Thursday, March 8, 2012

మరో మిలియన్‌మార్చ్ కావాలి!



ఎప్పుడు హైదరాబాద్ నగరంలో అడుగుపెట్టినా.. అనామకుడిలా, పరాయివాడిగా ట్యాంక్‌బండ్‌పై నిల్చునేవాడిని. హుస్సేన్ సాగర్ బెంచీపై కూర్చొని, బుద్ధుడిని, లుంబిని పార్క్‌లోని కేరింతలను, ఐమాక్స్ థియేటర్ ‘రంగుల కలల్ని, ఎన్టీఆర్ గ్డాన్స్ పచ్చిక బయళ్లు, ఆ అడుగున కూల్చబడిన ‘విద్యుత్తు కేంద్రం’ జీవనదిగా పారే మూసీ నది గుర్తొస్తూ వుండేయి. ఈ మహానగరపు దగ దగల వెనుక చీకట్లను, ఆ మహాసౌధాల కింద నలిగిపోయిన బతుకుల జీవన దుస్థితి చూస్తే అతలాకుతలం అయ్యేది. ఈ వివక్ష అణచివేతలతో ట్యాంక్‌బండ్‌పై నిలిపిన విగ్రహాలకు సంబంధం వుందని కళ్ళరా చూసిన దినం మార్చ్ 10, 2011.‘మిలియన్ మార్చ్’ సందర్భంగా హైదరాబా ద్ చేరుకోవడానికి చేసిన ప్రయత్నం ఎప్పటికీ గుర్తుండిపోయే సాహసం. నిత్యం తెలంగాణ పల్లెల్లో బూటకపు ఎన్‌కౌంటర్ల కోసం పట్టణాలు, గ్రామాల్ని జల్లెడ పట్టినట్లు, నేనుండే నల్లగొండ జిల్లాను పారా మిలిటరీ బలగాలు చుట్టుముట్టా యి. ఇది పరిస్థితి తీవ్రతను, ఆధిపత్యవర్గాల నియంతృత్వ పోకడలను తెలియజేసింది.అర్ధరాత్రి అయితే అరెస్టు చేయకపోవచ్చని, ఐదుగురం మిత్రు లం కలిసి పరిస్థితిని బట్టి, లారీ, బస్సు, రైలు ఏదైతే అది వెళ్ళద్దామని నిర్ణయించుకున్నాం. రోడ్డు మీద నా కోసం వస్తున్న ముగ్గురిలో ఇద్దరిని జీపు లో ఎత్తుకెళ్ళడం, మరొకరు పారిపోతే అతన్ని వెంటబెట్టుకొని తెల్లవార్లూ బస్‌స్టాండు, బైపాస్ రోడ్డు, రైల్వే స్టేషన్ తదితర ప్రాంతాల్లో పోలీసుల వేట వల్ల ప్రయాణంలో విఫలం చెందాం. 

తెల్లవారుగట్ల మళ్లీ ప్రయత్నం మొదటి పెట్టాం. సాధ్యం కాలేదు. బండి కి అంటించిన, ‘జై తెలంగాణ’ స్టిక్కర్ చూసి ఎత్తుకెళ్లే ప్రయత్నం చేస్తే స్టిక్క ర్ చించేసుకుని మరో ప్రయత్నం చేశాను. కొంతమంది కానిస్టేబుల్స్ పోనిచ్చినా (తెలంగాణ బిడ్డలు) ఆంధ్రా అధికారులు నిలువరించే ప్రయత్నం చేశారు. చివరికి వేషం మార్చుకుని పరిగెత్తే ‘కొశ్చిన్’ రైలు పట్టుకుని పట్నం చేరాను. పట్నంలో దిగగానే, సికిందారాబాద్ స్టేషన్ నుంచి అందరూ స్టేషన్ పక్కనుంచి ట్యాంక్‌బండ్ వైపుకు పరుగెత్తడం కనిపించింది. కాలి నడక తప్ప మరొక వాహనాన్ని అనుమతించని నిర్బంధపు నీడలో రాత్రి 2గంటల నుంచి మధ్యా హ్నం 2గంటల వరకు సకల ప్రయత్నాల వల్ల వెంటాడే వేటగాళ్ళను తప్పించుకొని సురక్షిత ప్రాంతానికి చేరినట్టు ట్యాంకుబండ్, మైసమ్మ గుడి దగ్గరికి చేరాను. ట్యాంక్‌బండ్ పైకి ఎక్కడం, అంత ఎత్తుకు ఎగబాకడం నావల్ల అయ్యే పని కాదని అనిపించింది. కానీ నాతోపాటు ట్యాంకుబండ్‌ను ఎక్కి తీరాల్సిందే.. అని ఎందరో రకరకాల రూపాల్లో ప్రయత్నిస్తున్నవారు కనపించారు. ఎన్ని ఆటంకాపూదురైనా ఒంట్లోకి తుపాకి తూటా దిగబడినా, కాళ్లు విరిగినా, చేతులు చీరుకు పోతున్నా శత్రువు కోటల్ని చుట్టు ముడుతున్నట్లు ఆడ, మగ, విద్యార్థి సామాన్య ప్రజలతోపాటు నేను కూడా పైకి ఎక్కేశాను.‘పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలం’లా గద్దరన్న పాటతో ఉర్రూతలూగుతున్న ట్యాంకుబండ్‌కు తరలివస్తున్న వేలాది గొంతుకల ‘చైతన్యం’ హుస్సేన్‌సాగర్‌లో కెరటాల్లా ఎగిసిపడింది. 

