Wednesday, March 7, 2012

అనాగరికతకు ఆనవాళ్లు - సుజాత గొట్టిపాటి



'ఎక్కడైతే మనసు నిర్భయంగా సంచరిస్తుందో, ఎక్కడైతే శిరస్సును సమున్నతంగా నిలపగలుగుతామో, ఎక్కడైతే ప్రపంచం సంకుచితమైన గోడల మధ్య ముక్కలైపోకుండా ఉంటుందో' అని విశ్వకవి రవీంద్రనాథ్ టాగూర్ కలలు కని శతాబ్దం దాటిపోయింది. 'మనుషులందరూ సమానంగా పుట్టారు. ఆ పుట్టుకతోనే ఎవరూ తీసుకోలేని హక్కులు వారి సొంతమయ్యాయి. 

జీవించే హక్కు, స్వేచ్ఛగా, సంతోషంగా ఉండే హక్కు అందులో ముఖ్యమైనవి. ఈ పరమసత్యాలకు వేరే రుజువులు అక్కర్లేదు' అని అమెరికా జాతిపిత థామస్ జెఫర్సన్ 1776లో అమెరికా స్వాతంత్య్ర ప్రకటన సందర్భంగా సగర్వంగా ప్రకటించి రెండున్నర శతాబ్దాలు కావస్తోంది. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అంటూ దాదాపు అదే కాలంలో ఫ్రెంచ్ విప్లవం నినదించింది. శతాబ్దం క్రితం ప్రపంచాన్ని వెల్లువలా చుట్టుముట్టిన సామ్యవాదం సమానత్వ విలువలను, ప్రత్యేకించి స్త్రీ, పురుష సమానత్వాన్ని పిడికిలెత్తి చాటింది. 

అయినా ఇప్పటికీ స్త్రీలకు స్వేచ్ఛ, సమానత్వం అందుబాటులోకి రాలేదు. కనీస మానవహక్కులు, ప్రాథమిక హక్కులు లేవు. తనకు నచ్చిన భాగస్వామిని పెళ్లి చేసుకోవాలనుకున్నందుకు, జీవితం పంచుకుంటున్నందుకు, తనకు నచ్చిన డ్రెస్ వేసుకున్నందుకు, తనకు నచ్చిన జీవన శైలిని ఎంచుకున్నందుకు, సంకుచితమైన, మూఢమైన, మధ్యయుగాల నాటి కుల, మత అలవాట్లు పాటించనందుకు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మహిళలు అత్యంత దారుణంగా, పాశవికంగా హతులవుతున్నారు. ప్రపంచంలో ఏదో ఒక చోట ప్రతి ఐదు నిమిషాలకొక 'పరువు హత్య' జరుగుతోంది. ఈ పరువు హత్యలు పరాయివాళ్లు చేస్తున్నవి కాదు. ప్రేమతో గుండెల్లో దాచుకోవాల్సిన సొంత కుటుంబ సభ్యులైన తండ్రులు, అన్నలు, భర్తలే కూతుళ్లను, చెల్లెళ్లను, భార్యలను కృత్రిమమైన పరువు పేరుతో పాశవికంగా తుద ముట్టించడం విషాదం. 

జార్ఖండ్‌కు చెంది, న్యూఢిల్లీలో జర్నలిస్టుగా ఉన్నత స్థానంలో ఉన్న నిరుపమా పాఠఖ్ తక్కువ కులం వాడిని పెళ్లి చేసుకున్నందుకు పుట్టింట్లోనే శవమైంది. బీహార్‌లోని దర్భాంగా జిల్లాలో జయ అనే బ్రాహ్మణ యువతి దళితుడిని ప్రేమించినందుకు, తల్లితండ్రులు ఆమెను బండిపోట్లకు అప్పగించారు; వారు ఆ యువతిపై అత్యాచారం జరిపి, చంపి నదిలో పడేశారు. సినిమా హీరోయిన్ నిషా కొఠారి తనకు నచ్చిన నేవీ ఆఫీసర్‌ను పెళ్లిచేసుకున్నందుకు ఇంట్లోంచి గెంటేశారు. ఇదే కారణంపై భోజ్‌పూర్‌లో ఇమ్రానా అనే 16 ఏళ్ల బాలికను ఇంట్లో సజీవదహనం చేశారు. 

