Thursday, February 2, 2012

సీపీఐ, సీపీఎంల మూడో ఫ్రంట్‌ ఎవరికోసం?


  • దళిత బహుజన పార్టీలు కులతత్వ పార్టీలా!

  • అగ్రకులాధిపత్యంలోనే వామపక్షాలు

  • ప్రకటితం కాని మూడో ఫ్రంట్‌ నిర్మాణలక్ష్యాలు

  • కుల వ్యవస్థ నిర్మూలన అజెండా పూజ్యం

  • సామాజిక న్యాయ నినాదం పట్టదా?

  • వర్గసంకర విధానాల పర్యవసానమేనా!

  • రాష్ట్రంలో మూడవప్రత్యామ్నాయం మాటేమిటి?


narayana-ragav
తీయ స్థాయిలో కాంగ్రెస్‌, బీజేపీలకు మూడో ప్రత్యామ్నాయం నిర్మించే కృషి చేస్తామని సీపీఐ జాతీయ సమితి హైదరాబాద్‌లో ఇటీవల సమావేశమైన సందర్భంలో పార్టీ ప్రధాన కార్యదర్శి ఎ.బి. బర్దన్‌ ప్రకటించారు. దేశంలో రెండు పార్టీల వ్యవస్థని నెలకొల్పటాన్ని సాగనివ్వబోమని కూడా ఆయన స్పష్టం చేశారు. అంతకు ముందు కొద్ది రోజుల కిందట సీపీఎం సైద్ధాంతిక నాయకుడు, ఊహాగానాల ప్రకారం కాబోయే పార్టీ ప్రధాన కార్యదర్శి అయిన సీతారామ్‌ ఏచూరి గూడా మూడో రాజకీయ ప్రత్యామ్నాయం అవసరాన్ని గురించి నొక్కి చెప్పారు. అయితే మూడో ప్రత్యామ్నాయ నిర్మాణ నినాదం ఉభయ కమ్యూనిస్టు పార్టీలకు కొత్తేమీ కాదు; ‘కావలసింది కొన్ని ప్రత్యామ్నాయ తలకాయలు కాదు; కొన్ని ప్రత్యామ్నాయ విధానాలు’ అని సి.పి.(ఎం) మాజీ ప్రధాన కార్యదర్శి నంబూదిరీ పాద్‌ పదేపదే చెప్పేవారు. (Not a Set of alternate heads; but a set of alternate policies) అయితే, రాజకీయ ప్రత్యామ్నాయ నిర్మాణానికి వ్యతిరేకంగా వ్యవహరించిన చరిత్రే ఉభయ కమ్యూనిస్టు పార్టీల చరిత్ర అంటే సత్యదూరం కాదు. అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో అదే చరిత్ర. ఒకప్పుడు ప్రధాన ప్రతిపక్ష స్థాయి నుండి దిగజారి ఏదో ఒక ప్రధాన పక్షానికి కేవలం ‘మిత్రపక్షాలు’గా ఆ పార్టీలు రూపాంతరం చెందాయి.పశ్చిమ బెంగాల్‌, కేరళ, త్రిపుర రాష్ట్రాలు మినహాయిస్తే మిగిలిన రాష్ట్రాలన్నింటిలో, కేంద్రంలో శాశ్వత ‘మిత్రపక్షాలు’ గానే స్థిరపడిపోయాయి.

