Thursday, March 8, 2012

మార్చి 8 మహిళ ఉద్యమాలకు దిక్చూచి----కె. స్వరూపరాణి



నేడు నూట రెండవ అంతర్జాతీయ మహిళా దినోత్సవం. మహిళా దినోత్సవాలెన్ని జరుపుకున్నా ఆకాశంలో సగ భాగంగా ఉన్న మహిళల స్థితిగతుల్లో ఆశించిన మార్పు రాలేదు. అసమానత, అణచివేత, దోపిడీ అంతంకాలేదు. గత రెండు దశాబ్దాలుగా పాలకులు అనుసరిస్తున్న నయా ఉదారవాద విధానాలు, పెంచిపోషిస్తున్న వినిమయ, వినోద సంస్కృతి మహిళలను కడగండ్లపాల్జేస్తున్నాయి. సామాజిక, ఆర్థిక పరంగా మహిళలపై దాడులకు ఆజ్యం పోస్తున్నాయి. ఈ విధంగా స్త్రీ అస్తిత్వానికే ఇవి సవాల్‌గా పరిణమించాయి. సామ్రాజ్యవాదం, పెట్టుబడిదారీ విధానం, మత ఛాందసవాదం సాగిస్తున్న ఈ ముప్పేట దాడికి ప్రతిఘటన కూడా పెరుగుతున్నది. ప్రపంచ వ్యాప్తంగా స్త్రీలు తమ అస్థిత్వం కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. మహిళా దినోత్సవం నాడు దోపిడీ, అణచివేత, హింస, అసమానతల నుండి విముక్తి కోసం శ్రామిక మహిళలు పోరాడి రక్తతర్పణ చేసిన చారిత్రాత్మక రోజు అయిన ఈ మహిళా దినోత్సవాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ ఉద్యమాలను మరింత ఉధృతం చేయాల్సిన అవసరముంది.
చైతన్యాగ్ని రగిలిన వేళ...
1845లో అమెరికా రెడీిమేడ్‌ దుస్తుల ఫ్యాక్టరీలలో పనిగంటల తగ్గింపు, వారానికి ఒకరోజు సెలవు కావాలని కోరుతూ ఐదు వేలమంది మహిళా కార్మికులు చేసిన సమ్మె ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించడమే కాదు, మహిళల్లో నిద్రాణంగా ఉన్న చైతన్యాన్ని ఒక్కసారిగా రగుల్కొలిపింది. మహిళల సమస్యలను ఎజెండాపైకి తీసుకొచ్చింది. అనేక ఉద్యమాలకు ఊపిరిలూదింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి స్ఫూర్తినిచ్చిన ఈ మహత్తర ఘటన 1857 మార్చి-8 న్యూయార్క్‌ నగరంలో చోటుచేసుకుంది. బట్టల మిల్లులో పనిచేసే మహిళలు పని ప్రదేశాలలో మెరుగైన సౌకర్యాలు కల్పించాలని, 18 గంటల పని తగ్గించాలని, వేతనాలు పెంచాలని, అమానవీయ పద్ధతులకు స్వస్తిపలకాలని, ఓటుహక్కు కల్పించాలని కోరుతూ వేలాది శ్రామిక మహిళలు సంవత్సర కాలంపాటు సమ్మె చేశారు.
సమ్మె చేస్తున్న మహిళా కార్మికులను నిర్భంధించి కాల్పులు జరిపింది యాజమాన్యం. కాల్పులలో 13-25 సంవత్సరాల యువతులు 146 మంది నేలకొరిగారు. క్రూర నిర్బంధాన్ని సైతం లెక్కచేయక సమ్మె కొనసాగించటంతో యాజమాన్యం దిగిరాక తప్పలేదు. '' ఆకలి కడుపులతో చస్తూ బతికే కన్నా చావడం మేలు'' అన్న నినాదం ప్రపంచ మహిళా లోకాన్ని కదిలించి ఏకతాటిపై నిలిపింది. తదనంతరం అనేక దేశాలలో జరిగిన పారిశ్రామిక పోరాటాలలో పురుషులతోపాటు స్త్రీలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 1907లో మొదటి అంతర్జాతీయ సోషలిస్టు మహిళా సదస్సు జర్మనీలోని స్టట్‌గార్టులో జరిగింది. 15 దేశాలకు చెందిన 59 మంది ఈ సదస్సులో పాల్గొన్నారు. క్లారాజెట్కిన్‌, లా పాషనారా నాయకత్వం వహించారు. 1910 కోపెన్‌హాగ్‌లో రెండవ అంతర్జాతీయ మహిళా సదస్సులో మార్చి-8 మహిళా హక్కుల దినంగా జరపాలని ప్రపంచ మహిళలకు పిలుపునిచ్చింది. ఆనాటి నుండి సమానత్వం, దోపిడీ, అణచివేతకు వ్యతిరేకంగా మార్చి8 వ తేదీని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. వివిధ దేశాలలో ప్రభుత్వాలు కూడా మహిళా సమస్యలను పరిగణనలోకి తీసుకుని ఓటుహక్కు, పనిగంటల తగ్గింపు, ప్రశూతి శెలవులు, రిజర్వేషన్స్‌ మొదలైన అంశాలపై నిర్ణయాలు చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. ఐక్యరాజ్యసమితి నిర్ణయం మేరకు 1975లో అంతర్జాతీయ మహిళా సదస్సు మెక్సికోలో జరిగింది. ఆ సదస్సులో దశాబ్దికాలం (1975-1985)పాటు అంతర్జాతీయ మహిళా దినోత్సవాలు అన్ని దేశాలలో జరపాలని ఐక్యరాజ్యసమితి సర్వసభ్యసమావేశం పెట్టిన తీర్మానానికి 150 దేశాలు అంగీకరించాయి. అయితే పాలక వర్గాలు అనుసరించిన విధానాలు అసంఖ్యాక మహిళలను సమస్యల వలయంలో నెట్టివేశాయి.
