Monday, March 12, 2012

సామాజిక న్యాయానికే యూపీ ఓటు--Y KMayawati--latest
ఉత్తరప్రదేశ్‌ శాసనసభ ఎన్నికల ఫలితాలు దేశ ప్రజలకిస్తున్న సందేశం ఏమిటి? కుల వ్యవస్థ పాతుకుపోయి సామాజిక అణచివేతకు గురైన సామాజిక వర్గాలకు చెందిన రెండు పార్టీలే ప్రధాన పోటీదారులుగా రంగంలో నిలవడం అర్థం చేసుకోవలసిన పరిణామమే. గత 2007 ఎన్నికల్లో గూడా ఇదే తరహా పరిణామం చోటు చేసుకొని ఉండడం అదేదో యాదృచ్ఛికమైనదికాదని స్పష్టమౌతోంది.ఎస్సీ మహిళ మాయావతి నాయకత్వంలోని బీఎస్పీ గతసారి 206 సీట్లతో ప్రథమ స్థానంలో నిలవగా, బీసీ నాయకుడు ములాయంసింగ్‌ సారథ్యంలోని ఎస్పీ గతసారి 97 స్థానాలతో ముగిసిపోవడం గమనార్హం. అయితే, గతసారి గానీ, ఈసారి గానీ కాంగ్రెస్‌, బీజేపీల స్థానాల్లో మాత్రం మార్పు లేదు. 
మాయవతి విశ్లేషణని బట్టిగానీ, స్వతంత్ర పరిశీలననిబట్టిగానీ బీఎస్పీకి దళిత ఓట్లు చెక్కు చెదరకుండా ఉన్నట్టు ద్యోతకమౌతోంది. మొత్తం ఓట్లలో 23 శాతానికి పైగా బీఎస్పీ సంపాదించింది. ఎస్పీకి బీసీలతో పాటు ముస్లిం మైనారిటీలు గట్టిగా అండదండలిచ్చినట్లు స్పష్టపడుతోంది. ఓబీసీల కోటా 27 నుండి 4.5 శాతం ఉపకోటాని ముస్లిం మైనారిటీలకు కేటాయిస్తామంటూ ఎన్నికలముందు కాంగ్రెస్‌ చేసిన కుయుక్తిని యూపీలో అందరికన్నా ముస్లిం ప్రజలే బాగా అర్థం చేసుకున్నారు. 

కాంగ్రెస్‌ కుట్రని ఓటింగు ద్వారా తిప్పికొట్టారు. ‘మౌలానా’గా పేర్గాంచిన ములాయం పార్టీకే తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. తాము కోరుకొంటోన్నది రంగనాథ మిశ్రా కమిటి సిఫార్సుల ప్రకారం 10 శాతం రిజర్వేషన్లను తమదైన ప్రత్యేక కోటాగా కల్పించాలన్నదే తప్ప, 54 శాతం జనాభా ఉన్న ఓబీసీ లకు అసలే సగానికిసగమే- అంటే 27 శాతమే కల్పిస్తోన్న రిజర్వేషన్లలో కోతపెట్టి, అవి తమకు పంచాలని కాదని ముస్లిం ప్రజలు ఘంటాపథంగా చాటి చెప్పారు.

బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీల ఓటర్లు తమవైన ఎస్పీ, బీఎస్పీలకు మాత్రమే ఓటు వేశారు. ఆధిపత్య కులాల పార్టీలైన కాంగ్రెస్‌, బీజేపీలను తిరస్కరించారు.ఆవిధంగా 100కి 80 శాతంగా ఉన్న ప్రజలు అద్భుతమైన సామాజిక న్యాయ చైతన్యాన్ని ఈ ఎన్నికల్లో ప్రదర్శించారు. 
బీహార్‌లో గూడా 80 శాతంగా ఉన్న ప్రజలు ఇదే తరహా చైతన్యాన్ని ప్రదర్శిస్తున్నారని గమనించాలి. అంటే, సమయం, సందర్భం, పరిస్థితులు ఒనగూడితే, యావత్‌ దేశంలోని 80 శాతం బలహీనవర్గాల ప్రజలు యూపీలోలాగానే సామాజిక న్యాయచైతన్యాన్ని ప్రదర్శించ గలరని అర్థంచేసుకోవాలి. బలమైన సామాజిక ప్రత్యామ్నాయం లేనికారణంచేతనే ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీలను మార్చుకొని మార్చుకొని అధికారంలోకి పంపిన చరిత్ర ముందుకొచ్చింది. సామాజిక న్యాయం నినాదంతో (మోసపూరితంగా నైనా) ముందుకొచ్చిన చిరంజీవి ప్రజారాజ్యం పార్టీకి 70 లక్షలకు పైగా ఓట్లు వేశారంటే, ఏ మోతాదులో ప్రజలు సామాజిక న్యాయాన్ని కోరుకొంటున్నారో అర్థం చేసుకోవచ్చు. నూటికి 80 శాతంగా గల బలహీనవర్గాలకు తమదైన పార్టీ ఏర్పడి, నిలబడి నమ్మకం కలిగించ గలిగితే, మన రాష్ట్రంలో గూడా తాజాగా ఊరేగుతోన్న మూడు పార్టీలకూ యూపీలో కాంగ్రెస్‌, బీజేపీలకు పట్టినగతే పట్టిస్తారనడంలో సందేహంలేదు. బీఎస్పీ ఒక ఉప్పెనలా దూసుకొచ్చిన 1994 ఎన్నికల్లో కాంగ్రెస్‌, టీడీపీలు ఎంత కలవరపడ్డాయో ఈ సందర్భంలో గుర్తుకు తెచ్చుకుంటే సరిపోతుంది.

అయితే, రెండు పార్టీలకు యూపీ బడుగు బలహీనవర్గాలు సామాజిక న్యాయ దృక్పథంతోనే ఓట్లు వేస్తోంటే-ఎస్పీ, బీఎస్పీలు ఎందుచేత పరస్పరం ఘర్షణ పడుతున్నాయి? ఓటర్లు ఒకసారి ఒక పార్టీని, మరోసారి మరో పార్టీనీ ఎందుకు అందలమెక్కిస్తున్నారు? పార్టీల నిర్మాణాన్నీ, నాయకత్వాన్నీ, విధాన ప్రకటనలనీ ప్రజలు అర్థంచేసుకుంటోన్న విధంగానే ఆ పార్టీలు ఆచరణలో వ్యవహరించకపోవచ్చు. సామాజికన్యాయం తన లక్ష్యంగా బీఎస్పీ స్పష్టంగా ప్రకటించిన మాట నిజమే. కానీ బీజేపీతో అధికారం కోసం జత కట్టటానికి ఆ పార్టీ వెనుకాడలేదు. ఆ సఖ్యతలో భాగంగానే గుజరాత్‌లో 2 వేలమంది ముస్లిం ప్రజలను మూకుమ్మడి హత్యలకు బాధ్యుడైన నరేంద్ర మోడి గెలుపు కోసం యూపీ ముఖ్యమంత్రి హోదాలో మాయావతి ఎన్నికల ప్రచారం చెయ్యవలసి వచ్చింది. అది బీజేపీ మద్దతుతో ముఖ్యమంత్రి పదవిని అలంకరించిన పాప ఫలితమే గదా! ముస్లిం ప్రజలు నిన్నటి ఎన్నికల్లో మాయావతి బీఎస్పీని కాదని ‘మౌలానా’ ములాయం సన్నిధికి చేరడంలో ఆశ్చర్యమేముంది?

బహుజనుల హితం కోరి, బహుజనులతో ఏర్పడిన పార్టీ రంగు మార్చకుండానే దిక్కు మార్చి, ఎన్నికల గెలుపు ఎత్తుగడల పేరుతో గత 2007 ఎన్నికల్లో మనువాద, కులాధిపత్య, రాచరికపు శక్తులకు పెద్దపీటవేసి తాత్కాలిక ఫలితాలు పొందినప్పటికీ- నాడు గెలిపించిన శక్తులే నేడు కిందకు పడదోసిన వాస్తవం కళ్ళకు కనపడుతోంది. సామాజిక న్యాయ సాధనని దీర్ఘకాల సాంఘిక, సాంస్కృతిక, ఆర్థిక, రాజకీయ పోరాట లక్ష్యంగా గాక, తాత్కాలిక ఎన్నికల విజయానికి కుదించి, శత్రు వర్గాలతో చేతులు కలిపిన దుష్ఫలితం బీఎస్పీ తాజా ఎన్నికల్లో అనుభవించింది. సరిగ్గా ఇలాంటి తాత్కాలిక ప్రయోజనం కోసమే శత్రు వర్గాలతో చేతులు కలిపి పతనమౌతున్న సీపీఐ, సీపీఎంల వర్గ సంకర విధానంతో సరిపోల్చదగిన వర్ణ సంకర విధానాన్ని చేపట్టి, కొనసాగిస్తే ఆ రెండు పార్టీలకు పట్టిన దుర్గతే బీఎస్పీకీ పడుతుందనడంలో సందేహం లేదు.