ఉభయ కమ్యూనిస్టు పార్టీల దృక్పథంలో దేశంలో ఉన్న వామ పక్షాలు నాలుగే- తమవి గాక రెవెల్యూషనరీ సోషలిస్టు పార్టీ, ఫార్వర్డ్‌ బ్లాక్‌ మాత్రమే. వివిధ రాష్ట్రాల్లో పనిచేస్తోన్న ప్రాంతీయ పార్టీలు తెలుగుదేశం పార్టీతో సహా బూర్జువా- భూస్వామ్య వర్గ పార్టీలే. అంటే దోపిడీ వర్గ పార్టీలే. బహుజన సమాజ్‌ పార్టీ, సమాజ్‌ వాది పార్టీ, లోక్‌జనశక్తి, రిపబ్లికన్‌ పార్టీ వంటి పార్టీలను గురించి సమగ్ర విశ్లేషణ చెయ్యకుండా దాటవేస్తున్నాయి. అవి ప్రధానంగా అణచివేతకు గురైన కులాల పార్టీలు గనుక, ఉన్నంతలో తమ ప్రజా పునాది గూడా అధిక భాగం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు చెందిన వారే అయినందువల్ల, ఆ పార్టీలకు నిందాపూర్వకమైన పేర్లు పెట్టటానికి ఉభయ కమ్యూనిస్టు పార్టీలు భయపడుతున్నాయి. ఇంకా సూటిగా చెప్పాంటే దళిత బహుజన పార్టీలు కులతత్వ పార్టీలని ఉభయ కమ్యూనిస్టు పార్టీల ఆంతరంగిక నిశ్చితాభిప్రాయం. ఈ వైఖరిని బహిరంగంగా చెప్పకుండా నాటకాలాడుతున్నాయి. ఈ వైఖరి ఆ పార్టీల రాజకీయ మోసకారి తనానికి అద్దంపడుతోంది.

ఉభయ కమ్యూనిస్టు పార్టీలు ఏ పార్టీలనైతే (జాతీయంగా, లేక ప్రాంతీయంగా) బూర్జువా - భూస్వామ్య పార్టీలుగా అభివర్ణిస్తోన్నాయో ఆ పార్టీలన్నీ వాస్తవంలో అగ్రకుల పార్టీలే. ఆర్థిక దోపిడీ ప్రాతిపదికగా వర్గ విశ్లేషణ చేసే విధానంగల ఉభయ కమ్యూనిస్టు పార్టీలూ సామాజిక ప్రాతిపదికగా మౌనం పాటించడం పరిశీలించవలసిన అంశం. అయితే, ఆ మౌనానికి కూడా బలమైన కారణం- అవి కూడా అగ్రకులాధిపత్యంలో పని చేస్తోన్న పార్టీలు కావడమే. ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించిన 80 సంవత్సరాలలో ప్రధాన కార్యదర్శిగా ఏ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి వ్యవహరించారో, కేంద్ర కమిటీలో ఏ సామాజిక వర్గాలకు చెందిన వారు ఎంతమంది ఉన్నారో ఒక శ్వేత పత్రం ప్రకటిస్తే వాస్తవాలు వెల్లడవుతాయి. ఆ పని కమ్యూనిస్టు పార్టీలు చేయగలుగుతాయా?
మూడో రాజకీయ ప్రత్యామ్నాయ ఫ్రంట్‌ నిర్మాణం కోసం 2009 ఎన్నికల సందర్భంలో పెద్ద ఎత్తునే ప్రయత్నించి రెండు పార్టీలూ ఘోరంగా విఫలమాయ్యాయి. అంతకు ముందు పార్లమెంటులో తమకు 60కి పైగా గల సభ్యుల సంఖ్యను సగం కోల్పోయాయి కూడా. గత 2004 ఎన్నికల్లో బీజేపీ నాయకత్వానగల ఎన్డీఏ కూటమికి వ్యతిరేకత పేరుతో కాంగ్రెస్‌ నాయకత్వానగల యూపీఏతో జత కట్టి అంతవరకూ అనుసరిస్తూ వచ్చిన కాంగ్రెస్‌ విరోధ వైఖరికి స్వస్తి చెప్పి సఖ్యతా సంగీతానికి తెరలేపాయి. ముఖ్యంగా మార్క్సిస్టు పార్టీ! ఎందుకంటే, 1964లో ఉమ్మడి పార్టీని చీల్చిందే కాంగ్రెస్‌ వ్యతిరేక వైఖరితో. ‘మితవాద కమ్యూనిస్టులారా, మీ ప్రయాణం పూర్తయిందా?’ అంటూ 10వ మహాసభ సందర్భంలో ఎద్దేవా చేస్తూ గ్రంథాన్ని ప్రకటించిన మార్క్సిస్టు పార్టీ నాయకుల కాంగ్రెస్‌ వ్యతిరేక ప్రయాణం 2004లో నిజంగానే పూర్తయింది. 

