Friday, March 9, 2012

కార్పొరేట్‌ను ఢ కొట్టే సామాజిక శక్తులు---చుక్కా రామయ్యకూకట్‌పల్లిలో ప్రగతి స్కూలు నడుపుతున్న దయాకర్‌, తెనాలిలో తులసి ప్రసాద్‌లాంటి వాళ్లను చూస్తే కార్పొరేట్‌ రంగానికి దీటుగా పనిచేసే సామాజిక శక్తులు బలంగా ఉన్నాయన్న కొండంత ధైర్యం కలుగుతుంది. ఈ విద్యా సంస్థల విజన్‌ను అమలుపరచటానికై దీక్షా కంకణబద్ధులైన ఉపాధ్యాయవర్గం వాళ్లకు దొరకటం అదృష్టం. ఇలాంటి నిస్వార్థపరులైన ఉపాధ్యాయుల సేవలను శ్లాఘిస్తున్న వాక్యాలు మనం రాయగలిగితే సామాన్యునికి నాణ్యమైన చదువు అందించగలిగే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం విద్యారంగాన్ని మార్కెట్‌కు అప్పగించేసి చేతులు దులిపేసుకొనే దానికన్నా, ఇలాంటి స్కూళ్లకు ఏమాత్రం చేయూతనిచ్చినా అవి సమాజానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
కార్పొరేట్‌ రంగం అందించే చదువే చదువన్న భావనను మార్కెట్‌ శక్తులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. ఈ ప్రచారం ఏస్థాయి దాకా వెళ్లిందంటే కార్పొరేట్‌ రంగం లేకుంటే నాణ్యమైన విద్య దొరికేదే కాదని తల్లిదండ్రులు భావించేంతదాకా వెళ్లింది. అందుకే ఆస్తిపాస్థులమ్ముకొనైనా సరే తమ పిల్లల్ని కార్పొరేట్‌ రంగానికి అప్పగిస్తున్నారు. ఏ.సి. రూములు, ఏ.సి. బస్సులలో ఫైవ్‌స్టార్‌ హౌటళ్లను తలపించే రీతిలో స్కూళ్లుపెట్టి విద్యార్థికి సకల భోగభాగ్యాలు కలిగిస్తేనే చదువు సమర్థవంతంగా ఉంటుందన్న భావనను ప్రచారం చేస్తున్న కాలమిది. విద్య వ్యాపారమయమైన ప్రపంచమిది. కొంతకాలం ప్రజాజీవితాలలో తమ జీవిత ప్రధానభాగం గడిపిన కార్యకర్తలు సామాజిక స్పృహతో చక్కటి చదువును పిల్లలకు అందిస్తూ, ఏ విధమైన ప్రచార ఆర్భాటాలు లేకుండా నిర్వహిస్తున్న కొన్ని ఉత్తమ స్కూళ్లను చూశాను. ఇలాంటి స్కూళ్లల్లో హైద్రాబాద్‌లోని కూకట్‌పల్లి సమీపానగల ప్రగతి నగర్‌లో ఉన్న ''ప్రగతి'' స్కూల్‌ను చూడగలిగాను. ఇదొక్కటే కాదు. ఖమ్మం, గుంటూరు, ఆదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, కాకినాడ, విశాఖ...ఇలా రాష్ట్రంలోని ఎన్నో ప్రదేశాలలో ఎంతోమంది కార్యకర్తలు తదేక దీక్షతో ఇలాంటి స్కూళ్లను నడిపిస్తున్నారు. అట్లాంటి వారితో కలిసి పనిచేసే అవకాశం నాకు దొరికింది. కార్పొరేట్‌ కబంధ హస్తాల్లో చితికిపోతున్న విద్యావ్యవస్థను కాపాడటం కోసం సామాజిక స్పృహ ఉన్నవాళ్లు కృషి చేస్తున్నారు. విద్యార్థి అంటే వినియోగదారుడు కాదని విద్యార్థిలో చైతన్యం కలిగించి జ్ఞాన ఆసక్తిని పెంచి నైపుణ్యం గల విద్యార్థులను సమాజానికి అందిస్తున్నారు.
ఇటీవల కూకట్‌పల్లి సమీపంలోని ''ప్రగతి'' స్కూలుకు వెళ్లాను. ఆ పిల్లల సమాధానాలు వింటుంటే నాకే ఆశ్చర్యం వేసింది. ప్రతి చిన్న విషయానికి కారణాలను విశ్లేషించి చెబుతున్న తీరు నన్ను అబ్బురపరచింది. ప్రగతి స్కూల్‌ పేరుకు తగినట్లుగానే చక్కటి వసతులు, విద్యా ప్రమాణాలు, క్రమ శిక్షణతో పురోగమిస్తున్నది. మార్కెట్‌ విద్య ఎంత ఉన్నా కానీ, ప్రగతి స్కూల్‌కు ఉన్న ప్రతిష్ట చెక్కుచెదరనిది.
