Saturday, March 17, 2012

కులాలు ఏ మతంలో లేవు? - వై.సత్యనారాయణ



హిందూమతం దానంతటదే అంతం అవుతుందని ప్రొఫెసర్లు, వారి అనుచరులు భావించడం వెర్రితనం. ప్రొఫెసర్ల వృత్తికే కళంకం. కంచ ఐలయ్య, వారికి వంత పాడే జి.రాములు తదితరులు ఆ విధంగా కలలు కనడం మానండి. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం అన్నట్లు మంచి కలలు కనండి. మంచికి సోపానాలు వేయండి. అంతేగాని పాపిష్టి వినాశక కలలు కనకండి. హిందూ మతం శాశ్వతమైనది. ప్రపంచం పుట్టినప్పటి నుంచి హిందూ మతం ఉన్నది. భారతదేశానికి దక్షిణాన గల హిందూ మహాసముద్రం ఒక దిక్కున ఉన్న ఈ హిందూ దేశంలో పుట్టిన వారు మాతృదేశంపై అభిమానం కంటే విదేశీ మతంపై అభిమానం ఉండటం విచిత్రం, మాతృదేశానికే తీరని ద్రోహం చేసినట్లే. 

ఎన్ని ఇతర మతాలైనా హిందూ మతం తర్వాతే పుట్టాయి. ప్రపంచం పుట్టినప్పుడే హిందూ మతం పుట్టింది. మనకు పెద్దలు ఇచ్చిన సామెత ఉంది. మధ్యలో వచ్చినవి మధ్యలోనే పోతాయి అని. పవిత్రమైన హిందూ మతం ఎక్కడికీ పోదు. పాపం మీరు భయపడకండి. ఇక కుల వ్యవస్థ అంటారా? కులాలు ప్రపంచంలో గల అన్ని మతాలలో ఉన్నాయి. కాకపోతే కొన్ని మతాల్లో వర్గాలనే పేరుతో, తెగలనే పేరుతో, జాతులనే పేరుతో ఉన్నాయి. క్రైస్తవులలో గానీ, ఎస్సీ, ఎస్టీలలో గానీ 36 ఉప కులాలు ఉన్నాయని కొంతమంది, కాదు 23 ఉప కులాలు ఉన్నాయని కొంతమంది ప్రకటనలు చేసే విషయం మీకు తెలియదా? అసలు మీది ఏ మతం? ఏ కులం? ప్రపంచంలో గల 700 కోట్ల జనాభాలో ప్రతి ఒక్కరూ ఏదో వర్గానికో, తెగకో, కులానికో చెందివుంటారు. 
హిందూమతంలోనికి రావాలని కోరుకునే వారికి ఏ కులంలో చేరాలో హిందూ మతం సూచించలేదు. కులాలు వద్దని ఒక వైపు అంటూనే, క్రైస్తవ మతంలోనికి ఆహ్వానించే మీరు మీ ఉపకులాల్లో దేనిలో చేరమని మీరు సలహా ఇస్తున్నారు? ఇస్లాం, క్రైస్తవంలోనికి హిందువులు తండోపతండాలుగా వలస పోలేదు. ఆర్థిక పరమైన ఆశలు తదితర ప్రోత్సాహకాలను చూపి పేద ప్రజలను మత మార్పిడిలోనికి ఆకర్షించడమే ఒక వ్యాపారంగా మారింది. పలు పాశ్చాత్య దేశాలలోని హిందూ ఆధ్యాత్మిక కేంద్రాలు, సత్యసాయి మందిరాలు, ఇస్కాన్ మందిరాలలో ఆయా దేశాల పౌరులు ప్రశాంతంగా నివశిస్తున్నారు. నిజానికి పాశ్చాత్య ప్రపంచంలో క్రైస్తవ ధర్మాన్ని అనుసరించే వారి సంఖ్య తగ్గిపోతోందని వార్తలు వెలువడుతున్నాయి. 
ఇస్లాంలో కూడా కులాలు ఉన్నాయి. తునీ అనీ, సయ్యద్ అనీ, షేక్ లనీ, పఠాన్‌లనీ, కుర్దులు, షియాలు, సున్నీలు తదితర తెగలువారు ఉన్న విషయం మీకు తెలియదా? ఈ ముస్లిం తెగల వారు ఒకరినొకరు వివాహం చేసుకుంటారా? ముస్లిం దేశాల్లో ఈ తెగల మధ్య అంతర్యుద్ధం జరగడం లేదా? మానవ బాంబులతో నిత్యం ఒకరిపై ఒకరు రక్తం చిందించుకోవడం ప్రతిరోజూ పత్రికలలో చూడటం లేదా? క్రైస్తవ రాజ్యమైన అమెరికాలో, దక్షిణాఫ్రికాల్లో నీగ్రోల పరిస్థితి ఏమిటి? డాక్టర్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగంలో పది సంవత్సరాలు రిజర్వేషన్ కల్పించాలని కోరినారు. ఆనాటి పార్లమెంటు సభ్యులలో 80 శాతానికి పైగా హిందూ అగ్ర వర్ణాల వారే. మరి వారెవ్వరూ బడుగు వర్గాల వారికి రిజర్వేషన్ల సదుపాయాన్ని వ్యతిరేకించలేదు. 