సరికొత్త సఖ్యతా ప్రయాణం ప్రారంభించి దాన్ని కూడా 5 ఏండ్లు గడవకముందే తెంచేసుకున్నాయ్‌. అది కూడా ప్రత్యక్షంగా ప్రజలకు సంబంధించిన దేశ సమస్యల విషయంలోగాక అమెరికాతో అణు ఒప్పందం సందర్భంలో.విశ్వాసరాహిత్య తీర్మానంలో సఫలంకాలేకపోయిన ఉభయ కమ్యూనిస్టు పార్టీలూ 2009 సాధారణ ఎన్నికల్లో మూడో ఫ్రంట్‌ కోసం విశ్వప్రయత్నం చేశాయి. ఇంతకీ అప్పుడుగానీ, ఇప్పుడు తజాగా బర్దన్‌ చెప్పడంలో గానీ మూడో ఫ్రంట్‌ నిర్మాణ లక్ష్యమేమిటో, ఏ సామాజిక, ఆర్థిక కార్యక్రమాన్ని ప్రజలకు అందించడం కోసమో ప్రకటించకపోవడం వింతల్లో కెల్లా వింత. అసలు 2004లో కాంగ్రెస్‌తో చెట్టా పట్టాలు వేసుకోవడం- తన వర్గ స్వభావాన్నిగానీ, నియంతృత్వ, అవినీతి పోకడలనుగానీ, ఆ పార్టీ అణుమాత్రమైనా మార్చుకొన్నదని కమ్యూనిస్టు పార్టీలు భావించడంవల్లనా? లేక, తామే తమ శ్రామికవర్గ స్వభావాన్ని ఏనాడో కోల్పోయి వర్గ సంకర విధానాన్ని కొనసాగిస్తోన్న ఆచరణ పర్యవసానమా? శ్రామిక వర్గ స్వభావాన్ని కోల్పోయి, ఉనికిలో ఉన్న పార్టీల్లో కేవలం మరో పార్టీగా మారిపోయిన స్థితిలో, రావిశాస్ర్తి భాషలో ‘రంగుమార్చుకోకుండానే దిక్కు మార్చుకొని’ ఎలాంటి పార్టీతోనైనా పొత్తు కుదుర్చుకోవడానికి అలవాటుపడిపోయిన మానసిక దౌర్బల్యమా? ఒక వైపు ప్రపంచీకరణ విష సంస్కృతి, మరోవైపు పార్టీల నాయకత్వాలు నూరిపోసిన పార్లమెంటరీ తప్పుడు రాజకీయాలతో మభ్యపెట్టి, భ్రమలతో ప్రలోభపెట్టిన ఫలితంగా, వర్గ సంకర విధానాన్ని సమర్థించే వారుగా దిగువ శ్రేణుల నాయకత్వాలనీ, కార్యకర్తల్నీ దిగజార్చగలిగామన్న ధీమాతోనా? కాకపోతే, ఎర్రజెండా ఎగరేస్తూ, మార్క్సునీ, లెనిన్‌నీ స్మరిస్తూ, దోపిడీ పాలకవర్గ పార్టీలతో ఇంతగా బరితెగించి తప్పుడు తిరుగుళ్లు అడ్డూ, అదుపూ లేకుండా తిరుగుతారా? సిద్ధాంతానికి కట్టుబడి త్యాగమయ జీవితంతో శత్రువుతో పోరాడుతోన్న విప్లవకారులపై తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో విచ్చలవిడిగా రాజ్యహింసకు దిగి పిట్టల్ని కాల్చినట్లు కాల్చి చంపడంలో బూర్జువా పార్టీల కన్నా ఘనాపాటీలుగా వ్యవహరిస్తారా? బెంగాల్‌, కేరళ రాష్ట్రాల్లో ప్రజలు ఇటీవలే ఛీ కొట్టిన తర్వాతనైనా నాయకత్వాలకు జ్ఞానోదయమైందని భావించగలమా?ఇండియాలో పాతుకుపోయిన జుగుప్సాకరమైన, కేవలం పుట్టుకతోనే సామాజిక హోదాని నిర్ణయించే అత్యంత అప్రజాస్వామికమైన కులవ్యవస్థని నిర్మూలించే అజండా ఉభయ కమ్యూనిస్టు పార్టీలకీ లేదు. వర్గ పోరాటం చేస్తూపోతే కులవ్యవస్థ ఆటోమేటిక్‌గా నిర్మూలన అయిపోతుందనే అవాస్తవికవాదనని పట్టుకొని వేళ్లాడి, అణచివేతకు గురైన కులాల అశేష ప్రజానీకం పార్టీలకు దూరమైపోతుంటే దిమ్మదిరిగిపోయి, ఒక ఎత్తుగడగానే కొద్ది సంవత్సరాల కిందటనే పార్టీల అనుబంధ ‘దళిత సెల్స్‌’ నిర్మాణం మొదలెట్టారు. 