గుజరాత్‌లో 19 ఏళ్ల వందన తనకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నందుకు తండ్రి రివాల్వర్‌తో కాల్చి, ఆ తర్వాత గొడ్డలితో తల నరికాడు. చండీగఢ్‌లో ఒకే గోత్రానికి చెందిన మనోజ్, బాబ్లీ పెళ్లి చేసుకున్నందుకు వారిని కిడ్నాప్ చేసి హతమార్చారు. పంజాబ్‌లో గుర్లీన్ కౌర్, ఉత్తరప్రదేశ్‌లో 18 ఏళ్ల రజని సాహు తమ జీవిత భాగస్వాములను ఎంచుకున్నందుకు హతమయ్యారు. 

మన రాష్ట్రంలో మహబూబ్ నగర్ జిల్లా అమ్రాబాద్ మండలంలో పద్మ అనే బాలిక దళిత యువకుడిని ప్రేమించినందుకు తండ్రి బలవంతంగా నోట్లో పురుగుల మందు పోసి చంపాడు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలంలో ఇదే కారణంపై లల్లీ కుఠియాను తండ్రి గొంతు నులిమి చంపేశాడు. మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలంలో దళితుడిని పెళ్లి చేసుకుని గర్భం దాల్చిన మాధవిని కుటుంబ సభ్యులే రాయితో తల పగలగొట్టి చంపేసి, పెట్రోలు పోసి తగులబెట్టారు. 

మన దేశంలో దక్షిణాది రాష్ట్రాలలో కంటే ఉత్తరాది రాష్ట్రాలలోనే ఎక్కువగా పరువు హత్యలు జరుగుతున్నాయి. హర్యానా జాట్‌లలో 'ఖాప్ పంచాయితీల' పేరిట కుల పెద్దలు కూర్చుని కులం కట్టుబాట్లు దాటిన తమ ఇళ్ల ఆడపిల్లలను హతమార్చాలని తీర్పులిస్తుంటారు. వాటిని కుటుంబ సభ్యులు అమలు చేస్తుంటారు. ఈ 'ఖాప్ పంచాయితీ'లు ఎంత అనాగరికంగా ఉంటాయంటే ఆడపిల్లలు జీన్స్ వేసుకోరాదని ఫత్వాలు కూడా జారీ చేస్తాయి. 

రాజ్‌పుట్‌లలో కూడా పరువు హత్యలు ఎక్కువే. తమిళనాడులో 'కట్టా పంచాయితీలు' ఇటువంటి దారుణాలే చేస్తున్నాయి. తిరుచ్చి జిల్లాలో వేధిస్తున్న భర్త దగ్గరకు వెళ్లనందుకు ఒక భార్యకు 50 వేల రూపాయల జరిమానా విధించింది 'కట్టా పంచాయితీ'. బీహార్‌లో భర్త వేధింపులు భరించలేక విడాకులిస్తే, అదే భర్తను మళ్ళీ పెళ్లి చేసుకోవాలని పెద్దల పంచాయితీ ఆదేశమిచ్చింది. ఈ ఆదేశాన్ని ధిక్కరించినందుకు ఆమెను వివస్త్రను చేసి కొరడాలతో కొట్టారు. మన దేశంలో ప్రతి ఏటా వేలాది పరువు హత్యలు జరుగుతున్నాయి. 

మన పొరుగునే ఉన్న పాకిస్థాన్‌లో మహిళల పరిస్థితి మరీ అధ్వాన్నం. అక్కడి మహిళల జీవితాలను మత ఛాందసవాదం నరకప్రాయం చేస్తోంది. 'కరో-కరి' పేరిట పరువు హత్యలు అక్కడ సర్వ సాధారణం. పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకోనందుకు ముగ్గురు టీనేజీ బాలికలను సజీవంగా పాతి పెట్టారు. పాకిస్థాన్‌లో ఏటా పదివేల మందికి పైగా మహిళలు పరువు హత్యలకు అంతమైపోతున్నారని అక్కడి మానవ హక్కుల సంఘాల అంచనా. అత్యాచారాలకు గురయిన మహిళలు నలుగురు పురుష సాక్షులను తెచ్చుకోవాలట! 