పెరుగుతున్న అసంఘటిత రంగం: మహిళలపై ప్రభావం
గత రెండు శతాబ్దాలుగా పాలక వర్గాలు అనుసరిస్తున్న ఉదారవాద విధానాల వల్ల కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులు కాలరాయబడుతున్నాయి. పర్మినెంట్‌ ఉద్యోగుల స్థానే క్యాజువల్‌ వర్కర్లు, కాంట్రాక్టుఉద్యోగులు పెరిగారు. మొత్తం ప్రభుత్వ ఉద్యోగులలో వీరు 45శాతం వున్నారు. లక్షలాదిగా ఉన్న కాంట్రాక్టు కార్మికులకు నిజవేతనాలు లేవు. ఉద్యోగ భద్రత అంతకన్నా లేదు. పని భారం పెరిగింది.
ప్రభుత్వ పథకాలలో పనిచేసే అంగన్‌వాడీ, ఆశ, మధ్యాహ్న భోజన కార్మికులు, ఐకెపి, మెప్మా, 104,108 సర్వీసులలో పనిచేసే శ్రామిక మహిళలు, ఐటిడిఎ వర్కర్సు శ్రమదోపిడీతోపాటు తీవ్ర లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారు. పర్మినెంటు ఉద్యోగులతో సమానంగా పని చేస్తున్నప్పటికీ వీరికి ఎలాంటి సామాజిక భద్ర్రత వుండడం లేదు. ప్రభుత్వ రంగాన్ని కారుచౌకగా బడా పారిశ్రామిక వేత్తలకు కట్టబెట్టటం వల్ల ఉద్యోగాలలో 33శాతం రిజర్వేషన్లు అమలు కావటంలేదు.1948లో వచ్చిన ఫ్యాక్టరీ చట్టం స్త్రీలు రాత్రి షిప్టులలో పని చేయడాన్ని నిషేధించింది. ప్రైవేటీకరణ పుణ్యమాని సాధించుకున్న చట్టాలు కనుమరుగవుతున్నాయి. గతంలో ఫ్యాక్టరీ కేంద్రంగా సాగిన వస్తూత్పత్తి ఇంటి వద్దనే ముడి సరుకులు తెచ్చుకుని పనిచేసే గృహకార్మికులు రాష్ట్రమంతా లక్షల సంఖ్యలో (సుమారు10లక్షలు) ఉన్నారు. కాంట్రాక్టర్లు, దళారుల దోపిడీకి మహిళలు గురవుతున్నారు. భారతదేశంలో ఉన్న 45.6 కోట్ల మంది శ్రామికులలో 39.8 కోట్ల మంది అసంఘటిత రంగంలో ఉన్నారని (ఎన్‌సిఇయుఎస్‌)నివేదిక తెలియజేస్తున్నది. మొత్తం శ్రామికులలో 86 శాతం అసంఘటిత రంగంలో ఉన్నారు. అసంఘంటిత కార్మికుల్లో 77 శాతం మంది సగటున రోజుకు 20 రూపాయల కన్నా తక్కువ ఖర్చు చేస్తున్నారని ప్రభుత్వం నియమించిన అర్జున్‌సేన్‌గుప్తా కమిటీయే తేల్చి చెప్పింది.