‘మాకు కులం లేదు; మేము కులరహితులం’ అంటూ తమకు తాము సర్టిఫికెట్లు ఇచ్చుకొంటూ వచ్చారు. తమ సంగతి అటుంచి, సమాజంలో ఉన్న కుల రుగ్మతని ఎలా రూపుమాపాలా అనే అంశానికి మార్క్సిజాన్ని అన్వయింపజేయకుండా పలాయనవాదాన్ని చిత్తగించారు. ఫలితంగా అసమానతలు, అణచివేతలు, అవమానాలకు మారు రూపంగా మారిన కులవ్యవస్థని చెక్కు చెదరకుండా కాపాడే అపవిత్ర కర్తవ్యాన్ని నెత్తికెత్తుకొన్నారు.
ఉదాహరణకు మన రాష్ట్రాన్నే తీసుకొంటే 1964లో రెండుగా చీలిన సీపీఐ, ిసీపీఎంలకు 50 ఏళ్ళుగా రాష్ట్ర కార్యదర్శులుగా రెడ్డో, కమ్మ చౌదరో తప్ప ఇతర సామాజిక వర్గాలకు చెందిన వ్యక్తులు ఎందుకు ఎన్నిక కాలేకపోయారు? ఇప్పుడేదో ఖమ్మంలో త్వరలో జరుగనున్న సీపీఎం మహాసభలో బి.సి. సామాజిక వర్గానికి చెందిన వీరయ్య కార్యదర్శి అవుతారంటూ ఊహాగానాలు వస్తున్నాయి. సామాజిక న్యాయ సిద్ధాంతాన్ని ఆమోదించకుండా, అలాంటి కార్యక్రమాన్ని రూపొందించకుండా ఒక వ్యక్తి కార్యదర్శి అయినంత మాత్రాన అణచివేతకు గురైన కులాల, మైనారిటీ ప్రజలకు పెద్దగా ఒరిగేదేముంటుంది? అసలు కమ్యూనిస్టుల చిరకాల వాదనే ఇదే గదా? ‘అన్నమైతే నేమిరా, మరి సున్నమైతేనేమిరా, ఈ పాడు పొట్టకు అన్నమే వేతామురా’ అనేదే గదా ఇంత కాలమూ ఆ పార్టీల నాయకత్వాలు అనుసరిస్తోన్న కులరహిత వాదనలోని అసలైన సారాంశం! కేంద్ర కమిటీ మొదలుకొని గ్రామ కమిటీలదాకా అగ్రకులాలే ఆధిపత్యం చెలాయిస్తోన్న నేపథ్యంలో ఒక్క రాష్ట్ర కార్యదర్శి మాత్రం ఏమి చేయగలడు? అసలా వ్యక్తికైనా సామాజిక న్యాయదృక్పథం ఉన్నదో లేదో! ఒకవేళ సామాజిక న్యాయం దిశగా కొన్ని అడుగులైనా ఎన్నికైన కార్యదర్శిని వెయ్యనిస్తారా? బ్యాక్‌సీట్‌ డ్రైవింగ్‌ చెయ్యరా? పొమ్మనలేక పొగపెట్టరా? ఏమైనా ఒక బీసీకి చెందిన నాయకుడు ఒక రాష్ట్ర కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి అయితే అది ఆహ్వానించదగిన సామాజిక పరిణామమే.

