ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టసాధన ఐక్య ఉద్యమ విజయం
Share
జాన్‌వెస్లీ Fri, 30 Mar 2012, IST
దళిత, గిరిజనులతోపాటు ఐక్య ఉద్యమం సాధించిన విజయం చట్టం అమలు జరిగితే దేశ చరిత్రలోనే చారిత్రాత్మకఘట్టం అవుతుంది. దళిత, గిరిజనుల అభివృద్ధికి తోడ్పడుతుంది. సంఘాలకు భిన్నాప్రాయాలు ఉన్నా సమస్యల పరిష్కారానికి ఐక్యంగా ఉద్యమిస్తే విజయం తధ్యమని ఈ ఉద్యమం నిరూపించింది. ఈ ఉద్యమానికి సహకరించిన, మద్దతు ఇచ్చిన, పాల్గొన్న సంఘాలు, సంస్థలు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలకు, చట్ట బద్ధత కల్సించేందుకు ఒప్పుకున్న ప్రభుత్వానికి ధన్యవాదాలు. ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుకు అందరూ సంఘటితంగా కృషి చేయాల్సి ఉన్నది.
దళిత, గిరిజనుల జనాభా నిష్పత్తికి తగ్గకుండా రాష్ట్ర ప్రణాళిక బడ్జెట్‌లో నిధులు ఫూల్ చేసి ప్రత్యేకంగా కేటాయించి వారి ప్రత్యేక ప్రయోజనాలకే ఖర్చు చేసేందుకు చట్టం తీసుకురావాలని 100కు పైగా దళిత, గిరిజన, ప్రజా సంఘాలు, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధుల సాధన ఐక్య కార్యాచరణ కమిటి ఆధ్వర్యంలో అన్ని రాజకీయ పార్టీల మద్దతుతో నిర్వహించిన ఉద్యమం, అధికారపార్టీలోని ఎస్సీ, ఎస్టీ యం.ఎల్.ఏ., యం.ఎల్.సి.లు, మంత్రులు ప్రభుత్వంపై తెచ్చిన ఒత్తిడి ఫలితంగా ప్రభుత్వం దిగి వచ్చింది. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి స్వయంగా శాసనసభలోను, శాసనమండలిలోను ఒక ప్రకటన చేస్తూ ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ అమలుకు, చట్ట బద్దత కల్పించేందుకు అధ్యయనం చేయడానికి మంత్రులతో సబ్‌కమిటి వేస్తామని, రెండు నెలల్లో ఈ ప్రకియ పూర్తి చేస్తామని, రెండు రోజులు ప్రతేకంగా శాసనసభ నిర్వహించి, చట్ట బద్దత కల్పిస్తామని ఈ బడ్జెట్ నుండే అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఐక్య కార్యాచరణ కమిటి శిబిరానికి ఉపముఖ్యమంత్రి దామోదర రాజా నర్సింహ, అధికార పార్టీ యం.ఎల్.ఏలు వచ్చి సబ్‌ప్లాన్ అమలుకు చట్టం తెస్తామని స్పష్టమైన హామీ ఇచ్చి నిరసన దీక్షలను విరమింప చేశారు. ఇది ఐక్య ఉద్యమం సాధించిన విజయం.
సబ్‌ప్లాన్ అమలుకు కెవిపిఎస్ ఉద్యమం
కెవిపిఎస్ ఆవిర్భవించిన కొద్దికాలం నుండే ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ అమలు చేయాలని ఆందోళన చేసినా టిడిపి ప్రభుత్వం స్పందించలేదు. 2004 ఎన్నికల సందర్భంగా అన్ని పార్టీల నాయకులతో సదస్సు నిర్వహిస్తే వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హాజరై కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అమలు చేస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక 2007 వరకు ఆ ఊసే ఎత్తలేదు. 2008లో కెవిపిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బి.వి.రాఘవులుతోపాటు 23 జిల్లాల నుండి 25 మంది నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. అన్ని దళిత, గిరిజన, ప్రజాసంఘాలు, సంస్థలు ఆ దీక్షలకు మద్దతునిచ్చాయి. అన్ని పార్టీల ఎంఎల్‌ఏలు రెండు రోజులు శాసనసభను స్తంభింపజేశారు. ప్రభుత్వ నిర్భందాన్ని అధిగమించి వేలాది మంది దళితులు ఛలో అసెంబ్లీ తరలివస్తే ప్రభుత్వం దిగి వచ్చి ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ అమలుకు ఎస్సీ, ఎస్టీ నోడల్ ఏజెన్సీ (జి.ఓ.నెం.117)లను, ముఖ్యమంత్రి అధ్యక్షతన అపెక్స్‌బాడీ (జి.ఓ.నెం.77)లను ఏర్పాటు చేసింది. వాటికి సబ్‌ప్లాన్ నిధులు కేటాయించకుండా, ప్రత్యేక అధికారాలను కాగితాలకే పరిమితం చేసింది. నాటి నుండి జనాభా దామాషాకు అనుగుణంగా నిధుల కేటాయింపులు జరుపుతున్నా, ఖర్చు చేయడం లేదు. దళిత, గిరిజనులకు ప్రయోజనం లేని రంగాలకు దారి మళ్లిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ అమలు చట్టం చేయాలని కెవిపిఎస్, గిరిజన సంఘం, వ్యవసాయమ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఛలో అసెంబ్లీ, అదే సందర్భంలో సిపియం రాష్ట్ర నాయకుల నిరవధిక నిరాహార దీక్షలు నిర్వహించగా మేధావులతో కమిటి వేస్తామని ముఖ్యమంత్రి ఎన్.కిరణ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చి నేటికి అమలు చేయడం లేదు.