అదే మాదిరిగా నేను ఖమ్మం వెళ్లాను. ఒకవైపున పిల్లలు నాలుగు వాక్యాలు కూడా చదవలేకపోతున్నారని ప్రభుత్వ నివేదికలొస్తున్నాయి. కానీ, కొన్ని స్కూళ్లల్లో నాలుగు వాక్యాలేం ఖర్మ పేరాలకు పేరాలు, పేజీలకు పేజీలు ఇంగ్లీషు, తెలుగులో గడగడా చదివేస్తున్నారు. ప్రతిరోజు పాఠ్యాంశాలకు సంబంధించిన అంశాలపై వాక్యాలు రాస్తున్నారు. వ్యాఖ్యానాలు చేయగలుగుతున్నారు. వీరందరికీ 594 మార్కులు పరీక్షల్లో రాకపోవచ్చును. వీళ్లు ర్యాంకు హోల్డర్లు కాకపోవచ్చును. వీళ్ల స్కూళ్లను టి.వి. తెరల మీద హంగూ ఆర్భాటాలతో చూపించకపోవచ్చును. కాని మధ్య తరగతి పిల్లలకు చదువులు చెపుతూ సామాజిక స్పృహతో ముందుకు సాగుతున్న ఈ స్కూళ్లు నిశ్శబ్ద మార్పుకు కారణభూతమౌతున్నాయి.అవగాహనతో చదవటం, అవగాహనతో రాయటం, పాఠ్యేతర పుస్తకాలను అధ్యయనం చేయడం, ఆ స్కూళ్లల్లో జరుగుతున్నటువంటి రొటీిన్‌ కార్యక్రమం. ఈ పిల్లలంతా మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన వారు, ఏ చిన్న క్లర్కులో, చిన్న చిన్న ఉద్యోగాలో, చిన్న చిన్న కుటీర పరిశ్రమలో, చేతివృత్తులు చేసుకుంటున్న మధ్యతరగతి కుటుంబీకుల పిల్లలే వీళ్లంతా. ఇళ్ళల్లో ఇంగ్లీషు మాట్లాడే వాతావరణం ఏమీ లేదు. ప్రతి రోజు ఎలా అభ్యాసం చేయాలో చెప్పే తల్లిదండ్రులు కూడా తక్కువగా వున్నారు. కానీ, ఏ పబ్లిక్‌ స్కూల్‌కు తీసిపోకుండా ఈ స్కూళ్లల్లో పిల్లలు, చక్కటి ఇంగ్లీషులో మాట్లాడుతున్నారు. అడుగుతున్న ప్రశ్నలకు ఎంతో సమయస్ఫూర్తితో చురుకుగా సమాధానాలు చెపుతున్నారు. ఏ ప్రశ్న అడిగినా దాన్ని అర్థం చేసుకొని సమాధానం చెప్పగలుగుతున్నారు.
ఈ సామాజిక సోయితో నడిచే బళ్లల్లో ఫీజుల విధానం మధ్యతరగతి కుటుంబీకులు మోయగలిగే విధంగా ఉంది. ఇంత తక్కువ ఫీజులతో పిల్లలకు ఇన్ని వసతులు ఎలా కలిగించారని ప్రగతి స్కూల్‌ సెక్రటరీ దయాకర్‌ను అడిగాను. పిల్లలిచ్చిన ఫీజుతోనే ఈ స్కూల్‌ నిర్మాణాలు జరిగాయని చెప్పాడు. దినదినం విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నది కాబట్టి వాళ్లకు వసతులు కల్పించే అవకాశం కూడా కలిగింది.