అలాగే ఎ.బి. బర్దన్‌కి వయస్సు పైబడిందని, ప్రధాన కార్యదర్శిని మార్చాలన్న చర్చ దాదాపు పదేళ్ళకిందటే సీపీఐలో జరిగింది. అప్పుడే తమిళనాడుకు చెందిన సీనియర్‌ నాయకుడు, మేధావి, దళితుడూ అయిన డి. రాజా పేరు ప్రముఖంగా వినిపించింది. కానీ అది నెరవేరలేదు. ఆ తర్వాత హైదరాబాద్‌ మహాసభలో బర్దన్‌కి సహాయ కార్యదర్శి అవసరమని భావించారు. అప్పుడూ రాజా పేరు ముందు కొచ్చింది. కానీ సుధాకర్‌రెడ్డినే ఆ పదవి వరించింది. సీనియారిటీలోగానీ, సిన్సియారిటీలోగానీ, సిద్ధాంత రాజకీయ పరిజ్ఞానంలోగానీ, పార్టీకి ప్రాతినిధ్యం వహించడంలోగానీ, దేశవ్యాపితంగా పార్టీ శ్రేణుల అభిమానాన్ని చూరగోనడంలో గానీ రాజా కన్నా సుధాకరరెడ్డి ఏవిధంగా మెరుగు? కులవ్యవస్థలో అంటరానివాడు, అగ్రకుల రెడ్డి అనే తేడా తప్ప? నిర్మాణ దక్షతలు రెడ్డి, చౌదరిలలోనే ఉంటాయా? అట్లాగని బ్రహ్మ రాసిపెట్టాడా? గతితార్కిక భౌతికవాదం స్థానంలో బ్రహ్మ రాతల ఆధ్యాత్మికవాదాన్ని చొప్పించారా?దేశంలో అణచివేతకు గురైన కులాలు, ఆదివాసీలు, ముస్లిం తదితర మైనారిటీల ప్రజలు చైతన్యవంతమౌతూ రాజకీయాధికారంలో తమదైన వాటాతో సహా సామాజిక న్యాయం కోసం ఉద్యమిస్తున్నారు. మాజీ ప్రధాని వి.పి. సింగ్‌ మండల్‌ కమిషన్‌ సిఫార్సులను అమలు జరిపి పదవిని సైతం కోల్పోయారు. మనువాద హిందుత్వ ఉన్మాద శక్తుల ఆగ్రహానికి గురైనందునే వి.పి.సింగ్‌ పదవిచ్యుతుడు కావటానికి కారణమని అందరికీ తెలిసిందే. 

బీసీలకు కొంత సామాజిక న్యాయం కల్పిస్తే హిందుత్వ శక్తులకి కోపం వచ్చిందంటే హిందుత్వ బ్రాహ్మణత్వానికీ కుల వ్యవస్థకీ మధ్య ఉన్న బలమైన ‘లింకు’ ముదిరిపోయిన కమ్యూనిస్టు నాయకులకు తెలియదని నమ్మగలమా? కమ్యూనిస్టు పార్టీలు కుల వివక్ష వ్యతిరేక సంఘం, దళిత హక్కుల పరిరక్షణ సమితి వంటి సంస్థల్ని దళిత ఉద్యమ ప్రభావంతో స్థాపించుకొని వారి మద్దతును ఎన్నికల కోసం పొందాలని తాపత్రయపడుతూ కూడా కమ్యూనిస్టు పార్టీలు సామాజిక న్యాయ నినాదాన్ని చేపట్టలేదు. ప్రజల్లో ప్రచారం చెయ్యరు. తమ పార్టీల అనుబంధ ప్రజా సంఘాల నిర్మాణాల్లో ఆ సూత్రాన్ని పాటించరు. ఆ పార్టీల ప్రజాసంఘాల నిర్మాణాలు సమాజంలోని కులవ్యవస్థ దొంతర్లను యధాతథంగా ప్రతిబింబిస్తుంటాయి. కుల రాహిత్యం ముసుగులో అగ్రకులాల ఆధిపత్యం స్థిరపడిపోయింది. సామాజిక న్యాయం గురించి మాట్లాడితే, వివిధ సామాజిక వర్గాల జనాభా దామాషా ప్రకారం తమ పార్టీల, అనుబంధ ప్రజాసంఘాల్లో ఆ సూత్రాన్ని పాటించవలసి వస్తుంది. కార్యకర్తలు ఆ సూత్రం అమలు జరపాలంటూ నిలవేసే ప్రమాదముంటుంది. 