విదేశీ మతం నీడలో ఉన్న వారి వింత పోకడలతో ఈ రిజర్వేషన్ విధానం వెర్రి తలలు వేస్తుందని, రాజ్యాంగస్ఫూర్తికి విరుద్ధంగా అంతరాలు పెరుగుతాయని ఆనాడు అంబేద్కర్ ఊహించి ఉండరు. మన అన్ని కుల మతాల ప్రజలకు అంబేద్కర్ మీద గౌరవాభిమానాలు ఉన్నాయి. హిందూ మతాన్ని అంబేద్కర్ విమర్శించలేదు. మూఢనమ్మకాలు తగవని హితవు పలికాడు. మానవ జాతి అంతా ఒక్కటేనని, వివక్ష ఉండకూడదని సనాతనులకు హితవు పలికాడు. ఆనాటి పరిస్థితులను అనుసరించి రిజర్వేషన్ విధానాన్ని అ పదేళ్ళపాటు అమలుచేస్తే అణగారిన వర్గాల వారి అభ్యున్నతికి వీలుకలుగుతుందని అంబేద్కర్ ఆశించారు. కొన్ని వర్గాల పట్ల అస్పృశ్యత, వివక్ష హిందువులలో ఎక్కువగా చూపుతున్నారని బాధపడి హిందువుగా పుట్టిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ బౌద్ధ మతంలో చేరారు. మరి క్రైస్తవ, ఇస్లాం మతాల్లో ఎందుకు చేరలేదు? ఈ మతాల్లోకూడా కులాలు, తోటి మానవుల పట్ల వివక్షలు, అస్పృశ్యతలు ఉన్నాయనే కాదూ? 
అంబేద్కర్ చేరిన బౌద్ధ మతానికి కారణ జన్ముడైన బుద్ధుడు హిందువుగా హిందూ దేశంలో జన్మించాడు. బుద్ధుని ఒక అవతారంగా హిందువులు అభిమానిస్తారు, పూజిస్తారు. రాకుమారుడైన బుద్ధుడు మానవ జన్మలోని అర్థము, పరమార్థము తెలుసుకోవాలనే ఆసక్తితో దేశాటన గావించి హిందూ పుణ్యక్షేత్రమైన 'గయ'లో బోధి వృక్షం క్రింద జ్ఞానోదయం పొందాడు. ప్రజలందరూ శాంతితో జీవించాలని, సత్యం పలకాలని, అహింస పాటించాలని, మద్యపానం చేయరాదని, శాకాహారం భుజించాలని, జంతు బలిచేయరాదని మానవ జాతికి బుద్ధుడు ప్రభోదించాడు. 

