Wednesday, February 8, 2012

ఏ 'ప్రజల'తో పొత్తు? - డాక్టర్ ఎం.ఎఫ్.గోపీనాథ్


ఫిబ్రవరి 2,3,4 తేదీల్లో ఖమ్మంలో జరిగిన సిపిఎం 23వ రాష్ట్ర మహాసభలు రాశి రీత్యానే కాక వాసి రీత్యా ఒక ప్రత్యేకత సంతరించుకున్నాయి. 46 తీర్మానాల్లో ముఖ్యమైనవి మూడు. అవి: (అ) గత యాభై ఎనిమిదేళ్ళుగా పార్టీలో తిష్ట వేసిన 'మూస' ఆలోచనకు బదులుగా భారతీయ వాస్తవికతకు దగ్గరగా ఆలోచించటం; (ఆ) ఐక్య సంఘటన పేరుతో బద్ధ వ్యతిరేకులైన సిద్ధాంత బద్దులతో తాత్కాలిక ప్రయోజనాల కొరకు దీర్ఘకాలిక ప్రయోజనాలు బలిపెడుతూ వస్తున్న వివాదాలకు స్వస్తి పలకటం; (ఇ) పార్టీ మీదున్న పీజెంట్ బూర్జువా అగ్రకుల ముద్రను నిర్మాణ పరంగా తొలగించుకోవడానికి రాష్ట్ర కార్యవర్గంలో మార్పులు చేసుకోవటం. 

ఈ విధంగా ప్రజానుకూల మార్పులకు సిద్ధం కావ టం వామపక్ష, ప్రజాతంత్ర శక్తులు ఆహ్వానింపదగింది. ఆంధ్రప్రదేశ్‌లో 1985 నుంచి ఆరుసార్లు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నాలు గు సార్లు టీడీపీతో, ఒకసారి కాంగ్రెస్‌తో ఎన్నికల్లో సర్దుబాటు / పొత్తు పెట్టుకున్న సిపిఎం ఇక నుంచి దేశ, రాష్ట్ర స్థాయిల్లో బూర్జు వా పార్టీలతో పొత్తు పెట్టుకోవద్దు అనే నిర్ణయాన్ని తీర్మానించింది. ఈ నిర్ణయానికి రావటానికి అనేక కారణాలను 'చిత్తు ముసాయిదా'లో చర్చించింది. ఆ చర్చలో ప్రధానంగా పార్టీ ప్రయోజనాలను, నష్టాలను దృష్టిలో పెట్టుకుందే కాని, బూర్జువా సాంగత్యం సిద్ధాంతబద్దంగా వ్యతిరేకమైందనే విషయాల మీద చర్చ జరిగినట్లు లేదు. మహాసభల సందర్భంగా రెండు ముఖ్యమైన సెమినార్‌లను నిర్వహించారు. 

అవి: (అ) ప్రపంచీకరణ-అవినీతి; (ఆ) పెట్టుబడిదారీ వ్యవస్థ సంక్షోభం-సోషలిస్టు ప్రత్యామ్నాయం. ఈ అంశాలపై పి.సాయినాథ్, ప్రొఫెసర్ ప్రభాత్ పట్నాయక్ ఉపన్యాసాలు ఆకట్టుకున్నాయి. కానీ భారతీయ సమాజాన్ని వేల సంవత్సరాలుగా పట్టి పీడిస్తున్న కులం, వైదిక బ్రాహ్మణీయ హిందూ మత విధ్వంసం మీద చర్చ జరగక పోవడానికి కారణం ఏమిటి? మానవ సమాజంలో వర్గాలున్నంతవరకు మార్క్సిజం ఉంటుంది. భారతీయ సమాజంలో కులాలున్నంతవరకు అంబేద్కరిజం ఉంటుంది. 'తెలంగాణ' మీద చర్చ జరగక పోవటానికి సిపిఎం పార్టీ నిర్ణయం కావచ్చు. కానీ కులం, మతం గురించి మాట్లాడవలసి ఉండె. 