పార్టీ సభ్యుల్లో 80 శాతం మంది బడుగు బలహీనవర్గాల వారైతే, నాయకత్వ కమిటీల్లో 80 శాతం అగ్రకుల నాయకులు తిష్ఠ వేసి కూర్చొనడం సామాజిక న్యాయ సూత్రానికి బద్ధ విరుద్ధం. సమాజంలో కుల వివక్షని గురించి మాట్లాడుతున్న నాయకత్వం తమ నిర్మాణాల్లో ఉన్న కుల వివక్ష ఎడల కన్వీనియంట్‌గా మౌనాన్ని పాటిస్తున్నారు. సామాజిక న్యాయాన్ని గురించి మాట్లాడితే తమ పీఠాలకు ఎసరు వస్తుందన్న వాస్తవం ముదిరి పోయిన నాయకత్వానికి బాగా తెలుసును. ఈ వాస్తవాన్ని గ్రహించిన దళిత బహుజన నాయకత్వ శ్రేణులు కూడా లేకపోలేదు. ఎందుకంటే యావత్‌ దేశాన్నే కుదిపివేస్తోన్న సామాజిక న్యాయ ఉద్యమ ప్రభావం బూర్జువా పార్టీలపైనే పడుతోన్న నేటి పరిస్థితుల్లో ఆ పార్టీల్లోకన్నా ఎక్కువ రాజకీయ చైతన్యం పొంది ఉన్న కమ్యూనిస్టు పార్టీల శ్రేణులపైన ఎందుకు పడదు? నాయకత్వంపైన తిరుగుబాటు చేయడానికై సరైన అదనుకోసం వేచిచూస్తోన్నారేమో?రెండు కమ్యూనిస్టు పార్టీల నాయకత్వాలూ సామాజిక న్యాయానికి వ్యతిరేకులనడానికి 2009 ఎన్నికల్లో అవి చేపట్టిన వైఖరి గూడా తేటతెల్లం చేస్తోంది. జాతీయ స్థాయిలో మూడో ప్రత్యామ్నాయం ఏర్పాటు కోసం పనిచేస్తోన్న సందర్భంలో ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరన్న ప్రశ్న వెలువడింది. బలమైన చర్చ గూడా జరిగింది. మూడో ప్రత్యామ్నాయంలో భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం కూడా మాయావతి అభ్యర్థిత్వానికి సానుకూలత తెలిపింది. కానీ, రెండు కమ్యూనిస్టు పార్టీలూ తమ ఫ్రంటులో ప్రధాని అభ్యర్థులు చాలామంది ఉన్నారనీ, ఆ విషయం ఎన్నికల అనంతరం తేల్చుకోవచ్చుననీ సాకులు చెప్పి దాటవేశాయి. పర్యవసానంగా బహుజన సమాజ్‌ పార్టీని తమ ఫ్రంట్‌లో భాగస్వామిని చేసుకోలేకపోయాయి. బడుగు, బలహీనవర్గాలకు చెందిన కోట్లాది ప్రజల్ని ఉత్తేజపరచలేకపోయాయి.

