విశ్వ విఖ్యాత ఆర్థికవేత్త, శాస్త్రవేత్త, తత్వవేత్త, రాజనీతిజ్ఞుడు, మహామహోపాధ్యాయుడు, గడచిన మిలీనియంలో ప్రపంచాన్ని ప్రభావితం చేసిన వారిలో ప్రథముడుగా గుర్తించబడ్డ విశ్వ మానవుడు కారల్ మార్క్స్. ఆయన 129వ వర్థంతిని మార్చి 14న జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా ప్రస్తుత ప్రపంచ పరిస్థితులను, ఆయన భావాలను నేటికీ వాటికున్న ప్రాధాన్యతను తెలుసుకుందాం.
నేడు, ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థ 2008 నుంచి గతంలో ఎన్నడూ చవిచూడనంత తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కొనసాగుతున్నది. ఇలాంటి సంక్షోభాన్ని అర్థం చేసుకొని, బయటపడే మార్గాలను అన్వేషించేందుకు పెట్టుబడిదారీ నేతలు, ఆర్థికవేత్తలు మార్క్స్ రచనలను ఆశ్రయిస్తున్నారు. మార్క్స్ చెప్పిన పరిష్కారాలను పెట్టుబడిదారీ వ్యవస్థ పరిధి దాటి వీరు అమలుకు పూనుకుంటారా అన్నది సందేహమే అయినా పెట్టుబడిదారీ సిద్ధాంతవేత్తలు మార్క్స్ గ్రంథాల అధ్యయనానికి పూనుకోవడం మార్క్సిజం విశిష్టతకు నిదర్శనం. ఈ రకంగా మార్క్స్ పట్ల ఆదరణ, ఆసక్తి అధికం కావడానికి ముందుగా చెప్పుకోవాల్సిన కారణం ఆయన పెట్టుబడిదారీ వ్యవస్థను నిశితంగా పరిశీలించి అద్భుతమైన విశ్లేషణ అందించడమే.
ఆయన చెప్పిన విశ్లేషణే నేడు జరుగుతున్నది. మార్క్సిజాన్ని మరింత సృజనాత్మకంగా అభివృద్ధిపరచి అమలు చేసిన లెనిన్ గుత్త పెట్టుబడిదారీ దశలో ఆ విధానం యొక్క అత్యున్నత దశ సామ్రాజ్యవాదం అని విశ్లేషణాత్మకంగా రుజువు చేశారు. 20వ శతాబ్దంలో పెట్టుబడిదారీ విధానం కోట్లాది ప్రజల ప్రాణాలను తీసిన రెండు ప్రపంచ యుద్ధాలకు కారణమైంది. అణ్వాయుధ పోటీలోకి ప్రపంచాన్ని నెట్టింది. స్వతంత్ర దేశాల అంతరంగిక వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూ నేటికీ అనేక కుట్రలకు, యుద్ధాలకు పాల్పడుతున్నది. 1989 అనంతరం భూమ్మీద ఏకధృవ ప్రపంచం ఏర్పడిన దాన్ని అవకాశంగా తీసుకొని అమెరికా నాయకత్వాన సామ్రాజ్యవాద దేశాలు నయా ఉదారవాద ప్రపంచీకరణ విధానాలను ప్రపంచ దేశాలపై రుద్ది గత 20 ఏళ్లుగా అమలు చేయిస్తున్నాయి.
మరోవైపు సైనిక వ్యయంలో కూడా ప్రపంచంలో అమెరికా వాటా 41.5 శాతానికి చేరింది. అందుకే మార్క్స్ తన కేపిటల్ గ్రంథంలో 'పెట్టుబడి నఖశిఖ పర్యంతం రక్తం, చెమటతో నిండి ఉంటుంది'' అని విశ్లేషించాడు. భారతదేశంలో ఆంగ్లేయుల వలస పాలనపై మార్క్స్ వ్యాఖ్యానిస్తూ 'బ్రిటీష్ ధనస్వామ్యం మాటల కందని క్రౌర్యం అంతులేని తన దోపిడీ పద్ధతుల ద్వారా భారతీయులను, ఆ దేశ వనరులను దోపిడీచేసి ప్రపంచంలో బలమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతుంది' అని అన్నారు.