akhilesh-yadav
బీసీల సంఖ్యా బలంతో, బీసీల నాయకత్వంలో కొనసాగుతున్న సమాజ్‌వాది పార్టీ సామాజిక న్యాయం తనలక్ష్యంగా అసలు ప్రకటించకపోవడమే చిత్రాల్లోకెల్ల విచిత్రం. అది ప్రధానంగా యాదవ సామాజికవర్గ పార్టీ. ఇతర బీసీ వర్గాలు ఆ పార్టీని బలపరుస్తుండవచ్చు. కానీ, పార్టీలో నిర్ణాయక శక్తి యాదవులదే. అదీ, ములాయం కుటుంబానిదే. అఖిలేశ్‌ యాదవ్‌ సమర్థుడైన, విజ్ఞతగల నాయకుడే కావచ్చు. కానీ, అతను ఆ స్థానానికి ఎగబాకడానికి ములాయం సింగ్‌ కుమారుడైనందువల్లే అనే కఠోరసత్యం చేదుగా ఉన్నా అంగీకరించక తప్పదు. అంతర్గత ప్రజాస్వామ్యానికీ, సమష్ఠి పని విధానానికీ ఇది విరుద్ధం. సంఖ్యాబలం హెచ్చుగా ఉన్న యాదవ సామాజిక వర్గంలోని కొన్ని అసాంఘిక శక్తులు గతంలో ములాయం సింగ్‌ అధికారంలో ఉన్న కాలంలో ‘గుండాయిజం’ విమర్శని ఎస్పీకి కట్టబెట్టాయి. ఈ ‘గుండాయిజం’ మాట చివరికి ములాయం పార్టీ అధికారాన్ని కోల్పోవటానికి ప్రధాన కారణమైంది. అధికారంలో ఉన్న కాలంలో తండ్రి చేసిన తప్పుల్ని ఈ సారి అధికారం కోసం కుమారుడు సరిదిద్దినట్లు చెబుతోన్నారు.

మంచిదే. అయితే, ఎన్నికల ఫలితాలు వెలువడీ, వెలువడక ముందే ఆ పార్టీ ‘కార్యకర్తలు’ కొందరు ‘వెనుకటి గుణాన్ని’ తిరగబెట్టారు. యువ నాయకుడు అఖిలేష్‌ మళ్లీ ఇల్లు చక్కబెట్టుకోవలసిన దురవస్థలో పడిపోతున్నారు. దీని కంతటికీ పార్టీ శ్రేణుల్లో సాంఘిక, సాంస్కృతిక, తాత్త్విక దృక్పథం లేకపోవడమే కారణం. డా రామ్‌ మనోహర్‌ లోహియా వంటి సోషలిస్టు నాయకుల స్ఫూర్తితో అలనాడు ‘సమాజ్‌వాది’ (సోషలిస్టు)గా నామకరణం చేసుకొన్నప్పటికీ, తమది- మహోన్నతమైన మానవ సమాజాన్ని, సోషలిజాన్ని నిర్మించవలసిన పార్టీగా- ఆ పార్టీ శ్రేణులకు ఇప్పుడు స్పృహలోనే లేదనడం అతిశయోక్తి కాదు. సోషలిజం గురించి ఆ పార్టీ శ్రేణుల్లో అత్యధిక భాగానికి అసలేం తెలియదని చెప్పినా చెయ్యరాని పాపం చేసినట్లేమీ కాదు. బీసీల నాయకత్వమే లేకపోతే, అదొక ప్రాంతీయ బూర్జువా పార్టీ అని చెప్పినా తప్పు కాదు. దేశంలోని అత్యంత ధనాఢ్యవర్గాలైన కార్పొరేట్‌ శక్తులతో ఆ పార్టీకున్న సన్నిహిత సంబంధాలు రహస్యమేమీకాదు. ప్రస్తుతం కూడా కాంగ్రెస్‌ నాయకత్వానగల యూపీఏ ప్రభుత్వానికి వెలుపలనుండి మద్దతు అందచేస్తోన్న పార్టీగానే అది కొనసాగుతోంది. 

