Friday, March 9, 2012

పోరాట ప్రతీక ‘మిలియన్ మార్చ్----కె. గోవర్ధన్రాష్ట్ర సాధన కోసం జరుగుతున్న ఉద్యమంలో ‘మిలియన్ మార్చ్’ విలువైన గుణపాఠాన్ని నేర్పింది. ఉధృతంగా సాగుతున్న ఉద్యమాన్ని క్రూర నిర్బంధంతో నలిపేయాలనుకున్న కిరణ్ సర్కార్‌కు చెంపపెట్టుగా మారింది. అణచివేత ప్రతిఘటనకు దారితీస్తుందన్న చారివూతక సత్యాన్ని మిలియన్‌మార్చ్ మరోసారి ప్రపంచానికి తెలియజేసింది. ఉద్యమ శక్తులకు, ప్రజానీకానికి అంతులేని విశ్వాసాన్ని ఇవ్వడమే కాకుండా, తెగించి పోరాడందే తెలంగాణ రాదనే సందేశాన్ని ఇచ్చింది. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం మాట తప్పి, మోసగిస్తున్నందుకు మిలిటెంట్ పోరాటాలే మార్గమని చెప్పిన మిలియన్ మార్చ్ బాట అనుసరణీయమైనది.
నాడు ‘మిలియన్ మార్చ్‌కు ప్రభుత్వ అనుమతి లేదన్నది. మార్చి 11వ తేదీ వరకు హైదరాబాద్ నగరంలో నిషేధాజ్ఞలున్నాయి. సభలు, సమావేశాలు నిషిద్ధం. ఎవరైనా ఈ ఆంక్షలు ధిక్కరిస్తే కఠిన చర్యలు తప్పవు’ అంటూ రాష్ట్ర డీజీపీ మొదలు సాధారణ పోలీసు అధికారుల దాకా అదే పనిగా ప్రచారం సాగించారు. మార్చి 5వ తేదీ నుంచే హైదరాబాద్‌కు ఎవరూ వెళ్లకూడదంటూ హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యమంత్రి కిరణ్‌ను నాలుగు నిమిషాల కంటే ఎక్కువగా మాట్లాడకుండా ‘రచ్చబండ’లో అడ్డుపడి తెలంగాణ పౌరుషానికి ప్రతీకగా నిలిచిన రాయినిగూడెం మహిళల్ని మార్చి 6వ తేదీనే కస్టడీలోకి తీసుకున్నారు. తెలంగాణ జిల్లాల్లోని ప్రజానీకం మిలియన్‌మార్చ్‌కు తరలిరాకుండా ఆయా జిల్లాల ఎస్పీలు హెచ్చరికలు జారీచేశారు. కొన్నిచోట్ల గ్రామస్థులను పిలిచి బైండోవర్ కేసులు పెట్టారు. మార్చి 10న హాజరు కావాలని ఆజ్ఞలు జారీ చేశారు. ఈ ఆజ్ఞల్ని ఉల్లంఘిస్తే పదివేల రూపాయల జరిమానా కట్టాలని, బాండ్ పేపర్లపై సంతకాలు చేయించుకున్నారు. తెలంగాణ జేఏసీ నాయకుల్ని, ఇతర ప్రజా సంఘాల కార్యకర్తల్ని మార్చి అర్ధరాత్రి నుంచే అరెస్టుచేశారు. వేలాది మందిని పోలీస్‌స్టేషన్లలో నిర్బంధించారు.


