Friday, March 9, 2012

ఆధిపత్యంపై తిరుగుబాటు యాత్ర---పొఫెసర్ కోదండరామ్మిలియన్ మార్చ్ ఆంధ్రపాలకుల నిరంకుశత్వంపై తెలంగాణ ప్రజలు చేసిన తిరుగుబాటు యాత్ర. సహాయనిరాకరణ ఉద్యమంలో సకల జనులను భాగం చేయడానికి, ప్రభుత్వంపై ఒత్తిడిని తీవ్రతరం చేయడానికే జేఏసీ మిలియన్ మార్చ్‌కు పిలుపునిచ్చింది. సహాయ నిరాకరణతో పాలన స్తంభించిపోయింది. అయితే ఈ కార్యక్షికమ భారం మొత్తం ఉద్యోగులే భరించవలసి వచ్చింది. ఉద్యోగులకు అండగా ప్రజలను కదిలించకుండా లక్ష్యాన్ని సాధించలేమన్న ఆలోచనతోనే జేఏసీ మిలియన్ మార్చ్ కార్యక్షికమాన్ని తయారుచేసింది. జేఏసీలో లేని అనేక సంఘాలు ప్రత్యేకించి ప్రజావూఫంట్ కూడా మిలియన్ మార్చ్‌లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చాయి.

అప్పటికే ఈజిప్టులో తెహరీర్ స్కేర్ నిరసన జరిగింది. ఆ పోరాట స్ఫూర్తి మిలియన్ మార్చ్‌కు దారి తీసింది. ప్రజలు కూడా చాలా ఉత్సాహంగానే స్పందించారు. యువతీ యువకులు, విద్యార్థినీ విద్యార్థులు, మధ్యతరగతి మేధావులు చాలా పెద్ద ఎత్తున కదిలారు. ప్రభుత్వ నిర్బంధ విధానాలు, ప్రత్యేకంగా ఎవ్వరూ హైదరాబాద్‌లోకి ప్రవేశించకుండా, ప్రవేశించినా ట్యాంక్‌బండ్ చేరకుండా ఏర్పాటు చేసిన పోలీసు వలయం ప్రజల్లో ఆగ్రహజ్వాలను రగిలించాయి. మన హైదరాబాద్ చేరుకోవడానికి ఇన్ని ఆంక్షలా అన్న అభివూపాయం తెలంగాణ అంతటా వ్యాపించింది. తెలంగాణ ఇక్క డి ప్రజలదే ఇది గుప్పెడుమంది ఆంధ్ర పాలకులది కాదన్న విషయాన్నిచాటి చెప్పడానికి ట్యాంక్‌బండ్‌కు చేరుకోవాలని నిర్ణయించుకున్నారు. అందుకు ఎవరి వ్యూహాలు వారు తయారు చేసుకున్నారు. పక్కనున్న వ్యక్తికి కూడా ఆ విషయం చెప్పలేదు.

నాలుగు రోజుల ముందు చేరుకొని హైదరాబాద్‌లో ఉండి ట్యాంక్‌బండ్ చుట్టూ సేదదీరే బిచ్చగాళ్లలో చేరిపోయి, వాళ్లతో పాటు అక్కడనే రాత్రుళ్లు గడిపిండ్రు. ఊరి నుంచి హైదరాబాద్ తోవలు బంద్ కావడంతో పొరుగు రాష్ట్రాలకు వెళ్లి అక్కడి నుంచి హైదరాబాద్‌కు చేరుకున్న వాళ్లు ఉన్నారు. గుంపుగా వస్తే పోలీసుల దృష్టి పడుతుంద ని విడివిడిగా ప్రయాణం చేసి ఏదో ఒక కారణం చూపించి హైదరాబాద్ వచ్చిన విద్యార్థుపూందరో. పోలీసులు బస్సుల నుంచి దింపితే కాలినడకన ట్యాంక్‌బండ్ చేరుకోవాలని కృషి చేసి విజయం సాధించిన వాళ్లున్నారు. ట్యాంక్‌బండ్ ఎక్కాలన్నదే అందరి లక్ష్యం.