ఒక వైపు ప్రాంతీయ పార్టీల ఫెడరల్‌ కూమి ఏర్పాటు గురించి చంద్రబాబు, మమతా బెనర్జీ, నవీన్‌పట్నాయక్‌ వంటి నాయకులూ, మరోవైపు వామపక్షాలతోసహా ఎస్పీని కలుపుకొని లౌకిక కూటమి ఏర్పాటుగురించి కాంగ్రెస్‌ నాయకులూ ఆలోచిస్తున్న నేపథ్యంలో రెండు కూటములూ ములాయంని కలుపుకోవాలని చూస్తున్నాయంటే, ఇంతకీ ఈయన ఏకోవకు చెందినవాడైనట్లు? తన తండ్రికి చంద్రబాబు నాయుడుతోనూ, తనకి జగన్‌ మోహనరెడ్డితోనూ మంచి సాన్నిహిత్యం ఉందని అఖిలేష్‌ చాలా ఘనంగా చెప్పుకొన్నారు. ఇంతకీ సారాంశం ఏమిటంటే, ఎస్పీకి బీసీగా సంపూర్ణ సామాజిక న్యాయమూ లేదు, ‘సమాజ్‌వాది’గా సంపూర్ణ సోషలిజమూ లేదు. ఎన్నికల ప్రచారంలో గూడా ఈ రెంటి ఊసే కనపడలేదు. సమైక్యవాదిగా పేరున్నప్పటికీ, ఆ అంశాన్ని తాజా ఎన్నికల్లో ప్రచార చెయ్యకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఆ మాటకొస్తే మాయావతి గూడా చిన్నరాష్ట్రాల అంశాన్ని ఎన్నికల గంపకింద మూసిపెట్టే ఉంచింది.

ఒక పార్టీ సమాజ్‌వాది (సోషలిజం) పేరు పెట్టుకొన్నా, మరొక పార్టీ సామాజిక న్యాయం లక్ష్యమని ప్రకటించినా, ఈ రెండు పార్టీలకూ శ్రామిక వర్గ దృక్పథం లేకపోవడం ఆ పార్టీల మధ్యగల భావ సారూప్యతగా చెప్పుకోవచ్చు. పైగా ఆధిపత్య కులాల రాజకీయ పార్టీల పోకడలనే అందుకోవాలని ఈ పార్టీలు ఉబలాటపడడం గమనిస్తాం. ఇండియాలో కుల వ్యవస్థని గుర్తించకుండా, తదనుగుణంగా కార్యాచరణని రూపొందించుకొనకుండా, రెండు కమ్యూనిస్టుపార్టీలు చేస్తోన్న చారిత్రక తప్పిదం వంటి దాన్నే ఎస్పీ, బీఎస్పీలు- ఇండియాలో ఉన్నది కుల వ్యవస్థ మాత్రమే కాదు, వర్గ సమాజం కూడా- అని గుర్తించకుండా, తదనుగుణ్యమైన కార్యాచరణ రూపొందించుకొనకుండా మరో తప్పుదారిన నడుస్తోన్నాయి.

yks
ఈ తప్పుల్ని సవరించుకొనవలసిన అవసరం ఆ పార్టీలకున్నది. తాజాగా జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో సోదెలోకి గూడా రాకుండా పోయిన రెండు కమ్యూనిస్టు పార్టీలకు పట్టిన దుర్గతి మరెవరికీ పట్టగూడదు గదా! అయితే ఎస్పీ, బీఎస్పీలు తమ దృక్పథాలను, కార్యాచరణలనూ సరిదిద్దుకొనేదాకా సామాజిక న్యాయశక్తులు వేచి చూడనవసరం లేదు. ఆ రెండు పార్టీలతో మిత్ర సంబంధాలు కొనసాగిస్తూనే వర్గ- కుల దృక్పథంతో సామాజిక న్యాయ సాధనకై బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీ తదితర పేద వర్గాలు తమదైన మరో రాజకీయ పార్టీ నిర్మాణానికి తక్షణమే నడుం బిగించవలసిందే. అటు దేశంలో, ఇటు రాష్ట్రంలో నేటి పరిస్థితులు అందుకు పరిపక్వంగా ఉన్నాయి. ఆధిపత్య కులాల పార్టీల మధ్య చెలరేగిన కాట్లాట ఈ సానుకూల పరిస్థితుల్ని వేగిర పరుస్తున్నాయి.

Surya News Paper Dated : 13/03/2012 

No comments:

Post a Comment