'ఇక నుంచి వామపక్ష ప్రజాతంత్ర శక్తుల్ని కూడగట్టి ఉద్యమాలు నిర్వహించి, ఎన్నికల పొత్తు పెట్టుకోవాలని' సమావేశం తీర్మానించింది. బూర్జువా పార్టీలతో ముఖ్యంగా టీడీపీతో సుదీర్ఘ కాలం పెట్టుకున్న 'పొత్తు'/సర్దుబాట్ల వల్ల పార్టీకి కలిగిన నష్టాల విషయం వివరంగా ముసాయిదా నివేదికలో పేర్కొన్నారు. సమావేశంలో ఆ నివేదికపై చర్చల సారాంశం ఏమంటే- ఇక నుంచి టీడీపీతో సహా ఏ బూర్జువా పార్టీతో పొత్తు ఉండకూడదు. పిఆర్ పీతో పొత్తు పెట్టుకోకపోవడం చారిత్రక తప్పిదంగా పరిగణించిన సిపిఎం మరి ఏ సూత్రం ప్రకారం ప్రజారాజ్యంతో 'పొత్తు' లేనందుకు చింతిస్తుందో అర్థం కావట్లేదు. పిఆర్‌పి నేడు కాంగ్రెస్‌లో కలిసింది. పిఆర్‌పి బూర్జువా పార్టీ కాదా? రేపు 2014లో వైఎస్ జగన్ పార్టీతో సిపిఎం సంబంధాలు ఎలా ఉండబోతున్నాయి? 

ప్రపంచ చరిత్రలో రెండు సందర్భాల్లోనే బూర్జువా పార్టీలతో ఐక్య సంఘటన లేక సంధి చేసుకున్నప్పుడు కమ్యూనిస్టు ఉద్యమాలు బలపడ్డాయి. ఈ రెండు సందర్భాలు కూడా రెండో ప్రపంచ యుద్ధకాలం నాటివి. మొదటిది-హిట్లర్‌తో స్టాలిన్ చేసుకున్న ఒడంబడిక; రెండోది- కొమింటర్న్ చాంగ్ కై షేక్‌తో మావో నాయకత్వంలో చైనా కమ్యూనిస్టు పార్టీ చేసుకున్న జపాన్ వ్యతిరేక ఐక్య సంఘటనా ఒప్పందం. ఇవి యుద్ధకాలంలో చేసుకున్న ఒప్పందాలే కావడం గమనార్హం. 

ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమ చరిత్రలో 'శాంతి' సమయాల్లో ఏ కమ్యూనిస్టు పార్టీ బూర్జువా పార్టీలతో కలిసి ఐక్య సంఘటన, ఎన్నికల పొత్తు, సంధి ఒడంబడికలు చేసుకోలేదు. 'వామపక్ష, ప్రజాతంత్ర శక్తులతో పొత్తు పెట్టుకుంటామ'ని సిపిఎం తీర్మానించింది. మరి ఈ వామపక్ష, ప్రజాతంత్ర శక్తులు ఏ వి? ఈ విషయంలో కూడా సిపిఎంకి స్పష్టత ఉన్నట్లు వినికిడి. సిపిఎం దృష్టిలో వామపక్ష, ప్రజాతంత్ర శక్తులంటే సిపిఎంతో పా టు పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో నమ్మకం ఉన్న సిపిఐ, సిపిఐ (న్యూ డెమొక్రసీ), సిబ్దాల్ ఘోష్ ఆలోచనలతో పనిచేసే ఎస్ యుసిఐ, సిపిఐఎంఎల్ (గుర్రం విజయ్‌కుమార్), సిపిఐ ఎంఎల్ (లిబరేషన్), సిపిఐ ఎంఎల్ (ప్రతిఘటన), ఎంసిపి, బిఎన్‌రెడ్డి గ్రూపు, ఫార్వర్డ్ బ్లాక్, ఆర్ఎస్‌పి. ఈ పార్టీల విధానాలను సిపిఎం ఏ విధంగా విశ్లేషిస్తుంది? వ్యూహాన్ని, ఎత్తుగడలను అమలుపర్చడానికి ఈ ప్రశ్న ముఖ్యమైనదే. అసలు సిపిఎంలో ఈ మార్పుకు దారితీసిన కారణాలేమిటనేది కూడా విశ్లేషించవలసిన అంశమే. 

బెంగాల్‌లో ఒక వేళ అత్యధిక మెజారిటీతో మొన్న ఎన్నికల్లో గెలిచి, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 2009 ఎన్నికల్లో కన్నా 10 సీట్లు ఎక్కువ సంపాదించుకున్నట్లయితే ఆ పార్టీలో ఇప్పుడు వస్తున్న ఆలోచనా సరళికి అవకాశం ఉండేదా? సిపిఎం పొత్తుల విషయం లో కాని ఆ పార్టీ నిర్ణయంలో కాని, ఆచరణలోకాని పీజెంట్ బూ ర్జువా ముద్ర నుంచి బయటపడడానికి కాని, బయటపడడానికి చేస్తున్న ప్రయత్నానికి గాని కారణం 2009లో జరిగిన కేరళ, బెంగాల్ ఎన్నికల ఫలితాలు కావచ్చు. 

