Tuesday, March 27, 2012

పాలమూరు నేర్పిన పాఠం - సుజాత సూరేపల్లి


ఇటీవలి ఉప ఎన్నికల్లో ఆదిలాబాద్, కామారెడ్డి, స్టేషన్ ఘనపూర్, నాగర్‌కర్నూ ల్, మహబూబ్‌నగర్‌లలో తెలంగాణ వాదమే గెలిచిందని టిడిపి, కాంగ్రెసు ఖంగు తిన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. బిజెపి, టిఆర్ఎస్ శ్రేణులు కూడా అదే విషయం చెప్పాయి. అన్ని చోట్ల గెలిచింది తెలంగాణ వాదమే కావొచ్చు, కాని మహబూబ్‌నగర్ సీటు మాత్రం చాలా చర్చనీయాంశమైంది. ఒక రకంగా చర్చ బిజె పి తెలంగాణవాదం గెలిచిందా, టిఆర్ఎస్ తెలంగాణ వాదం గెలిచిందా అనే దాకా వచ్చింది. ఎన్ని సీట్లు వచ్చాయి, ఎన్ని పోయాయి అనేది పక్కనబెడితే ఇప్పుడు తెలంగాణలో రెండు వాదాలున్నట్లు స్పష్టంగా ఒప్పుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. 

నిన్నటిదాకా కనపడకుండాపోయిన బిజెపికి తెలంగాణ ఒక వరం లాగా దొరికింది. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ మేము అధికారంలోకొస్తే తెలంగాణ ఇస్తామని, మేము మాత్రమే ఇస్తామని చెప్పుకుంటూ ప్రచారం చేసుకున్నారు. మహబూబ్‌నగర్‌లో కె.రాంరెడ్డి హఠాన్మరణంతో అక్కడ ఉప ఎన్నికలో ఎవరు నిలబడాలన్న సమస్య మొదలయింది. అది సెంటిమెంట్ కాదు కాబట్టి మేము నిలబడతామని బిజెపి పట్టుబట్టింది. 'మేము అభ్యర్థిని నిలబెట్టాక నువ్వెలా నిలబడతావ్?'అని టిఆర్ఎస్, బిజెపి బహిరంగంగానే వాదులాడుకున్నాయి. నువ్వు నేను భాయ్, భాయ్ అనుకునే టీఆర్ఎస్, బిజెపి ఎడముఖం పెడముఖం అయ్యాయి; ఈ ఎన్నికల్లో తెలంగాణ వాదానికి చిరునామాగా ఇంతకాలం కొనసాగిన టిఆర్ఎస్ నిర్మాణంలోని బలహీనతలు బయటపడ్డాయి. 

కెసిఆర్ ఒంటెద్దు పోకడకి బిజెపి మాత్రమే చెక్ పెట్టగలదని, ఇట్లా చేయడమే సబబు అని యెన్నం శ్రీనివాస్‌రెడ్డి (పోటీ అభ్యర్థి) తరఫు వాళ్లు వాదించారు. లేక లేక ఒక ముస్లిం అభ్యర్థిని టిఆర్ఎస్ నిలబెట్టింది, మహబూబ్‌నగర్‌లో కనీసం 40,000 ముస్లిం ఓట్లు ఉంటా యి కాబట్టి అక్కడ ముస్లిం అభ్యర్థిని నిలబెట్టడమే సబబని టీఆర్ ఎస్ నాయకులు వాదించారు. ప్రచారంలో కిషన్‌రెడ్డి, యెన్నం తదితరులు టిఆర్ఎస్‌ని నానా మాటలు అన్నారు. ముస్లింలపై చేయరాని దుష్ప్రచారం చేశారు. ప్రతిచోట టీఆర్ఎస్ గెలిచి మహబూబ్‌నగర్‌లో మాత్రం ఓడిపోవడానికి కారణమేమిటి? బిజెపి బలం ఒక్కసారిగా ఎక్కువైందా? ఉప ఎన్నికల ప్రకటనకు ఒక్కరోజు ముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి జంప్ చేసి బిజెపిలో చేరిన అభ్యర్థి గొప్పతనమా? ఆ విషయాలు పక్కనబెడితే తెలంగాణ భిన్న అస్తిత్వ ప్రజల వైరుధ్యాలు స్పష్టమౌతాయి. 