విశాలమైన ఆట స్థలాలు, ఆటలు, పాటలతో ఆ ప్రాంగణాలు కళకళలాడుతున్నాయి. ఇవన్నీ పిల్లలమీద చదువు ఒత్తిడి తగ్గించేందుకు ఉపయోగపడుతున్నాయి. వ్యాసరచనలు, వక్తృత్వ పోటీలు, సంగీత పోటీలు నిర్వహిస్తున్నారు. తెనాలిలో శ్రీరామ రూరల్‌ విద్యాసంస్థలు చేస్తున్న కృషి మరువలేనిది. 'మా దినచర్యలో భాగంగా బడిని చూస్తున్నాం. అందుకే ఈ పిల్లలు రాణించగలుగుతున్నారని' శ్రీరామ రూరల్‌ విద్యాసంస్థల నిర్వాహకుడు తులసీ ప్రసాద్‌ నాకు చెప్పాడు. బాలోత్సవాలు నిర్వహించటం వల్ల దీని ప్రభావంతో అన్ని స్కూళ్లలో కూడా ఇలా జరగాలన్నదే తమ ధ్యేయమని తులసీప్రసాద్‌ చెప్పాడు. తులసీ ప్రసాద్‌ నిర్వహిస్తున్న స్కూలు లాభాపేక్షతో లక్షలు ఆర్జించాలని పెట్టింది కాదు. తులసీ ప్రసాద్‌ వాళ్ల పూర్వీకులు రెండు తరాల వాళ్లు స్వాతంత్య్రం రాకపూర్వమే ఈ స్కూలుని ప్రారంభించారు. తన పూర్వీకులు సృష్టించిన ఒరవడిలోనే తులసీప్రసాద్‌ ఈ స్కూలును కొనసాగిస్తున్నాడు. తులసి తాత, వాళ్ల నాన్న ఈ బడిని డెబ్బై ఏళ్లుగా నిర్వహిస్తూ వస్తున్నారు. ఆ ప్రాంతంలోని, అలాగే చుట్టుపక్కల జిల్లాల నుంచి వచ్చిన ఎందరో పేద విద్యార్థులు ఈ స్కూల్లో చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించారు. తులసి ప్రసాద్‌ ఆ వారసత్వాన్ని కొనసాగిస్తున్నాడు. అందుకే కూకట్‌పల్లిలో ప్రగతి స్కూలు నడుపుతున్న దయాకర్‌, తెనాలిలో తులసి ప్రసాద్‌లాంటి వాళ్లను చూస్తే కార్పొరేట్‌ రంగానికి దీటుగా పనిచేసే సామాజిక శక్తులు బలంగా ఉన్నాయన్న కొండంత ధైర్యం కలుగుతుంది.
ఈ విద్యా సంస్థల విజన్‌ను అమలుపరచటానికై దీక్షా కంకణబద్ధులైన ఉపాధ్యాయవర్గం వాళ్లకు దొరకటం అదృష్టం. ఇలాంటి కమిట్‌మెంట్‌ ఉన్నవాళ్లు ఎలా దొరికారని అడిగాను. ప్రతిరోజు పత్రికల్లో ఉపాధ్యాయ వర్గాన్ని విమర్శిస్తూ వార్తలు వస్తుంటే, ఇంత పవిత్రమైన వృత్తి ఎంతో అపఖ్యాతి పాలవుతుందని అనేకసార్లు బాధపడ్డాను. ఈ స్కూళ్లల్లో పనిచేసే టీచర్లను చూస్తుంటే నాకు భవిష్యత్తుపై నమ్మకం పెరుగుతుంది. కార్పొరేట్‌ రంగాన్ని ఢ కొట్టే శక్తి సామర్థ్యాలు ఈ బళ్లకు ఉన్నాయన్న నమ్మకం కలిగింది. అంకితభావంతో పనిచేసే ఉపాధ్యాయులు ఈ మార్కెట్‌యుగంలో ఎందరెందరో ఉన్నారని ఈ స్కూళ్లను చూస్తే తెలుస్తుంది. వారికి సమస్యలు లేకేం కాదు, కానీ యాజమాన్యం అంకితభావం దానికి స్ఫూర్తి కలిగించింది. నాయకత్వం వహించేవారు నిజాయితీపరుడైతే సిబ్బంది కూడా స్ఫూర్తి చెందుతారు. దురదృష్టవశాత్తు ఈ లోకంలో చెడునే చూపిస్తారు. చెడునే ప్రచారం చేస్తారు. ఇలాంటి నిస్వార్థపరులైన ఉపాధ్యాయుల సేవలను శ్లాఘిస్తున్న వాక్యాలు మనం రాయగలిగితే సామాన్యునికి నాణ్యమైన చదువు అందించగలిగే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం విద్యారంగాన్ని మార్కెట్‌కు అప్పగించేసి చేతులు దులిపేసుకొనే దానికన్నా, ఇలాంటి స్కూళ్లకు ఏమాత్రం చేయూతనిచ్చినా అవి సమాజానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.ఇతర దేశాల్లో పాఠశాల విద్య ప్రభుత్వపరంగానే ఉంటుంది. స్వచ్ఛమైన గాలిని, నీటిని, వైద్యాన్ని అందించటం ఎంత ప్రధానమో కల్తీలేని చదువును అందించటం కూడా అంతే ముఖ్యమని కొన్ని దేశాలు భావించి పనిచేస్తున్నాయి. ఇలాంటి లోటును కొద్దో గొప్పో పూర్తి చేయటానికి తమ బాధ్యతగా విలువలతో స్కూళ్లను నిర్వహిస్తున్న, సేవాతత్పరతతో ఉన్న యాజమాన్యాలకు, కార్యకర్తలకు తోడ్పడాలి.
(రచయిత ప్రముఖ విద్యావేత్త, శాసనమండలి సభ్యులు) 
-చుక్కా రామయ్య 
ప్రజాశక్తి  న్యూస్  పేపర్  : Dated  10 /03 /2012 

No comments:

Post a Comment