Tuesday, February 14, 2012

ఉలికిపాటుతో ఉపద్రవం పోదు - జి.రాములు



కంచ ఐలయ్య 'హిందూ మతానంతర భారతదేశం' సారాంశంతో విభేదించాల్సిందేమీ లేదు. అంత మాత్రాన ఆ పుస్తకంలోని ప్రతి అంశం సమర్థనీయం కాదు. అటువంటి అంశాలు కొన్నిటిని ఇక్కడ చర్చించడం అసందర్భం కాదు. 


ప్రస్తుత కుల వ్యవస్థకు, వర్గానికి మధ్య ఉన్న సంబంధం గురించి ఐలయ్య మరింత విశ్లేషించి వుండవల్సింది. ఈ సంబంధానికి ఉన్న ప్రాధాన్యాన్ని ఆయన గుర్తించినట్లు లేదు. దాదాపు 150 సంవత్సరాలపాటు కులం, వర్గం దాదాపు ఒకటిగానే ఉన్నా, ఈ మధ్యకాలంలో పరిమితంగానైనా కులాల్లో సహితం వర్గాలు ఏర్పడుతున్నాయి. పెట్టుబడిదారీ వర్గ వ్యవస్థతో కులాలు బలహీనపడతాయని కొందరు అమాయకంగా నమ్మిన కాలం కూడా ఉంది. కాని కుల వ్యవస్థను పెట్టుబడిదారీ వ్యవస్థ తన దోపిడీకి రక్షణ కోటగా మలుచుకుంటోంది. అసంఖ్యాక కులాలతో నిండిన ఈ హిందూ సమాజం, ఒక కులం ఇంకొక కులంతో కలవలేని సామాజిక నేపథ్యంలో సతమతమవుతున్నది. ఇదే అగ్రకుల సంపన్న వర్గాలకు వరంగా, శ్రామిక కులాలకు శాపంగా మారింది. 



అగ్రకులాల నుంచే సంపన్న వర్గాలుగా ఎదగడం, శ్రామిక కులాలు పేదలుగానే మిగలడం ఎవరైనా ఇట్టే గమనించవచ్చు. అదే విధంగా సంపన్న వర్గాలను కాపాడడానికి కుల వ్యవస్థ, కుల వ్యవస్థను చెక్కు చెదరనీయకుండా సంపన్నవర్గాలు పకడ్బందీ పథకంతో పరిరక్షించుకుంటున్న విషయం సదాగమనంలో ఉండాలి. ఈ విషయం అర్థమయితేనే భారత సమాజం సక్రమంగా అర్థమయినట్లు భావించాలి. 



అయితే కుల వ్యవస్థ ఫలితంగా హిందూ మతం దానంతట అదే అంతమవుతుందనే భావన (ఐలయ్య పుస్తకం 346వ పేజీలోని పేరాలు చదివితే) వస్తుంది. దానిని సరిచూసుకోవల్సి వుందేమోనని భావిస్తున్నాను. అలాగే 'శూద్ర పునాది-బాపన భవంతి' అధ్యాయంలో ఐలయ్య ఇలా అన్నారు: 'పెట్టుబడి, క్రైస్తవ, బౌద్ధ మార్కెట్లు నిలకడగా ఉంటాయి' (330వ పేజీ). పెట్టుబడిదారీ వ్యవస్థ నిలకడగా ఉండే అవకాశమే లేదు. క్రైస్తవమైనా, బౌద్ధమైనా మరే మతమైనా పెట్టుబడిదార్ల మార్కెట్లు నిలకడగా, సంక్షోభరహితంగా ఉన్నట్లు రుజువు లేదు. 



పెట్టుబడిదారీ వ్యవస్థే నిరంతర సంక్షోభాలతో సతమతమవుతుంటుంది. ప్రపంచంలో అత్యంత బలీయమైన పెట్టుబడిదారీ వ్యవస్థలు కలిగివున్న అమెరికా, యూరోపియన్ దేశాల ప్రస్తుత పరిస్థితి నుంచి దీనిని గమనించవచ్చు. ఇంకొకచోట భౌతికవాద ఆలోచనలు సంక్షోభంలో పడ్డట్లు ఐలయ్య పేర్కొన్నారు. భౌతికవాదులమని చెప్పుకునే వారి ఆలోచనలు తప్పు కావచ్చు. కాని భౌతికవాదమెలా తప్పవుద్ది? భౌతికవాదమంటేనే వాస్తవమని అర్థం. వాస్తవ ఆలోచనలు సంక్షోభంలో పడటం ఏమిటి? ఇలాంటివి మరికొన్ని, ఐలయ్య పుస్తకంలో నా గమనంలోకి వచ్చిన లోపాలు. 