తెలంగాణలో ఉన్న అసమ సమాజం, అంబేద్కర్ చెప్పిన నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ, మైనారిటీల పట్ల ప్రధాన రాజకీయ పార్టీల దృక్పథంతో ఆలోచించినా మహబూబ్‌నగర్ ఎన్నికలు కొత్త సమస్యకు తెరలేపాయి. ఈ ఎన్నికల ప్రహసనంలో ముస్లింల మనోభావాలు విపరీతంగా దెబ్బతిన్నాయి. హక్కులు, సమానత్వం, రాజకీయాలు మాట్లాడే వారికి రాబోయే తెలంగాణలో రాజకీయ పార్టీల నిజస్వరూపం ఆవిష్కృతమైంది. దానిని వివిధ కోణాల నుంచి ప్రజలు చూస్తున్నారు. కలవర పడుతున్నారు. నిజంగా టిఆర్ఎస్‌కు ముస్లిం అభ్యర్థిని గెలిపించే ఉద్దేశముంటే, అన్ని భాగస్వామ్య సంస్థలతోటి చర్చించి, మైనారిటీలకు సరైన అవకాశం కల్పించే అంశం ముందుపెట్టి, ఒప్పించిన తరువాత బరిలోకి దిగి ఉండాల్సింది. 

సరే, అయిందేదో అయింది, అభ్యర్థుల పేర్లు ఖరారయ్యాక ప్రత్యర్థి- ఒక పెద్ద జాతీయ పార్టీకి చెందిన అభ్యర్థి, అందునా ఉన్నత వర్గం, డబ్బు, పలుకుబడి ఉన్నవాడు కాబట్టి మరింత కృషి చేసి మైనారిటీ అభ్యర్థిని గెలిపించాల్సిన బాధ్యత ఎంతో ఉంది. అయితే జాక్ కాని, టిఆర్ఎస్ కాని, కెసిఆర్ కాని ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నట్టు కనబడదు. పైగా తెలంగాణలోని సకల సమస్యలకు జవాబులిచ్చే సిద్ధాంతకర్తలు కొందరు ఇద్దరూ తెలంగాణ వాళ్ళే అని మధ్యే మార్గం, గాంధీ మార్గం లాగా ఉండాలని చెప్పారు. స్వతంత్ర సంస్థలు కొన్ని కరపత్రాలు వేసి రెండింటికీ సమానంగా ప్రచారం చేసామని చెప్పుకోవడం ఇంకా విచిత్రం! 

ఇద్దరు అసమానుల మధ్య పోటీ జరిగినప్పుడు ఎవరికి ఎక్కువ ప్రచారం చేయాలి? అసలు ఇద్దరికీ ప్రచారం చేస్తే ఎవరు గెలవాలని అర్థం? ముస్లింలు తెలంగాణకి వ్యతిరేకమని ప్రచారం చేసే సంస్థలకి చెంపపెట్టుగా తెలంగాణకు మేము సైతం అంటూ ముందు నిలబడ్డ ముస్లిం సోదరులని అక్కున చేర్చుకుని, మానసికంగా వారికి «ధైర్యాన్ని కల్పించాల్సింది పోయి కేవలం తెలంగాణ వాదాన్ని అడ్డం పెట్టుకొని గెలుస్తారులే అన్న వైఖరి దేనికి సంకేతం? కావాలని వాళ్ళని పక్కన పెట్టడమే కాదా? ఒకవేళ బిజెపి గెలిస్తే తెలంగాణ వాదం గెలిచింది అని (రెడ్డి గారు గెలిచారు అంటే బాగోదేమో) ఒక్క ముక్కతో తేలిస్తే రాత్రింబవళ్ళు కష్టపడిన వాళ్ళు ఊరుకుంటారా? అదంతా ఉత్తుత్తి ప్రయత్నమే అంటే న్యాయమేనా? బిజెపికొక్క సీటు లేకపోతే వచ్చే నష్టం ఏమిటి? గెలిస్తే వచ్చే లాభం ఏమిటి? ఉన్నకాస్త మంచి పేరుని కూడా ముస్లింలకు వ్యతిరేకులు అని ముద్ర వేసుకుంది కదా. 

అసలు కేసిఆర్ కానీ, జాక్ కానీ ఎన్నిసార్లు ఇబ్రహీం తరపున ప్రచా రం చేశారు? ఈటెల రాజేందర్, కవితకి మహబూబ్‌నగర్ బాధ్యత అప్పగిస్తే, వాళ్ళు నిజాయితీగా ప్రచారం చేస్తే వోట్లు కుప్పలు పడాలి కదా? కేవలం ముఖస్తుతి కోసమో, మొహమాటానికో ముసుగు వేసుకొని రాజకీయాలు నడిపారని, మమ్మల్ని ఇంకా కూరలో కరివేపాకులా వాడుకుంటున్నారు అని ఇబ్రహీంతో పాటూ, ముస్లిం సంఘా లూ, హక్కుల నాయకులూ, ప్రజాస్వామికవాదులూ ఆరోపించడం లో తప్పేముంది? 

