Wednesday, February 8, 2012

సిద్ధాంతాలు రైట్... సమస్యలు లెఫ్ట్


5050 talangana patrika telangana culture telangana politics telangana cinemaఉద్యమం అంటే సమష్టి కష్టం, త్యాగం. అప్పుడే దాని ఫలితాలు ఆశించిన మేరకు, ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ఉంటాయి. అమెరికా సామ్రాజ్యవాదంపైనా, పెట్టుబడిదారులపైన అవకాశమొచ్చినప్పుడల్లా విరుచుకుపడే సీపీఎం మాత్రం ఊకదంపుడు ఉపన్యాసాలకు పరిమితమైంది. ఖమ్మం జిల్లాలో ఈనెల 2 నుంచి 4 వరకు సీపీఎం రాష్ట్ర మహాసభలు జరిగాయి. మహాసభకు జన సమీకరణ చేసుకున్న నాయకులు ఎప్పటిలాగే తూతూమంవూతంగా పలు తీర్మానాలు చేసుకున్నారు. అనంతరం పసలేని, ఉద్యమ విలువలు లేని ప్రసంగాలు చేసి, నిర్మాణాత్మక ఉద్యమ రచన చేయడంలో ఘోరంగా విఫలమయ్యారు. తెలంగాణ ఉద్యమం పట్ల సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు సీతారాం ఏచూరి అనుచిత వ్యాఖ్యలు చేయడం ఉద్యమ విలువలకు పాతర వేసినట్లయింది.

మహాసభలో ఆయన మాట్లాడుతూ 1969లో తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పడు తాను హైద్రాబాద్‌లో చదువుతున్నానని, ఉద్యమం వలన ఒక ఏడాది చదువుకు నష్టం కలిగిందని, దీంతో చదువుకోవడానికి ఢిల్లీ వెళ్లానని చెప్పడం గర్హనీయం. ఇది ఉద్యమం పట్ల ఆయనకున్న అవగా హనను, ప్రజా సమస్యలకు దూరంగా పారిపో యే స్వభావాన్ని స్పష్టంగా చాటింది. ఒక ఏడాది చదువు నష్టాన్ని వందలాది మంది బలిదానాల కన్నా ఎక్కువగా అభివర్ణించి చెప్పడంలో ఆంతర్యమేమిటి? మహాసభలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు నేటి అగ్రనేతలు, నాయకులు, కార్యకర్తలకు ఓ దిశానిర్దేశమా? అంటే నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా సాగుతున్న ఉద్యమాల జోలికి పోకూడదనా? త్యాగం చేయాల్సి వస్తే వెనుకంజే మేలనా? అసలు నష్టం, కష్టం లేని ఉద్యమాలు ఉంటాయా? ఇంతకాలంగా సీపీఎం చేస్తున్న పలు ఉద్యమాల సంగతేమిటి? అవన్నీ మొక్కుబడిగా ఎవరికీ నష్టం, కష్టం చేయకుండా పార్టీ ఉనికి కోసం చేపడుతున్న ఉద్యమాలేననేది బహిరంగంగా చెప్పినట్లయింది.

రాష్ట్ర నలుమూలల నుంచి తరలివచ్చిన ఆపార్టీ శ్రేణులకు ఆయన ఇచ్చిన పిలుపేమిటి? ఉద్యమం పట్ల ఆయనకున్న అవగాహన, సంకేతాలు ప్రజలలో ఏమేరకు వెళుతున్నాయనేది చర్చనీయాంశమే. మార్క్సిస్టు సిద్ధాంతాలకు నీళ్ళొదిలి, తెలంగాణ పట్ల ఉన్న విముఖతను చాటడానికే ఆనాటి ఉద్యమాన్ని సదరు అగ్రనేత బహిరంగ సభలో అవమాన పర్చారు. ఇది ఒక అంశమైతే, ఇక మహాసభలో తీసుకున్న తీర్మానాలన్నీ యథాతథం. కొత్త సమస్యలు, పోరాటాలేమీ లేవు. కేవలం రాష్ట్ర కమిటీని ఎన్నుకుని, గత 14 ఏళ్ల నాడు ఏవైతే తీర్మానాలు చేశారో వాటినే కాపీ చేసి పార్టీ శ్రేణులను బురిడీ కొట్టించారు. రాష్ట్రంలోని 11 వామపక్ష పార్టీలతో కలిసి ప్రజా సమస్యలపై పోరాడతామన్నారు. 
నిత్యం బూర్జువా పార్టీలను విమర్శించే ఈ పార్టీ నాయకులు, ఎన్నికలప్పుడు ఆ పార్టీలతోనే పొత్తు పెట్టుకునే ధోరణిని ప్రజలు అసహ్యించుకుంటున్నారు.

