Share
నామా.పురుషోత్తం, కనకం సైదులు, ఖమ్మం Mon, 19 Mar 2012, IST
- పింఛన్ల రద్దుతో అర్ధాకలి
- సమస్యల పరిష్కారం కోసం
- 20న ఎన్‌పిఆర్‌డి చలో హైదరాబాద్
రాష్ట్రంలో వికలాంగులు దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు. వీరికి సంక్షేమ కార్యక్రమాలు అందడంలేదు. అర్హత ఉన్నా పింఛన్లు రావడం లేదు. ఉన్న వాటిలోనే లక్షా 40 వేల మంది పింఛన్లను ప్రభుత్వం రద్దు చేసింది. ఒక్క ఖమ్మం జిల్లాలోనే 8 వేల మంది నోటి కాడ కూడును ప్రభుత్వం లాగేసుకుంది. రాష్ట్ర జనాభాలో ఏడు శాతంగా ఉన్న వికలాంగుల సంక్షేమానికి ప్రభుత్వం తన బడ్జెట్‌లో కేవలం 66 కోట్లు మాత్రమే కేటాయించింది. వీటిని చూస్తుంటే ప్రభుత్వానికి వికలాంగులపై ఎంత వివక్ష ఉందో అర్థమవుతుంది. ఈనేపథ్యంలో ప్రజాశక్తి ఈ వారం ప్రత్యేక కథనం...
ఖమ్మం జిల్లాలో 70 వేలకు పైగా వికలాంగులు ఉన్నారు. వీరంతా దుర్భర జీవితాలను గడుపుతున్నారు. సమాజం చిన్నచూపు, ప్రభుత్వం నిర్లక్ష్యం ఫలితంగా వికలాంగలు మానసికంగా కుంగిపోతున్నారు. వీరికి లాభం కలిగించే చట్టాలు, సంక్షేమ పథకాలు అమలుకు నోచుకోవడం లేదు. మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా ప్రభుత్వం వికలాంగుల పింఛన్ల రద్దుకు పాల్పడుతోంది. జిల్లాలో 8 వేల మంది వికలాంగుల పింఛన్లు రద్దు చేసింది. దీంతో పూట గడవక అర్థాకలితో అలమటిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా రద్దు చేసిన పింఛన్లలో 70 శాతం మంది అర్హులని తేలింది. కానీ ఎనిమిది నెలల నుంచి పింఛన్ ఇవ్వ కుండా వికలాంగులు ఆకలిచావులకు గురయ్యేలా ప్రభుత్వం చేస్తోంది. కాకులను కొట్టి గద్దలకు వేసిన చందంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది. బడా పెట్టుబడి దారులకు, పారిశ్రామిక వేత్తలకు లక్షల కోట్ల రాయితీ ఇస్తూ నిరుపేద వికలాంగుల పింఛన్లు రద్దు చేసివారి నోటికాడి ముద్దను లాగేసుకుంటోంది.
బడ్జెట్‌లో తీవ్ర అన్యాయం
రాష్ట్ర బడ్జెట్‌లోనూ మరోసారి వికలాంగులకు తీవ్రమైన అన్యాయం జరిగింది. జనాభాలో 60 లక్షలు (ఏడు శాతం) ఉన్న వికలాంగులకు ఒక శాతం నిధులు కూడా దక్కలేదు. వికలాంగుల సంక్షేమానికి బడ్జెట్‌లో మూడు శాతం నిధులు కేటాయిస్తామని ప్రభుత్వం జిఓ నెం.1ని తీసుకొచ్చింది. కంచే చేను మేసినట్లుగా ప్రభుత్వమే వికలాంగుల బడ్జెట్‌కు గండికొట్టింది. మూడు శాతం ప్రకారం 1620 కోట్లు కేటాయించాలి. కాని కేవలం 66 కోట్లు కేటాయించింది. వికలాంగుల వివాహ ప్రోత్సాహ బహుమతి పది వేల నుంచి 50 వేల వరకు పెరిగినా అందుకు అనుగుణంగా కేటాయిం పులు జరప లేదు. ప్రతి ఏటా రెండు వేలకు పైగా వికలాం గులకు ఈ ప్రోత్సా హాన్ని అం దించాల్సి ఉంటుంది. దీనికి పది కోట్లు అవసరం ఉంది. ఇందుకు ప్రభుత్వం కేటా యిం చింది కేవలం కోటి రూపా యలే. ఎస్‌సి, ఎస్‌టిల వల్లే వికలాంగులకు కార్పొ రేషన్ సబ్సిడీ 30 వేలకు పెంచుతున్నట్లు నెల క్రితమే ముఖ్యమంత్రి గొప్పగా ప్రకటించారు. కానీ బడ్జెట్‌లో మాత్రం నిధులు కేటాయించలేదు. ప్రభుత్వం వికలాంగుల పథకాలను క్రమంగా అటకెక్కించే ప్రయత్నం చేస్తోంది. పెట్రోల్ సబ్సిడీ పథకానికి పైసా కూడా కేటాయించలేదు. వేలాది మంది వికలాంగులకు లబ్ధిపొందే సహాయ పరి కరాలకు సైతం 60 లక్షల కోత పెట్టి సిగ్గుమాలిన చర్యకు పూనుకుంది. ప్రతి వికలాంగ కుటుంబానికి అంత్యోదయ కార్డులు ఇవ్వాలని సుఫ్రీం కోర్టు చివాట్లు పెట్టినా వికలాంగులకు 35 కిలోల బియ్యం ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధ పడటం లేదు. బోగస్ ముసుగులో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా లక్షా 40 వేల పింఛన్లు రద్దు చేసిన ప్రభుత్వం మరో లక్ష వికలాంగుల పింఛన్ల రద్దుకు బడ్జెట్‌లో కోత విధించింది. పింఛన్లు రాక, ఉపాధి అవకాశాలు లేక అంగవైక్యలం ఉన్న వారు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
వికలాంగులపై దాడులు, హత్యలు...