రేప్ చేసిన వారు నిర్లజ్జగా తిరుగుతుండగా, రేప్‌కి గురయినందుకు మహిళలు, బాలికలను పరువుపోయిందని చంపివేయటం సాధారణ విషయం. బంగ్లాదేశ్‌లో కూడా పరువు హత్యలు జరుగుతున్నాయి. మాల్దీవులలో ఎవరైనా మహిళలకు వివాహేతర సంబంధాలు ఉంటే, వారిని అత్యంత పాశవికంగా బజారులో నిలబెట్టి కొరడాలతో కొడ్తారు. మళ్లీ పురుషులకు అదేమీ సమస్య కాదు. ఈ అనాగరికమైన అలవాటుకు స్వస్తి చెప్పాలని ఐక్యరాజ్యసమితి మానవహక్కుల కమిషనర్ కోరినందుకు మాల్దీవులలోని సమితి కార్యాలయం ముందు మత ఛాందసవాదులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. 

అఫ్ఘానిస్తాన్, ఈజిప్ట్, జోర్డాన్, ఇరాన్, ఇరాక్, టర్కీ, యెమెన్, సౌదీ అరేబియా తదితర ఇస్లామిక్ దేశాలలో వేలాది పరువు హత్యలు జరుగుతున్నాయి. యూరప్, బ్రిటన్, అమెరికా, కెనడా వంటి పాశ్చాత్య దేశాల్లో వ్యక్తిగత స్వేచ్ఛ, స్వాతంత్య్రం, మానవహక్కులు, స్త్రీ పురుష సమానత్వం మొదలైన విలువలను న్యాయ వ్యవస్థ, చట్టాలు, ప్రభుత్వం మీడియా మొదలైన అన్ని వ్యవస్థలూ అంగీకరించాయి. 

అయినా ఆ దేశాలలో కూడా పరువు హత్యలు జరుగుతున్నాయి. అయితే ఈ హత్యలు ఆయా దేశ ప్రజల్లో కాక పాకిస్థాన్, బంగ్లాదేశ్, అప్ఘాన్, టర్కీ, ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియా మొదలైన దేశాలనుంచి వలస వెళ్లిన ముస్లిం కుటుంబాలలోనే జరుగుతున్నాయని గణాంకాలు చెప్తున్నాయి. కెనడాలో ఇటీవల ముగ్గురు బాలికల, ఒక మహిళ హత్యలు పెను సంచలనం కలిగించాయి. అప్ఘాన్ నుంచి వెళ్లిన మహమ్మద్ షఫియా తన కుమారుడితో కలిసి తన ముగ్గురు (19, 17, 13 సంవత్సరాల) కుమార్తెలను (మగ స్నేహితులు ఉన్నందుకు), తన మొదటి భార్య రోనా (పిల్లల్ని కనకుండా వృధాగా ఉన్నందుకు)ను కారులో తీసుకెళ్లి కాలువలోకి దొర్లించి రాక్షసంగా హతమార్చాడు. 

ఈ సంఘటనతో కెనడా ఉలిక్కి పడింది. కెనడాకు వచ్చి స్థిరపడిన యువతులందరికీ కెనడా మహిళల మాదిరిగా భావ స్వేచ్ఛ, వ్యక్తిగత స్వేచ్ఛ, మానవహక్కులు ఉంటాయని, మధ్యయుగాల నాటి 'పరువు హ త్యల' తరహా ఆటవిక చర్యలకు అక్కడ చోటు లేదని కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసధికారి ప్రకటించారు. మీడియాలో, మానవహక్కుల సంఘాల సమావేశాల్లో ఈ 'పరువు హత్యల' గురించి చర్చలు ప్రారంభం కాగానే, మత ఛాందసవాదులు 'ఈ చర్చలన్నీ తమ మతంపై జరుగుతున్న దాడి' అంటూ గొడవ ప్రారంభించారు. 

రెండు దశాబ్దాలుగా యూరప్, బ్రిటన్, అమెరికా, కెనడా తదితర దేశాలకు భారత్, పాకిస్థాన్, గల్ఫ్ రాజ్యాలు, ఇతర ఇస్లామిక్ దేశాల నుంచి వలసలు బాగా పెరిగాయి. మత మౌఢ్యం, కులం కట్టుబాట్లు, స్త్రీ-పురుష అసమానతలు వంటి అవలక్షణాల వల్ల వలస ప్రజల్లో పెద్ద సంఖ్యలో పరువు హత్యలు జరగటం, వాటిని అక్కడి మీడియా బాగా వెలుగులోకి తేవటంతో ఐక్యరాజ్యసమితి కూడా ఈ సమస్యను గుర్తించింది. పరువు హత్యలను అంతమొందించడానికి ఐరాస ప్రత్యేక ప్రాధాన్యమిస్తోంది. 