పోరాటాలు, ఉద్యమాలేమో వామపక్షాలతో కలిసి చేస్తారు. ఆ ఉద్యమాన్ని బూర్జువా పార్టీలకు ఎన్నికల సమయంలో తాకట్టు పెట్టి రాజకీయాల్లో లబ్ధి పొందే సీపీఎం సైద్ధాంతిక విలువల ను పూర్తిగా కోల్పోయింది. 2003లో విద్యుత్ చార్జీల పెంపునకు వ్యతిరేకంగా, ప్రపంచ బ్యాంక్ ఏజెంట్‌గా రాష్ట్ర సీఈఓగా, నియంతగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారంటూ బషీర్‌బాగ్‌లో పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. ఈ పోలీస్ కాల్పుల్లో ముగ్గురు చనిపోగా అనే క మంది గాయాలపాలయ్యారు. అటు తర్వాత 2004లో జరిగిన ఎన్నికల్లో దీన్ని అడ్డం పెట్టుకుని కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని వైఎస్‌ఆర్‌కు ఆ పార్టీని తాకట్టు పెట్టిన ఘనత వారిదే. అటు తర్వాత మళ్లీ వామపక్షాలతో భూ పోరాటమని, పలు ఉద్యమాలు సాగించారు. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లా ముదిగొండలో 2007లో జరిగిన పోలీస్ కాల్పుల్లో ఏడుగురు చనిపోగా అనేక మంది గాయపడ్డారు.

తరువాత ఎన్నికల్లో రాజశేఖర్‌డ్డిని వదిలి చంద్రబాబుతో జత కట్టారు. ఈ విధంగా వామపక్షాలతో ఉద్యమాలనడం ఎన్నికలు రాగానే బూర్జువా పార్టీలకు తాకట్టు పెట్టడం సీపీఎంకు పరిపాటిగా మారింది. ఉద్యమాలను వాడుకుంటూ, రాజకీయ లబ్ధి కోసం అడ్డదారులు తొక్కుతు న్న మార్క్సిస్టులు రానురాను ప్రజల్లోకి నేరుగా వెళ్లలేని పరిస్థితులు తెచ్చుకుంటున్నారు. 

సీపీఎం ధోరణిలోని ఇంకో ప్రధాన అంశం- మార్క్సిస్టు సూత్రీకరణకు విరుద్ధంగా కులానికో సంఘం స్థాపించి, కులాల ప్రాతిపదికన లబ్ధి పొందే ప్రయత్నం. కుల సంఘాలతో ఉద్యమాన్ని నడిపిస్తున్న పార్టీ ఒక ప్రాంతం మొత్తం వివక్షతకు, దోపిడీకి, అన్యాయానికి గురవుతుంటే ఆ ప్రాంత ప్రజలు ఉద్యమం చేస్తుంటే, దానికి వ్యతిరేకంగా ఉండటం ఎంతటి అనైతికం. నీళ్లు, నిధులు, వనరుల విషయంలో నిలువునా దగా పడుతున్న తెలంగాణ ప్రాంతం అట్టుడికిపోతుంటే, చీమంతైనా పట్టని పార్టీకి ప్రజల పట్ల, సమస్యల పట్ల ఎంతటి సానుభూతి, ప్రేమ ఉన్నాయో ఇట్టే అర్థమవుతోంది. తెలంగా ణ రాష్ట్రం కోసం పోరాడుతుంటే దీన్ని మాత్రం ప్రాంతాల మధ్య విభేదాలుగా చూపించడం వారు ఆంధ్ర ఆధిపత్య శక్తులకు కొమ్ముకాస్తున్నారనడానికి నిదర్శనం. తెలంగాణ త్యాగ వీరులను మహాసభ స్మరించకపోవడం కనీస విలువలకు తిలోదకాలిచ్చినట్లే. తెలంగాణ ఉద్యమాల కేంద్రం ఖమ్మంలో సభ నిర్వహించి, తెలంగాణ ప్రస్తావన చేయకపోవడం ఉద్యమ స్ఫూర్తి కోల్పోయిన నాయకుల నైజాన్ని చాటింది.