మార్చి 10న తెలంగాణ జిల్లాల నుంచి హైదరాబాద్‌కు వచ్చే రైళ్లనంటిని రద్దు చేశారు. ఏ లారీని, జీపును, ఇతర వాహనాలను కూడా అనుమతించలేదు. ఎవరైనా మిలియన్ మార్చ్‌కు లారీలను, ఇతర వాహనాలు సమకూరిస్తే తీవ్ర పరిణామాలుంటాయని, వాటి యజమానులను బెదిరించారు. చాలాచోట్ల ఆర్‌సీ బుక్కులను లాగేసుకున్నారు. చివరికి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్న వారిని సైతం పోలీసులు విడిచిపెట్టలేదు. కొన్నిచోట్ల ప్రయాణికులను దించివేశారు. ఇలా హైదరాబాద్ నగరానికి వచ్చే రహదారులలో చాలాచోట్ల చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి, ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేశారు. రాజధాని నగరంలోని ముఖ్యమైన రోడ్లన్నిటిని మూసివేసి వేలాదిమంది పోలీసులతో పహరా పెట్టారు. ప్రజలను ట్యాంక్‌బండ్ చేరుకోకుండా ప్రభుత్వం అన్ని రకాల నిరంకుశ, నిర్బంధ చర్యలకు ఒడిగట్టింది.
ప్రభుత్వం అనుసరిస్తున్న క్రూరమైన అణచివేత విధానాన్ని ఎదుర్కొని ఎలాగైనా ట్యాంక్‌బండ్‌పై మిలియన్ మార్చ్‌ను జయవూపదం చేయాలని న్యూడెమోక్షికసీ భావించింది. ఆ సంకల్పం నుంచే ఆర్యసమాజ్‌లో పెళ్లి ఆలోచన ముందుకొచ్చింది. దీన్ని పకడ్బందిగా అమలుచేసి, అక్కడ క్యాడర్‌ను జమ చేసింది. అలా ఆర్యసమాజ్‌లో, చుట్టుపక్క ప్రాంతాల్లో గుమిగూడిన దాదాపు ఎనిమిదివందల మంది న్యూడెమోక్షికసీ, పీడీఎస్‌యూ, పీఓడబ్ల్యూ, ఐఎఫ్‌టీయు, జేఏసీ శ్రేణులు సరిగ్గా మధ్యాహ్నం ఒంటి గంటలోపే ట్యాంక్‌బండ్‌కు చేరుకోగలిగారు. ఆర్యసమాజ్ నుంచి వందల సంఖ్యలో జై తెలంగాణ అంటూ రాకెట్‌లా దూసుకొచ్చారు. మూడంచెల పోలీసు వలయాన్ని, బారికేడ్లను, ముళ్ల కంచెలను ఛేదించి ట్యాంకుబండ్‌పై మిలియన్ మార్చ్‌ను ప్రారంభించారు. టీజేసీ కో-ఛైర్మన్ మల్లేపల్లి లక్ష్మయ్య, న్యూడెమోక్షికసీ నాయకులు సూర్యం. ప్రదీప్, జె.వి. చలపతిరావు, పీఓడబ్ల్యూ నాయకురాళ్లు సంధ్య, ఝాన్సీలతో పాటు నాలాంటి వందలాది మందిమి ట్యాంక్‌బండ్‌పైకి దూసుకెళ్లాం. పోరాట పతాకమైన ఎర్రజెండా ఎగురవేశాం. దీంతో హతాశులైన పోలీసు బలగాలు ఉద్యమకారులపై విరుచుకుపడ్డాయి. దొరికిన వారిని దొరికినట్టుగా చితకబాదారు. ముళ్లకంచెలను, తుపాకులను, లాఠీలను ఎదురొడ్డిన వందలాది ఉద్యమకారులు సమరోత్సాహంతో పోలీసుల అష్ట దిగ్బంధాన్ని వీరుల్లా చిత్తుచేశారు.

రాష్ట్ర ప్రభుత్వం అనుసరించిన దిగ్బంధాన్ని పటాపంచలు చేస్తూ వేల సంఖ్యలో వివిధ వర్గాలకు చెందిన ప్రజానీకం ట్యాంక్‌బండ్‌పై ఉత్సాహపూరితంగా మార్చ్ నిర్వహించారు. ఊరేగింపులుగా పాటలు పాడుతూ, ఆటలు ఆడుతూ మిలియన్ ‘మార్చ్’ను విజయవంతంగా నిర్వహించారు. న్యూడెమోక్షికసీ శ్రేణులతో పాటు బీజేపీ, సీపీఐ, టీఆర్‌ఎస్, జేఏసీలకు చెందిన నాయకులు, ఉస్మానియా, కాకతీయ,తదితర యూనివర్సిటీలకు చెందిన విద్యార్థులు,జర్నలిస్టులు లాయర్లు, డాక్టర్లు, ఉద్యోగులతో పాటు అన్ని వర్గాల ప్రజలు మిలియన్ మార్చ్‌లో పాల్గొన్నా రు. అమరవీరుల త్యాగా ల సాక్షిగా తెలంగాణ వచ్చేవరకు వీరోచితంగా పోరాడుతామని ప్రతిజ్ఞ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం అణచివేత విధానాలకు వ్యతిరేకంగా సాగిన మిలియన్ మార్చ్‌ను కొంతమంది పనిగట్టుకుని ‘విగ్రహాల విధ్వంసం’గా ప్రచారం చేశారు. మిలియన్ మార్చ్ ప్రశాంతంగా ముగుస్తున్న సమయంలో కొంతమంది విగ్రహాల విధ్వంసానికి పూనుకున్నారు. దీన్ని నాలాంటివాళ్లతో పాటు అనేక మంది సరికాదని వారించాం. అయితే ప్రభుత్వ అణచివేతలోంచి కట్టలు తెంచుకున్న ప్రజాక్షిగహానికి ప్రతీకగానే మిలియన్‌మార్చ్ చూడాలి. శాంతియుతంగా జరుప తలపెట్టిన మిలియన్ మార్చ్‌కు తెలంగాణ జేఏసీ ముందుగానే ప్రభుత్వ అనుమతిని కోరింది. పోలీసులు అనుమతి నిరాకరించడమే కాకుండా అడ్డుకుంటామని బహిరంగంగా ప్రకటించారు. అడుగడుగునా అడ్డంకుల్ని సృష్టించారు. అయినప్పటికీ ప్రభుత్వ నిర్బంధాన్ని తిప్పికొడుతూ తెలంగాణ ప్రజలు మిలియన్‌మార్చ్‌ను సాహసోపేతంగా నిర్వహించారు. తెలంగాణ నినాదాన్ని దేశమంతటికి వినిపించడంలో కృతకృత్యులయ్యారు. అందుకే తెలంగాణ ఉద్యమానికి మిలియన్ మార్చ్ పోరాట ప్రతీక.

-కె. గోవర్ధన్
సీపీఐ (ఎం-ఎల్) న్యూడెమోక్షికసీ రాష్ట్ర కమిటీ సభ్యులు
Namasete Telangana News Paper Dated : 10/03/2012 

No comments:

Post a Comment