమేమిటో పాఠకులకు తెలియజేస్తారా? ఖత్రోచీని, మీ నాయకురాలైన ఇటలీ దేశస్తురాలి ఆదేశాల పైనే కదా, ఆమె చేతినీళ్ళు తాగి బ్రతికే పాలకులు కుట్ర పూరితంగా, సురక్షితంగా దేశ హద్దులు దాటించారు? మీ నాయకురాలిని సూటిగా అడగలేకనా? దురదృష్టం. సరే, ఏది ఏమైనా కుయుక్తులతో రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యం లాగా విస్తరించాలనుకున్న క్రిస్టియానిటీ పంథా హిందూ మతానికి అవసరం లేదు. హిందూ మతం అలా అధర్మ విధానానికి పాల్పడదు. 

తెలిసో తెలియకో భూక్యా ఇలా రాశారు: 'ముస్లింల రాకతోనే హిందూ మతం పుట్టింది. అంతకు ముందు హిందూ అనే పదమే వాడుకలో లేదు'. రచయిత వాదనను బట్టి, ఇప్పుడు వ్యవహరిస్తున్న 'హిందూ' అనే పేరుతో పిలువబడుతున్న మతం ఈ భారతదేశంలో 'ముస్లిం' దోపిడీదారులు మన దేశంపైకి దండెత్తి వచ్చేవరకు లేదు. మరి ఈ జాతికి, అప్పుడు వ్యవహరిస్తున్న మతం ఏమిటి? ఏమీ లేదా? ఆలోచించడం. వేదాలు, ఉపనిషత్తులు, ధర్మశాస్త్రాలు అనుసరించిన అప్పటి ప్రజలు దేనిని అనుసరించారు? వారి గురువులు వాటిలోని బోధనలను ఏమని చెప్పారు? ముస్లింలు రాక పూర్వం ఈ జాతి అనుసరించినది 'సనాతన ధర్మం'. ఇతర మతాలు వచ్చిన తరువాతే ఈ 'మతం' (అంటే అభిప్రాయం) అనే పదం వాడుకలోకి వచ్చినట్లు తెలుస్తున్నది. కాబట్టి, ఈ దేశానికి ఉన్న పేరు ప్రకారం- 'భారత'దేశం. అనగా భా అంటే జ్ఞానం/ప్రకాశం; రత అంటే కలిసి ఉండటం. కాబట్టి భారతదేశం అంటే జ్ఞానంతో వెలిగిపోవటం, కాంతినివ్వటం. ఈ భావమే ఈ జాతిలో/హిందువులలో, అణువణువునా నిండి నిబిడీకృతమైన, సనాతన ధర్మాచరణ. 

ఐలయ్య చెప్పినట్లు హిందూయిజం అంతరించకపోవటం అటుంచి, అనూహ్యంగా, నిశ్శబ్దంగా, ప్రపంచ దేశాలలో తనదైన శైలిలో ఆధ్యాత్మికంగా (వ్యాపారాత్మకంగా కాదు) విస్తరిస్తోంది. ఇస్కాన్‌లోని అనుయాయులందరూ దాదాపు విదేశీయులే కదా. భగవద్గీత, రామాయణాలు అనేక దేశాలలో అనువదితమయ్యాయి. రష్యా/ ఇండోనేషియాలలో రామాయణం నృత్యరూపకంగా ప్రదర్శించుకుంటారట. ఈ మధ్యన, రష్యాలో భగవద్గీతను అక్కడి వారు రష్యన్ భాషలోకి అనువదించారని, అయితే ఆ అనువాదంలోని కొన్ని అంశాలు వివాదాస్పదమై కోర్టులో వ్యాజ్యం నడుస్తున్నదనీ తెలుస్తోంది కదా. సత్యసాయిబాబా కేంద్రాలు, రామకృష్ణా మిషన్, యోగదా సత్సంగ సొసైటీ వంటి అనేక సంస్థలు, ఆశ్రమాల కేంద్రాలు ఎన్నో దేశాలలో విస్తరించి ఉన్నాయి. ఇది వ్యాప్తి కాదా? అది కూడా ఎవరినీ, ఏ ప్రలోభం పెట్టకుండా సుమా! ఇది మీరు కూడా ప్రశంసించ వలసిన విషయం, సహృదయత ఉంటే. 

హిందూ మతం ఒక నిరంతర గంభీర ప్రవాహం. సనాతన ధర్మ పీఠం. అదొక మహాసముద్రం. దానిలోని నీరును ఎంత తోడి ఖాళీ చేద్దామనుకున్నా ఖాళీ అవుతుందా? ఇంకిపోతుందా? కాదు. కానేకాదు. గంభీరమైన ఆ హిందూ మహా సముద్రంలో ఎన్నో నదులు/ (మతాలు) చేరినా దాని స్వస్వరూపం, పరిమాణం ఏమీ తగ్గదు. గుణం చెడదు. ఇంకా బలోపేతమవుతుంది. దీనికి కారణం ఇదొక మతం కాదు, జీవన విధానం. సనాతన (వేద విదితమైన) శాస్త్రీయమైనది దీని ఆధ్యాత్మికత. అందుకే, ఎన్ని దుర్మార్గపు దాడులు జరిగినా, విధ్వంసాలు జరిగినా, ఘోరమైన ద్వేషపూరితమైన మత మార్పిడిలు జరిగినా, మతద్వేషం కక్కినా ఈ పుణ్యభూమిలో, ఈ కర్మ భూమిలో, అణువణువూ నిండి నిబిడీకృతమైన సహిష్ణుత, సర్వ మానవ సౌభ్రాతృత్వం, లోక కల్యాణం కోసం, ఈ జాతి పడే తపన దీనిని చెక్కు చెదరనీయదు. 

గంభీరమైన ఐరావతం వలే, హుందాగా ముందుకు నిరంతరంగా కదులుతూనే ఉంటుందని మా ప్రగాఢ విశ్వాసం. మహాసముద్రం వంటి హిందూ మతానికి అంతం లేదు. ఉండదు. ఉంటుందని ఐలయ్య, గోపీనాథ్, భూక్యా వంటివారు అనుకుంటే వారు తీవ్రంగా పాత దురాక్రమణదారుల వలె భంగపడక తప్పదు. సూర్యుడి మీద ఉమ్మేస్తే ఏమవుతుందో ఈ మేధా బ్రువులకు తెలియదనుకోను. కాని వారికి చివరిగా నాదొక సూచన. ఇప్పటికైనా ఈ ద్వేష పూరిత విషప్రచారం మాని ఆచార్య పదవి అలంకరించారు కాబట్టి పెద్ద మనుషులుగా, పెద్దమనసుతో సంస్కారయుతమైన భాషతో, తమ అభిప్రాయాలను ఇతరుల మనోభావాలను కించపరచకుండా వ్యక్తం చేయమని. వారి భాష/భాషణం హుందాగా ఉంచుకోమనీ. 

- గీతాంజలి మూర్తి
వ్యాసకర్త రవీంద్రుని 'గీతాంజలి' అనువాదకు

Andhra Jyothi News Paper Dated 23/02/2012 

No comments:

Post a Comment