కులం లేదని, తెలంగాణ వాదమే ఉందని అనడం చాలా సులభం. ఇక్కడ కులం, మతం, మహిళలు అన్నీ కలిపితేనే తెలంగాణ. కేవలం తెలంగాణ వాదాన్ని ముందుపెట్టి ఒక వర్గం కాని, కులం కాని ముందుండి రాజకీయాలు చేస్తామంటే ఇంకా ఇక్కడి ప్రజలు ఊరుకోరు. ఏ ఫలితాలు ఆలోచించకుండా ఎన్నో ప్రాణత్యాగాలు చేసి, భూములు, ఆస్తులు కోల్పోయి తెలంగాణ కోసం సర్వస్వం అర్పించిన వారందరూ అణచివేయబడిన వర్గాల వారే అన్న విషయం మరవొద్దు. 700 మంది ఆత్మ బలిదానం చేసిన ఈ ఉద్యమాన్ని ఏ ఒక్క కులానికో, మతానికో, వర్గానికో తాకట్టు పెట్టాలనుకునేవాళ్లకు తెలంగాణ ప్రజలు బుద్ధి చెబుతారు. 

సామాజిక న్యాయం ప్రాతిపదిక మీద ఎన్నికలు, వనరులు, అధికారం పంపకాలు జరగకపోతే తెలంగాణ రాష్ట్రం మరింత ఆలస్యం అవడం ఖాయం. ప్రజలు గొంతెమ్మ కోరికలు కోరడం లేదు, న్యాయం అడుగుతున్నారు. తెలంగాణ డిమాండ్ ఎంత న్యాయమో, ఇక్కడ ఉన్న వెనుకబడిన వర్గాల వారు పైకి రావడం అంతే న్యాయం. 'ఒకటి తరువాత ఒకటి' అనడం ఇంకా నడవదు. 'ఒకటితో ఇంకొకటి' అని ప్రత్యేక రాష్ట్ర పోరులో భాగంగా మహిళ, దళిత, గిరిజన, బహుజన, మైనారిటీపై జరుగుతున్న దోపిడీని అరికట్టే ఉద్యమం ఇప్పుడు అవసరం. గిరిజనుల పట్ల నిజాయితీని విగ్రహాలు కట్టి కాదు, వందలాది కోయగ్రామాలను స్మశానంగా మార్చే పోలవరం ప్రాజెక్టును ఆపడంలో చూపాలి. 

మారుమూల గ్రామాల్లోకి చొచ్చుకొచ్చి భూములను కౌలుకు తీసుకుంటున్న సమైక్యాంధ్రులను అడ్డుకోవడంలో చూపాలి. మైనారిటీలపై దుష్రచారంతో గెలిచే గెలుపుల్ని ఆపాలి. ఒక బందు ఒక విందు లాంటి తంతులా సాంస్కృతిక ఉపన్యాసాలు కాక మన భాషా సంస్కృతులపై నిరంతరం సాగుతున్న సినిమా, పత్రిక, టీవీ వ్యాపారానికి చెక్కు పెట్టాలి. ఎవరికో టిక్కెటిచ్చామని చెప్పడం కాక గెలిపించుకోవడంలో నిజాయితీ చూపాలి. ఇప్పటికైనా ఓటు సీటే తెలంగాణ అంటే, ఓట్లు, సీట్ల ఎత్తులు జిత్తులే తెలంగాణ వాదం అంటే వినేందుకు జనం సంతృప్తిగా లేరు. 

ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ఒక మైనారిటీ, అందులో మనం పోటీ చేసేది ఇంకా మైనారిటీ, అందులో మనకొచ్చే ఓట్లు మైనారిటీ. ఈ లెక్కలు బాగాలేవు. వీటికి సంబంధించిన ముహూర్తాలు ఇంకా బాలేవు. వాటికయ్యే యగ్నాలు ఇంకా లాభం లేదు. నిరంతరం ఉద్యమం ఏదైనా ఉందా, అన్ని అణిచివేయబడ్డ వర్గాలతో ఐడెంటిఫై చేసుకొనే తెలంగాణ వాదం ఏదైనా ఉందా, నిత్య జీవితంలో ఆచరించగల తెలంగాణ జీవన వాదం ఏదైనా ఉందా అంటున్నారు న్యాయం అందని అన్ని శ్రేణులు. దీన్ని మరిచిపోతే మళ్లీ ఎన్నికల్లో ఇవే ప్రశ్నలొస్తాయి. 

- సుజాత సూరేపల్లి
Andhra Jyothi News Paper Dated : 27/03/2012 

No comments:

Post a Comment