ఎవరో మిత్రుడు దాసుకొచ్చిన ‘ఫ్ల కార్డ్’ ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం, పోలీసురాజ్యం ఆంధ్రా రాజ్యం, గూండారాజ్యం,అని రాసి ఉన్నది పట్టుక తిరుగుతుం ఒక్కొక్కరు తమదైన నినాదాలు.. ‘ఆంధ్రోడు తమ్ముడే అడ్డువస్తే తన్నుడే’ తెలంగాణ అడ్డుస్తే.. మిలియన్ మార్చ్‌లై తిరగబడతం, ఇంకొవరో మందుపాతర్ల లై పేలిపోతం.. ఎవరికి తోచిన నినాదం వాళ్లు ఇస్తున్నారు. ఎవరికి నచ్చిన పాట వాళ్లు, ఎవరి నృత్యం వాళ్లు చేసుకుంటూ పోతున్నరు. సీమాంధ్రపాలకుల, కేంద్ర దురంహంకారం, డిసెంబర్ 9 నాటి ద్రోహాన్ని తుత్తునియలు చేయడానికి సన్నద్ధ మై వచ్చిన సమరశీల తెలంగాణ పోరు బిడ్డలతో ట్యాంకుబండ్ అంతా కదం తొక్కింది. ఉప్పొంగే చైతన్యం అయ్యింది. లక్ష్యసాధన కోసం ప్రజలంతా కదం తొక్కితే.. ఎంతటి రౌద్ర ప్రవాహంగా ఉంటారో నిరూపించింది.