వికలాంగులపై దాడులు, హత్యలు పెరిగిపోయాయి. ఆరు నెలల కాలంలోనే 357 ఘట నలు చోటు చేసుకున్నాయి. వీటిలో 8 అత్యాచారాలు, 12 హత్యలు ఉన్నాయని పేర్కొన్నారు. వికలాంగులు కేసులు పెట్టినా పట్టించుకోవటం లేదు. ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల గ్రామంలో వికలాంగురాలిపై సామూహిక అత్యాచారం చేసి గొంతు కోసి చంపారు. అనంతపురంలో ఆధార్‌కార్డుకు ఫొటో దిగేందుకు వెళ్లిన వికలాంగుడు భూస్వాముల ఎదుట కుర్చీలో కూర్చున్నాడనే కోపంతో దాడి చేసి హత్య చేశారు. ఖమ్మం జిల్లా వైరా మండలంలో భూ సమ స్యను పరిష్కరించాలని పోలీసు స్టేషన్‌కు వెళ్లిన వికలాంగుడుని సిఐ బూట్ కాళ్లతో తన్నాడు. ఇలా వికలాంగులపై దాడులు చేస్తున్నా వారిపై చర్యలు తీసుకోకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది.
20న చలో హైదరాబాద్ : ఎన్‌పిఆర్‌డి
ఈ పరిస్థితుల్లో రద్దు చేసిన వికలాంగుల పింఛన్లు పునరుద్ధరించాలని, పింఛను 1500 రూపాయలకు పెంచాలని, అంత్యోదయ కార్డులు, బడ్జెట్‌లోవాటా, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు తదితర డిమాండ్ల సాధనకు ఈ నెల 20న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్‌పిఆర్‌డి) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ పింఛన్ పోరుకు వికలాంగులు తరలి రావాలని ఎన్‌పిఆర్‌డి జిల్లా కమిటీ కోరుతోంది.
పుట్టకతోనే గుడ్డి - పింఛన్ లేదు : దేవత్ లక్ష్మి, రేవతి సెంటర్, ఖమ్మం
నాకు పుట్టక తోనే రెండు కళ్లు లేవు. అయినా పింఛన్ లేదు. ఇప్ప టికి లెక్కలేనన్ని సార్లు దర ఖాస్తు చేసుకున్నాను. డాక్టర్ సర్టిఫికెట్ 100 శాతం అని ఇచ్చారు. అధికారులు మాత్రం పట్టించుకోవటం లేదు. నా భర్త రిక్షా తొక్కి డబ్బులు తెస్తేనే కుటుంబం గడుస్తుంది. లేదంటే పస్తులు వుండాల్సి వస్తోంది. అధికారులు స్పందించి పింఛన్ ఇప్పించాలి.
సదరన్ క్యాంపులో పింఛన్ రద్దు చేశారు : బట్టు ఎల్లమ్మ, ఖమ్మం
మరుగుజ్జుగా పుట్టా ను. డాక్టర్ సర్టిఫికెట్ ఇస్తే పింఛన్ ఇచ్చారు. కంప్యూటర్ సర్టిఫికెట్లు ఇస్తామని చెప్పి తీసుకెళ్లారు. 8 నెలలుగా నాకు పింఛన్ ఇవ్వటం లేదు. అధికారులను అడిగితే రద్దు చేశారని చెప్పారు. ఇదెక్కడి న్యాయం. వస్తున్న పింఛన్ ఎందుకు ఆపారో తెలియటం లేదు. సంఘం ఆధ్వర్యంలో గొడవ చేస్తే ఇస్తామన్నారు. ఇవ్వడం లేదు.