పెట్టుబడి కొద్దిమంది చేతుల్లో పోగుపడి, సంపద కేంద్రీకరించబడటానికి దారితీసి, మరోవైపు విస్తారమైన జన బాహుళ్యం చేతిలో కొనుగోలు శక్తి క్షీణించడంలోనే సంక్షోభానికి పునాదులు ఏర్పడతాయి అంటాడు మార్క్స్. 'ఉత్పత్తి సామాజికంగా జరిగితే పంపిణీ వ్యక్తిగతంగా ఉండటంలోనే మౌలిక వైరుధ్యం ఉంది' అని కూడా మార్క్సిజం చెప్పింది. పెట్టుబడిదారీ విధానం చరిత్ర పొడవునా పెట్టుబడి కేంద్రీకరణ రెండు విధాలుగా జరుగుతుంది.
మొదటిది మార్క్స్ చెప్పినట్లు మేథో, శారీరక శ్రమలను దోచుకొని పెట్టుబడిని గుట్టలుగా పోగుచేసుకోవడం (Appropriation). ఇది సాధారణంగా జరిగే ప్రక్రియ. రెండవది పైన పేర్కొన్నది కొనసాగుతుండగానే బలప్రయోగంతోనూ, నిలువుదోపిడీ (ex - appropriation) ద్వారా కొల్లగొట్టడం. ఉదాహరణకు ప్రభుత్వరంగ ఆస్తులను, సహజ వనరులైన గనులు, భూములు, అడవులు, నదులు, సముద్రాలు, ఇంధనం లాంటి అన్నింటినీ లూటీ చేయడం. మన దేశంలో జాతి సంపదగా ఉండాల్సిన వాటిని ప్రైవేటుగా కొన్ని కుటుంబాలకు చెందినవారే లూటీ చేయడం.
కార్పొరేట్ గుత్త సంస్థల అపరిమితమైన, అనుచితమైన లూటీకి అడ్డంకిగా ఉన్న ఇనుము-ఉక్కు, చమురు, సహజవాయువు, బొగ్గు, బ్యాంకులు, ఇన్సూరెన్స్, ఓడరేవులు, ట్రాన్స్‌పోర్ట్, విద్యుత్, కమ్యూనికేషన్స్ తదితర అనేక లాభాలతో నడుస్తున్న ప్రభుత్వ రంగానికి చెందిన విభాగాలలో పెట్టుబడులను ఉపసంహరిస్తూ, వాటాలను అమ్ముతూ, వాటిని బలహీనపరుస్తూ, కారుచౌకగా వేలం వేస్తూ, దోపిడీ కొనసాగుతుంది. ఈ దోపిడీ విధానానికి పెట్టిన ముద్దుపేరే ప్రస్తుత ప్రపంచీకరణ విధానం.
ఈ ప్రపంచీకరణ విధానంలో అంతర్జాతీయ ఫైనాన్స్ పెట్టుబడి చేస్తున్న లూటీకి, దానికి లొంగిపోయిన వర్ధమాన దేశాల పాలకులు సిగ్గువిడిచి సహకరించడం నేడు మనకు కనబడుతున్న బహిరంగ రహస్యం. ఇంతవరకు తెలియని అనేక మార్గాలను అనుసరించడం ద్వారా, మార్కెట్ శక్తుల అవినీతిని, ప్రభుత్వాలే ప్రోత్సహించడం ద్వారా అవినీతి చట్టబద్ధమైపోయింది. ఉపాధిరహిత, ఉపాధిని దెబ్బతీసే అభివృద్ధి (jobless growth, job loss growth) విధానాల వల్ల కోట్లాది ప్రజలు జీవనాధారం కోల్పోవడం, లేదా స్థిరత్వంలేని కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ పద్ధతుల్లోనే పరిమితంగానైనా ఉపాధి వెతుక్కోవాల్సిరావడం చూస్తున్నాం. ఆర్థిక సంక్షోభం పెరుగుతున్నకొద్దీ, ఆ సంక్షోభ భారాలను అత్యధిక ప్రజానీకం అనుభవిస్తుంటే, మరోవైపు శత సహస్ర కోటీశ్వరులు పెరుగుతూ ఉన్నారు.