అంతే కాదు మహాసభలో తెలంగాణ అంశంపై మాట్లాడానికి ప్రయత్నించిన ఆ పార్టీ శ్రేణుల గొంతు నొక్కి, ఈప్రాంత ఉద్యమంపై వివక్షను ప్రదర్శించారు. తెలంగాణ వాదంతో ప్రజా సమస్యలు పక్కదారి పడుతున్నాయని మహాసభలో జాతీయ నాయకులు చేసిన వ్యాఖ్యలు దుమా రం లేపాయి. దశాబ్దాల కాలంగా ఒప్పందాలన్నింటిని ఉల్లంఘించి సీమాంవూధులు సాగిస్తున్న ఆధిపత్యానికి వ్యతిరేకంగానే తెలంగాణ ఉద్యమం పుట్టుకొచ్చింది. ఈ ప్రజా సమస్యల పరిష్కారానికే తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగుతుంటే, దాన్ని సమస్యలకే సమస్యగా చిత్రీకరించడం నేతల హీన భావజాలానికి దర్పణం. సీపీఐ, బీజేపీ, న్యూడెమోక్షికసీ పార్టీలు తెలంగాణ ఉద్యమాన్ని భుజాన వేసుకున్నప్పటికీ, వాటికి ఒనగూరే ప్రయోజనం ఏమీ ఉండదని, ఆ పేటెంట్ అంతా కేసీఆర్‌కే దక్కుతుందని, ఎన్నికల్లో ఆ పార్టీలకు అనుకూల ఫలితాలు ఉండవని సీపీఎం నేతలు చేసిన ప్రసంగాలు పరిశీలిస్తే పోరాటమనేది బూటకమని, ఓట్లు, సీట్ల చుట్టే వారు తిరుగుతుంటారనేది తేటతెల్లమైంది.

ఓట్లు, సీట్లు తద్వారా అధికారం చేకూరనిదే ఏ పని చేయకూడదనే వారి స్వభావం వారి మాటల్లోనే వెల్లడైంది. సీపీఎం 11 పార్టీలతో కలిసి ఉద్యమాలు చేస్తామంటున్నది. మరి ఈ పదకొండులో మెజార్టీ పార్టీలు తెలంగాణకు అనుకూలం. ఇక ప్రధాన తెలంగాణ సమస్యపై కాకుండా మరే సమస్యలపై వీరు ఉద్యమిస్తారు? 

ఖమ్మం జిల్లాలోని ఏపీ స్టీల్స్ కర్మాగారం, కరీంనగర్‌లోని రామగుండం ఎరువులు కర్మాగారం, ఆదిలాబాద్ సిర్పూర్ కాగజ్‌నగర్ పేపర్ మిల్లు, హైద్రాబాద్ ఆల్విన్ ఫ్యాక్టరీ, వరంగల్ అజంజాహి మిల్లు ఇలా అనేక పరిక్షిశమలు మూతపడ్డాయి. అలాగే తెలంగాణ ప్రాంతాన్ని ముంచే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం సాగుతోంది. ఇవన్నీ చూస్తే తెలంగాణకు ద్రోహం చేస్తున్నట్లు వీరికి కనిపించలేదా? ఇంకా తెలంగాణ పరిధిలోని గోదావరి పరివాహకంలో ఒక్క నీటి ప్రాజెక్టు లేదు. కాకతీయుల కాలం నాటి చెరువులే ఉన్నాయి తప్ప వాటి అభివృద్ధి లేదు. కృష్ణా నది తెలంగాణలో ప్రవహిస్తున్నప్పటికీ, ఆ నీటినంతా ఆంధ్రా ప్రాంత ఆయకట్టుకు తరలిస్తున్నారు. తెలంగాణ పరిధిలోని నాగార్జున సాగర్ ఎడమ కాల్వ ఆయకట్టుకు మాత్రం నీరందక ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో వేలాది ఎకరాలు బీళ్లుగా మారుతున్నాయి.

గోదావరి నదిపై నిజాం కాలంలో నిర్మించిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు, ఎలాంటి మరమ్మతులకు నోచుకోక, పూడికతో నిండిపోయి నీటి సామర్థ్యం ఏమాత్రం సరిపోవడం లేదు. ఇక్కడి వెనుకబాటు తనాన్ని ఆసరాగా చేసుకుని సీమాంధ్ర పాలకులు ఆధిపత్యం చెలాయిస్తూ తెలంగాణ వారిని రెండవ తరగతి పౌరులుగా చూస్తున్నారు. తెలంగాణ ప్రజల పోరాటాన్ని ఇంతగా అవమానిస్తున్న సీపీఎం తగిన మూల్యం చెల్లించక తప్పదు. సీపీఎం కోట్లాది రూపాయలు వసూళ్లు చేసి కార్పొరేట్ సంస్థల స్థాయిలో సభ నిర్వహించింది. ఖమ్మం జిల్లా వైరాలో చందా ఇవ్వనందుకు ఒక ఉద్యోగిని చితకబాది రౌడీయిజాన్ని కూడా చాటుకున్న ఘనతను మూటగట్టుకున్నారు. సీపీఎం సీమాంధ్ర పాలకులకు తొత్తుగా వ్యవహరించడాన్ని ప్రజలు క్షమించరు. 
-ఆకుతోట ఆదినారాయna
Namasete telangana Dated 09/02/2012 

No comments:

Post a Comment