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అధమస్థానానికి పడిపోయిన ఎమ్మెల్యేల సంఖ్య కావచ్చు లేదా పార్టీ లోపలా బయటా ఎదురవుతున్న సైద్ధాంతిక ప్రశ్నలు కావ చ్చు, లేదా జాతీయ రాజకీయాల్లో ఏర్పడుతున్న అనిశ్చిత పరిస్థితులూ కావచ్చు. ఇవన్నీ కాకుండా మార్క్సిజాన్ని దేశీయంగా మార్చాలనే బలమైన కోరిక కావచ్చు. ఏ ఒక్క కారణమైనా లేక అనేక కారణాలైనా ఈ మార్పు దిశగా ఆలోచన చేయటం ఒక మంచి పరిణామం. 

పైన పేర్కొన్న పార్టీలేకాక వామపక్షాలే అయిన యుసిసిఆర్ఐ (ఎంఎల్), సిపిఐ మావోయిస్ట్ పార్టీలున్నాయి. నిన్న గాక మొన్ననే స్వీడన్ దేశీయుడు, వామపక్ష ఉద్యమ శ్రేయోభిలాషి అయిన జాన్ మిర్డాల్ రాసిన 'ఇండియాపై అరుణ తార' అనే పుస్తకానికి ప్రేరణ అయిన మావోయిస్ట్ పార్టీని వామపక్ష ప్రజాతంత్ర శక్తుల నుంచి వేరుగా చూడడానికి కారణమేమిటి? అదే విధంగా పిఆర్‌పితో ఎన్నికల పొత్తు పెట్టుకోకపోవడం చారిత్రక తప్పిదంగా భావించిన సిపిఎం కేంద్రనాయకత్వం, బహుజన్ సమాజ్ పార్టీ పట్ల తన వైఖరి ఏమిటి? బిఎస్పీ బూర్జువా పార్టీనా? లేక ప్రజాతంత్ర పార్టీనా? 

సిపిఎం అగ్రనాయకుడు సీతారాం ఏచూరి ఫిబ్రవరి 4న బహిరంగ సభలో మాట్లాడుతూ 'ఇక నుంచి ప్రజలతోనే పార్టీకి పొత్తు ఉంటుంది' అని అన్నారు. ఇంతకు ముందు లేదా అనే ప్రశ్న వేయకుండా పాజిటివ్‌గా ఆలోచిస్తే ఈ 'ప్రజలు' అనేవాళ్లు, భూస్వామ్య, బూర్జువా దోపిడీకులాల్ని మినహాయిస్తే మిగిలిన వాళ్లనుకుందాం. వీళ్లతో పొత్తు అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలతో అనుకుంటే అప్పుడు అది విశాలమైన కుల వర్గ పొందికతో ఏర్పడ్డ ప్రజా పునాది అవుతుంది. అప్పుడు మార్క్సిజంతోపాటు 1937లో అంబేద్కర్ ప్రతిపాదించిన 'కులం' ఎజెండాలోకి ఎక్కుతుంది. ఈ అంశాన్ని మార్క్సిజం వెలుగులో ఏ విధంగా విశ్లేషించి సింథసైజ్ చేస్తారు? నూటికి 85 శాతంగా ఉన్న ఈ అణచివేయబడ్డ కులాల్ని, వామపక్ష ప్రజాతంత్ర కూటమిలో భాగస్వాములను చేయడానికి అవలంభించే వ్యూహం, ఎత్తుడగడలు, ప్రణాళిక ఏ విధంగా ఉండాలి? వీటన్నింటికీ జవాబులు అంత తేలిక కాదుకాని అసాధ్యం కాదు. 

ఓట్లు, సీట్లు మీద నుంచి తప్పుకుని వీరనుకునే ప్రజాతంత్ర విప్లవ స్ఫూర్తితో ప్రణాళికను సిద్ధం చేసుకోవల్సి ఉంటుంది. ఇదే సందర్భంలో నేను ఫిబ్రవరి 5న ఖమ్మంలో సిపిఎం సభ్యుడు (?) ఆ పార్టీ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటున్న మేధావితో ముచ్చటిస్తూ పార్లమెంటరీ వామపక్ష, బూర్జువా పార్టీలన్నీ ఇప్పుడు ప్రమాదకరమైన అంతర్గత శత్రువుగా భావిస్తున్న మావోయిస్టు పార్టీతో సూత్రప్రాయంగానైనా ఎందుకు ఐక్యత కోరుకోవడం లేదు? అని అడిగాను. మమ్మల్ని చంపేవాళ్లతో 'ఐక్యత' ఎట్లా సాధ్యం అన్నాడు. బూర్జువా పార్టీలతో కలిసి పనిచేయటానికి సిద్ధాంతాలను పక్కన పెట్టిన అనుభవం ఉన్న వాళ్లు ఈ విధంగా ఆలోచించటం భావ్యం కాదు. దేశాన్ని దోచుకునే బూర్జువా పార్టీల్లో ఉన్న ఐక్యత దేశాన్ని రక్షిద్దామనుకునే వాళ్ల మధ్యలేకపోవటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. 