చాలా మంది రాలేకపోయారు. దాదాపు 50,000 మందిని పోలీసులు అరెస్టు చేశారు. మరెంతో మందిని బస్సుల నుంచి, రైళ్ల నుంచి దింపి వెనకకు పంపించినారు. అసెంబ్లీ నుంచి బయలుదేరిన ఎమ్మెల్యేలను కూడా పోలీసులు అరెస్టు చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించినారు. జేఏసీ ఆఫీసు ఆరోజు పోలీసుల దిగ్బంధంలో ఉన్నది. నాతో పాటు ఆఫీ సు నుంచి బయలుదేరిన ఎండల లక్ష్మీనారాయణ, తదితరులను అరెస్టు చేసిండ్రు. ఇన్ని దాడుల మధ్య ట్యాంక్‌బండ్ ఎట్లా చేరుకుంటారని విలేకరులు వేసిన ప్రశ్నకు ఆరోజు మేము సమాధానం చెప్పలేదు. కానీ అప్పటికే వ్యూహ రచన జరిగింది. ట్యాంక్‌బండ్‌కు దగ్గరిలో కలుసుకోగలిగితే ట్యాంక్‌బండ్ పైకి రావడం కష్టం కాదు. అందుకే పెళ్లి నాటకంతో ఒకచోట చేరుకుని మూకుమ్మడిగా ట్యాంక్‌బండ్ వద్దకు చేరుకున్నరు. చుట్టుపక్కల ఒంటరిగా తిరుగుతున్న వాళ్లు కొందరు ఆ గుంపులో చేరిపోయిండ్రు. అందరూ కలిసి బారికేడ్లను బద్దలుకొట్టి ట్యాంక్‌బండ్‌ను మద్దాడిండ్రు. ఒంటిమీదు న్న ప్యాంట్లు విడిచి తాడుగా మార్చుకొని ట్యాంక్‌బండ్ కట్టకిందనున్న వారినిపైకి లాగిన యువకులున్నారు. ట్యాంక్‌బండ్ ఎక్కినప్పుడు తెలంగాణవాదులకు కలిగిన ఆనందం ఎవస్టు శిఖరం ఎక్కినప్పుడు టెన్సింగ్ నార్గే కూడా పొంది ఉండడు. నాకు ఒక యువకుడు ఫోన్‌లో చెప్పిన విషయాలు ఆనాటి తెలంగాణవాదుల మానసిక స్థితిని తెలియజేస్తాయి.

ఆయన మాటల్లో ‘సార్ పోలీసుల బారికేడ్లు తప్పించుకున్న, లాఠీదెబ్బలు తిన్న, ముళ్ల కంచెలు దాటిన, బట్టలు చినిగినై, ఒళ్లంతా గాయాలు, రక్తంతో తడిసిన. కానీ ఇవి చెప్పడానికి ఫోను చేయలేదు, నేనిప్పుడు ట్యాంక్‌బండ్ పైనున్నానని చెప్పడానికి ఫోన్ చేసిన’.టెన్సింగ్ నార్గే ప్రకృతి నిర్మించిన అవరోధాన్ని అధిగమించిండు. కానీ తెలంగాణ ప్రజలు ఆంధ్రపాలకుల నిరంకుశత్వాన్ని, వాళ్లు ఏర్పాటు చేసిన ఆటంకాలను దాటి వచ్చిండ్రు. టెన్సింగ్ నార్గే మనిషి శక్తియుక్తులను ప్రదర్శించిండు. కానీ మిలియన్‌మార్చ్ రోజు తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవంతో జీవించాలన్న ఆకాంక్షను- నిర్బంధాన్ని దాటి ట్యాంక్‌బండ్‌పై చేరుకుని- ప్రకటించినారు. స్వేచ్ఛ, సమానత్వం, ఆత్మగౌరవం కోసం మనిషి ఏం చేయగలడో తెలుసుకోవాలంటే మిలియన్ మార్చ్ గురించి తెలుసుకోవాలి. నిరంకుశత్వంపైన, ఆధిపత్యంపైన మనిషి సాధించిన విజయానికి మిలియన్‌మార్చ్ ఒక అపురూపమైన ప్రతీక. మనిషి తలుచుకుంటే ఎంతటి నియంతనైనా ఎదిరించగలడు. ఇది ప్రపంచ చరివూతలోనే ఒక కీలకమైన దినం. అందుకే మిలియన్ మార్చ్ జ్ఞాపకాలను తెలంగాణ పదిలంగా దాచుకోవాలి. హైదరాబాద్ చేరుకోలేని వారు ఎక్కడికక్కడ మిలియన్ మార్చ్ నిర్వహించారు.