ఐక్య ఉద్యమం
ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ అమలుకు చట్టబద్ధత కల్పించాలని, బడ్జెట్ ప్రతిపాదించే సందర్భంలోనే సబ్‌ప్లాన్ నిధులను వేరు చేసి ఎస్సీ, ఎస్టీ నోడల్ ఏజెన్సీలకు కేటాయించాలని, జనరల్ బడ్జెట్‌లో అందరితోపాటు దళిత, గిరిజనుల ప్రయోజనాలకు ఖర్చు చేస్తునే సబ్‌ప్లాన్ నిధులను వారి జనాభా ప్రతిపాదికన కేటాయించి వారి ప్రత్యేక ప్రయోజనాలకే ఖర్చు చేయాలని, ఈ నిధుల దారి మళ్ళింపు, కోత విధించరాదని, అలా చేసిన అధికారులపై సంబంధిత మంత్రులను చట్టపరంగా శిక్షించే విధంగా చట్టం రూపొందించాలని, కార్పోరేషన్స్, మున్సిపాలిటీలు, జిల్లా పరిషత్‌లతోపాటు అన్ని సంస్థలకు వచ్చే నిధుల్లో అక్కడి జనాభా ప్రతిపాదికన సబ్‌ప్లాన్ అమలు చేయాలని తదితర డిమాండ్స్‌పై కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్), గిరిజన సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సంఘాలను, సంస్థలను, మేధావులను ఆహ్వానించి 2011 మే 8న ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధుల సాధన ఐక్యకార్యాచరణ కమిటిని ఏర్పాటు చేశారు. 100 సంఘాలు ఇందులో భాగస్వాములుగా ఉన్నాయి. మాజీ ఐఏఎస్, ఐపిఎస్ అధికారులు, మేధావులు పాల్గొన్నారు. మాజీ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి కాకి మాధవరావును చైర్మన్‌గా ఎన్నుకోవడం జరిగింది. రాష్ట్ర వ్యాపితంగా అన్ని జిల్లాల్లో డివిజన్, మండల స్థాయిల్లో ఐక్యకార్యాచరణ కమిటీలు ఏర్పడ్డాయి. స్థానికంగా 873 సంఘాలు ఈ ఉద్యమంలో భాగస్వాములయ్యాయి. సదస్సులు, రౌండ్‌టేబుల్ సమావేశాలు, సైకిల్ యాత్రల ద్వారా సబ్‌ప్లాన్‌పై ప్రజలకు అవగాహన కల్పించి ప్రభుత్వంపై ఒత్తిడి చేసింది. అధికారులు, ప్రజాప్రతినిధులు, ముఖ్యమంత్రి, స్పీకర్, గవర్నర్, శాసనసభ పక్ష నాయకులకు పై డిమాండ్స్ పరిష్కారించాలని పలుమార్లు వినతి పత్రాలు ఇచ్చింది. లేఖలు, గ్రామ సభల తీర్మానాలు చేసి ముఖ్యమంత్రికి పంపాయి. అయినా ప్రభుత్వం నుండి స్పందన లేకపోవడంతో మార్చిలో శాసనసభ బడ్జెట్ సమావేశాల సందర్భంగా కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాన్‌వెస్లి, గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీరాంనాయక్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి.మురళీకృష్ణతోపాటు 11 సంఘాల నుండి 11 మంది 72 గంటలు 2012 మార్చి23 నుండి 26 వరకు నిరహార దీక్షలు నిర్వహించారు. ఈ దీక్షలకు మద్దతుగా సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు, సిపిఐ నుంచి గుండా మల్లేష్, టిఆర్‌ఎస్ నుంచి మాజీ మంత్రి చంద్రశేఖర్, కెటిఆర్, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నల్లా సూర్య ప్రకాష్, బిజెపి నుంచి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్‌రెడ్డి, న్యూడెమోక్రసి నుంచి డివికృష్ణ, టిడిపి నుంచి మోత్కుపల్లి నర్సింహులు ఒక రోజు చొప్పున నిరసన దీక్షలు నిర్వహించారు. ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా రాష్ట్ర నలుమూలల నుండి మార్చి 26న వేలాది మంది చలో అసెంబ్లీకి తరలి వచ్చారు. టిడిపి అధ్యక్షులు చంద్రబాబు, లోక్‌సత్తా రాష్ట్ర అధ్యక్షులు జయప్రకాష్ నారాయణ దీనికి మద్దతు ఇచ్చారు. ప్రధాని మాజీ కార్యదర్శి కెఆర్ వేణుగోపాల్, ఐక్యకార్యాచరణ కమిటి చైర్మన్, రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి కాకి మాధవరావు, దానం ఐఏఎస్(రి), డిటి నాయక్ ఐపిఎస్(రి), ప్రొ.సత్యనారాయణ, సినీయర్ జర్నలిస్ట్ మల్లేపల్లి లక్ష్మయ్య, గిరిజన సంఘం ప్రధాన కార్యదర్శి మాజీ యంపి బాబురావులతోపాటు వామపక్ష నాయకులు, పలు సంఘాల నాయకులను అరెస్టు చేసింది.
ఈ ప్రభుత్వ నియంతృత్వ చర్యలను నిరసిస్తూ దళిత, గిరిజనుల డిమాండ్స్ ప్రభుత్వం శాసనసభలో నిర్దిష్ట హామీ ఇచ్చే వరకు కదిలేది లేదని సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు, న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు వెంకటేశ్వర్లు, సంఘాల నాయకులతోపాటు వేలాది మంది సామూహిక దీక్షలో బైఠాయించడంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రభుత్వ నిరంకుశ చర్యలకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాపితంగా నిరసన ప్రదర్శనలు, ధర్నాలు జరిగాయి. శాసనమండలిలో సైతం 59 మంది యం.ఎల్.ఏ.లు సంతకాలు చేసి సబ్‌ప్లాన్‌పై చర్చను ప్రారంభించారు. అధికార పార్టీలోని ఎస్సీ ,ఎస్టీ యం.ఎల్.ఏ.లు మంత్రులతో ఉప ముఖ్యమంత్రి దామోదర రాజా నర్సింహా ఆధ్వర్యంలో సమావేశమై ముఖ్యమంత్రిపై ఒత్తిడి తెచ్చారు. ప్రజల వ్యతిరేకతను గమనించిన ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలు కాంగ్రెస్ పార్టీని ఈసడించుకుంటున్న విషయాన్ని గమనించి తప్పని స్థితిలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ అమలుకు చట్టం చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. 24 గంటల సామూహిక దీక్ష అనంతరం ఉపముఖ్యమంత్రి దామోదర రాజా నర్సింహ బృందం శిబిరానికి వచ్చి సబ్‌ప్లాన్ అమలుకు చట్టం చేస్తామని హామీ ఇచ్చి దీక్షను విరమింపజేయించింది.
దళిత, గిరిజనులతోపాటు ఐక్య ఉద్యమం సాధించిన విజయం చట్టం అమలు జరిగితే దేశ చరిత్రలోనే చారిత్రాత్మకఘట్టం అవుతుంది. దళిత, గిరిజనుల అభివృద్ధికి తోడ్పడుతుంది. సంఘాలకు భిన్నాప్రాయాలు ఉన్నా సమస్యల పరిష్కారానికి ఐక్యంగా ఉద్యమిస్తే విజయం తధ్యమని ఈ ఉద్యమం నిరూపించింది. ఈ ఉద్యమానికి సహకరించిన, మద్దతు ఇచ్చిన, పాల్గొన్న సంఘాలు, సంస్థలు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలకు, చట్ట బద్ధత కల్సించేందుకు ఒప్పుకున్న ప్రభుత్వానికి ఐక్య కార్యాచరణ కమిటి ధన్యవాదాలు తెలియజేస్తున్నది. ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుకు సంఘటితంగా కృషి చేయాల్సి ఉన్నది.
(రచయిత కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి)
-జాన్‌వెస్లీ
Prajashakti news paper dated : 30/3/2012