మీరు బౌద్ధ మతం తీసుకొని వుంటే బుద్ధుడు చెప్పిన సూక్తులను ఎంతవరకు పాటిస్తున్నారు? ప్రపంచ ప్రఖ్యాత రచయిత్రి తస్లీమా ఇస్లాం మతంపై ఏవో వ్యాఖ్యలు చేశారని ఇస్లాంవాదులు ఆమెకు దేశ బహిష్కారం శిక్షను విధింపచేయలేదా? ఏ దేశంలో కూడా నిలవనీడ లేకుండా చేసిన సంగతి మీకు తెలియదా? అదే విధంగా భారత సంతతికి చెందిన ప్రముఖ రచయిత రష్దీ పైన కూడా ఇస్లాం వ్యతిరేకి అనే ముద్ర వేశారు. వీరిద్దరికి వ్యతిరేకంగా 'ఫత్వా'ను జారీ చేసిన విషయం మీకు తెలియనిది కాదు. హిందువులు శాంతికాముకులు కాబట్టి, మీరు మీ మిత్రులు ఎన్ని వక్ర భాషలతో హిందూ మతాన్ని విమర్శలు చేసినా ప్రదర్శనలు జరపడం కాని, ప్రతిచర్యలకు గాని పాల్పడలేదు. ఇస్లాంపై వ్యాఖ్యలు రాయండి. అలాగే క్రైస్తవంపై రాయండి. 
దేవాలయాలలో దళితులకు ప్రవేశం లేకపోవడం గురించి మీరు ఎంతో వేదన చెందుతున్నారు. దేవుడిపై నిజంగా విశ్వాసం, నమ్మకం, భక్తి ఉంటే దేవాలయాలకు వెళ్ళవలసిన పనిలేదు. అంత భక్తి ప్రపత్తులు మీకు ఉంటే ఆ దేవుని చిత్ర పటాన్ని కాని, విగ్రహాన్ని కాని, తమ గృహంలో పెట్టుకొని పూజించవచ్చు కదా. చిన్న ప్రార్థన మందిరం నిర్మించుకొని దానిలో భజన చేయవచ్చు కదా. శ్రీరామనవమికి, గణపతి ఉత్సవాలకు నిర్మించే పందిళ్ళలో పూజలు చేసుకుని దైవదర్శనంతో భజనలు చేయవచ్చు కదా. 

మక్కా మసీదులో ముస్లిమేతరులకు ప్రవేశం ఉందా? శబరిమల అయ్యప్ప దేవాలయానికి వేలమంది ముస్లింలు పవిత్రమైన ఇరుముడి ధరించి వస్తారు. శబరిమల అయ్యప్ప దర్శనానికి నలభై కిలో మీటర్లు వనయాత్రకు బయలుదేరే ముందు అయ్యప్ప స్వామి భక్తుడైన 'వోవరుస్వామి దర్గా'ను మొదటిసారిగా దర్శించుకుంటారు. దర్గాను మొదటిసారి దర్శించుకొని మాత్రమే స్వాములు పాదయాత్ర చేయాలి. 
'నేను హిందువును ఎట్లయిత?' అని మేధావి కంచ ఐలయ్య ప్రశ్నించారు. వారు హిందూ మతంలో లేకపోవడం హిందూ మతం చేసుకున్న 'అదృష్టం'. అనేక దేవాలయాలలో బ్రాహ్మణేతరులు కూడా అర్చకత్వం చేస్తున్నారు. ప్రస్తుతం కొంత మంది సంస్కరణ వాదులు కులరహిత కమిటీలు అనే పేరుతో హిందూ మతం మీద ఆవాక్కులు, చవాక్కులు పేలుతున్న వారు కల్పనా ప్రపంచంలో విహరిస్తున్నారు. రిజర్వేషన్ సౌకర్యం అనుభవిస్తూ, మత ద్వేషాలను రెచ్చగొట్టకుండా ముందు మీరు సంస్కరించుకొని ఇతరులకు హితబోధ చేయండి. ఆ విధంగా పాడుకలలు కంటూ ఆరోగ్యం పాడుచేసుకోకండి. మంచి కలలు కని పదిమందికి ఉపయోగపడండి. 

- వై.సత్యనారాయణ
చీరాల మునిసిపాలిటీ మాజీ వైస్-చైర్మన్
Andhra Jyothi News Paper Dated : 17/03/2012 

No comments:

Post a Comment