నిజానికి తెలంగాణ ప్రజలు శాంతినే కోరుకున్నారు. పోలీస్ కమిషనర్‌ను అనుమ తి కోరాము. పరీక్ష అయిపోయిన తర్వాతే ఒంటిగంటకు ర్యాలీ తీస్తాము. సాయంకాలం ఐదు గంటల కల్లా ముగిస్తామని అన్నాము. కమిషనర్ కాదన్నడు. కోర్టు ఆర్డరు ఉన్నది, ట్యాంక్‌బండ్‌పై ర్యాలీ ఒప్పుకోమన్నారు. పోనీ నిజాం కాలేజీ ఆవరణలో నిరసన సభ చేసుకుంటామని అన్నాము. అసెంబ్లీ ఉండగా అక్కడ అందుకు అవకాశం లేదన్నడు. అట్లాగైతే ఎవ్వరికీ ఇబ్బంది కలగదు కనుక నెక్లెస్ రోడ్డును నిరసనకు వాడుకుంటామని అడిగినాము. సెక్రె పక్కన గుమిగూడితే శాంతిభవూదతల సమస్య తలెత్తుతుందన్నాడు. మరి ధర్నాచౌక్‌లో కూర్చుంటాము, చట్టపరమైన సమస్యలు కూడా రావని చెప్పినం. కుదరదన్నడు. ‘మీరు అక్కడి నుంచి బయలుదేరి ట్యాంక్‌బండ్ ఎక్కవచ్చునన్న’ అనుమానం వ్యక్తం చేసిండు. చివరకు ఇంటర్ పరీక్షలు రాసే పిల్లలకు ఇబ్బంది రానీయవద్దని, పరీక్షలు మొదలైన తర్వాతనే బారికేడ్లు కట్టాలని ప్రాధేయపడినం. పిల్లల పరీక్షల కోసమే ర్యాలీని అనుమతించడం లేదన్న ప్రభుత్వం రాత్రికిరాత్రే బారికేడ్లు కట్టి పిల్లలకు ఇబ్బందులు సృష్టించింది. మీకు చేతనైతే ఆపండి, మాకు శక్తి ఉంటే ట్యాంక్‌బండ్‌పై చేరుకుంటామని చెప్పి లేసి వచ్చినం.
పై విషయాలు ఎందుకు చెప్తున్నానంటే తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి ఆంధ్ర పాలకులు వారి ఆస్తిపాస్తులకు, అధికారానికి కేంద్రంగా మారిన హైదరాబాద్ ను పోలీసు క్యాంపుగా మార్చిండ్రు. ముఖ్యంగా తెలంగాణవాదులు గుమిగూడుతున్నరం వారికి భయం. ఆస్తులపై దాడి జరుగుతందని వారి అనుమానం. అందుకే హైదరాబాద్‌లో ఏ ప్రజాస్వామిక నిరసనకూ అవకాశం లేదు. పోలీసుల దాడులతో అన్ని కార్యక్షికమాలను అణచివేస్తుంటరు. ఇంతటి అనుమాన వైఖరిని తెలంగాణ సమాజం ఎదిరించింది. విజయం సాధించింది. అందుకే తెలంగాణ ప్రజలు మిలియన్ మార్చ్‌ను ఆంధ్రపాలకుల ఆధిపత్యంపై సాధించిన విజయంగా చూస్తున్నరు.

ఆనాడు ప్రొఫెసర్ జయశంకర్ గారికి కలిగిన ఆనందం వర్ణనాతీతం. మిలియన్ మార్చ్ అయిన రెండు రోజులకు నేను వారిని హైదరాబాద్‌లో కలుసుకున్నాను. నగరంలో వారి స్నేహితుల అపార్టుమెంటులో ఉన్నారు. సారుకు విషయాలు చెప్పాలన్న ఆలోచనతో నేను వారింటికి వెళ్లినాను. అప్పటికే వారికి క్యాన్సర్ వచ్చింది. అది ఇక నయం కాదని తెలిసింది. మిలియన్ మార్చ్ నాడు సార్ ఎప్పటి వలెనె తయారై ఐదంతస్తులు దిగి ట్యాంక్‌బండ్ వెళ్లడానికి కారులో కూర్చున్నడు. పోలీసుల వలయంలో ఉన్న ట్యాంక్‌బండ్ చేరుకోవడానికి చాలా నడువాల్సి వస్తుందని, ఆయన ఆరోగ్యం బాగా లేనందున ఆ ప్రయత్నం చేయవద్దని మిత్రులు బతిమాలి వెనకకు తీసుకెళ్లినారు. మిలియన్ మార్చ్‌లో పాల్గొనాలన్న బలమైన కోరిక వారికి ఉండేది. తాను చేరుకోలేకపోయినా మిగతా తెలంగాణవాదులు చేరుకున్నందుకు సంతోషించిండు. 
సార్‌ను కలిసినప్పుడు విగ్రహాల విధ్వంసంపైకి చర్చ మళ్లింది. అప్పుడు ఆ విగ్రహాలను ఏర్పాటు చేసినప్పుడు చెలరేగిన వివాదాన్ని సహచరులతో కలిసి వారు అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుకు ఇచ్చిన విజ్ఞాపన పత్రాన్ని గుర్తు చేసిండ్రు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ అస్తిత్వానికి గుర్తింపు లేకుండాపోయిందని తెలంగాణ చరివూతను, సాంస్కృ తి వారసత్వాన్ని గుర్తుచేసే వైతాళికులకు ట్యాంక్‌బండ్‌పై స్థానం ఉండాలని వారు ఇతర మిత్రులతో కలిసి విజ్ఞప్తి చేసిండ్రు. ఆంధ్ర పాలకులు తెలంగాణ విన్నపాలను ఎప్పుడూ పట్టించుకోలేదు. జయశంకర్ గారి విజ్ఞాపన పత్రమూ బుట్టదాఖలైంది. 