మహిళలపై పెరిగిన హింస
సామ్రాజ్యవాద ప్రపంచీకరణ భారత్‌ లాంటి దేశాలపై రుద్దుతున్న సంస్కృతి మహిళల పాలిట శాపంగా మారింది. సమానత్వం, స్వేచ్ఛ వంటి వాటికి అర్థాలు మారిపోయాయి. మహిళలకు న్యాయంగా దక్కాల్సిన వాటా దక్కనీయకుండా అవరోధంగా ఉన్నాయి. యుగయుగాలుగా పాతుకుపోయిన పితృస్వామిక వ్యవస్థ దాని తాలూకు కట్టుబాట్ల్లు ఏదో ఒక రూపంలో ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. స్త్రీని సెక్స్‌ సింబల్‌గాను, వ్యక్తిత్వం లేని అంగడి సరుకుగాను కార్పొరేట్‌ మీడియా చిత్రీకరిస్తున్నది. విలువలు క్షీణిస్తున్నాయి. ఈ క్షీణ సంస్కృతి మహిళల జీవితాలను అథఃపాతాళానికి నెడుతున్నది. నయా ఉదారవాద విధానాలు స్త్రీలను దారిద్య్రంలోకి నెట్టడంతోపాటు అనేక రూపాలలో ఇంటా బయటా హింస పెరిగింది. స్త్రీలపై సాగుతున్న హింసలో మన రాష్ట్రం రెండవ స్థానంలో ఉంది. వినియోగదారీ సంస్కృతి వరకట్న దాహాన్ని పెంచింది. అదొక అంటురోగంలా అన్ని సామాజిక తరగతులకూ నేడు పాకుతోంది. ఇది స్త్రీల ప్రతిపత్తిపై అనేక విధాలుగా దుష్ప్రభావం చూపుతున్నది.
స్త్రీ శిశు భ్రూణహత్యలు ఆందోళనకరంగా పెరగడానికి కూడా ఇదొక కారణం. ఫ్యూడల్‌ వారసత్వంతో వచ్చిన వెనుకబాటుతనం, మూఢాచారాలు, మతమౌఢ్యం, పుత్ర ప్రాధాన్యతతో స్త్రీ పురుష నిష్పత్తి పడిపోతున్నది. 2011 జనాభా గణాంకాలను పరిశీలిస్తే 6 సంవత్సరాల లోపు బాల బాలికల నిష్పతి 1000:914గా ఉంది. ప్రేమోన్మాదుల దాడులు, యాసిడ్‌ దాడులు, వరకట్న వేధింపులు, హత్యలు, అత్యాచారాలు ఆడపిల్లల తల్లిదండ్రులలో భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి. పెరిగిన సాంకేతికాభివృద్ధితో మహిళలపై సైబర్‌ నేరాలు కూడా పెరిగాయి.
ఆడపిల్లల అక్రమ అమ్మకాలు, వ్యభిచార గృహాలకు తరలించబడుతున్న ఆడపడుచులు, బతుకు బండి నడపటానికి మాతృత్వాన్ని అద్దెకు ఇచ్చే అద్దె తల్లులు, పెరుగుతున్న హింస ఇవేమీ ప్రభుత్వాలకు కానరావటంలేదు. ప్రజా సంక్షేమాన్ని మరిచి లాభనష్టాలు బేరీజువేసి మార్కెట్‌ శక్తులకు మహిళలను బలిచేస్తున్నాయి. మహిళా సాధికారిత గురించి గొప్పలు చెపుతున్న ప్రభుత్వం స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాలూ, హింస నిరోధించే చర్యలు చేపట్టడంలేదు. గృహహింస నిరోధక చట్టం (2005) అమలుకు కావల్సిన ప్రత్యేక యంత్రాంగాన్ని ఇంతవరకు ఏర్పాటు చేయలేదు. 60 రోజులలో కేసు పరిష్కరించాలని చట్టంలో పొందుపరిచినా ఒక్కో కేసుకు సంవత్సరాలు పడుతోంది. ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులు ఏర్పాటు చేస్తామన్న వాగ్దానం నెరవేరలేదు. మహిళలకు ఉపశమనం కల్గించే 498ఎ సెక్షన్‌ దుర్వినియోగం అవుతోందనే కుంటిసాకుతో చట్టాన్ని సరళతరం చేసే యోచన చేస్తోంది.1997లో రద్దయిన మహిళాకమీషన్‌ గురించి ఊసేలేదు.