ఈ లోపాలేవీ ఐలయ్య గ్రంథం గొప్పతనాన్ని తగ్గించవు. హిందూ మత కుళ్ళును, మతం లేదా ధర్మం చాటున దాగిన దోపిడీని కళ్ళకు కట్టినట్లు ఐలయ్య ఈ పుస్తకంలో చూపారు. శ్రామిక కులాల కృషిని, నైపుణ్యాన్ని, సైన్సు అభివృద్ధి, సంపద సృష్టిలో వారి పాత్రను చక్కగా చూపిన పుస్తకం ఇది. ఎంత కష్టమైనా, ఇబ్బందికర పనులుచేస్తే అంత నీచులుగా, ఎంత సోమరులు, పరాన్న భుక్కులయితే అంత గౌరవనీయమైన సామాజిక హోదాలను హిందూ మ తం కేటాయించిందో ఐలయ్య పుస్తకం చక్కగా బహిర్గతపర్చింది. కులాలు లేని సమాజంలో కూడా వ్యత్యాసాలు ఉంటాయి. యజమానుల నుంచి శ్రామికులు అవమానాలు పొందుతారు. 



కాని కుల వ్యవస్థ ఫలితంగా ఆర్థిక దోపిడీతో పాటు సామాజిక అణచివేతనూ అనుభవించాల్సివస్తుంది. కులవ్యవస్థలో వచ్చే అవమానం ఆర్థికం లో వచ్చే దానికంటే అనేక రెట్లు పెద్దదన్న డాక్టర్ అంబేద్కర్ అభిప్రాయాలను గమనంలోకి తీసుకోవచ్చు. హిందూ మతాన్ని ఎవరో నాశ నం చేయాల్సిన అవసరం లేకుండానే అంతర్గత వైరుధ్యాలతో అం తం కాగలదని ఐలయ్య అంటారు. ఇది భవిష్యత్తులో మరింత చర్చనీయాంశమయ్యే అంశం. హిందూ మతానికి మిగతా మతాలతో విభేదమున్న ప్రధాన అంశాలు ముఖ్యంగా మూడు. అవి: (అ) కుల వ్యవస్థ; (ఆ) దోపిడీదార్ల దేవుళ్ళ వ్యవస్థ; (ఇ) వికర్షించే స్వభావం. 



కుల వ్యవస్థ పుట్టుకతో వచ్చి జీవితాంతం కొనసాగుతుంది. వర్గ మార్పిడికి అవకాశం ఉంది; కుల మార్పిడికి ఆ అవకాశం లేదు. ఏ కులమూ ఇంకో కులంతో సమానం కాదు. హిందూ మత కుల వ్యవస్థలో ఎంతెక్కువ మందిని అసహ్యించుకుంటే అంత పవిత్రుడు. ఎంతెక్కువ మందిని ప్రేమిస్తే అంత అపవిత్రుడు. ఎంతెక్కువ శారీరక శ్రమ చేస్తే అంత తక్కువ కులం. శారీరక శ్రమకు ఎంత దూరంగా ఉంటే అంత ఎక్కువ కులం. ఇలాంటి స్థితి ఏ మతంలోనూ లేదు. 



ఇది హిందూ మత ప్రత్యేకతల్లో ఒకటి. హిందూ మతం దోపిడీదార్ల దేవుళ్ళ వ్యవస్థ ఎందుకయిందో చూద్దాం. హిందూ దేవుళ్ళు లేదా దేవతలందరూ బ్రాహ్మణ తదితర అగ్రవర్ణాల నెదిరించిన పీడితులను అణచివేసిన వాళ్ళే. హిందూ మతస్థులకు అత్యంత ఆరాధ్య దైవం రాముడు. కాని ఆయన శత్రువులు వాలి, శంభుకుడు, తాటకి, శూర్పణఖలు. రాముడు ఎవరి రక్షకుడు? 



కేవలం బ్రాహ్మణుల (మునుల) రక్షణకే కృషి చేశాడు. ఇది చాలు హిందూ మతాన్ని అర్థం చేసుకోవడానికి. ఇక వికర్షించే స్వభావం గురించి చూద్దాం. హిందూ మతానికి ఆకర్షించే గుణం లేదు. ఇతర మతాలకు చెందిన వారికి ఆ మతం నచ్చక మతం మారాలంటే ముఖ్యంగా హిందూ మతంలోకి రావాలనుకుంటే ఏ కులంలో చేరాలో హిందూ మతం మార్గం చూపించలేదు. కారణం హిందూ మతం అంటేనే కులాల సమూహం. 