భారతదేశంలో కూడా ఉన్న చట్టాలకు పదును పెట్టడం ద్వారా, కఠినమైన కొత్త చట్టాల్ని తీసుకునిరావటం ద్వారా పరువు హత్యలకు అడ్డుకట్ట వేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందుకోసం ముసాయిదా బిల్లును రూపొందించడానికి ఒక మంత్రుల బృందాన్ని నియమించింది. 'ప్రాణానికి, స్వేచ్ఛకు ప్రమాదం (రక్షణ, ప్రాసిక్యూషన్, ఇతర చర్యలు) చట్టం-2011' పేరిట లా కమిషన్ కూడా గత జూన్‌లో ఒక ముసాయిదా బిల్లును రూపొందించింది. ఐపిసి సెక్షన్ 300లో మార్పులు చేయటం కాక, పరువు హత్యలకు విడిగా చట్టం ఉండాలని లా కమిషన్ కోరుకుంటోంది. 

పరువు పేరిట జరుగుతున్న 'పరువు హత్య'లే కుటుంబానికి, సమాజానికి, దేశానికి పరువు పోగొడతాయని, వీటిని ఎట్టి పరిస్థితులలో అడ్డుకుంటామని కేంద్ర హోం మంత్రి చిదంబరం గట్టిగా చెప్తున్నారు. 'ఖాప్ పంచాయితీలు' చేస్తున్న అరాచకాలపై అజయ్ సిన్హా గత ఏడాది 'ఖాప్-పరువు హత్య కథ' అనే సినిమా తీశారు. ఐదుగురు జాట్ యువకులు పరువు పేరిట జరిగే అరాచకాలపై చేస్తున్న పోరాటంపై నకుల్ అనే యువ దర్శకుడు ఒక డాక్యుమెంటరీ తీశారు. పరువు హత్యలపై సంజయ్ సచ్‌దేవా అనే వ్యక్తి 24 గంటల హెల్ప్‌లైన్‌ను ప్రారంభించారు. 

ఎవరెన్ని చర్యలు తీసుకున్నప్పటికీ, చట్టాలు తెచ్చినప్పటికీ, సంకుచితమైన మతఛాందసవాదం, కుల మౌఢ్యం, కులాల్లోని అసమానతలు, కట్టుబాట్లు స్త్రీ పురుష అసమానతలను తొలగించటానికి, అవగాహన కలిగించడానికి పూనుకోనిదే పరువు హత్యలకు అంతం ఉండదు. జీవిత భాగస్వామిని ఎంచుకోవటం అనేది ఆడ అయినా, మగ అయినా ప్రతి వ్యక్తికి ఉండే ప్రాథమిక హక్కు. రాజ్యాంగంలో అందరూ సమానమని చెప్పినంత మాత్రాన సరిపోదు. ఎక్కడైతే స్త్రీకి ఒక వ్యక్తిగా దక్కవలసిన మానవ హక్కులు, స్వేచ్ఛ, స్వాతంత్య్రం లభించవో అక్కడ అన్ని రకాల దారుణాలు జరుగుతుంటాయి. 

అనేక పరువు హత్యలను వంటగది ప్రమాదాలుగా, ఆత్మహత్యలుగా, సహజ మరణాలుగా చిత్రీకరిస్తున్నారు. వేలాది పరువు హత్యలు అసలు బయటకి రావటం లేదు. చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవటంతో పాటు, మానవ హక్కులు, వ్యక్తి స్వేచ్ఛ వంటివి స్త్రీలకు కూడా ఉంటాయని, బలహీనతలు పురుషుడికైనా, స్త్రీకైనా ఉంటాయని గుర్తించాలి; స్త్రీ అంటే పిల్లలను కనే, ఇంటి పనులు చేసిపెట్టే యంత్రం కాదని, స్త్రీ పురుషులు ఏ మినహాయింపులు లేకుండా అన్ని విధాలుగా సమానమేనని, ఇద్దరికీ ఒకే న్యాయం, ధర్మం వర్తిస్తాయనే కనీస నాగరికతను బాల్యం నుంచి నేర్పినప్పుడే ఈ పాశవిక చర్యలకు ముగింపు పలకగలం. 

- సుజాత గొట్టిపాటి
(నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా)
Andhra Jyothi News Paper Dated 08/03/2012 

No comments:

Post a Comment