ఆట పాటలతో సాగుతున్న మిలియన్ మార్చ్ తమ భాగ్యనగరానికి రాకుం డా అవాంతరాలు కలిగించిన వలసవాద ప్రభుత్వంపై ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తన చేతుల్ని కట్టేసి, ఆత్మాభిమానాన్ని పాతరేసిన వలసాంధ్ర ఆధిపత్య చిహ్నాలపై విరుచుకుపడింది. వాడెవడో నూనూగు మీసాల పోరగాడే.. తెలంగాణ కసినంతా కడుపులో పెట్టుకుని, మూతికి గుడ్డ చుట్టుకొని చేతితో అక్కడే విరగొట్టిన ఇనుప కమ్మీ, కేబుల్ వైర్లతో కదం తొక్కాడు. ఒకనితో వేల చేతలు జత కలిసినయి. ఒక్కొక్కటి పదే పదినిమిషాల్లో విగ్రహాల్ని, ఆ విగ్రహాల శిలాఫలకాల్ని నామరూపాల్లేకుండా చేశారు. ఆ పిల్లల సాహసాన్ని ఏ సాధనాలతో కొలవగలం!జై తెలంగాణ నినాదాల హోరులో ఒక్కొక్కటే ఆధిపత్య ప్రతీకలు నేల కూలుతుంటే.., వేలాదిమంది తెలంగాణ బిడ్డల ఆక్రోశం చల్లబడుతున్నట్లన్పించింది.‘ఎందుకయ్యా అట్లా చేయడం బాగాలేదంటే’, మీకేం తెలుసుసార్ అనుభవిస్తే తెలుస్తది. ప్రశాంతంగా మిలియన్ మార్చ్ జరుపుకుంటమంటే అనుమతియ్యలే, హైదరాబాదేమన్నా వాడబ్బ జాగిరా? ఇక్కడ విగ్రహాలు పెట్టి ఆధిపత్యంతో బతుకుల్ని ఆగం చేసింది చాలక ఎంతమంది మా అన్నా తమ్ముళ్ళు మాడి మసైపోతు న్నా స్పందించరా? అందుకే మేం చేయాలనుకున్నది చేసే తీరుతాం. డిసెంబర్ 9 ప్రకటనకు అడ్డుపడ్డోని ఆస్తులపై కూడా దాడులు చేస్తాం అంటుండగానే పటపటమంటూ ఆంధ్రాబ్యాంకు, అద్దాల మేడల మీద రాళ్ళ వర్షం కురుస్తూనే వుంది. తెలంగాణ అడ్డుకోవడానికి, రాజకీయ ఆధిపత్యానికి చిహ్నంగా నిలిచిన ఓ హోటల్‌పై దాడుల పరంపర కొనసాగుతూనే ఉంది. కూలుతున్న విగ్రహాల్లో‘శ్రీశ్రీ’ దగ్గర కొంచెం తీవ్రంగానే ‘కూ ల్చొద్దు’అని నేను, పాశం యాదగిరి మరికొంతమంది అక్కడే నిలబడ్డాం. దీంతో.. ఆ విగ్రహం నిలిచిపోయింది.జాషువా, శ్రీశ్రీ, మగ్దూం వంటి విగ్రహాల పట్ల ఆవేశంలోనైనా విజ్ఞత ప్రదర్శించడం నాలాంటి వారికి ఎంతో ఊరట నిచ్చింది. అయితే ఇంత విధ్వంసం జరగడానికి ప్రభుత్వమే కారణం. సాఫీగా మిలియన్ మార్చ్ జరగనిస్తే ఇంత విద్వేషం రగిలి వుండేది కాదు. వేలాది మంది పోలీసు బలగాలను దింపి మార్చ్‌ను అడ్డుకోవాలని ప్రయత్నించడమే ఆగ్రహానికి అసలు కారణం. మిలియన్ మార్చ్ చాలా స్పష్టంగానే తెలంగాణకు అడ్డుపడుతున్న శక్తుల్ని గు ర్తించి, అడ్డును ఎట్లా తొలిగించుకోవాలో తెలుసుకుంది.ఆ చైతన్యం అక్కడికొచ్చిన రాజకీయ పక్షాలకు, మార్చ్‌ను నీరుగార్చే ప్రయత్నం చేసిన దివాళాకోరు నాయకులకు తగిన గుణపా చెప్పింది. ఉద్యమ ద్రోహాన్ని సహించబోమని హెచ్చరించింది. ప్రజాకాంక్షను ఎత్తిపట్టిన ఉద్యమకారుల్ని, కోదండరాంను నెత్తిన పెట్టుకొని బతుకమ్మలా ఎత్తిపట్టింది.తెలంగాణ వచ్చేదాకా బలిదానాలు మాని ఆత్మస్థైర్యంతో పోరాడి సాధించుకుంటామన్న ప్రతిజ్ఞ చేసింది. రాజకీయ విద్రోహాన్ని హుస్సేన్‌సాగర్ నడిబొడ్డున ఎండగట్టింది. సీమాంధ్ర వలసాధిపత్యంపై తిరుగుబాటు బావుటాను ఎగరేసి తమ దాస్య శృంఖలాలను తెంచుకోవడానికి, ధ్వంసం చేయాల్సిన దాన్ని ధ్వంసం చేసి తమ కలల మహానగరాన్ని నిర్మించుకోవడం కోసం తెలంగాణ కలలు కంటున్నది. ‘సకల జనుల స్వప్నం’ కోసం మరో మహత్తర పోరాట పిలుపు కోసం ఎదురు చూస్తున్నది. మార్చి 10 మిలియన్ మార్చ్ ఓ సజీవ దృశ్యం.. ఓ సంచలన కావ్యం.. తెలంగాణ పోరాటానికి వేగుచుక్క..

-కె. ప్రభాకర్ తెలంగాణ టీచర్స్ ఫోరం కన్వీన
Namasete Telangana News Paper Dated 09/03/2012 

No comments:

Post a Comment