యుపిఎ ప్రభుత్వం నిత్యావసర సరుకుల ధరల పెరుగుదలను అరికట్టడంలో ఘోరంగా విఫలమైంది. పప్పు ధాన్యాలు, కూరగాయలు, పండ్లు, వంటనూనెలు, పంచదార, గుడ్లు, మాంసం, చేపల వంటి ఆహార పదార్దాల ధరలు పెరుగుతుండడంతో ప్రజలు ముఖ్యంగా మహిళలు అనేకకష్ట నష్టాలకు గురవుతున్నారు. పౌష్టికాహారం లేక రక్తహీనతతో 54 శాతం మంది మహిళలు అనారోగ్యానికి గురవుతున్నారని పలు అధ్యయనాల్లో తేలింది. ఆహార భద్రత బిల్లుపై దేశంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ద్రవ్యలోటు అదుపు పేరుతో ప్రజాసంపిణీ వ్యవస్థను సమాధి చేసేందుకు నగదు బదిలీ పథకాన్ని తీసుకొస్తున్నది.
మహిళల అభ్యున్నతికి అత్యంత ముఖ్యమైన అంశాలు విద్య, ఉద్యోగాలు. దేశంలో ఈనాటికీ మహిళా అక్షరాస్యత 55:4 శాతం వద్దే ఉంది. ప్రతి వందమందిలో ఎనిమిది మంది మాత్రమే డిగ్రీ చదువులకు వెళుతున్నారు. విద్య కార్పొరేటీకరణతో సామాన్యులు ముఖ్యంగా ఆడపిల్లలు ఉన్నత చదువులకు దూరమవుతున్నారు.
మద్యం ఒక సునామీలా రాష్ట్రాన్ని ముంచెత్తుతోంది. ప్రజాసంక్షేమాన్ని మరిచి ఆబ్కారీ ఆదాయాన్ని ప్రభుత్వం ఒక వనరుగా భావిస్తోంది. 2004లో 3,834 కోట్లు ఉన్న మద్యం ఆదాయం 18,000 కోట్లకు చేరింది. వందమందికి పైగా శాసన సభ్యుల ప్రత్యక్ష, పరోక్ష ప్రమేయం, ప్రోదల్భంతో ఈ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. ప్రజల బలహీనతలను ఆసరా చేసుకుని రాష్ట్రంలో 6,550 లైసెన్స్‌ షాపులు, లక్షలాది బెల్టుషాపులు పెట్టి, ఎంఆర్‌పి రేట్లకు అధిక రేట్లకు మద్యం అమ్మకాలు సాగిస్తున్నది. భార్యా భర్తలు రోజంతా కష్టపడి పని చేసినా మగడి సంపాదన మద్యం కొట్టుకే పోతుంది. అది కూడా చాలక ఇంట్లో ఉన్న వస్తువులు కూడా తాకట్టు పెట్టి మరీ తాగుతున్నారు. తాగుబోతు భర్తలు పెట్టే హింస గురించి వేరే చెప్పనవసరం లేదు. అందుకే ఈ మద్యం పాలసీకి వ్యతిరేకంగా మహిళలు నడుం బిగించాల్సిన అవసరముంది.
చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లు రాజ్యసభలో ఆమోదం పొంది రెండేళ్ళు గడిచినా లోక్‌సభలో ఆమోదానికి పెట్టకుండా యుపిఏ-2 ప్రభుత్వం నాన్చుతున్నది. పార్లమెంటులో మహిళా ప్రాతినిధ్యంలో పొరుగు దేశాలైన పాకిస్థాన్‌, ఆఫ్ఘనిస్థాన్‌లకన్నా ప్రజాస్వామ్య దేశమని చెప్పుకుంటున్న మన దేశం వెనుకబడి ఉండడం శోచనీయం. విద్య, ఆరోగ్యం, జీవించడం, రాజకీయ సాధికారిత లాంటి నాలుగు ప్రమాణాలను పరిగణనలోకి తీసుకునే జండర్‌ ఇండెక్స్‌కు సంబంధించి మొత్తం 136 దేశాల్లో భారత్‌ 98వ స్థానంలో ఉంది. ఈ వివక్ష, అన్యాయాలకు వ్యతిరేకంగా ఉద్యమాలకు ప్రతిన బూనాల్సిన మార్చి-8ని ఫ్యాషన్‌ షోలు,పెరేడ్‌లు, బహుళజాతి సంస్థల సరుకుల విక్రయాలకు వేదికగా కొందరు మార్చాలని చూస్తున్నారు. అటువంటి యత్నాలను సాగనివ్వరాదు. మహిళాదినోత్సవ నిజమైన స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లేందుకు అందరం నడుం బిగిద్దాం. సకల అనర్థాలకు మూలమైన ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా సంఘటితమవుదాం. ఆకలి,పేదరికం, హింసకు వ్యతిరేకంగా, మహిళల సమాన హక్కుల కోసం గళమెత్తే రోజుగా మార్చి-8 మహిళా దినోత్సవం జరుపుకుందాం.
-కె. స్వరూపరాణి
Prajashakti  News Paper Dated : 09/03/2012 

No comments:

Post a Comment