ప్రపంచ జనాభాలో అత్యంత సంపన్నులైన రెండు శాతం మంది ప్రపంచ సంపదలో సగానికి పైగా అనుభవిస్తున్నారు. అమెరికాలో ఆదాయం సంగతి అటుంచి సంపద కోణంలో చూస్తే అందరికన్నా పైనున్న ఒకశాతం మంది 40 శాతం సంపద అదుపు చేస్తున్నారు. భారత్‌లో 69 మంది డాలర్ మహా కోటీశ్వరుల ఆస్తుల మొత్తం దేశ జి.డి.పి.లో 30 శాతం ఉంది. అదే సమయంలో 80 శాతం మంది భారతీయులు రోజుకు 20 రూపాయలు కన్నా తక్కువ ఆదాయంతో బతుకుతున్నారని ప్రభుత్వ కమిటీల నివేదికలే తెలుపుతున్నాయి. 'పెట్టుబడిదారీ విధానం ఒక వ్యవస్థగా ఎప్పుడూ దోపిడీ సాగించకుండా, సంక్షోభరహితంగా ఉండజాలదని' మార్క్స్ విశ్లేషించాడు. బడా పెట్టుబడిదారీ దేశాల సంక్షోభాలను ఒకసారి పరిశీలిద్దాం.
ప్రజల్లో కొనుగోలు శక్తి తీవ్రంగా తగ్గిపోవడంతో, సత్వర లాభాలను పోగు పోసుకోవాలన్న హడావిడిలో ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కేపిటల్ (ఐఊఇ) స్పెక్యులేటివ్ మార్గాలను ఎం చుకుంటుంది. ప్రజలకు చౌకగా రుణాలివ్వజూపుతుంది. ప్రజలు ఈ రుణాలు ఖర్చుచేసే సందర్భంలో లాభాలొస్తాయి. రుణం తీసుకున్న వాడు దివాళా తీయడంతో ప్రైవేట్ బ్యాం కులు, ఇన్సూరెన్స్, ఇతర భారీ ఆర్థిక సంస్థలు దివాళా తీస్తాయి. ఆ ద్రవ్య సంస్థలు మళ్ళీ పుంజుకొని భారీ స్థాయిలో లాభాల సృష్టికి పాల్పడేట్లు చేయడానికి ఉద్దీపన పథకాలు (బెయిలవుట్ ప్యాకేజీలు) పెట్టుబడిదేశాల ప్రభుత్వాలు ప్రకటించాయి.
ఈ ప్యాకేజీలకయ్యే సొమ్మును సంపాదించడానికి సహజంగానే ఈ ప్రభుత్వాలు ప్రజల వెన్ను విరుస్తున్నాయి. ప్రజల సదుపాయాలను, హక్కులను దారుణంగా కోతపెట్టడం, ధరలు, పన్నులు పెంచడం చేస్తూ అంతిమంగా కార్పొరేట్ దివాళాలు దేశాల దివాళాలుగా మార్చబడ్డాయి. నిరుద్యోగాన్ని పెంచి ప్రజల కొనుగోలు శక్తిని తీవ్రంగా తగ్గిస్తాయి. కాబట్టే అంతిమంగా సంక్షోభం వాయిదాపడుతుంది తప్ప అంతరించిపోదు.
బలమైన రాజకీయ ప్రత్యామ్నాయం కూడా లేదు కనుక పెట్టుబడిదారీ విధానం ఈ సంక్షోభం నుంచి తాత్కాలికంగా బయటపడుతుంది. కాకుంటే ప్రజలపై దోపిడీ తీవ్రతరమౌతుంది. మార్క్స్ చెప్పినట్లు ఈ సంక్షోభం తీవ్రత ఎంత ఉన్నా పెట్టుబడిదారీ విధానం దానికదే కుప్పకూలదు. మానవాళి విమోచనకై పోరాటాలను ప్రపంచీకరణగావించి ఆయా దేశాల్లోని ప్రజలు విప్లవ పరివర్తన క్రమాన్ని ముందుకు తీసుకుపోవాలి. సమకాలీన సామ్రాజ్యవాద ప్రపంచీకరణ దశలో కూడా మార్క్స్, ఎంగెల్స్, లెనిన్ లాంటి మహనీయుల బోధనలకు ప్రాధాన్యత ఉంది.
- బండారు రవికుమార్
సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు
(నేడు కారల్ మార్క్స్ 129వ వర్ధంతి)
No comments:
Post a Comment