ఏదో ఒక కులం అయిన తర్వాతే హిందువు కావాలి. కులం లేని వాడికి హిందూ మతంలో చోటు లేదు. కులం ఉండాలంటే అప్పటికే హిందూ మతంలోని ఏదో ఒక కులానికి సంబంధించిన వ్యక్తికి పుట్టి వుండాల్సిందే. ఆ విధంగా మాత్రమే కుల సభ్యత్వం పొందాల్సివుంటుంది. దీనికి ప్రత్యామ్నాయం లేదు. హిందూ మతం నుంచి బయటికిపోవడం తప్ప లోనికి రావడముండదు. ఇస్లాం, క్రైస్తవంలోకి తండోపతండాలుగా హిందువులు వలసపోయారు. ఇంకా పోతూనే వున్నారు. కారణం హిందూ మతానికి వికర్షించే స్వభావం, మిగతా మతాలకు ఆకర్షించే స్వభావం ఉండటమే. 



పరిణామక్రమంలో ఏదీ శాశ్వతం కాదనేది ప్రకృతి సూత్రం. హిందూ మతానికి ఇతర ప్రధాన మతాలకు ఉన్నంత జీవితకాలముండదనేది పరిణామాలను బట్టి అర్థమవుతుంది. ప్రత్యామ్నాయం దొరికే దాకా సమాజానికి అవసరమయినంత కాలం అప్పటికే ఉన్న మతాలు కొనసాగవచ్చు. ఐలయ్య కేవలం హిందూ మత లోపాలనే చెప్పలేదు. 



బిన్ లాడెన్ లాంటి వారి వలన ఇస్లాం మతానికి ఎలాంటి ముప్పు ఉందో ఆయన చెప్పారు. క్రైస్తవ సంస్కరణోద్యమంలో మార్టిన్ లూధర్‌కి ఎదురైన ప్రతిఘటనల గురించి ఆయన ప్రస్తావించారు. 'హిందూ మతాన్ని సంస్కరించుకోండి. లేకుంటే హిందూమతంలోని కులాల మధ్యనే అంతర్యుద్ధం వస్తుంది. తత్ఫలితంగా హిందూ మతం వేగంగా అంతరిస్తుందని' ఐలయ్య తన గ్రంథం ద్వారా హెచ్చరించారు. దీనికే హిందూ మతవాదులు ఉలిక్కిపడితే రాబోయే ఉపద్రవాన్ని ఎలా తట్టుకొంటారు? 



హిందూ మతం అంతరించడం అనివార్యం. ఎలా అనివార్యమో పరిశీలిద్దాం. హిందువులలో 90 శాతంగా ఉన్న శ్రామిక కులాల వారికి హిందూసమాజం చదువు, సంపదలు నిషేధించింది. రెండు వేల సంవత్సరాలకు పైగా ఇది కొనసాగింది. ఒక శతాబ్ద కాలం నుంచి మాత్రమే అందరికీ చదువుకునే అవకాశాలు మెరుగయ్యాయి. చదువుకు దూరమైన శ్రామిక కులాల్లోని మూడు లేదా నాలుగో తరం వారే ప్రస్తుతం చదువుకుంటున్నారు. మొదటి తరంవారు ప్రాథమిక విద్యకి పరిమితమై బంట్రోత్ ఉద్యోగాలు చేశారు. 



రెండో తరం వారు రెండవ శ్రేణి ఉద్యోగాలకే పరిమితమయ్యారు. ప్రస్తుత తరం వారు ఐఏఎస్, ఐపిఎస్ తదితర ఉన్నత శ్రేణి ఉద్యోగాలు చేస్తున్నారు. అంతే కాక, వేల సంవత్సరాలుగా తమ పూర్వీకులకు, ప్రస్తుతం తమ బంధువులకు అంటే స్వకులం వారికి జరుగుతున్న అవమానాలు, అన్యాయాలు, మోసాలను పరిశోధిస్తున్నారు. ఈ పరిశోధనల్లో దొరికిన ఆధారాలన్నీ రోగగ్రస్తమైన కుల వ్యవస్థను, హిందూ మతాన్ని మరింత పతనం చేస్తాయే తప్ప రోగాన్ని నయం చేయవు. ఐలయ్య హెచ్చరిక, సలహాలను హిందూ మతవాదులు వినరు. విన్నా సంస్కరించుకోరు. అనివార్యంగా హిందూ మతోన్మాదం పతనంకాక తప్పదు. అది భారత సమాజానికి అవసరమే. 