అలాగే, రాష్ట్రంలో కూడా చిత్తశుద్ధి గలిగిన సామాజిక న్యాయ పార్టీ కాకపోయినా రెండు అధిపత్య కులాల పార్టీల రాజకీయ గుత్తాధికారానికి గండికొట్టే అవకాశం చిరంజీవి ప్రజారాజ్యం ద్వారా లభించింది. చిరంజీవి వైపు నుండి కమ్యూనిస్టు పార్టీలతో సఖ్యతకి ఆసక్తి కనిపించింది కూడా. అది ప్రధానంగా కాపు సామాజిక వర్గ పార్టీ అనేమాట కూడా నిజమే. రెడ్డి, కమ్మ సామాజిక వర్గాల పార్టీలతో సూత్రరహిత కలయికలకు మార్చుకొన సిద్ధపడిన కమ్యూనిస్టు పార్టీలు, కాపు సామాజిక వర్గ పార్టీతో చేతులు కలపటానికి అభ్యంతరమేమొచ్చింది? ఉభయ పార్టీలూ, కమ్మ, రెడ్డి సామాజిక వర్గాల ఆధిపత్యంలో ఉండటమే కాపుల పార్టీతో చేతులు కలపటానికి ఇష్టపడలేదని ఎవరికి తెలియదు? ఇప్పటికి సుమారు 30 సంవత్సరాల కింద ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీకి కమ్మ చౌదరి తప్ప మరెవరైనా అధ్యక్షుడుగా ఎన్నికయ్యారా? ఇక ముందు అవుతారా? ఈ వాస్తవం అతి మేధావులైన రాఘవులు, నారాయణలకు తెలియదనుకోవాలా? అలాంటి కులతత్వ పార్టీతో ఈ నాయకులు ఎందుకు శాశ్వతమైన బ్రహ్మముడి వేసుకొని అంకితమైపోయారు? 2004లో ప్రపంచ బ్యాంకు జీతగాడు చంద్రబాబునాయుడు అని తిట్టిపోసి 5 సంవత్సరాలు గడవకముందే అదే పార్టీతో ఎందుకు విడదీయరాని విధంగా లక్క-బంగారంలాగా అతుక్కు పోయారు? కమ్మ సామాజిక వర్గ పార్టీ రాష్ట్రంలో 16 ఏళ్లు పరిపాలించి చేసిన పాపాల్లో కమ్యూనిస్టు పార్టీలు కూడా పాలు పంచుకొన్నట్లు కాదా? అలాగే రాష్ట్ర కాంగ్రెస్‌లో రెడ్డి సామాజికవర్గం ఆధిపత్యం చెలాయించడం లేదా? ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడిన 56 సంవత్సరాల కాలంలో 35 సంవత్సరాలకు పైగా రెడ్లే ముఖ్యమంత్రులుగా పరిపాలించడం అతి ప్రాథమిక సత్యం కాదా? జాతీయ స్థాయిలో మూడో ప్రత్యామ్నాయం గురించి మాట్లాడుకున్న రెండు కమ్యూనిస్టు పార్టీలు రాష్ట్రంలో మూడో ప్రత్యామ్నాయం గురించి ఎందుకు మాట్లాడరు?రాష్ట్రంలో మూడో ఫ్రంట్‌ గురించి ఎందుకు మాట్లాడరు? ఇందుకు నాయకత్వాలకున్న అగ్రకుల సామాజిక బాంధవ్యమేనని ప్రజలు భావిస్తే తప్పేమిటి? స్పష్టంగా చెప్పదలచుకొన్న దేమంటే- రెండు కమ్యూనిస్టు పార్టీలకి శ్రామిక వర్గ దృక్పథమూ లేదు; సామాజిక న్యాయలక్ష్యమూ లేదు. వర్గ సంకరమూ, సామాజిక న్యాయ వ్యతిరేకమూ- ఈ రెండూ ఆ పార్టీలకు ఒకే నాణేనికి బొమ్మ- బొరుసులు.

yk
వర్గ దృక్పధమూ, సామాజిక న్యాయమూలేని మూడో ప్రత్యామ్నాయం ఎవరికోసం? సామ్రాజ్యవాద అనుకూల బూర్జువా భూస్వామ్య అగ్రకుల స్వభావంగల రెండు కూటములు ఎన్డీయే, యూపీఏలకు అవే స్వభావాలు గల మరికొన్ని పార్టీలతో కలిపి మరో కూటమని ఏర్పాటు చేస్తే అది ప్రత్నామ్నాయ కూటమి అవుతుందా? సంఖ్యరీత్యా మూడో కూటమి అవ్వవచ్చునేమోగానీ ప్రత్యామ్నాయ రాజకీయ శిబిరం మాత్రం కాజాలదు. ప్రత్యామ్నాయ ఆర్థిక, సామాజిక కార్యక్రమంలేని మరో కూటమి కోసం కమ్యూనిస్టు పార్టీలు పెట్టే కేకలు కంఠశోషగానే మిగిలిపోతాయి. ఇప్పటికైనా ఆ పార్టీల్లోని దిగువస్థాయి శ్రేణులూ, కార్యకర్తలూ శ్రామికవర్గ దృక్పథంతో సామాజిక న్యాయం కోసం సంఘర్షించగలిగితే దేశానికి కొంత శ్రేయస్సే.
Surya News Paper Dated 2/2/2012 

No comments:

Post a Comment