ఆ విధంగా ట్యాంక్‌బండ్‌పై విగ్రహాలు ఆంధ్ర ఆధిపత్యానికి గుర్తులుగా మిగిలిపోయినాయి. 1996లో ఉద్యమం బలపడిన తరువాత ఈ విషయాలు అందరికీ తెలిసినై. కీ.శే. గుడిహాళం ట్యాంక్‌బండ్‌పై విగ్రహాలు మీవి, హుస్సేన్‌సాగర్‌లో శవాలన్నీ మావి అనే కవితా పంక్తులను రాసినాడు. ఈ పంక్తులను కళాకారులు, కవులు గ్రామక్షిగామానికి మోసుకొనిపోయిండ్రు. విగ్రహాలు ఏర్పరిచినప్పుడే ఇది ఎప్పటికైనా బద్దలయ్యే సాంస్కృతిక అగ్నిపర్వతమని చెప్పినాం అని జ్ఞాపకాలను నెమరు వేసుకున్నాం. మిలియన్ మార్చ్‌లో పాల్గొన్న తెలంగాణ ప్రజల గుండెమంట అగ్నిపర్వతము వలె బద్దలైంది. వైతాళికుల చారివూతక పాత్ర ఎవ్వరూ పట్టించుకోలేదు. ఆధిపత్యానికి ప్రతీకలుగానే విగ్రహాలను చూసినారు.

ఆంధ్రవూపదేశ్ సామాజిక, రాజకీయ విషయాలపైన చర్చను నిర్వహించేది సీమాంధ్ర మీడియానే. సహజంగానే తమ దృష్టి నుంచి మిలియన్ మార్చ్‌ను చూసి దానిపై వ్యాఖ్యానించిండ్రు. వారు విగ్రహాలను ధ్వం సం చేయడంలో ‘కల్లుతాగిన కోతులను’ మాత్రమే చూసినారు. తెలంగాణ ప్రజల మనసులలో ఉన్న ఆగ్రహానికి కారణమైన చారివూతక నేపథ్యాన్ని, ఆ ఆగ్రహాన్ని అర్థం చేసుకోవడంలో ప్రభుత్వ వైఫల్యాన్ని మిలియన్ మార్చ్ పట్ల ప్రభుత్వం అనుసరించిన అప్రజాస్వామిక ధోరణిని పూర్తిగా విస్మరించినారు. ఈ చర్చ కారణంగానే విచ్చలవిడి అరెస్టులు జరిగాయి. ప్రదర్శనకారులు వెళ్లిపోయిన తర్వాత చుట్టుపక్కల బస్తీలలో కనిపించిన అమాయకులైన యువకులను అరెస్టు చేసినారు. అరెస్టయిన వారిలో ఈ ఘటనతో సంబంధం లేని ఒక గుడి పుజారి, ఇతర రాష్ట్రాల నుంచి బతుకుదెరువు కోసం వచ్చిన కూలీలు, రోడ్డుపై ఆడుకుంటున్న పదవ తరగతి విద్యార్థులూ, శాంతిని పెంపొందించడానికి కృషి చేసిన అడ్వకేట్లు ఉన్నారు. అక్రమంగా అరెస్టు చేసినందుకు కరీంనగర్ జిల్లా చెంజెర్ల గ్రామానికి చెందిన ఎంబీఏ చదువుతున్న ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అనేక పట్టణాలలోని యువకులను ఎక్కడోవీడియోలో కనిపించాడంటూ ఎత్తుకొచ్చి కేసులు పెట్టినారు. 

మిలియన్ మార్చ్ తరువాత ప్రభుత్వం మరింత నిరంకుశంగా తయారైంది. ఎల్లప్పుడూ నక్సలైట్లకు శాంతి ప్రవచనాలు చేసే ప్రభుత్వం తాను మాత్రం హింసనే పాటించింది. తెలంగాణ ప్రజలు తాము ఎంచుకున్న శాంతియుత మార్గాన్ని వదిలిపెట్టలేదు. మిలియన్ మార్చ్ స్ఫూర్తితో చరిత్ర గమనాన్ని శాసించగలమన్న విశ్వాసంతో ముందుకు సాగుతున్నారు.

పొఫెసర్ కోదండరామ్
(తెలంగాణ జేఏసీ ఛైర్మన్)
Namasete Telangana News Paper Dated : 10/03/2012 

No comments:

Post a Comment