ఐలయ్య పుస్తకంపై మీడియాలో విస్తృత చర్చ జరుగుతోంది. ఆయన లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. చెప్పకపోగా ఐలయ్యపై దేశద్రోహిగా, విదేశీ ఏజెంట్‌గా అరవిందరావు (మాజీ డిజిపి)నిందలు మోపగా, క్రైస్తవ ప్రచారకుడుగా హనుమాన్ చౌదరి (టెలికమ్యూనికేషన్స్ నిపుణులు) ముద్ర వేశారు. అసంబద్ధమైన, హేతురహిత వాదనలతో వ్యాసాలు రాశారు. విశ్వహిందూపరిషత్, భజరంగ్ దళ్ తదితర మతోన్మాద సంస్థలకు చెందినవారు రాస్తే సరిపెట్టుకోవచ్చు. 



కానీ మేధావులుగా చెప్పుకుంటున్న అరవిందరావు, హనుమాన్ చౌదరిల నుంచి ఇలాంటి వ్యాసాలను సమాజం ఆశించదు. పైగా ఇలాంటి వ్యాసాల ద్వారా ఆధ్యాత్మిక ఫాసిజానికి ఊతం ఇస్తున్నారు. ఇప్పటికే ఐలయ్యకు నిత్యం బెదిరింపులొస్తున్నాయన్న విషయం వారికి తెలియందేమీకాదు. హిందూ మతంలోని కుల వ్యవస్థ వలన గౌరవాలు పొందే కులాలకి చెందినవారు హిందూ మతాన్ని కాపాడుకోవాలనుకోవడం ఎంత సహజమో, అవమానాలు పొందేవారు ఆ మతం అంతరించి పోవాలనుకోవడం కూడా అంతే సహజం. 



- జి.రాములు
కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు

Andhra Jyothi News Paper Dated 15/02/2012 

1 comment:

  1. హిందుత్వం అంటే ఈ జాతి ప్రజల జీవనవిధానం, సంస్కృతీ. ఈ దేశంలో షణ్మతాలు అయిన శైవం, వైష్ణవం, శాక్తేయం, గానపత్యం, సౌరసిద్ధాంతం, షణ్ముఖ తత్త్వం - ఈ ఆరు ఆదిశంకరుల కంటే ముందు నుండే ఈ దేశంలో ఉన్నాయి. ఆ తదుపరి కాలంలో ఆవిర్భవించిన బౌద్ధం, జైనం, అకాలీ వంటి మతాలూ కూడా ఈ దేశంలో వికసించి పరిదవిల్లుతున్నాయి. జీవిస్తున్న జీవన విధానమే హిందూ జీవన విధానం. హిందూ సమాజం అత్యంత ఉదారమైనది కాబట్టే కంచ ఐలయ్య లాంటి వారు "నేను హిందువునెట్లైత", "హిందూ మతానంతర భారతదేశం" వంటి హిందుత్వ వ్యతిరేక పుస్తకాలు, వ్యాసాలూ వ్రాసికూడా స్వేచ్ఛగా తిరగగలుగుతున్నాడు. ఒకవేళ ఈ ఉదారవాదం లేకపోయినట్లయితే సాల్మన్ రష్డీ, తస్లీమా నస్రీన్ ల వలె స్వదేశాన్ని వదలి ప్రవాస జీవితం గడపవలసి వచ్చేదేమో!

    ఈ దేశంలో ఆధ్యాత్మిక ప్రజాస్వామ్యం మోతాదుకు మించి ఉండటం వల్లనే రాజకీయ పక్షాలు, సెక్యులరిస్టులు మైనార్టీలను సమర్థిస్తూ మైనారిటీయిజాన్ని అభివృద్ధి చేయగలిగారు. వారి మెప్పు కోసం హిందూ సమాజంలో భేదభావాలు సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవన్నీ వారి వ్యక్తిగత ప్రచారం కోసమో, విదేశీ పర్యటనల కోసమో, ముఖ్యంగా అమెరికా, యూరప్ దేశాలో ఉండే ప్రాయోజిత సంస్థల మెప్పు కోసమో వ్రాస్తున్నారు. ఇక్కడి పత్రికా రంగం కూడా ఇటువంటి కుహనా సెక్యులరిస్టులను ప్రోత్సహిస్తున్నట్లుగా కనబడుతున్నది. హిందూ సమాజంలోని సామాన్య ప్రజలలో కుల, మతపరమైన భేదభావాలను సృష్టిస్తూ తమ పబ్బం గడుపుకోవాలని ప్రయత్నిస్తున్న కంచ ఐలయ్య వంటి వారి విషయంలో హిందూ సమాజం అప్రమత్తంగా, జాగృతంగా ఉండాలి.

    ReplyDelete