స్థూలంగా భారత దేశంలో ఉన్నవి రెండే రెండు రాజకీయ శిబిరాలు. అవి: (అ) అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడిని ఆహ్వానిస్తూ, దేశ సంపదను, సార్వభౌమత్వాన్ని బహుళజాతి కంపెనీలకు, అమెరికన్ సామ్రాజ్యవాదానికి తాకట్టు పెట్టే కాంగ్రెస్, బిజెపి, వాటి కూటములు; (ఆ) దేశ సార్వభౌమత్వాన్ని రక్షించుకుంటూ అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడిని, అమెరికన్ సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకిస్తున్న వామపక్ష ప్రజాతంత్ర శక్తులు. వీటిలో ఐదు జాతీయ పార్టీలు, వివిధ రాష్ట్రాల్లో అధికారాన్ని పంచుకుంటున్న 51 ప్రాంతీయ పార్టీలు (ఎన్నికల కమిషన్ ఆఫీసులో రిజిస్టరైనవి). ఇంకా స్థూలంగా చెప్పాలంటే దోపిడీకుల పార్టీలు, దోపిడీని వ్యతిరేకించే పార్టీలు. 

ఏ ప్రజాతంత్ర వాది అయినా, అణచివేతల్ని కుల దోపిడీని వ్యతిరేకించే శక్తులు, పార్టీలు ఏకం కావాలని కోరుకుంటారు. ఈ సభలు జరిగిన ఖమ్మం జిల్లానే తీసుకుంటే 1964 నుంచి, పార్లమెంటరీ కమ్యూనిస్టు పార్టీలైన సిపిఐ, సిపిఎంల మధ్య ఎన్నడూ నిజమైన ఐక్యత లేదు. అంతేకాదు. ఖమ్మం జిల్లాలో సిపిఐ, సిపిఎంలు ఒకర్నొకరు చంపుకున్న సందర్భాలున్నాయి. న్యూడెమొక్రసీ పార్టీ సిపిఐ, సిపిఎం నేతలను చంపిన సందర్భాలు లేకపోలేదు. మార్క్సిజం-లెనినిజంను నమ్మిన పార్టీల మధ్య చంపుకోవటం అనేది వస్తే అది వ్యక్తిగత కక్షల వల్లనేకాని సిద్ధాంత ప్రాతిపదికన కాదు. 1970 దశకంలో ఎమర్జెన్సీ కాలంలో సిపిఐని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇందిరగా ప్రజలు ముద్దు గా పిలుచుకునేంతవరకు సిపిఐ కాంగ్రెస్‌తో అంటకాగింది. 

1977 లో జనతా పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఆ పార్టీలో జనసం ఘ్ భాగస్వామిగా ఉన్నప్పుడు కూడా సిపిఐ, సిపిఎంలు కూడా మద్దతిచ్చాయి. ఖమ్మంలో ఒక్క ఎమ్మెల్యే సీటు కొరకు పోటీపడ్డ ఇద్దరు నాయకుల వల్ల రాష్ట్ర వ్యాపితంగా ఉన్న సిపిఐ, సిపిఎం ఐక్యతకు భంగం కలుగుతున్న విషయం ఇప్పటికీ పార్టీ శ్రేణుల్లో సజీవంగా ఉంది. అనాలోచితంగా వ్యక్తి కేంద్రంగా విధించుకున్న ఈ పరిమితుల గురించి వారు ఊహించిన వామపక్ష ప్రజాతంత్ర శక్తులు ఆలోచించాలి. 'ఇక నుంచి బూర్జువా పార్టీలతో పొత్తు ఉం డదు' అన్న ఈ తీర్మానాన్ని సవరణ, ఎత్తుగడల పేరుతో నీరుగా ర్చకుండా అమల్లోకి వస్తుందా? అని ప్రశ్నించుకునే శ్రేయోభిలాషు ల, అభిమానుల అనుమానానికి 2014లో తావివ్వరని ఆశిద్దాం. 

- డాక్టర్ ఎం.ఎఫ్.గోపీనాథ్
మేనేజింగ్ ట్రస్టీ, ఫూలే-అంబేద్కర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్, ఖమ్మం
Andhra Jyothi News Paper Dated 09/02/2012 

No comments:

Post a Comment