8 నెలలుగా పింఛన్ ఆపేశారు : నాగమల్లి, సారధీనగర్
ప్రతి నెలా ఇస్తున్న పింఛన్‌ను 8 నెలలుగా ఆపేశారు. కంప్యూటర్ సర్టిఫికెట్ కావాలన్నారు. డాక్టర్ నుంచి తీసుకొచ్చార. 100 శాతం వికలాంగురాలినని సర్టిఫికెట్ ఇచ్చారు. తీరా ఇప్పుడు పింఛన్ అడిగితే పై నుంచి మీకు డబ్బులు ఇవ్వలేదు. వచ్చాక ఇస్తాం .. మమ్మల్ని ఏం చేయమంటావ్ అని అధికారులు బెదిరిస్తున్నారు. సదరన్ క్యాంపులు పెట్టి ఉన్న ఫించన్‌లను రద్దు చేయటం ఎంత వరకు సమంజసం.
ఇది దుర్మార్గ ప్రభుత్వం : టి.రాజేందర్, ఎన్‌పిఆర్‌డి ప్రధాన కార్యదర్శి
బోగస్ అంటూ రాష్ట్ర వ్యాప్తంగా 1.40 లక్షల మంది వికలాంగుల పింఛన్లను ప్రభుత్వం తొలగించింది. దీంతో వికలాంగులు రోడ్డున పడే పరిస్థితి దాపురించింది. వారిలో 52 వేల మంది సర్టిఫికెట్లను పరిశీలించకుండానే పింఛన్లను రద్దు చేశారు. పునఃపరిశీలనలో 94 వేల మంది అర్హులని తేలింది. అయినా 8 నెలల నుంచి పింఛన్లను మంజూరు చేయకుండా ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. పింఛన్లు రద్దు కావడంతో నలుగురు వికలాంగులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ప్రస్తుతం జరగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో వికలాంగుల సమస్యలు చర్చించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 20న చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. దీనికి ప్రతి ఊరు నుండి పెద్ద ఎత్తున వికలాంగులు కదలి రావాలని ఎన్‌పిఆర్‌డి కోరుతోంది.
పింఛన్లు, బడ్జెట్‌లో వాటా కోసం ఉద్యమిస్తాం : షేక్ అంకుష్, ఎన్‌పిఆర్‌డి జిల్లా ప్రధాన కార్యదర్శి, ఖమ్మం
రద్దు చేసిన వికలాంగుల పింఛన్లను పునరుద్ధరించాలని, రూ.500 నుండి రూ.1500లకు పెంచాలని , వికలాంగుల కుటంబానికి అంత్యోదయ కార్డులు ఇవ్వాలని, బడ్జెట్‌లో రూ.1620 కోట్లు వాటా కోసం ఉద్యమిస్తాం. స్థానిక సంస్థల్లో వికలాంగులకు రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 20న చలో హైదరాబాద్ కార్యక్రమం తలపెట్టాం. జిల్లాలో రద్దు చేసిన పింఛన్లలో 70 శాతం పైగా అర్హులని తేలినా 8 నెలల నుంచి ఇవ్వడం లేదు. వెంటేనే ఇవ్వాలి. లేకుంటో సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేస్తాం. ఖాళీగా ఉన్న వికలాంగుల బ్యాక్‌లాగ్ పోస్టులను భర్తీ చేయాలి.
డిమాండ్లు :
* రద్దు చేసిన వికలాంగుల పింఛన్లు వెంటనే పునరుద్ధరించాలి.
* దరఖాస్తు చేసుకున్న వికలాంగులం దరికీ పింఛన్ మంజూరు చేయాలి.
* పింఛన్ రూ.500 నుండి 1500 రూపాయలకు పెంచాలి.
* స్థానిక సంస్థల్లో మూడు శాతం రిజర్వేషన్ కల్పించాలి.
* బడ్జెట్‌లో మూడు శాతం వాటా ప్రకారం 1620 కోట్లు కేటాయించాలి
* వికలాంగ వైకల్య శాతాన్ని 40 నుంచి 30 శాతానికి తగ్గించాలి.
* ప్రతి వికలాంగ కుటుంబానికి అంత్యోదయ కార్డు ఇవ్వాలి.
* వికలాంగులందరికీ సదరం సర్టిఫికెట్లు వెంటనే ఇవ్వాలి.
* జిఓ నెర.106 ప్రకారం వికలాంగులకు ఇళ్లస్థలం కేటాయించి ఇల్లు నిర్మించి ఇవ్వాలి.
* వికలాంగుల కార్పొరేషన్ ఉద్యోగు లకు ఉద్యోగ భద్రత కల్పించాలి.
* మండల కేంద్రాల్లో వికలాంగులకు సహాయ పరికరాలను అంద జేయాలి.
* జిల్లాలో ఖాళీగా ఉన్న వికలాంగుల బ్యాక్‌లాగ్ ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలి.
Prajashakti News Paper Dated : 19/03/2012
No comments:
Post a Comment